కాళోజీ మెచ్చిన కవిత

 

ప్రమాది ఉగాది కవిసమ్మేళనం

ఆకాశవాణి హైదరాబాద్,వరంగల్
కేంద్రాలు సంయుక్తంగా 1999 మార్చి
15వ తేదీనాడు వరంగల్ లో ప్రముఖ ఆహ్వానితుల, ఆహూతుల సమక్షంలో
“ప్రమాది ఉగాది కవిసమ్మేళనం” నిర్వ
హించారు. కవిసమ్మేళనానికి ప్రజాకవి
పద్మభూషన్ కాళోజీ నారాయణ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి
ఆశీర్భాషణం చేసినారు. _”హనుమకొండ- పుష్పాంజలి ఆడిటో రియం”_ లో ఈ కవిసమ్మేళనం జరి గింది.రాష్ట్రస్థాయి కవిసమ్మేళనంలో 16మందికవులు పాల్గొన్నారు.

ఈ కవి సమ్మేళనంలోని కవితలను “శబ్దశిఖరాలు” పేరున ఆకాశవాణి వరంగల్ కేంద్రంవారు ప్రచురించినారు.
ఆకవిసమ్మేళనంలోనేనూ పాల్గొన్నాను. నేను ఆనాటి కవిసమ్మేళనంలో చదివిన కవిత పేరు ” ఓ ప్రమాదీ!”
కాళోజీగారు విశిష్ట అతిథులుగ ఉన్న ఆ కవిసమ్మేళనంలో పాల్గొని , కాళోజీగారి కరకమలాలాలతో సన్మానితుడను, బహూకృతుడను కావడం ఈ నాటికీ ఒక మథురాను భూతిగా స్మృతిపథంలో అపుడపుడూ మెదలుతూ ఉంటుంది.

ఆనాటి కరపత్రాలు,కాళోజీగారు నన్ను సన్మానంచేసిన ఛాయాచిత్రాలు,ఆకాశ వాణివారు ప్రచురించిన నా కవితకూడ ఉన్న “శబ్దశిఖరాలు” పుస్తకం భద్రంగ
నేటికీ ఉన్నాయి.(వెతుకలేక వాటిని
పోస్ట్ చేయలేకపోయాను.)

ఆనాటి నా కవిత-

ఓ ప్రమాదీ!

 

శ్రీరంజిల్లగ చైత్ర
శ్రీరమణీ!జగతికీవు శ్రేయమొసంగన్
కూరిమి మీరగ రాగదె
రా!రమ్మిదె!ఓప్రమాధి!రావె ఉగాదీ!!

కిసలయమ్ములమెసవి కోకిలలుబలికె
తమ్మిపువ్వులలో మరందమ్ములొలికె
కవియుగళమెత్తి కమ్మని కవిత బలికె
స్వాగతమ్మో ప్రమాధి!సుస్వాగతమ్ము!

—అంటూ స్వాగతం పలుకక పోయినా
కొత్తసంవత్సరం రానేవచ్చింది.

మనదేశంలో
బస్సులూ-రైళ్లూ-విమానాలూ-
అన్నీ లేటుగానే వస్తూవుంటాయి,
ఓ కాలశకటమా!
నీవుమాత్రం కరెక్టుటయానికే వస్తుంటావవు,

నీకు స్వాగతం పలుకడం మావంతు
ఇదంతా ఉగాది తంతు.

ఓ ప్రమాదీ!
నీవు ప్రమాదివి అని తెలిసికూడా
ఎలా స్వాగతం పలకాలో
ఏమని స్వాగతం పలకాలో!?

పోయిన బహుధాన్య
“బహు ధాన్య” అయినప్పటికీ
వదాన్యత లేకపోవడంవల్ల
ధరలన్నీ ఆకాశానికి వెళ్లాయి
ఒకానొకప్పుడు
ఉల్లిధరకూడా ఆకాశంలో
ఉల్కాపాతాన్ని సృష్టించింది
మరి నీవే చేస్తావో…. !?
నీ పేరే ప్రమాది…!

ప్రమాది ఉగాది పంచాంగశ్రవణంలో
మన కందాయఫలాలిలా ఉన్నాయి
విదేశాలిచ్చే అప్పులవల్లే ఆదాయం
స్వదేశీయులుకల్గించేముప్పులవలవల్లే
వ్యయం
ప్రజలే కదా! మనరాజులు

రాజపూజితం సున్న
అవమానాలుమాత్రం మిన్న
ఓప్రమాదీ!
ఇలాంటి నీకు
ఎలాపలకాలో స్వాగతం?
ఏమని పలకాలో స్వాగతం??

ఓ ప్రమాదీ!
నీ పేరుకు దీటుగా
మా గడ్డమీద
నల్లధనం విషవృక్షానికి
గూండాయిజం విరబూసింది
బాంబులసంస్కృతి పరిమళించింది
ఇదీ…..
మా సీమలోని ఆమని
మంచి ఉనికీ
మంచి మనికీ
కరువైన ఆమనీ……!
ఏమని పలకాలో స్వాగతం?
ఎలాపలకాలో స్వాగతం??

ఆ విషవృక్షాన్ని సమూలంగా పెకలించాలి,
సమైక్యంగా మానవత్వపు మొక్కల్ని
నాటాలి,
మంచితనం
పరిమళించాలి,
ప్రమాదిని
ప్రమోదంగా మలచుకోవాలి,
అదే మాకు ఉగాది

ఓ ప్రమాదీ!
నీవు
ప్రమాదాలనుకలిగించే
ప్రమాదివి కారాదు,
ప్రమోదాలను చేకూర్చే
ప్రమోదివి కావాలి,

ఓ ఉగాదీ!
చేదు రుచుల్ని చవిచూపిస్తూ ఉంటావు
తీపికలల్నికూడా
నిజంగా పండించడం నీవంతు
చిగురించిన ఆశలతో
నీకు స్వాగతంపలకడం మావంతు
సర్వేజనాః సుఖినోభవంతు.

***

కాళోజీగారు కైత విని కౌగిలించి,
ఆశీర్వదించినారు; అదొక మరువలేని మధురానుభూతి.


-వైద్యంవేంకటేశ్వరాచార్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *