అసంపూర్తి ‘కాళోజి భవన్’ లో ప్రజాకవికి నివాళి

తెలంగాణ తొలిపొద్దు,ఓరుల్లు ధిక్కార స్వరం,ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు ఈ రోజు వరంగల్ పౌర స్పందన వేదిక అధ్వర్యంలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న “కాళోజి భవన్ “ఆవరణలో ఘనంగా నిర్వహించడమైంది.

మొదటగా కాళోజీ చిత్రపటానికి తెలంగాణ పుష్పమైన తంగేడు పూల దండవేసి నివాళులర్పించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి మల్లారెడ్డి,ఆడెపు రాజేంద్ర ప్రసాద్ ,గోనెల దేవెందర్ ,నల్లెల్ల రాజయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేదిక కో-ఆర్డినేటర్ నల్లెల్ల రాజయ్య మాట్లాడుతూ వరంగల్ మహానగరంలో కాళోజీ భవన్ నిర్మాణం ప్రారంభించి అయిదేండ్లు దాటిపోతున్నా అతీగతీలేకుండా అసంపూర్తి నిర్మాణంతో కునారిల్లుతుండటం సాహితీవేత్తలను ,మేధావులను తీవ్రంగా కలవరపరుస్తున్నది.

గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాళోజీ భవన్ తర్వాత ఆరంభించిన ప్రగతి భవన్ ,యాదాద్రి ,కాళేశ్వరం ప్రాజెక్టు,ప్లై ఓవర్లు ,ఎర్రబెల్లి ఫాంహౌస్ కు రోడ్లు పూర్తిచేయడమే కాకుండా నిన్నగాక మొన్నటికి మొన్న నగరాల జనం నట్టేట్లో మునుగుతుంటే రోం చక్రవర్తి నీరో లెక్క గగన విహారంచేసి దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేయడం చూస్తుంటే సిగ్గుచేటుగా భావిస్తున్నామన్నారు.

కాళోజీ భవన్ నిర్మాణం నిర్లక్ష్యం చేయడమంటే ధిక్కార స్వరాలు, కవులు ,రచయితలు,మేధావులు,ప్రజాస్వామిక వాదులను అవమాన పరిచి ఆనందించడమే నేటి పాలకుల కింకర్తవ్యంగా మారడం ప్రజా స్వామ్యాన్ని హాస్యాస్పదం చేయడమేనన్నారు.

ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు (కాళోజీ భాషలో అన్నట్లు)సోయి తెచ్చుకుని మళ్ళీ వచ్చే కాళోజీ జయంతి వరకైన భవన నిర్మాణం పూర్తి చేయించి జయంతి వేడుకలను కాళోజీ భవన్ లోనే జరుపాలని ,అదొక అద్వితీయమైన అద్భుతమైన సాహితీవేత్తల వేదికగా మలచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *