ఏ.పి.సచివాలయం : దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేయడానికి, మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ తెలిపారు.
ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా ముందడుగు వేస్తున్నామని, ఈ క్రమంలోనే మద్యం అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
సచివాలయంలోని తన ఛాంబర్‌లో సోమవారం అబ్కారీ, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోల పనితీరుపై రజత్ భార్గవ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అబ్కారీ శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం కేవలం 350 మంది సిబ్బంది ఉండేవారని, ఆ సంఖ్యను 5,000కు పెంచి అబ్కారీ చట్టాలు పటిష్టంగా అమలు చేసేలా అవసరమైన చర్యలు చేపట్టామని వివరించారు.
ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పనితీరును అభినందనీయమన్న రజత్ భార్గవ, నాటుసారా తయారీ, సరఫరా, వినియోగం, అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వ్యక్తులను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఈ తరహా వ్యవహారాలపై పిడి యాక్ట్ అమలుతో సహా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోను ఆదేశించారు. రాష్ట్రంలో అక్రమ మధ్యం వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఈ తరహా వ్యవహారాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆదేశించారని వివరించారు.
2020-21 సంవత్సరంలో అక్రమ మధ్యం కార్యకలాపాలకు సంబంధించి 59,873 కేసులు నమోదు చేసి 46,872 మందిని అరెస్టు చేయటమే కాక, 7,71,288 లీటర్ల నాటు సారా, 2,19,55,812 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, 6,540 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
ఇదే కాలంలో 34,643 సుంకం చెల్లించని మద్యం కేసులు నమోదు చేసి, 50,401 మందిని అరెస్టు చేసామని, 6,98,305 లీటర్ల ఎన్‌డిపిఎల్ స్వాధీనం చేసుకుని 18,744 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తెచ్చారు.
స్పెషల్ బ్యూరో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాంతి భత్రతల పరిరక్షణకు కూడా కృషి చేస్తోందని, సుంకం చెల్లించని మధ్యం సరఫరాపై ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. మద్యం అక్రమ రవాణాకు అలవాటు పడిన ఐదుగురు వ్యక్తులకు పిడి చట్టం కింద నిర్బంధించగా, ఈ తరహా వ్యక్తులు అందరినీ పిడి యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని రజత్ భార్గవ అదేశించారు.
ఈ విషయంపై తదుపరి సమీక్షలో కీలకంగా చర్చించటం జరుగుతుందని సంబంధిత అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో డైరెక్టర్ పిహెచ్‌డి రామకృష్ణ, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి.వాసుదేవరెడ్డి, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ కె.ఎల్.భాస్కర్, తదితరులు సమావేశానికి హాజరయ్యారు.