ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
కాబూల్ ఎయిర్ పోర్టుపై సాధికారిక హక్కు అమెరికాకి ఉంది. కాబూల్ నగరం కూడా అమెరికన్ల స్వాధీనంలో ఉంది. సాంకేతికంగా ఆఫ్ఘనిస్తాన్ పై సాధికారం ఇంకా అమెరికాకే ఉంది. కాబూల్ లో 6000 మంది అమెరికన్ సైనికులు ఇంకా మిగిలే వున్నారు. ఏ కారణంగానైనా డెడ్ లైన్ లోపు (ఆగస్టు 31 అర్ధరాత్రి) అమెరికా ఆధ్వర్యంలో తరలింపు పని ఒకవేళ పూర్తికాకపోతే, మిగిలి పోయిన వారిని, అమెరికా సమర్పించే జాబితా ప్రకారం ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నూతన సర్కార్ తన స్వంత బాధ్యతతో తరలించే అవగాహన కూడా ఉభయ పక్షాల మధ్య ఉంది. ఆయా దేశాల ఎంబసీల రక్షణ అమెరికాపై ఆధారపడి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లోని (ముఖ్యంగా కాబూల్ లోని) వివిధ దేశాలఎంబసీల, కనస్ట్రక్షన్ తదితర వాణిజ్య రంగాల్లోని కంపెనీల సంరక్షణ బాధ్యత అమెరికా సైన్యంపై ఆధారపడి ఉంది. పైగా గతంలో ప్రధానంగా “దాడిదళాల” పాత్రని పోషించే అమెరికన్ సైన్యానికి తాలిబన్ల తో ఘర్షణ లేని స్థితి ఏర్పడింది. శాంతియుతంగా నిష్క్రమణ జరుగుతోన్న తాజా నిర్దిష్ట దశలో కేవలం తరలింపు పని మీదే ఏకైక కేంద్రీకరణ చేసే సదావకాశం అమెరికా ఆర్మీకి లభించింది. (దాడిదళాలను సాంకేతికంగా కంబాట్ ఫోర్సెస్ అంటారు. ఆ దశ ముగియడం గమనార్హం)
అంతే కాకుండా సమాచార వ్యవస్థ మొత్తం కాబూల్ లో అప్పటికి ఇంకా అమెరికా ఆధ్వర్యంలో వుంది. మీడియా ప్రధానంగా అమెరికా ప్రభావం లో ఉంది. కాబూల్ రవాణా వ్యవస్థ అమెరికా చేతుల్లోనే ఉంది. ఇవే కాకుండా ఉభయ పక్షాల మధ్య కుదిరిన గత ఒప్పందం అమలు ప్రక్రియలో ఒకవేళ తేడాలు తలెత్తితే, వాటిపై తాలిబన్లతో చర్చించి పరిష్కరించే అవకాశం కూడా అమెరికాకి ఉంది. ఇది ఆగస్టు 31 అర్ధరాత్రి వరకూ కొనసాగే భౌతిక పరిస్థితే! ఐనా ఆగస్టు 16వ తేదీన కాబూల్ ఎయిర్ పోర్టుకు విదేశీయులు అంత మానసిక భయంతో, ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని ఎందుకు అనూహ్యంగా పోటెత్తారు?
పైన పేర్కొన్న పోటెత్తిన జనంలో అమెరికన్లు పెద్దగా లేరు. యూరోప్ దేశాల జనం పెద్దగా లేరు. ఆయా మూడో ప్రపంచ దేశాల కార్పొరేట్ కంపెనీల అధిపతులు లేరు. చీఫ్ ఏక్సిక్యూటివ్స్ లేరు. బడా కాంట్రాక్టర్లు లేరు. అక్కడ ఆర్ధిక లావాదేవీల ద్వారా విపరీతంగా డబ్బు గడించిన దేశదేశాల సంపన్నులు లేరు. అందులో 90 శాతం మంది ప్రధానంగా మూడో ప్రపంచ దేశాలకి చెందిన సాధారణ జనం మాత్రమే. ప్రధానంగా ఆయా దేశాల కనస్ట్రక్షన్ & ఇతర కాంట్రాక్ట్ కంపెనీలలో పని చేయడానికి పొట్టకూటి కోసం వచ్చిన నిరుపేద కూలీలు మాత్రమే. ఆరోజు ఎయిర్ పోర్టు కి తమ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పోటెత్తింది వాళ్లే. విమానాల రెక్కలకు వేలాడపడ్డ వాళ్ళల్లో అధిక శాతం మంది అలాంటి నిరుపేదలే. ఆరోజు ప్రాణాలు పోగొట్టుకున్న కొద్ది మంది దురదృష్టవంతులు కూడా వారే. అంతెందుకు! ఆరోజు ప్రాణభయంతో విమాన రెక్కలకి వేలాడిన ప్రయాణీకుల పై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది కూడా అమెరికన్ సైన్యమే. తాలిబన్ల బూచితో ప్రపంచ ప్రజల్ని ఉన్మాదపూరిత భావోద్వేగంతో సామ్రాజ్యవాద మీడియా రెచ్చగొట్టింది. నాటి ఉన్మాద స్థితిలో ప్రపంచ ప్రజలు గుర్తించ లేని నిజాలివి. కానీ అట్టి నిప్పులాంటి నిజాలను చరిత్ర విస్మరించదు. “ఒకవ్యక్తిని ఎల్లకాలం మోసం చేయచ్చు, అందరినీ కొద్దికాలం మోసగించ వచ్చు. కానీఎల్లకాలం అందరినీ మోసం చేయలేరు” అనేది ఓ నగ్న చారిత్రక సత్యం. కొంత ఆలస్యంగానైనా నిజాలు బట్టబయలు కాకతప్పదు. ఆలస్యంగానైనా వాస్తవిక దృష్టితో మనం పరిశీలిద్దాం.
ఈ సందర్భంగా క్రింది కొన్ని మౌలిక ప్రశ్నల్ని వేసుకుందాం.
ట్రంప్ హయాంలో తరలింపు ప్రక్రియలో జాప్యం జరిగిందనే విమర్శల్ని పక్కకు పెడదాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 నవంబర్ లో జరిగాయి. అధికారికంగా 2021 జనవరిలో అధ్యక్షునిగా బైడెన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఐనా రెండో దశ తరలింపు నిర్ణయం మీద ప్రకటనకు మరో మూడు నెలల వరకు ఎందుకు పట్టిందనే విమర్శల్ని కూడా కొద్దిసేపు పక్కకు పెడదాం. 1-5-2021 నుండి రెండో దశ తరలింపు చేస్తామని వాషింగ్టన్ లో ఏప్రిల్ లో ప్రెస్ మీట్ లో బైడెన్ ప్రకటన చేసిన తర్వాత కూడా ఎందుకు జాప్యం జరిగింది? ఈ ప్రశ్నలకు అమెరికా నుండి జవాబు లేదు.
మాటవరసకి వాటన్నింటినీ క్షమించి వదిలేద్దాం. కానీ అలా ఆలస్యంగా ప్రారంభించిన తరలింపు ప్రక్రియలో కూడా సాధారణ కనీస ప్రమాణాలకు కట్టుబడి అమెరికా నిజంగా సరిగ్గానే ప్రవర్తించిందా? అది నిష్క్రమణ ప్రక్రియలో అన్ని న్యాయ ప్రమాణాలను సరిగ్గా పాటించిందా? లేదంటే వాటిని ఉల్లంఘించిందా? ఉల్లంఘిస్తే, వాటిని కూడా క్షమిద్దామా? ఈ నిష్క్రమణ దశలో కూడా అమెరికా ఏఏ ఉల్లంఘనలు, అతిక్రమణలు సాగించిందో నిశిత దృష్టితో పరిశీలిద్ధాం.
2001 అక్టోబర్ లో ముందు అమెరికన్, నాటో దురాక్రమణ సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వచ్చాయి. ఆ తర్వాత మూడో ప్రపంచ దేశాల ఎంబసీల్ని తన స్వంత బాధ్యతతో అమెరికా తెచ్చింది. వెనక్కి నిష్క్రమించే సమయంలో ఎవరు ముందుగా తరలి పోవాలి? ఎవరు వెనక వరసలో వెనక్కి వెళ్ళాలి? “First come, last go” అనే సూత్రం ఉండనే ఉంది. అంటే కాబూల్ కి ముందు వచ్చిన వాళ్ళు, కాబూల్ నుండి వెనక వరసలో వెనక్కి వెళ్లిపోవాలి. దీనర్ధం సుస్పష్టమే. ముందుగా ఇండియా తదితర దేశస్తుల్ని సురక్షితంగా కాబూల్ నుండి తరలించిన తర్వాతే, తాము (అమెరికా, నాటో) తరలి పోవాలి. ఇది కనీస కామన్ సెన్స్ తో ఆలోచించే విషయమే. మరి అమెరికా ఈ కామన్ సెన్స్ తో వ్యవహరించిందా?
ఆఫ్ఘనిస్తాన్ దురాక్రమణలో భాగస్వామ్యం లేని వివిధ దేశాల (Non occupied nations) ఎంబసీలు కాబూల్ ఎప్పుడు వచ్చాయి? అమెరికా దురాక్రమణ చేసిన తర్వాతే కదా! అమెరికా తన స్వంత రక్షణ బాధ్యతతో ఒకింత ఆలస్యంగా వాటిని కాబూల్ కి రప్పించింది. తిరిగి వెనక్కి వెళ్లే సమయంలో ఇదే సూత్రాన్ని అమెరికా పాటించిందా?
అదేవిధంగా ఇండియాతో సహా మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వ రంగ, ప్రయివేటు కంపెనీలతో పాటు హైవేల భారీ కనస్ట్రక్షన్ సంస్థలు, భారీ భవన నిర్మాణ సంస్థలు, ఇతర బడా వాణిజ్య సంస్థల్ని అమెరికాయే తన సైనిక రక్షణ బాధ్యతతో ఆఫ్ఘనిస్తాన్ కి రప్పించింది. అలాంటి ఇతర దేశాల కంపెనీల తరలింపు ప్రక్రియ పూర్తికాక ముందే, దురాక్రమణ దేశాలైన అమెరికా, నాటో కూటమి దేశాల కంపెనీలను ముందుగా కాబూల్ నుండి హుటాహుటిన తరలించవచ్చా?
ఇండియా వంటి వివిధ ప్రపంచ దేశాల నుండి బడా కార్పొరేట్ కంపెనీల రప్పింపు ప్రక్రియలో భాగంగా ముందుగా వాటి అధిపతులు (హెడ్స్) కాబూల్ కి రావడం జరిగింది. అంటే, ఆయా బడా కార్పొరేట్ వాణిజ్య సంస్థల డైరెక్టర్లు, చీప్ ఏక్సిక్యూటివ్స్, జనరల్ మేనేజర్లు నాటి అమెరికా దురాక్రమణ తర్వాత ముందు కాబూల్ చేరారు. ఒప్పందాల తర్వాత ఈ హెడ్స్ దగ్గరుండి తమ దిగువ స్థాయి స్టాఫ్ ని కాబూల్ కి రప్పించారు. ఇంకా చివరలో పొట్టకూటికోసం పని వాళ్లుగా నిరుపేద కూలీలు, కార్మికుల్ని ఆఫ్ఘనిస్తాన్ కి రప్పించారు. అదే సీరియల్ క్రమం నేడు నిష్క్రమించే సమయంలో కూడా అమలు జరగాలి. మరి అదే జరిగిందా?
ఆచరణలో ఏమి జరిగిన కారణంగా ఆగస్టు 16 నాటి కాబూల్ ఎయిర్ పోర్టు దుర్ఘటన జరిగిందో తదుపరి భాగంలో.