నోటిఫికేషన్ రాకుండానే ఎన్నికల ప్రచారాలు ఏంది?

(వడ్డేపల్లి మల్లేశము)

రాజకీయ లబ్ధికి ఎప్పుడైతే రాజకీయ పార్టీలు పాల్పడడం ప్రారంభమైందో అప్పటినుండి ఎన్నికలు, ప్రలోభాలు, గెలుపు, ఓటములు,
ప్రచారాలు వంటి అస్త్రాలను రాజకీయ పార్టీలు విరివిగా వాడుకుంటున్నవి.

ప్రైవేట్ పెట్టుబడిదారులు, కార్పొరేట్ల దగ్గర వసూలు చేసిన చందాలతో ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం కూడా రివాజుగా మారిపోయింది.

గతంలో ఇలాంటిపద్ధతి ఉండేది కాదు. సాధారణ ఎన్నికల్లో గాని అడపాదడపా జరిగే ఉప ఎన్నికల సమయంలోనూ గతంలో రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిగా నీతివంతంగా అంశాల వారీగా ప్రచారాలు చేసుకుని గెలుపు ఓటములను స్వీకరించే సమదృష్టితో ఉండేవి.

ఆనాటి రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి నటువంటి నాయకులు ఎన్నికల సం గ్రామములో మాత్రమే ప్రత్యర్థులు కానీ ఎన్నికల అనంతరం బేధ భావాలను మరచి అభివృద్ధిలో ఉమ్మడిగా పాలుపంచుకునే వాళ్ళు.

కనుకనే వాళ్ళు రాజనీతిజ్ఞులైనారు. అధికార పార్టీకి చెందిన టువంటి నాయకులు ప్రతిపక్షములో సమర్థులైన వాళ్ళు ఉంటే మంత్రి వర్గంలోకి ఆహ్వానించి నటువంటి గొప్ప సంప్రదాయం కూడా ఒక నాడు ఉండేది.

మరి నేడో…

ప్రజలతో ఎన్నికల్లో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఐదేళ్లపాటు ప్రజల కోసం పని చేయాల్సింది పోయి ఐదేళ్ల పాటు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలనే దృష్టితో ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను ప్రలోభపెడుతున్నాయి. ఇక అధికారపార్టీలయితే,   అలివి గాని  ఆశ చూపించి ఓటర్లను ప్రభావితం చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయి.

ఈ ఆనవాయితీని దేశవ్యాప్తంగా చూడవచ్చు. మరియు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందునా తెలంగాణ రాష్ట్రంలో సర్వసాధారణమైపోయింది.

రాజకీయ పార్టీ చూడాల్సిన ఎన్నికల ప్రక్రియను ముఖ్యమంత్రులు ,మంత్రులు తమ భుజానేసుకుంటున్నారు. ఇటీవల హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడక పోయినప్పటికీ ప్రచారం వూపందుకుంది.  అక్కడి శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ రాజీనామా చేయగానే అధికార పార్టీ ఎన్నికల సంరంభం ఆరంభమైనది. ముఖ్యమంత్రికెసిఆర్ దగ్గిర నుంచి రోజూ ఒక మంత్రి అక్కడ పర్యటిస్తూనే ఉన్నారు. ఇక ఆర్ఠిక మంత్రి హారీష్ రావు పర్యటనల గురించి, సమావేశాల గురించి వేరేచెప్పాల్సిన పనేలేదు. ఆయన రోజు వందల మంది  ‘ఇతరపార్టీలకు చెందిన’ వారినిపెద్ద సంఖ్యలో టిఆర్ ఎస్ లో చేర్పిస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ లేకుండానే

ఉప ఎన్నికలు జరిగేది వాస్తవమే కానీ ఎన్నికల సంఘం ఆ ప్రక్రియను ప్రారంభించక ముందే ప్రభుత్వం, అధికార పార్టీ అధికారులకు ఆదేశాలు పరోక్ష,ప్రతక్ష ప్రచారం కొనసాగించడం అనేక అనర్థాలకు దారి తీస్తుంది.

ఎన్నికల సంఘం చూసుకోవలసిన ఓటర్లు నమోదు  చేయించే కార్యక్రమంచేపట్టండని  ప్రభుత్వ అధికారులను ఆదేశించడం జరిగింది. దీనికి  ప్రతిపక్షాలు  కూడాా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.  దీనితో  దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి.

ఈ ప్రక్రియ అంతా కూడా ఎంత అవమానకరమైనది అంటే “పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టిన” రీతిలో నోటిఫికేషన్ రాకముందే అందునా ఎన్నికల సంఘం చూసుకోవలసిన విషయాలను ప్రభుత్వము అధికార పార్టీ వాళ్లు అధికారులతో బలవంతంగా చేయించడం అనుమానాలకు దారితీసింది.

కరోనా ఉదృతంగా వ్యాపించిన నేపథ్యంలో అనేక సంస్థలను, పాఠశాలలను మూసి వేసి నటువంటి ప్రభుత్వం వేలాది మంది కార్యకర్తలతో ఇష్టారాజ్యంగా అధికారపక్షం అధికార పక్షాన్ని చూసి ప్రతిపక్షాలు ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించడం అది హుజురాబాద్ కేంద్రంగా చేసుకొని ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి అడ్వాన్సుగా సమావేశాలు పెట్టడం సబబు కాదు.

రాజ్యాంగ నియమావళి ప్రకారం గా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలో మాత్రమే ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోడు నిబంధనలు పాటిస్తూ మాత్రమే ప్రచార కార్యక్రమాలు నిర్వహించే బదులు అటు అధికార పార్టీ, ప్రతిపక్షాలు కూడా ఆ బాధ్యతను విస్మరించడం దేనికి సంకేతం?

ప్రజలను బానిసలుగా చూడడమే –

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని రాజ్యాంగం చెబుతుంటే పాలకులు ఏనాడు కూడా ప్రజలను ప్రభువులుగా చూడకపోగా మద్యం, డబ్బు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలతో బానిసలు గానే చూస్తున్నారు. దీనికి నోటిఫికేషన్ రాకముందే ప్రచార ఆర్భాటాలు జరగడం ప్రత్యక్ష సాక్ష్యం.

ప్రజలు రాజకీయ పార్టీలను ప్రచారం చేయమని కోరలేదు. రాయితీలను ప్రకటించుమని అడగలేదు. సభలు సమావేశాలు పెట్టి లక్షలాది మందిని వేలాదిమందిని సమీకరించడానికి కోరలేదు.

మరి అధికార పార్టీ ఎందుకు ఈ తంతు ప్రారంభించినట్లు? రాజకీయ పార్టీల నాయకులు గతాన్ని విస్మరించకుండా గతంలో నీతివంతమైన టువంటి సన్నివేశాలను సందర్భాలను మననం చేసుకొని ఎన్నికల ప్రచారాన్ని పరిమితం చేసుకుని రాజకీయ లబ్ధి కోసం పనిచేయక పోవడం ఉత్తమం. లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు చైతన్యవంతులై ఏదో ఒకనాడు కచ్చితంగా ప్రతి ఘటిస్తారు. ఎప్పుడు ఈ రాయితీలు, మద్యం, డబ్బు పనిచేయవని రాజకీయ పార్టీలు గుర్తించవలసిన అవసరం ఉన్నది.

ప్రజలు కోరకుండానే…

వీణవంక మండలం కలువల వాగుపైన చెక్ డ్యాం అంచనాలను
రెండున్నర కోట్లకు పెంచడం ,కమలాపూర్ మండలం శనిగరం వాగుపై చెక్ డ్యాం అంచనాలను సుమారుగా నాలుగు కోట్లకు పెంచడం ఎన్నికల వేళ నే అవసరమా? పరిపాలన, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మరి అధికార పార్టీ అధికారం ఉంది కనుక పథకాలు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న ది. ప్రతిపక్షాలు ఏం ప్రకటిస్తాయి? కనుకనే ఎన్నికల వేళ అభ్యర్థుల చిత్తశుద్ధి, గత చరిత్ర ,సమర్థత, రాజకీయ చతురత, సేవా దృక్పథాన్ని అంచనా వేయగలగడమే నిజమైన టువంటి ప్రజలు, ఓటర్ల బాధ్యత.

ఇక ఏ రకమైనటువంటి లబ్ధికోసం రాజకీయ పార్టీలు ప్రస్తావించకుండా ఉంటే నిజమైన టువంటి అభ్యర్థి ఎన్నిక అవుతాడు. కానీ స్వార్థము తో నిండి ఉన్న రాజకీయ పార్టీలు ప్రజలను పరిపాలనను మరిచి ఎన్నికల నే మదిలో తలచి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమ కాలాన్ని ఎన్నికల కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నవి. అంటే అధికార పార్టీ దారిలోనే మిగతా ప్రతిపక్షాలు కూడా నడుస్తున్నాయి.

హుజురాబాద్ ప్రత్యేకత ఏమిటి

ఇంత కాలం రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ అవినీతి ఆరోపణల కారణంగా శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైన విషయం అందరికీ తెలిసిందే.

ఆత్మగౌరవం నినాదంతో టిఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేకుండా ఇంతకాలం బతికినట్లు విమర్శిస్తూ ముఖ్యమంత్రి పైనే అస్త్రాలు సంధించడం ఈ ఎన్నికకు ప్రాధాన్యత మరింత పెరగడానికి కారణం అయ్యింది.

టిఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలో చేరిన ఈటల రాజేందర్ ను ఓడించడానికి దానినే ప్రతిష్టగా భావించిన ప్రభుత్వం పరిపాలనను మరిచి ప్రభుత్వం యావత్తు హుజురాబాద్ మీదనే కేంద్రీకరించడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం వంటిది అనిపిస్తున్నది.

కాదు! కాదు! పిచ్చుకను గొప్పగా భావించి ప్రమాదకరమని తెలవడం వల్లనే కాబోలు !ప్రభుత్వంలో ఇంత దిగులు .అందుకే ఈ ఆర్భాటం కావచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గత ఐదేళ్లలో ఏనాడు కూడా మాట మాత్రంగా కూడా ఉచ్చరించని దళితుల అభివృద్ధి పైన దళిత బంధు పేరుతో ప్రకటించడం అందునా హుజరాబాద్ లోనే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం ఎన్నికల గెలుపు కోసం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి చేసిన ప్రకటన కాదా?

పరిపాలనలో అంతర్భాగంగా ఆయా సామాజిక వర్గాలకు నిరంతరం బడ్జెట్లో నిధులు కేటాయించడం ద్వారా పరిపాలన సాగాలి. కానీ ఎన్నికల వేళ కులాల వారిగా వర్గాల వారిగా నిధులను మంజూరు చేయడం ప్రజాస్వామ్య పరిపాలనకె విరుద్ధమైనది. అందుకే దళిత బంధును చూసి ఆదివాసి బంధు, బి సీ బంధు,మైనారిటీ బంధు,కులాలవారి బంధు కావాలని పెద్ద ఎత్తున ప్రజలు పోరాడుతున్న విషయాన్ని బట్టి ప్రభుత్వం ఇంతకాలం ఎవరిని ఆదుకోలేదు అనే కదా అర్థం అయ్యేది.

ఇప్పటికైనా ప్రభుత్వం అనాలోచిత చర్యల ను పక్కన పెట్టి, నూతన పథకాలను మానుకొని, అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వం పైన మాత్రమే ఎన్నిక జరిగే విధంగా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టడానికి అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా సిద్ధపడాలి. లేకుంటే ప్రజలు అనాలోచిత కుట్రపూరిత రాజకీయాలను అసహ్యించుకునే కాలం దగ్గరలోనే ఉన్నది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయులు ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *