క్రెమ్లిన్ గంటలు : పొట్టి లెనిన్ పాత్రలో పొడవాటి కాకరాల

కాకరాల జీవన యానం -3

(రాఘవ శర్మ)

కాక‌రాల రంగ‌స్థ‌ల జీవితంలో క్రెమ్లిన్ గంటలు ఆయనకొక ఒక మ‌ర‌పు రాని  మ‌ధురానుభూతి. ఈ నాట‌కంలో కాక‌రాల లెనిన్ పాత్ర‌ వేశారు.కాక‌రాల పొడ‌గ‌రి. కానీ, లెనిన్ పొట్టిగా ఉంటాడు. దాంతో పొడుగు లెనిన్ అని పేరొచ్చింది. న‌ట‌న‌నే న‌మ్ముకున్న క‌ళాకారుడు కాక‌రాల‌.
ఆయన నట జీవితం ఆయన మాటల్లోనే..

 

“డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మొమోరియల్ అకాడమీ (డ్రామా)ని1970 నుంచి 1979 దాకా నడిపాము. కొన్నినాటకాలకు నేను దర్శకత్వం వహించాను.

1972లో ప్ర‌ద‌ర్శించిన‌ ‘క్రెమ్లిన్ గంటలు’ నాటకానికి కూడా నేనే దర్శకత్వం బాధ్యతలు చేపట్టాను. చలనం కోల్పోయిన సోవియ‌ట్‌ సమాజాన్ని లెనిన్ ఎలా పునర్నిర్మించాడో ఈ నాటకం సారాంశం. దీనిలో హెచ్ జీ వెల్స్, లెనిన్ రెండు ప్రధాన పాత్రలు.

ఇద్దరి సంభాషణలతో నాటకం పూర్తవుతుంది.లెనిన్ పొట్టివాడు కనుక వల్లం నరసింహారావును లెనిన్ వేషం వేయమన్నాను.  నేను హెచ్ జీ వెల్స్ వేషం వేస్తానన్నాను. ఆయన ఒప్పుకోలేదు. తానే హెచ్ జీ వెల్స్ వేషం వేస్తానన్నాడు. దాంతో నాకు లెనిన్ వేషం వేయ‌క‌ తప్పలేదు.

కుమార్ నాకు ప్ర‌త్యేకంగా మేక‌ప్ చేశాడు. ఆ మేక‌ప్‌కు 3 గంటలు పట్టింది.  నాటకాన్ని రెండున్నర గంటలకు ఎడిట్ చేశాం. ఇప్ప‌టి హీరో సాయికుమార్‌ రైతు కుమారుడిగా, ఎనిమిదేళ్ళ మా కూతురు రైతు కుమార్తెగా వేశారు.

మా రమణ జెర్జెన్సీ వేషం వేశాడు. అందరికీ పోర్షన్స్ చెపుతూ నేను వేషం వేయాలి.

ఫైన‌ల్ రిహార్స‌ల్స్ చూసిన ర‌మ‌ణ మూర్తి “నువ్వు తప్ప , అంతా బాగుంది” అన్నారు. దాంతో నా స‌హ‌చ‌రి సూర్యాకాంతం స‌హ‌కారంతో రాత్రంతా కూర్చుని లెనిన్ పోర్షన్ వచ్చేదాకా సాధ‌న చేశాను. ఎందుకంటే లెనిన్ పొట్టివాడు. పొడవుగా ఉండే నేను లెనిన్ పాత్ర వేయాల్సి వచ్చింది.

నాటకం వేస్తున్నప్పుడు శ్రీ శ్రీ వచ్చి కూర్చున్నాడు. నాట‌కం అయిపోయాక గ్రీన్ రూంలోకి వ‌చ్చి “నాటకం చాలా బాగా వచ్చింది. కాకపోతే పొడవు లెనిన్” అన్నారు శ్రీశ్రీ.

“నువ్వు తప్ప అంతా బాగుంది” అన్నారు రమణ మూర్తి. మంచి స్పందన వచ్చింది.పత్రికలు కూడా బాగా రాశాయి. నా జీవితచరిత్రలో ‘క్రెమ్లిన్ గంటలు ‘ మైలు రాళ్ళుగా నిలిచిపోయాయి.

కాళీపట్నం రామారావు గారు రాసిన ‘యజ్ఞం’ కథను  డి. రామినీడు గారు సినిమా తీయాలనుకున్నారు. ఎన్ ఎఫ్ డీ సీ ద్వారా ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకుంటే, నాటి కేంద్ర మంత్రి ఉపేంద్ర స‌హాయంతో నిధులు మంజూర‌య్యాయి.

డి.రామినీడు గారు దర్శకత్వం వ‌హించారు సినిమా కథగా సంభాషణలను కాళీప‌ట్నం రామారావు గారినే రాయమన్నాను.  సినిమా వాళ్ళలాగా త్వరత్వరగా రాయలేను అన్నారు.  వాళ్ళు తొందర పెడుతున్నారు.

సీఎస్ రావు చేత సినిమా కోసం రాయించారు. సీఎస్ రావు గారు క‌థ‌లో ఉన్న సంభాష‌ణ‌ల‌తోనే  స్క్రిప్టు త‌యారు చేశారు. అందులో నేను కమ్యూనిస్టు నాయ‌కుడి వేషం వేశాను.  నాచేత కామెంట్ కూడా చెప్పించారు.  సినిమా రిలీజ్ అయ్యింది.

కాళోజీ నారాయణ రావు గారు ఆ సినిమా చూసి ‘మీ సినిమా వాళ్ళు ఎంత ధైర్యవంతులయ్యా! మాకు సినిమా చూడడం తెలియదు అనుకుంటారు’ అన్నారు.

సాహిత్యానికి ప్రతీకలుంటాయి. దాన్ని సబ్జెక్టివ్ గానే  చూడకుండా,  ఆబ్జెక్టివ్ గా కూడా కథ నెరేషన్ ను అర్థం చేసుకోవాలి.

నా సహచరి సూర్యకాంతం 

సూర్యకాంతంతో నా వివాహం 1953 ఆగ‌స్టులో జరిగింది. అప్పుడు ఆమె వయసు పద‌మూడేళ్ళు, నా వయసు పదిహేనేళ్ళు.  ‘సూర్యకాంతం’ అన్న పేరు నాకు నచ్చలేదు. ఆమెను ‘అమ్మాయ్’ అని పిలిచే వాణ్ణి. నన్ను ‘స్వామి’ అని పిలిచేది.

 సూర్యకాంతం

‘స్వామి’ అని పిలిస్తే నాకు చాలా ఇరిటేషన్గా ఉండేది. అయినా అలాగే పిలిచేది. ఆమెకు సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఎక్కువ‌. మాకు పెళ్ళైన ప‌దేళ్ళ‌కు పిల్ల‌లు పుట్టారు.

నా భార్య పురుడు పోసుకోడానికి పుట్టింటికి వెళుతున్న‌ప్పుడు మా ఇంటికి నటి జి. వరలక్ష్మి వచ్చింది. ఆమె అంటే నాకు చాలా గౌరవం.  ‘మీకు ఆడపిల్ల పుడితే నా పేరు పెడతావా’ అని అడిగింది. ‘మీరంటే గౌరవం. తప్పకుండా పెడతాను’ అన్నాను.

మగపిల్లవాడు పుడితే రాజారావు అని పెట్టాలనుకున్నాం.  వరలక్ష్మి ఇంటి పేరు కూడా గరికపాటి. 1963లో మా పెద్ద‌మ్మాయి పుట్టింది. ‘గురుస్మృతి’ అని పెట్టాలనుకున్నాం.  చివరికి ‘గురు వ‌ర‌లక్ష్మీ స్మృతి’ అని పేరు పెట్టాం. స్మృతి అని పలకలేక అంతా ‘గురు’ అని పిలిచేవారు.

రెండవ కుమార్తెకు ‘సమత’ అని పెట్టాం. సమత ఆర్ట్ థియేటర్ పేరుతోనే నా కార్యక్రమాలు ప్రారంభించాను.

సినీరంగ జీవితం

సీ.వీ రమణ చాలా మంచి వాడు. బి.ఎన్. రెడ్డి గారికి అసోసియేట్ డైరెక్టర్.  నన్ను వదిలి పెట్టలేనంత స్నేహం వాడిది. లింగమూర్తి, తిమ్మరాజు కలిసి ఒక పాత్రను కె.వి. చలానికి ఇప్పించాలని ప్రయత్నం చేశారు.

ఆ పాత్రను నాకిప్పించాలని రమణ ప్రయత్నం.  రమణ నన్నునిర్మాత‌, ద‌ర్శ‌కుడు బీ.ఎన్. రెడ్డి గారి వద్దకు తీసుకెళ్ళాడు.

“నీవు ఏ వేషమైనా చేయగలవు. నాకా నమ్మకం ఉంది. నేనిచ్చే వేషానికి నీవెలా సరిపోతావో టెస్ట్ చేయాలి. అభ్యంతరమా?” అన్నారు బీ.ఎన్ రెడ్డి గారు.

“నాకేం అభ్యంతరమండి. అభ్యంతరం లేదు” అన్నాను.

దాంతో బీ.ఎన్. రెడ్డి గారు నాకు, చంద్రమోహన్ కు, నాగరాజరావులకు టెస్ట్ చేశారు.

లింగమూర్తి గారు నన్ను చూసి “నీకు సీరియస్ వేషమైతే బాగుంటుంది” అన్నారు వ్యంగ్యంగా.

“నీవు బాగుంటావు. నీకే వేషం ఇస్తాం. కానీ కొత్త వాళ్ళకు, చిన్న పిల్లలకు నటనలో శిక్షణ ఇవ్వాలి. నెలకు మూడు వందల రూపాయలు ఇస్తాం” అన్నారు బీ. ఎన్. రెడ్డి గారు.

మూడొందలంటే మంచి జీతం. సరే అన్నాను.  చంద్రమోహన్ మంచి ఈజ్ ఉన్న నటుడు.

నా తొలి సినిమా మోడరన్ థియేటర్ వారి ‘అపూర్వసహస్రశిరచ్ఛేద చింతామణి. అది 1960. సేలం స్టూడియోలో షూటింగ్ జరిగింది.

వారికి పర్మనెంట్ ఆర్టిస్టును. నెలకు వందరూపాయల జీతం.  ఒక సినిమాలో పదివేషాలు కూడా వేశాను. దాన్ని చూసి రాజనాల గారు నాకు ‘దశావతారం’ అని పేరు పెట్టారు.

విఠ‌లాచార్య గారి ద‌ర్శ‌క‌త్వంలో , రాజనాల ముఖ్యపాత్రలో, దేవిక హీరోయిన్ గా ‘అన్నా చెల్లెలు’ సినిమా వచ్చింది.  దానిలో కూడా వేషం వేశాను. అలా అక్కడ మూడునెల‌లు పనిచేశాను.

వచ్చే వంద రూపాయలలో 90 రూపాయలు నాస‌హ‌చ‌రి సూర్యాకాంతానికి పంపే వాణ్ణి.  పది రూపాయలలో నా ఖర్చు వెళ్ళదీసుకునే వాణ్ణి.  నేను మొత్తం 250 నుంచి 300 వరకు సినిమాలలో నటించాను.

వాహినీ వారి ‘రంగుల రాట్నం’ సినిమాలో కామెడీ, విలన్‌గా నటించాను. మంచి గుర్తింపు వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా జరిగిపోతోంది.

సీరియస్ పాత్రలు ధరించడం నాకిష్టం. క్యారెక్ట‌రైజేష‌న్‌ ఉంటే తప్ప కామెడియ‌న్‌గా న‌టించ‌లేను. బీఎన్ రెడ్డి గారు ఒక సారి చంద్రమోహనను పిలిచి “నీకు ఆర్థిక సమస్యలు లేవు కనుక ఏవేషం పడితే ఆవేషం వేయకు. ఎంపికచేసుకుని వేయి. గుర్తింపు వస్తుంది” అన్నారు.

నాకా సలహా ఇవ్వలేదు. ఎందుకంటే, ఏదో ఒక వేషం వేస్తే తప్ప గడవని పరిస్థితి నాది.  సీరియస్ వేషాలు వచ్చేదాకా కామెడీ వేషాలు వేశాను.

నా రెండవ కుమార్తె సమత 1968లో పుట్టింది. ఇల్లు మారాం. వాహినీ వారి ‘బంగారుపంజరం’ బాపు గారి ‘బంగారుపిచ్చుక’ రామినీడు గారి ‘బంగారు సంకెళ్ళు’ విఠలాచార్య గారి ‘నిన్నే పెళ్ళాడతా’ వంటి సినిమాల్లో నటించాను.

నా జీవ‌న నావ‌ కదిలింది. ఇక వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండాపోయింది.  ‘వేముల వాడ భీమకవి’ సినిమాలో ఎన్టీయార్ నాకు అవకాశం ఇచ్చారు.  షూటింగ్‌కు వెళ్ళ‌బోతో తాతినేని రామారావు గారు కబురు పంపారు.

డెబ్బై సంవత్సరాల వ్యక్తి కావాల ని, ఎవరినైనా సూచించమన్నారు.మాతో నాట‌కాలు వేసే తారా కృష్ణను సూచించాను. మేకప్ టెస్ట్ చేస్తే కుదరలేదు. నన్ను వేయమన్నారు. ఎల్లుండే షూటింగ్. అదిసీరియస్ క్యారెక్టర్.

కామెడీ నుంచి విముక్తి కావడానికి ఈ వేషం నాకు దోహదపడింది. శోభన్ బాబు, శారద నటించిన ‘దేవుడు చేసిన పెళ్ళి’ బ్రేక్ వచ్చినట్టే అన్నారు గుమ్మడి.  1969 నుంచి 1979 దాకా ఏ వేషం వచ్చినా వేశాను.  అవమానాలు ఎక్కువయ్యాయి. నాకు స్వాభిమానం ఎక్కువ. ప్రయత్నించడం మానేశాను.

మద్రాసునుంచి హైదరాబాదు వచ్చినా 2004 వరకు వేషాలు వేస్తూనే ఉన్నాను. కళాకారులకు బీ.ఎన్.రెడ్డి గారిచ్చినంత స్వేచ్ఛ ఇంకెవరూ ఇవ్వలేదు. ఒక సీన్ చెప్పేవారు. కళాకారుడిని చేయమనేవారు. అంతే…

మళ్ళీ అలాంటి దర్శకుడు గౌతం ఘోష్ మాత్రమే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మాభూమి’లో నటించాను.  హీరో తండ్రి పాత్రకు గౌతం ఘోష్ వెతుకుతుంటే నర్సింగ్ రావు నన్ను సూచించారు. ఆ అవకాశం నాకు లభించింది.

గౌతమ్ ఘోష్ ఆ సినిమాలో నా పాత్ర కోసం కొత్తగుడ్డలు కుట్టించారు. హీరో సాయిచంద్ తండ్రి పాత్ర నాది.  పేద రైతు కొత్త గుడ్డలు కట్టుకుంటే ఎలా?  సినిమా షూటింగ్ చూడడానికి వచ్చిన వారిని గమనించారు.

మా భూమి చిత్రంలో కాకరాల

నా సైజు ఉన్న ఒక పేద  వాణ్ణి పిలిచి కొత్త గుడ్డలు కట్టుకోమన్నారు. అతను కట్టుకున్నాడు.అతని పాత గుడ్డలు తీసుకుని ఉతికించి నాకిచ్చారు. గౌతమ్ ఘోష్ పరిశీలన అంత సూక్ష్మంగా ఉంటుంది. కళాకారుడు హర్ట్ కాకుండా గౌతం ఘోష్ కళను సున్నితంగా రాబట్టే వారు.  కెమెరా మెన్ అత్యవసరంగా ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వచ్చింది.

గౌతమ్ ఘోషే కెమెరా పట్టుకుని షూటింగ్ పూర్తి చేశాడు. అంత గొప్ప దర్శకుడు తెలుగులో లేడు. 1977లో మొదలైన ఆ సినిమా షూటింగ్, 1980లో రిలీజ్ అయ్యింది.  అంతకు ముందు పెద్దలకు చూపించాము.

కొందరు కొత్త డైరెక్టర్లు గుమ్మడి లాంటి గొప్ప నటులను కూడా హర్ట్ చేశారు.  కమర్షియల్ సినిమాల్లో వాళ్ళు చెప్పింది చేశాను. మా భూమిలో నేను అర్థం చేసుకొని చేశాను. మా భూమి చూసి ‘సినిమా బాగా వచ్చిందయ్యా’ అన్నారు కొడవటిగంటి కుటుంబరావు. నేను నటించిన మంచి సినిమాలు ‘మాభూమి’ ‘రంగుల కల’ మాత్రమే.

కేఎస్ ప్రకాశరావు కళాకారులను ప్రోత్సహించినట్టుగా మరెవరూ ప్రొత్సహించలేదు. తొలితరం దర్శకులు బాగున్నారు. మలితరం ఫరవాలేదు.

తరువాత వచ్చిన దర్శకులు నియంత‌లై పోయారు. విశ్వనాథ్ మొత్తం తానే చేసి చూపిస్తారు.  విశ్వనాథ్ ప్రాపంచిక దృక్పథం గతానికి సంబంధించిందేకాని, వర్తమానానికి సంబంధించినది కాదు. సినిమా రంగంలో ట్రేడ్ యూనియన్లు పెరిగాయి. ఫెడరేషన్లు ఏర్పడ్డాయి.

మద్రాసులో కాన్ఫెడరేషన్ జరిగింది.  ఎం.బి.శ్రీనివాస్ నన్ను ట్రేడ్ యూనియన్ లో ప‌నిచేయ‌మ‌న్నారు. హీరో ఇజానికి ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకం. కనుక హీరోలంతా ట్రేడ్ యూనియన్లను వ్యతిరేకించారు.

వారితో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చేతులు కలిపారు.  సినీ ఆర్టిస్టు అసోసియేషన్ కు 1969 నుంచి 70 దాకా జగ్గయ్య అధ్యక్షుడు, నేను (కాకరాల) ప్రధాన కార్యదర్శిని. (ఇంకా ఉంది)

(అలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు,తిరుపతి )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *