వినదగు నెవ్వరు చెప్పిన… వైఎస్ ఆర్ తో జ్ఞాపకాలు

(టి. లక్ష్మీనారాయణ)

పార్లమెంటుకు 1991లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డా.వై.యస్.రాజశేఖరరెడ్డి గారు కడప లోక్ సభ స్థానానికి పోటీ చేశారు. టిడిపి అభ్యర్థిగా శ్రీ సి.రామచంద్రయ్య గారు పోటీ చేశారు. నాడు సిపిఐ, కడప జిల్లా కార్యదర్శిగా నేను బాధ్యతల్లో ఉన్నాను. లాండ్ ఫోన్ మాత్రమే అందుబాటులో ఉన్న రోజులు. డా.వై.యస్.ఆర్. ఫోన్ చేసి ఎన్నికల్లో సీపీఐ తోడ్పాటును కోరడానికి మీ ఆఫీసుకు వస్తున్నానని చెప్పారు. అప్పటికి వారితో నాకు పరిచయం లేదు.

అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఏ.ఐ.ఎస్.ఎఫ్.) జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి, రిలీవై, సొంత జిల్లాలో, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పని చేయడానికి వెళ్ళాను. నా మీద విశ్వాసం పెట్టి జిల్లా కార్యదర్శి బాధ్యతలను పార్టీ అప్పజెప్పింది. జిల్లా రాజకీయాలకు కొత్త. ఇతర పార్టీల నాయకులతో అప్పటికి పెద్దగా పరిచయాలు లేవు.

ఆ ఎన్నికల్లో సీపీఐ, టిడిపిల మధ్య రాష్ట్ర స్థాయిలో ఎన్నికల పొత్తు ఉన్నది. ఈ పూర్వరంగంలో డా.వై.యస్.ఆర్. ఫోన్ చేశారు. మా పార్టీకి టిడిపితో ఎన్నికల ఒప్పందం ఉన్నది. దాన్ని మా పార్టీ శ్రేణులు అమలు చేయాల్సి ఉంటుంది. మన్నించండని చెప్పాను. ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టే ముందు మీ పార్టీ ఆఫీసుకు వస్తున్నానని చెప్పి , నాడున్న పరిమితమైన దినపత్రికల విలేకరులను, ఒకరిద్దరు ఫోటోగ్రాఫర్లను వెంటబెట్టుకొని వచ్చారు. ఈలోపు వారితో బాగా పరిచయం ఉన్న పార్టీ సీనియర్ నాయకులైన కా.యన్.శివరామిరెడ్డి, కా.జె.వెంకట్రామిరెడ్డి, కా.కె.సుబ్బన్న, తదితర అందుబాటులో నాయకులకు కబురు చేస్తే, వాళ్ళు వచ్చారు.

పార్టీ సహకారాన్ని, పెద్దల ఆశీస్సులను కోరడానికి వచ్చానని ముక్తసరిగా రెండు మాటల్లో డా.వై.యస్.ఆర్ విజ్ఙప్తి చేశారు. మన్నించాలి, మాకు టీడీపీతో ఎన్నికల ఒప్పందం ఉన్నది, మీకు శుభాకాంక్షలు మాత్రమే తెలియజేయగలమని పార్టీ స్పందనగా తెలియజేశాను. మేమిచ్చిన తేనీటి విందు స్వీకరించి, సరదాగా కొద్దిసేపు పెద్దలతో కబుర్లు చెప్పి, వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్లారు. అదే మా తొలి పరిచయం. డా.వై.యస్.ఆర్. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.

డా.వై.యస్.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజా సమస్యలపై పార్టీ ప్రతినిథివర్గంగా వెళ్లి కలిసిన సందర్భాల్లో, చాలా గ్యాప్ తర్వాత కలిసినప్పటికీ పేరుతో ఆప్యాయంగా పలకరించేవారు. కాంగ్రెస్ తో సీపీఐకి రాజకీయ మిత్రత్వం ఉన్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఒప్పందంపై చర్చించడానికి ఒకసారి నేను కా.కె.నారాయణ వెళ్ళాం. కడప జిల్లాలో యర్రగుంట్ల జెడ్.పి.టి.సి. స్థానాన్ని కేటాయించాలని కోరాం. అభ్యర్థి ఎవరు? అని అడిగారు. కా.జి.ఓబులేసు అని సమాధానం చెప్పా. వీరపునాయునిపల్లి స్థానాన్ని తీసుకోమని ఆయన సూచించారు. రెండు మాటల్లో ఆ అంశం ముగిసింది. ఆ స్థానంలోనే సీపీఐ పోటీ చేసి, గెలిచింది.

మరొకసారి పార్టీ ప్రతినిథివర్గం వెళ్ళి కలిసినప్పుడు గండికోట జలాశయానికి మాజీ పార్లమెంటు సభ్యుడు, కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో అగ్రగణ్యులు, అమరజీవి కా.వై.ఈశ్వరరెడ్డి గారి పేరు పెడితే సముచితంగా ఉంటుందని సూచించా. ఆ మాట విన్నవెంటనే డా.వై.యస్.ఆర్. స్పందించి జీ.ఓ. జారీ చేసే ఏర్పాటు చేయమని ప్రక్కనున్న ఓ.ఎస్.డి. సుబ్రహ్మణ్యంగారిని ఆదేశించారు.

నేను విశాలాంధ్ర విజ్ఞాన సమితి, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో విశాలాంధ్ర దినపత్రిక ఎడిషన్స్ ను హైదారాబాదు, తిరుపతి, విశాఖపట్నం, కరీంనగర్ పట్టణాల్లో ఏర్పాటు చేయాలని కార్యాచరణకు పునుకొన్నాం. హైదరాబాదు ఎడిషన్ కు స్థలం కోసం చాలా ప్రాంతాల్లో వెదికాం. ఆఖరికి బండ్లగూడలో స్థలాన్ని డా.వై.యస్.ఆర్. నామమాత్రపు ధరకు కేటాయించారు. అలాగే, తిరుపతి ఎడిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైనారు. తిరుపతి ఎడిషన్ కు కూడా స్థలాన్ని కేటాయించారు.

డా.వై.యస్.ఆర్.కు 12వ వర్థంతి సందర్భంగా శ్రద్దాంజలి ఘటిసున్నా!

ఫోటో: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విశాలాంధ్ర దినపత్రిక, తిరుపతి ఎడిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన డా.వై.యస్.రాజశేఖరరెడ్డిగారికి విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శిగా మెమోంటోను బహుకరిస్తున్న దృశ్యం. ప్రక్కన కా.సురవరం సుధాకరరెడ్డి గారు ఉన్నారు. చిత్రంలో అస్పష్టంగా కనిపిస్తున్నది, నాటి విశాలాంధ్ర విజ్ఞాన సమితి, అధ్యక్షులు కా.చాడా వెంకటరెడ్డి గారు.

(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *