‘మిషన్ భగీరథ’ నీళ్ల మీద విశ్వాసం కుదిరేదెపుడు?

(వడ్డేపల్లి మల్లేశము)

ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అన్ని పథకాలు ఎక్కువ ప్రయోజనాన్ని తృప్తిని ఇవ్వాలి. అలాంటప్పుడు ఆ పథకం పై ఖర్చు చేసిన నిధులు లాభనష్టాల మాట కాని, దుబారా అనే కోణంలో కానీ ఆలోచించడం జరగదు.

ప్రభుత్వాలు చేసే ప్రతి పని కూడా లాభనష్టాల తో సంబంధం లేకుండా ప్రజా ప్రయోజనం, సేవా దృక్పథం రాజ్యాంగబద్ధంగా ప్రజల అవసరాలను తీర్చడం అనే కోణంలోనే ఆలోచించవలసి ఉంటుంది. మెజారిటీ ప్రజానీకానికి మెజారిటీ ప్రయోజనాన్ని ఇవ్వగలిగిన ప్పుడే ఆ పథకం విమర్శకు గురి కాదు.

విమర్శకు గురికాకుండా ఉండాలంటే అఖిల పక్షాలతో సమావేశాన్ని నిర్వహించడం కానీ, సంబంధిత వర్గాల నాయకులతో చర్చించడం కానీ, బుద్ధి జీవులు మేధావుల సలహాలు తీసుకోవడం కానీ జరగాలి.

గమ్మత్తయిన విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వంతో సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనూ మిగతా అన్ని రాష్ట్రాలలోనూ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించే ఆచారము క్రమంగా కనుమరుగైనది. ముఖ్యంగా తెలుగు ఉభయ రాష్ట్రాలలో ప్రతిపక్షాల ప్రస్తావనే లేకుండా పరిపాలన కొనసాగడం ప్రజాస్వామ్యానికి పట్టిన చీడగా భావించవచ్చు.

‘మిషన్ భగీరథ’ పథకం కొన్ని వాస్తవాలు

తెలంగాణ రాష్ట్రంలో మొదటి దఫా ఎన్నికైన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు ఇవ్వడానికి హామీ ఇచ్చిన ది. అదే సందర్భంలో రెండవ సారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు త్రాగునీరు ఇవ్వకపోతే ఎన్నికలకు ఓట్లు అడగం అని ప్రకటనలు చేయడం కూడా జరిగింది. 2016  ఏప్రిల్ లో ఖమ్మంలో  పార్టీ 15 ప్లీనరీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రకటన చేశారు.

అయితే 2018 సంవత్సరాంతంలో ముందస్తుగా రెండవసారి జరిగిన శాసనసభ ఎన్నికల నాటికి మిషన్ భగీరథ నీళ్లు దాదాపుగా సగం ప్రజానీకానికి అందలేదు. అయినా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి కొన్ని జనాకర్షక పథకాల ద్వారా తిరిగి అధికారానికి రావడం జరిగింది.

మిషన్ భగీరథ ద్వారా అందించే నీరు ముఖ్యంగా త్రాగునీరు. మిషన్ భగీరథ పథకం గాని త్రాగునీరు గురించి గానీ ఏ ప్రాంత ప్రజానీకం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. ఎక్కడికక్కడ గ్రామగ్రామాన పట్టణం లోపల గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విధానాల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నది.

ఇక గత పదిహేను, ఇరవై సంవత్సరాలుగా త్రాగడానికి వాటర్ ప్లాంట్ ల మీద ఆధారపడి తమ అలవాటును ప్రజలు మార్చుకున్నారు. నల్ల నీళ్లు, మోటార్ నీళ్లు ప్రజలను సంతృప్తి చేయలేకపోయిన వి. ఆరోగ్యం పరిస్థితులు ఎలా ఉన్నా నోటికి రుచి కావాలని కోరుకోవడం వల్ల ఫిల్టర్ నీళ్ల మీద ఆధారపడక తప్పలేదు.

ఈ పరిస్థితులలో ప్రభుత్వం నదీజలాలను ప్రత్యేక పైపులైన్ల ద్వారా సుమారుగా 45 వేల కోట్ల రూపాయలను వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా అందించే కృషి ఇప్పటికి ఇంకనూ కొనసాగుతున్నది. అయితే “కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు” పెద్ద ఎత్తున ఖర్చు చేసి మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ దాదాపుగా ఏ ఇంట్లోనూ తాగడానికి వాడుకోవడం లేదు.

ఇక ఇంటి వాడకానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ఉన్నందున ఈ పథకం ద్వారా వస్తున్నటువంటి నీళ్లు అరకొరగా ఉపయోగిస్తూ ఉండటంవలన అగ్రభాగం తిరిగి డ్రైనేజలోకి చేరుతున్నట్లు గా మనం చూడవచ్చు.

మిషన్ భగీరథ -అనర్థాలు

అయితే ఏ పథకం అయినా లేదా ఏ సౌకర్యమైన ప్రజలు ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేయకుండా అమలు చేస్తే దాని వినియోగం అంతగా ఉండదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1000 మినీ బస్ స్టేషన్ లను మండల కేంద్రాలలో నిర్మించినప్పటికీ వాటి వాడకం లేకుండా శిథిలావస్థకు చేరుకున్న వైనాన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు. అవసరమున్న చోట బస్ స్టేషన్లు సౌకర్యవంతంగా లేకపోవడం ప్రయాణీకులు లేనిచోట్ల బస్ స్టేషన్ నిర్మాణం చేయడం ఈ అనర్థానికి కారణమైనట్లు మిషన్ భగీరత నీళ్లు కూడా అంతగా ప్రయోజనానికి నోచుకోకపోవడం బాధాకరమే.

మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అనేక రోడ్లు ధ్వంసమై పోయినవి. చాలా డబుల్ రోడ్లు సింగల్ రోడ్డులుగా మారిపోయినవి. కానీ పైపుల కంపెనీ వాళ్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతారు. ఈ పథకానికి వెచ్చించిన నిధులు అగ్రభాగం దుర్వినియోగం అయినట్లు, అవినీతి అధికారులు స్వాహా చేసినట్లు అనేక ఆరోపణలు ఉన్నవి.

నదీ జలం పరిశుభ్రమైనదే కాదు ఆరోగ్యవంతమైనది కూడా. దాన్ని కాదనలేము కానీ సుదూర ప్రాంతాల నుండి పైపుల్లో ప్రవహించి వస్తున్న కారణంగా నాచు వంటి పదార్థంతో కూడిన నీళ్లు పచ్చగా వస్తున్నట్లు అందుకే తాగలేక పోతున్నట్టు ప్రజలు వాపోతున్నారు.

ఇక కేటాయించిన కోట్లాది రూపాయలు వృథా కావడమే కాకుండా రోడ్డు ధ్వంసమైన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాన్ని కి ఇబ్బంది కలుగుతుంది ఈ మాట వాస్తవం. గత ప్రభుత్వాలు నిర్మించిన రోడ్లు దీనివలన పనికిరాకుండా పోవడంతో ఆ రోడ్లను తిరిగి బాగు చేయాలంటే బహుశా మళ్లీ 45 వేల కోట్లు అవసరం పడతాయో ఏమో? ఈ పని “గట్టుకు కట్టెలు మోసినట్లు ఉందనిపిస్తుంది” నిజమా ?కాదా?

మిషన్ భగీరథ నీటిని విశ్వసించడం లేదా?

పాలకులు తను ఆచరించి ఆదర్శంగా ఉన్నప్పుడే ప్రజలు కూడా ఆచరించడానికి సిద్ధంగా ఉంటారు .కానీ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రివర్గ సభ్యులు, చివరికి ముఖ్యమంత్రి వరకు మిషన్ భగీరథ నీటిని తాగడానికి వాడకపోతే ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారో ఆలోచించాలి.

ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలలో వేదికపైన మిషన్ భగీరథ వాటర్ బదులు ఫిల్టర్ వాటర్ బాటిళ్లు సీల్ చేసినవి దర్శనమిస్తున్న వి.

ఈ విషయంలో ఇటీవల కొందరు మంత్రులు పాల్గొన్న కార్యక్రమంలో పాలకులే ఆచరించకపోతే ప్రజలకు ఎలా విశ్వాసం ఉంటుంది ?అని పెద్దఎత్తున పత్రికా ప్రకటనలు రావడాన్ని మనం గమనించాలి.
ఉపయోగపడని పథకం ,తద్వారా వృధా అయిన నిధులు రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని విశ్లేషకులు భావిస్తున్న వేళ ఈ పథకం యొక్క సాధ్యాసాధ్యాలు, ప్రయోజనాల పైన ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

ఎట్లాగూ గ్రామ గ్రామానికి నీళ్లు అందుబాటులోకి వచ్చినాయి. కనుక తిరిగి తిరిగి పరిశుద్ధం చేయడం గురించి ఆలోచిస్తే వాడుకలోకి వచ్చే అవకాశం ఉంటుందేమో సంబంధిత నిపుణులు ఆలోచించాలి.

ఈ పథకం కింద పైపులు వేయడానికి సంబంధించి జరిపిన తవ్వకాల ద్వారా అనేక రోడ్లు ధ్వంసం కావడంతోపాటు వర్షానికి మట్టి కొట్టుకొని పోయి రోడ్డులు బురదమయంగా గుంతలతో పనికిరాకుండా పోయినాయి. కనుక వెంటనే నిధులను మంజూరు చేసి రోడ్డును బాగు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు ,శాసన సభ్యులు వారి నియోజకవర్గాలలో పర్యటించినప్పుడు ఆడంబరాలు ప్రారంభోత్సవాలకు మాత్రమే పాకులాడడం తో ఈ అనర్థాలు అన్నింటినీ పరిశీలించ లేకపోతున్నారు. సూక్ష్మంగా ప్రజా కోణంలో పరిశీలిస్తే గాని ఈ అనర్ధాలు నష్టాలు అవినీతి బాగోతాలు బయటపడవు.

ప్రజలకు మేలు చేసినట్లుగా తలపెట్టిన ఈ పథకం ద్వారా మేలు కంటే కీడే ఎక్కువగా జరగడం అది ప్రజాధనం దుర్వినియోగం కావడాన్ని బుద్ధి జీవులు, విద్యావంతులు, మేధావులు, మనసున్న ప్రతి వారు కూడా ఆలోచించి ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా చూడాలి.
పాలకులు మంత్రులు అధికారులే సమావేశాల సందర్భంగా నిత్య వాడకంలో ఫిల్టర్ బాటిల్ లకు అలవాటు పడితే క్రింది స్థాయిలో మామూలు సమావేశాల సందర్భంలో కూడా మిషన్ భగీరథ నీటిని పక్కనపెట్టి ఫిల్టర్ బాటిల్ అనేకం వాడడానికి సిద్ధపడితే యధా రాజా తథా ప్రజా అన్నట్లు మూలకు పడ్డ పథకం గురించి ఎవరు ఆలోచిస్తారు?

ఇటువంటి అనర్థదాయకమైన, ఏ వర్గం నుండి కూడా డిమాండ్ రాని పథకాలను స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికల లబ్ధి కోసం ప్రవేశపెడితే పాలకులు, రాజకీయ వర్గాలు మూల్యం చెల్లించుకోక తప్పదు.


( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు,ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *