(సిఎస్ షరీఫ్)
ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూను ఎప్పుడైనా విన్నారా?
రేడియోల కాలం నాటి మాట…ఆకాశవాణి కేంద్రం (AIR) ప్రసారాలు పొద్దనే మొదలయ్యే ముందు వయోలిన్ సౌండు తో ఓ ట్యూను వినిపించేది. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉత్తేజం కలిగిస్తుంది. ఆ ట్యూన్ కోసం ఆసేతు హిమాచలం భారతీయులంతా ఎదరుచూసే వారు.
తెల్ల వారుజామున నిద్రలేస్తూనే రేడియో ఆన్ చేసి ఆ జింగిల్ వింటూ ప్రతి ఇంట్లో సుప్రభాత కార్యక్రమాలు మొదలయ్యేవి. ఈ జింగిలేేే ఆకాశవాణి (All India Radio) సిగ్నేచర్ ట్యూను. అది వినడం ఒక గొప్ప అనుభూతి.
నాటి ప్రజల దైనందిన జీవితాల్లో ఒక భాగంగా వుండిన ఈ ట్యూను శాస్త్రీయ సంగీతం లో ఒక గొప్ప రాగమైన “శివరంజని” ఆధారంగా తయారు రూపొందింది. దీని వెనక పెద్ద చరిత్ర వుంది.దాన్నిరూపొందించింది భారతీయ సంగీత విద్వాంసుడు కాదు.
రెండో ప్రపంచయుద్ధం కాలంలో హిట్లర్ ఆగడాలను తప్పించుకునేందుకు భారతదేశంలో తలదాచుకున్న ఒక కాంది శీకుడు. వాల్టర్ కావుఫ్ మన్ ( Walter Kaufmann). అది మరొక సారి ముచ్చటించుకుందాం. ఇపుడు శివరంజనీ రాగం చిత్రసీమను ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం.
శివ రంజని రాగం శివుడ్ని సంతోష పరచడానికి పాడేది గా చెప్పుకోవచ్చు (శివ = శివుడు, రంజని = రంజింప చేసేది) వ్యాకులత (దుఖము) నుండి శక్తి ని సమీకరించుకోవడానికి ఈ రాగం పనికొస్తుంది అని చెబుతారు. దీన్ని తేలికైన సెమి క్లాసికల్ రాగంగా వ్యవహరిస్తారు. శివ రంజని రాగం కరుణ రసాన్ని చూపుతుంది.. ఆసక్తి కరమైన విషయ మేమిటంటే వ్యాకులత ను ప్రతిబింబించే ఈ స్వరం ఆధారంగా తయారు చేసిన బహారో ఫూలు బర్సావో పాట ఓ ప్రేమ గీతం.
శివరంజని రాగం ఆధారంగా తెలుగు లోనూ అనేక పాటలు, అందమైన పాటలు అలరించే పాటలు వచ్చాయి. ఈ రాగం పేరుతో తెలుగు లో ఏకంగా “శివరంజని” సినిమాయే వచ్చింది. ఈ పాటల లిస్టు చాలా పెద్దది. వీటిలొ మచ్చుకు కొన్ని:
“ఒకటై పోదామా ఊహల వాహినిలో” చిత్రం – ఆస్తులు అంతస్తులు (1969), గీత రచన – ఆరుద్ర, సంగీతం – కోదండపాణి పాడినవారు – ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల,
“మెరిసే మేఘ మాలికా, ఉరుములు చాలు చాలిక” – చిత్రం – దీక్ష, (1974), గీత రచన – డా. సి. నారాయణ రెడ్డి సంగీతం – పెండ్యాల నాగేశ్వర రావు, పాడినవారు – ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
“ఓ బంగరు రంగుల చిలకా పలుకవా?” చిత్రం – తోట రాముడు (1975), గీత రచన – దాశరధి, సంగీతం – సత్యం, పాడినవారు – ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల
“శివ రంజనీ, నవ రాగిణీ” – చిత్రం – తూర్పూ పడమర (1976), గీత రచన – డా. సి. నారాయణ రెడ్డి, సంగీతం– రమేష్ నాయుడు. పాడినవారు – ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
ఒకప్పుడు యువ హృదయాల్లో సంచలనం రేపిన బాలూ పాట “ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో” శివరంజని రాగపు ఆధారంగానే తయారయింది.
(చిత్రం – కన్నె వయసు (1973), గీత రచన – దాశరధి, సంగీతం– సత్యం. పాడినవారు – ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
ఇక బాలివుడ్ లో…
“బహారో ఫూలు బర్ సావో మేరా మహబూబు ఆయా హై …..”
అనే పాట తెలీని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఈ పాట 1966 లో వచ్చిన సూరజ్ చిత్రం లోనిది. పాట రచయిత హస్రత్ జైపురి. సంగీతం శంకర్ జైకిషన్. ఈ పాటకు మహమ్మద్ రఫీ కి ఉత్తమ గాయకుడిగా, హస్రత్ జైపురి కి ఉత్తమ గీత రచయిత గా, శంకర్ జైకిషన్ కి ఉత్తమ సంగీత దర్శకులు గా ఆ సంవత్సరం ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.
పై పాట ఇక్కడ వినండి
బ్రహ్మ చారి (1968) చిత్రానికి గాను హస్రత్ జైపురి రాసిన “దిల్ కె ఝరోకె మె తుఝ్ కో బిఠా కర్” అనే మహమ్మద్ రఫీ పాడిన పాటకు రఫీ కి ఉత్తమ గాయకుడి గా, చిత్రానికి సంగీతం సమకూర్చిన శంకర్ జైకిషన్ కి ఉత్తమ సంగీత దర్శకులు గా ఆ సంవత్సరం ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.
ఈ రెండు పాటల మధ్య ఒక సారూప్యత వుంది. ఈ రెండు పాటలు కూడా “శివరంజని” రాగం ఆధారంగానే స్వర పరచ బడ్డాయి. 1970 లో రాజ్ కపూర్ “మేరా నాం జోకర్” సినిమా వచ్చింది. దీనికి కూడా సంగీతం శంకర్ జైకిషనే. ఈ చిత్రం సంగీతానికి ఈ జంట మళ్లీ ఆ సంవత్సరం ఉత్తమ సంగీత దర్శకులు గా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నారు.
ఈ చిత్రం లో ముకేశ్ పాడిన “జానే కహా గయే వో దిన్” పాట చరిత్ర సృష్టించింది. ఈ పాట కు కూడా శివరంజని రాగమే అధారం కావడం కాకతాళీయం.
శంకర్ జైకిషన్లకు ఉత్తమ సంగీత దర్శకత్వపు అవార్డులను తెచ్చి పెట్టిన చిత్రాలు సూరజ్, బ్రహ్మచారి, మేరా నాం జోకర్ మూడింటిలోనూ శివరంజని రాగపు అధిక్యత వుండటం చెప్పుకోదగ్గ విశేషం. శివరంజని రాగాన్ని గొప్ప బాణీలు గా మలచు కున్న ఘనత బాలీవుడ్ సంగీత దర్శకుల జంట శంకర్ జైకిషన్ లకు ఆపాదించ వచ్చు.
మనిషి జీవితం లో సంగీతానికున్న స్థానం అనిర్వచనీయం. ఫ్రపంచం లో ఎవ్వరికైనా అర్థమయ్యే భాష సంగీత మొక్కటే. సంగీతం సాంత్వన కలిగిస్తుంది, ఆహ్లాదాన్నిస్తుంది, ప్రేరణ కలిగిస్తుంది. ఇంకా ఏం కావాలి? జన సామాన్యం సంగీతాన్ని సినిమా పాటల రూపంలో అస్వాదిస్తారు.
ప్రకృతిలో పక్షులూ జంతువులూ చేసే శబ్దాలతో సప్త స్వరాలు పుట్టాయి . ఈ స్వరాల కోమల స్వరాలూ, శుధ్ధ స్వరాలూ కలిపి 12 స్వరాల సప్తకం తయారయింది. ఈ స్వరాల వివిధ రకాల అమరిక లతో రాగాలు ఆవిర్భవించాయి. ఒక్కో రాగం ఒక్కో రసాన్ని ఒలికిస్తుంది. ఒక్కో థీమును ప్రదర్శిస్తుంది. ఒక రాగం లో స్వర క్రమపు ఎంపిక, స్వరం మీద గడిపే కాలం మీద ఆధార పడి బాణీలు తయారవుతాయి. సినీ సంగీత దర్శకులు కొన్ని సార్లు సందర్భాను సారం ఈ రాగాల ఆధారంగా సినిమా పాటల బాణీలు తయారు చేస్తారు. స్వరాలూ, రాగాలూ, అవి వొలికించే రసాలూ, ఘరానాలూ, శృతులూ, లయలూ, తాళాలు, సంగీతా వాయిద్యాలు, అబ్బో!! సంగీతం ఒక సాగరం. దాని వైపు చూస్తూ అలల కదలికల్లాంటి రాగాలూ వాటితో తయరైన బాణీలూ వింటూ యుగాలు గడిపేయ వచ్చు. మంచి పాటలు మానసికారోగ్యానికి మందు గుళికలు. మనసారా సేవించండి.
“సంగీతం విశ్వానికి ఆత్మనూ, మెదడుకి రెక్కల్నీ, ఊహలకు ఎగిరే గుణాన్నీ, సర్వ విషయాలకు జీవాన్నీ ఇస్తుంది” అన్నాడు ప్లాటో.
(సిఎస్ షరీప్,రచయిత, కవి, సినిమా విశ్లేషకుడు, వృత్తిరీత్యా ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కోర్స్ కోచ్)