గరికపాటి లేకపోతే నేను లేను: కాకరాల

 

-రాఘవ శర్మ

ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావుతో కాకరాలకు పరిచయం ఏర్పడింది.

అది ఆయన జీవితగమనాన్నే మార్చేసింది.  మద్రాసుకెళ్ళి నాటకాలు వేస్తూ సినిమా రంగంలో కాలూనారు.

బతుకు తెరువు కోసం ఏ వేషం వేసినా, మా భూమి, రంగుల కల వంటి మంచి సినిమాలు ఆయన జీవితంలో తృప్తినిచ్చిన గొప్ప మైలు రాళ్ళు.

 

“నర్సీపట్నం నుంచి రాజమండ్రికి వచ్చి స్థిరపడిన కొన్ని కాపు కుటుంబాలలోని వారు కలిసి ట్యూషన్లు చెపుతూ, భోజనాలు చేస్తూ, నాటకాలు వేసేవారు.

రాఘ‌వ క‌ళాస‌మితితో కలిసి నాటకాలు వేసేవాడిని.

అప్పుడే గరికపాటి రాజారావుగారితో పరిచయం ఏర్పడింది. రాజారావు గారు మద్రాసు వెళుతుంటే ‘మేమూ వస్తాం’ అని  నేను, మరొక మిత్రుడు అడిగాం.

‘ముందర నేను వెళ్ళి స్థిరపడ్డాక ఉత్తరం రాస్తాను. అప్పుడు వద్దురు’ అన్నారాయన.

వారు మద్రాసులో స్థిరపడినా మాకు ఉత్తరం రాయరని ఒక అపనమ్మకం ఉండేది.

ఎందుకంటే చిత్తూరు నాగయ్య గారికి ఉత్తరం రాస్తే, ‘ఇప్పుడు అవకాశం అయిపోయింది. మళ్ళీ సినిమా కదిలితే అవకాశం ఇస్తా’ అని రాశారు. కానీ ఆయన నుంచి ఉత్తరం రాలేదు.

రాజమండ్రిలో నేను నాటకాలు వేస్తుండగా, వేషం వేయడానికి నన్ను మద్రాసు తీసుకురమ్మని రాజారావుగారు భాస్క‌ర‌రావుతో కబురు పంపారు.

 


కాకరాల జీవనయానం -2


ఆత్రేయ రాసిన నాటకం ‘భయం’. అందులో పెద్ద వేషం తాను వేసి, నాకు చిన్న వేషం ఇద్దామనుకున్నారు భాస్కరరావు. నేను బ‌క్క‌ప‌ల‌చ‌గా ఉండ‌డం వల్ల ఆ పెద్ద వేషం నాకు కుదిరింది.

ఆ నాటకాన్ని హైదరాబాదులోని సరోజినీ నాయుడు హాలులో వేశాం.

 

నాకు 1953లో సూర్యాకాంతంతో పెళ్ళైంది. ఆమె పుట్టింటి వారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన అర ఎకరా పొలంలో వచ్చే కౌలు కింద వెయ్యి రూపాయలు అడ్వాన్స్ తీసుకుని మద్రాసు వెళ్ళాను.

మూడు నెలల్లో అయిపోయాయి. పరిస్థితి అర్థమైపోయింది. నా నివాసం రాజారావు గారింట్లోనే.  బ‌య‌ట పార్క్‌లాండ్ హోట‌ల్‌లో భోజనం  చేసేవాణ్ణి. ‘ ఒకరు బతికే ఖర్చుతో ఇద్దరం బతకలేమా? ‘  అనుకున్నాను.

    గరికపాటి రాజారావు

రాజారావుగారితో చెప్ప‌కుండా నేనేమీ చేయ‌ను. రాజారావుగారి దగ్గరకు వెళ్ళి ‘నా భార్యను కాపురానికి తీసుకొస్తాను’ అన్నాను. ‘సరే తీసుకురా’ అన్నారు.

నా భార్యను తీసుకుని 1959 నవంబర్ లో మద్రాసు లో కాపురం పెట్టాను. అప్పటి నుంచి మద్రాసు జీవితం మొదలైంది. అదే నా జీవితం.రాజారావు గారు నా మనసెరిగిన మంచి మనిషి. నాకాయన దొరికారు.

తన ఆలోచనే నా ఆలోచన. నా ఆలోచనే తన ఆలోచన. నన్ను నడిపించారు. జీవితంలో నేను ఈ మాత్రం సక్సెస్ అయ్యానంటే రాజారావుగారే కారణం.

రాజారావుగారు తీయాలనుకున్న సినిమా తీయలేకపోయారు. పుచ్చలపల్లి సుందరయ్యగారి తమ్ముడు డాక్టర్  రామచంద్రారెడ్డి గారు రాజారావుగారికి ప్రాణ స్నేహితుడు, గైడ్, ఫిలాసఫర్ కూడా.

రామదాసు గారు, రాజారావుగారు, రామచంద్రారెడ్డిగారు మంచి స్నేహితులు. సినిమాలు  ప్ర‌య‌త్నం డెడ్ లాక్ అయ్యాక  మళ్ళీ నాటకాలు ప్రారంభించారు.

కందుకూరికి కుడి భుజంగా ఉన్న గంగన్న పంతులు గారి కొడుకు జయంతి వెంకట కామేశ్వరరావు ఫైనాన్స్ చేస్తానంటే, అల్లూరు సీతారామరాజు నాటకాన్ని ముగ్గురు న‌లుగురు కలిసి తయారుచేశారు.

ఒక చేతి  నుంచి స్క్రిప్టు  వ‌స్తే బాగుంటుందని ఆత్రేయ సూచించారు. దాంతో సుంకర సత్యనారాయణ స్క్రిప్టు త‌యారు చేశారు.

మద్రాసు కృష్ణ గాన సభలో ప్రారంభమైన ఈ నాటకానికి బలరాజ్ సహాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొడవటి గంటి కుటుంబరావు, కొర్రపాటి గంగాధర రావు లాంటి వారు ఈ నాటకంపైన వ్యాఖ్యానించారు.

ఒక ప్రదర్శనకు నాకు పాతిక రూపాయలు ఇచ్చేవారు. నెలకు 5 నాటకాలు వేసేవారు.నాట‌కానికి పాతిక రూపాయ‌లు ఇచ్చేవారు.

ఒక నాట‌కానికి తీసుకునే డ‌బ్బుల‌ను థియేట‌ర్ ఖ‌ర్చులు, ర‌వాణా ఖ‌ర్చుల‌కు వ‌దిలేసే వాళ్ళం. వందరూపాయలతో రోజులు హాయిగా గడిచిపోయేవి.

రాజారావు గారికి సినిమా అవకాశాలు రాకపోయినా,  సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా న‌డిపించేవారు.

మామావ‌రేత్క‌ర్  ‘జయ్ భవాని’ అన్న నాటకాన్ని వేశాం. మూడవ నాటకం హైద‌రాబాదులోని ర‌వీంద్ర భార‌తిలో స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ స‌మ‌క్షంలో వేశాం.

కందుకూరి వీరేశలింగం చేప‌ట్టిన ఉద్య‌మం పైన అభిమానంతో రాజారావుగారు ‘పుట్టిల్లు’ సినిమా తీశారు. కానీ అది ఫెయిలయింది.

రాజారావుగారి పరిచయమే లేకుంటే నేను సినిమా రంగంలో స్థిర‌ప‌డేవాడిని కాదు. రాజబాబుతో కలిసి ఉండమని రాజారావుగారు చెప్పారు. ఇంటి అద్దె రాజబాబు భరించేవాడు, నేను ఇంట్లో ఖర్చు భరించేవాడిని.

రాజబాబు చాలా చురుకైన వాడు. ఇద్దరం కలిసి ఉన్నాం. రాజారావుగారు చివ‌రి రోజుల్లో ఇంటి అద్దె కట్టలేకపోయేవారు. ఆయన ఎల్ ఐ ఎం డాక్టరు.

ఒక సారి రాజారావుగారు ‘మీ ఆవిడకు ట్రాన్సిల్స్ ఉన్నాయా’ అని అడిగారు.’ఏమో బాధపడుతోంది. ఉండే ఉండవచ్చు’ అన్నాను. ‘ఆపరేషన్ చేస్తా డబ్బు తెచ్చుకో’ అన్నారు.

‘ఎంతవుతుంది’ అని అడిగాను. “పాతిక’ అన్నారు. తీసుకొచ్చి ఇచ్చాను. ఆపరేషన్ చేసేశారు.

ప్ర‌భుత్వం త‌ర‌పున జ‌యీభ‌వ నాట‌కాన్ని వేయ‌డానికి గెస్ట్ హౌస్‌లో ఉన్న పి.వి.న‌ర‌సింహారావు గారిని క‌ల‌వ‌డానికి రాజారావుగారితో పాటు నేను కూడా వెళ్ళాను.

ఆ త‌రువాత రాజారావుగారికి గుండెపోటు వ‌చ్చింది. 1963లో రాజారావు గారి ఆరోగ్యం విషమించింది. జనరల్ ఆస్పత్రిలో చేర్చాము.

“రాజా బ్యాట‌రీని (గుండెను) ఎక్కువగా వాడేశాడు. వాడికేమైనా అయితే. నాకు చెప్పకండి” అన్నారు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి. అంత ఆత్మీయ స్నేహితులు వాళ్ళిద్ద‌రు.

1963 సెప్టెంబర్ 8వ తేదీన ఆస్పత్రిలోనే రాజారావు గారు గుండెపోటుతో మరణించారు. రాజారావుగారు పోయిన విషయం ఆయన భార్యకు కూడా చెప్పకుండా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళాం.

రాజారావు గారి అంత్యక్రియల వార్త‌విని ఆంధ్రదేశమంతా కదిలింది. గోరా, ఎన్టీ రామారావు  కూడా  వచ్చారు.  మ‌ద్రాసులో ఉన్న ప్రజానాట్యమండలి మనుషులంతా వచ్చారు.

రాజారావుగారి ఆకాంక్ష మేర‌కు ఆయన శవంపై ఎర్ర‌జెండా క‌ప్పాల‌నే ఆలోచ‌న ఎవ‌రికీ రాలేదు. సంప్రదాయ పద్ధతిలో  ఆయ‌న కుటుంబం  అంత్యక్రియలు చేసింది.

రాజారావు గారి చేత గ‌వ‌ర్న‌మెంటు నాట‌కం వేయించ‌కుండానే మృతి చెంద‌డం ఆయనను రక్షించింది. ఆయన అంత్యక్రియలకు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

రామచంద్రారెడ్డి గారు ఆయన టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోవడం, ఆయన ఫొటో దగ్గర దు:ఖించడం ; చాలా రోజులు  జరిగింది.

రాజారావుగారు పోయిం తరువాత తొమ్మిది రోజుల వరకు నేను మనిషిని కాలేకపోయాను. నేను ఎలా బతికేది అనేది ఆవేదన.

ఆ బాధ నుంచి విముక్తి పొందడానికి ‘మళ్ళీ రాహుల్ సాంకృత్యాయన్ రచనలు చదవడం మొదలు పెట్టాను. రాహుల్ సాహిత్యం మొత్తం నాకు దొరికింది. ఆలోచించడం మొదలు పెట్టాను.

ఇప్పటి దాకా నాకేమీ లేదు. రాజారావు గారి దగ్గరకు రావడం వల్లనే రాజకీయ స్పర్శ లభించింది. ఇక మీదట ఆ  ముగ్గురి తాత్విక చింతనతోనే నడవడానికి ప్రయత్నిస్తాను.

ఆ తాత్విక చింతనతో నడవలేకపోతే, దాని వెనకైనా నడుస్తాను. కానీ, దానికి దూరంగా మాత్రం జీవించదలుచుకోలేదు. నాలో నేను ఇలా బలమైన నిర్ణయం తీసుకున్నాను.

బెంగాల్ అసోసియేష‌న్‌లో  రాజారావు గారి వర్ధంతిని పెద్ద ఎత్తున మేమంతా క‌లిసి నిర్వహించాం.

ఎన్టీయార్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి లక్ష రూపాయలు వసూలు చేసి రాజారావు గారి కుటుంబానికి ఒక ఇల్లు కొనిచ్చారు.

రాజారావుగారు పోయాక‌ రాజబాబు త‌న‌దైన ప‌ద్ధ‌తిలో జీవించ‌డం మొద‌లు పెట్టాడు. అది నాకు కుదరలేదు.

రాజారావు గారి పైన గౌరవంతో ఒంగోలులో గాండ్ల వెంకటరావు నిరాటంకంగా 40 సంవత్సరాలు ఆయన వర్ధంతిని నిర్వహించారు. ఎక్కువసార్లు నన్నే పిలిచారు.

(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *