(టి. లక్ష్మీనారాయణ)
ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం మరియు ప్రకాశం జిల్లా నీటి హక్కులపై తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపై ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో పలుదఫాలు సమావేశమై సెప్టెంబరు 1న జరగబోయే కృష్ణా నది యాజమాన్య బోర్డు(కె.ఆర్.యం.బి.) సమావేశంలో తెలంగాణ వాదనలను బలంగా వినిపించడానికి సన్నద్ధం చేసినట్లు వార్తలొచ్చాయి.
కానీ, మీ వైపు నుంచి అలాంటి కృషి జరిగినట్లు కనపడడం లేదు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులపై తెలంగాణ రాష్ట్రం చేస్తున్న దాడి, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ పర్యవసానాలపై రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సాగునీటి రంగంపై అవగాహన ఉన్న ఉద్యమకారులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలను తీసుకోవాలన్న డిమాండును మీరు పెడచెవిన పెట్టారు. కనీసం, సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై కార్యాచరణపై చర్చించినట్లు కూడా వార్తలు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. అధికారులు కొన్ని సమస్యలపై మాత్రమే స్పందించి, బోర్డుకు ఉత్తరాలు వ్రాసిన ఘటనలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలోను చిత్తశుద్ధి కొరవడింది. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులపై తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న దాడిపై ఐక్యకార్యాచరణకు ప్రభుత్వం రాజకీయ అనుబంధాలకు అతీతంగా అందరినీ కూడగట్టే ప్రయత్నం చేయాలి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు కేంద్ర ప్రభుత్వం కృష్ణా – గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధులను నిర్ణయిస్తూ 2021 జులై 15న జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుండి అమలులోకి రానున్నది. సెప్టెంబరు 1న జరుగనున్న బోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ బహిరంగ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకురాదల్చాను.
1. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్ కు తరలించాలి. కృష్ణా నది పరివాహక ప్రాంతానికి బయట వందల కి.మీ. దూరంలో ఉన్న విశాఖపట్నంకు బోర్డు కార్యాలయాన్ని తరలించాలని మీరు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. భేషరతుగా దాన్ని ఉపసంహరించుకొని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న కర్నూలుకు బోర్డు కార్యాలయాన్ని తరలించమని బోర్డు సమావేశంలో నిర్దిష్టంగా ప్రతిపాదించి, తదనుగుణంగా నిర్ణయం తీసుకొనేలా కృషి చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది.
2. కేసిఆర్ ప్రభుత్వం అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్నది. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశాలను సహితం ఖాతరు చేయడం లేదు. అసంబద్ధ వాదనలు, డిమాండ్లతో నదీ జలాల సమస్యను జఠిలం చేయడానికి ఉద్ధేశ్యపూర్వకంగానే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. కె.ఆర్.యం.బి. సమావేశాన్ని వేదికగా వాడుకొని అసంబద్ధమైన, రాజకీయపరమైన డిమాండ్లతో ఈ నీటి సంవత్సరంలో నీటి వినియోగానికి అవరోధాలు సృష్టించే ధోరణి ప్రస్ఫుటంగా కనపడుతున్నది. వాటిని ధీటుగా తిప్పికొట్టాల్సి బాధ్యత మీపై ఉన్నది.
3. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై దాఖలైన వ్యాజ్యం సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నది. కాబట్టే, బచావత్ ట్రిబ్యునల్ తీర్పు నేటికీ అమలులో ఉన్నది. బచావత్ ట్రిబ్యునల్ నీటి వినియోగ ఆధారంగా ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులను చేసినప్పటికీ చేయలేదంటూ అడ్డగోలుగా వాదిస్తూ, తెలంగాణలో పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్నదని, కనీసం 50:50 నిష్పత్తిలో నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఇదొక రాజకీయపరమైన డిమాండు మాత్రమే. నీటి వినియోగంలో గందరగోళం సృష్టించడం ద్వారా లబ్ధిపొందాలన్నదే వారి లక్ష్యంగా కనపడుతున్నది. ఆ కుటిలనీతిని క్షేధించాలి.
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖాధికారులు తాజాగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రసారమాధ్యమాలలో వచ్చిన మేరకు కొన్ని లోపభూయిష్టంగాను, బలహీనంగాను ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా “పస్ట్ ఇన్ టైం, పస్ట్ ఇన్ రైట్” అన్న న్యాయబద్ధమైన సూత్రాన్ని కొలబద్దగా పరిగణించి, 1960 సెప్టెంబరు నాటికి ప్రణాళికా సంఘం అనుమతి ఉన్న ప్రాజెక్టులకు 75% ప్రామాణికంగా నికర జలాలను కేటాయించింది. అదనంగా జురాలకు, శ్రీశైలం రిజర్వాయరు వద్ద ఆవిరి పద్దు క్రింద నీటిని కేటాయించింది. ఈ విషయంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించి, ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నది.
5. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు తోడు, ఆ తీర్పు పరిధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భీమాకు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(ఎస్.ఆర్.బి.సి.)కు చేసిన రెండు సర్దుబాట్లను పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీ, తెలంగాణ 299 టీఎంసీ వాడుకోవాలని 2015 జూన్ 18, 19 తేదీలలో కుదిరిన ఒప్పందం సముచితమైనది. ఆ ఒప్పందంపై కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్సులు సంతకాలు చేశారు. ఆ ఒప్పందం మేరకే ఇప్పటి వరకు నీటిని వినియోగించుకోవడం జరిగింది. ఆ ఒప్పందాన్ని తిరగదోడాలని కేసీఆర్ ప్రభుత్వం విఫల ప్రయత్నం చేస్తున్నది. ఆ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టి ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపైన ఉన్నది.
6. శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 834 అడుగులు. దానికంటే క్రింద నీటి నిల్వ ఉన్నప్పుడు జలవిద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగించకూడదు. అలాగే, కృష్ణా డెల్టా – నాగార్జునసాగర్ ప్రాజెక్టుల క్రింద సాగు నీటి అవసరాలకు అనుగుణంగా శ్రీశైలం జలాశయం నుండి జలవిద్యుత్తు ఉత్ఫత్తికి నీటిని వాడాలని విస్పష్టంగా మార్గదర్శకాలున్నాయి. ఈ రెండు నిబంధనలను ఉల్లంఘిస్తూ, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ ప్రభుత్వం 800 అడుగులలోపు నీటి నిల్వ ఉన్నప్పటి నుంచే శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతల కేంద్రాల నుండి జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి, కొనసాగిస్తున్నది. ఆల్మట్టి నిర్మాణం తర్వాత శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం తగ్గిపోయి, 854 అడుగులపైన నీటి నిల్వ ఉండే రోజులు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పూర్వరంగంలో తెలంగాణ ప్రభుత్వ దుశ్చర్యలను బోర్డు సమావేశంలో గట్టిగా నిలదీసి, అడ్డుకట్ట వేయాలి. తద్వారా, కరవు పిడిత రాయలసీమ ప్రాంత నీటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉన్నది.
7. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014, షెడ్యూల్ 11(10) జాబితాలో ఉన్న తెలుగు గంగ, గాలేరు – నగరి, హంద్రీ – నీవా, వెలుగొండ ప్రాజెక్టులు కృష్ణా నది పరివాహక ప్రాంతంలోలేవంటూ గోలచేస్తూనే ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలంటూ కె.ఆర్.యం.బి.కి, ఆర్థిక తోడ్పాటు ఇవ్వద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తరాలు వ్రాసింది. తాజాగా హంద్రీ – నీవాపై అభ్యంతరం తెలియజేస్తూ కె.ఆర్.యం.బి.కి ఉత్తరం వ్రాసింది. విభజన చట్టంలో పేర్కొన్న కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విభజన తర్వాత పాలమూరు – రంగారెడ్డి, డిండి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన ఎస్.ఎల్.బి.సి. తదితర ప్రాజెక్టుల నిర్మాణాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ధ్వంద వైఖరిని సమర్థవంతంగా ఎండగట్టి, కట్టడి చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపై ఉన్నది.
8. కె.సీ.కెనాల్ నీటి వినియోగంపై వివాదాన్ని సృష్టించే కుటిల రాజనీతితో కేసీఆర్ ప్రభుత్వం ఆగస్టు11న కృష్ణా నది యాజమాన్య బోర్డు(కె.ఆర్.యం.బి.) ఛేర్మన్ కు ఉత్తరం వ్రాసింది. కె.సి.కెనాల్ కు కేవలం 10 టీఎంసీలు మాత్రమే వినియోగించుకొనే అర్హత ఉన్నదని ఆ ఉత్తరం సారాంశం. దీనిపై ఇప్పటి వరకు మీరు స్పందించలేదు. ఈ అంశంపై కె.ఆర్.యం.బి. సమావేశంలోనైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు బలంగా గళమెత్తాలి. 150 సం.ల చరిత్ర ఉన్న కె.సి.కెనాల్ నీటి వినియోగంపై వివాదాన్ని సృష్టించే కుట్రను ఎండగట్టాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపై ఉన్నది.
బ్రిటిష్ వాళ్ళ పాలనలో నావిగేషన్ కోసమే కర్నూల్ – కడప కాలువను తవ్వారు. అటుపై సాగునీటి కాలువగా మార్చారు. మద్రాస్ – మైసూర్, మద్రాస్ – హైదరాబాద్ ప్రావెన్సెస్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం -1956 అమలులోకి వచ్చింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ ను నియమించింది. కృష్ణా నదీలో 75% నీటి లభ్యత ప్రాణికంగా లభించే 2060 టీఎంసీలను మహారాష్ట్ర, కర్ణాటక, పూర్వ ఆంధ్రప్రదేశ్ ల మధ్య ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 800 టీఎంసీల్లో కె.సీ. కెనాల్ కు 39.90 టీఎంసీలు కేటాయించబడ్డాయి. అందులో 10 టీఎంసీ తుంగభద్ర డ్యాం నుండి, మిగిలిన 29.9 టీఎంసీ తుంగభద్ర డ్యాంకు సుంకేసుల ఆనకట్టకు మధ్య తుంగభద్ర నదికి చేరే వర్షపు నీటి నుండి వాడుకోవాలని తీర్పులో పేర్కొనబడింది. అదే ఫైనల్. ఆ కేటాయింపును కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ -2/ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
నిత్యకరవు పీడిత రాయలసీమ ప్రాంతంలో నిర్మించబడిన పురాతనమైన, ప్రధాన భారీ నీటిపారుదల ప్రాజెక్టు కె.సి.కెనాల్. బ్రిటిష్ వారి పాలనా కాలంలో డచ్ కంపెనీ అయిన మద్రాస్ ఇరిగేషన్ & కెనాల్ నిర్మాణ సంస్థ జల రవాణా మరియు నీటి పారుదల కోసం కర్నూలు – కడప కాలువ(కె.సి.కెనాల్) నిర్మాణాన్ని 1863లో ప్రారంభించి, 1870 నాటికి పూర్తి చేసింది.
కర్నూలు పట్టణానికి 30 కి.మీ. దూరంలో ఉన్న సుంకేసుల వద్ద తుంగభద్ర నదిపై ఆనకట్టను నిర్మించారు. సుంకేసుల నుండే కె.సి.కెనాల్ ప్రారంభమై, 350 కి.మీ. ప్రయాణించి, కడప సమీపంలోని కృష్ణాపురం వద్ద ప్రధాన కాలువ ముగుస్తుంది. ఆయకట్టు చివరలో ఉన్న పాత కడప చెరువుకు నిరందిస్తుంది. గాలేరు, నిప్పులవాగు, కుందు, పెన్నా నదులతో అనుసంధానంచేస్తూ కె.సి.కెనాల్ ను నిర్మించారు.
ఈ కాలువను నిర్మాణ సంస్థ డచ్ కంపెనీ 1882లో బ్రిటిష్ వారికి అమ్మేసింది. ప్రఖ్యాత ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ సలహా మేరకు బ్రిటిష్ ప్రభుత్వం నీటి పారుదలకు అధిక ప్రాధాన్యతిచ్చి ఈ కాలువను వినియోగంలోకి తెచ్చింది. 1935 నాటికి సరుకు రవాణాను పూర్తిగా నిలిపివేసి, సాగునీటి సరఫరాకే పరిమితం చేశారు. కర్నూలు జిల్లాలో రెండు లక్షల ఎకరాలు, కడప జిల్లాలో లక్షా మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. శ్రీశైలం జలాశయం నిర్మాణం వల్ల కె.సి.కెనాల్ ఆయకట్టులోని దాదాపు 10,000 ఎకరాల సాగుభూమి, 100 గ్రామాలు ముంపుకు గురైనాయి.
తుంగభద్ర నుండి 60 టీఎంసీల నీటిని వినియోగించుకొంటున్న కె.సి.కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ 39.9 టీఎంసీలను మాత్రమే కేటాయించింది. ఇందులో తుంగభద్ర డ్యాం నుండి 10 టీఎంసీలను, మిగతా 29.9 టీఎంసీలను తుంగభద్ర డ్యాం, సుంకేసుల ఆనకట్టకు మధ్య లభించే వర్షపు నీటి నుండి వాడుకోవాలని తీర్పులో పేర్కోన్నారు. ఈ ప్రాంతం అతితక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం కావడం, పైభాగంలో రాజోలి బండ మల్లింపు పథకం మరియు ఇతర ప్రాజెక్టులు ఉండడం వల్ల ఎక్కువ సంవత్సరాల్లో కె.సి.కెనాల్ ఆయకట్టులో చివరి భూములకు నీరందని దుస్థితి కొనసాగుతున్నది. బచావత్ ట్రిబ్యునల్ విచారణ కాలంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు రాయలసీమకు అన్యాయం చేశారనే ఆవేదన ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్నది.
1994 మార్చి 28న నాటి ముఖ్యమంత్రి యన్.టి.రామారావు గారి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణం తరువాత కె.సి.కెనాల్ కు అవసరమైన నీటిని శ్రీశైలం రిజర్వాయరు నుండి అందించి, తుంగభద్ర డ్యాం నుండి కె.సి.కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 10 టీఎంసీలను అత్యంత కరవు పిడిత అనంతపురం జిల్లాలోని పెన్నా అహోబిలం రిజర్వాయరు(పి.ఏ.బి.ఆర్.)కు సర్దుబాటు చేయాలని ఆ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానం పూర్వరంగంలో డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాజకీయ పార్టీల ఆమోదంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కృష్ణా నదీ జలాలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులర్ ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ మీదుగా ఎస్కేప్ ఛానల్ ద్వారా సంతజూటూరు ఆనకట్టకు కొంత నీటిని తరలించి కె.సి.కెనాల్ దిగువ భాగంలో ఉన్న కడప జిల్లా ఆయకట్టుకు అందించడం జరుగుతున్నది. అలాగే, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కొంత నీటిని తరలించి కర్నూలు జిల్లాలోని ఆయకట్టుకు అందిస్తున్నారు.
తుంగభద్ర జలాశయంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం 132.47 నుండి 100.85 టీఎంసీలకు తగ్గిపోయింది. ఆ నీరంతా సుంకేసుల ఆనకట్ట మీదుగా శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. పర్యవసానంగా తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్.ఎల్.సి.)కు కేటాయించిన 32.5 టీఎంసీ, తుంగభద్ర దిగువ కాలువ(ఎల్.ఎల్.సి.) కేటాయించిన 29.5 టీఎంసీ ఏ నీటి సంవత్సరంలో కూడా వినియోగించుకొన్న దాఖలాలు లేవు. కె.సి.కెనాల్ చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరందని దుస్థితితో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది.
కె.సి. కెనాల్ ఆధునికీకరణ వల్ల ఆదా అయిన 8 టీఎంసీ మరియు బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 11 టీఎంసీ పునరుత్పత్తి నీటిని కలిపి మొత్తం 19 టీఎంసీలను శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(ఎస్.ఆర్.బి.సి.)కి కేటాయించి, కేంద్ర జల సంఘం అనుమతితో నిర్మించుకోవడం జరిగింది. కె.సి.కెనాల్ ఆధునికీకరణ ద్వారా ఆదా అయిన నీరు సుంకేసుల ఆనకట్టను దాటుకుని శ్రీశైలం జలాశయానికే చేరుతున్నాయి. అందుకే ఎస్.ఆర్.బి.సి.కి శ్రీశైలం నుండే 19 టీఎంసీ కేటాయించబడింది.
వాస్తవాలు ఇలా ఉంటే చరిత్రను, వాస్తవాలను, గణాంకాలను వక్రీకరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం కె.ఆర్.యం.బి.కి ఉత్తరం వ్రాసింది. హైదరాబాదు రాష్ట్రం భవిష్యత్తు నీటి వాడకానికి అభ్యంతరం పెట్టకూడదన్న షరతు మీద మద్రాసు రాష్ట్రానికి కె.సి.కెనాల్ కు నీటిని సరఫరా చేసే సుంకేసుల ఆనకట్ట నిర్మాణానికి నాటి హైదరాబాద్ ప్రభుత్వం ఆమోదం తెలిజేసిందంటూ మొదలుపెట్టి కె.సి.కెనాల్ ఆయకట్టును ఎండబెట్టే కుట్రపూరితమైన ధోరణితో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి శాఖ ఛీప్ ఇంజనీర్ శ్రీ సి.మురళీధర్ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు 2021 ఆగస్టు 11న ఉత్తరం వ్రాశారు. బచావత్ ట్రిబ్యునల్ కె.సి.కెనాల్ కు కేటాయించిన 39.9 టీఎంసీలను వివాదాస్పదం చేయడానికి విఫల ప్రయత్నం చేస్తుంటే మీ ప్రభుత్వం ఎందుకు మౌనం వహించిందో ఆశ్చర్యంగా ఉన్నది.
9. మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రాజోలుబండ కుడి కాలువ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించకుండా మూలనపడేసింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ పథకం ప్రాధాన్యతను గుర్తించి 4 టీఎంసీ కేటాయించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. కాబట్టి ఇంకా అమల్లోకి రాలేదు. దాన్ని కేసీఆర్ ప్రభుత్వం వివాదాస్పదం చేస్తున్నది. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుగా నిలిచింది. మరొకవైపున, తుమ్మెళ్ళ, తదితర ఎత్తిపోతల పథకాలను నిర్మించుకొంటున్నారు.
10. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అధర్మ నీటి యుద్ధం నుండి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా నీటి హక్కులను పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత మీ ప్రభుత్వంపైన ఉన్నది.
(టి.లక్ష్మీనారాయణ, కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక, మొబైల్ నెం.9490952221)