సీబీఐ, ఈడీ కేసుల సత్వర విచారణ శుభపరిణామం
రాజకీయాల్లో నేరస్తుల్ని నిలువరించినపుడే అసలైన ప్రజాస్వామ్యం
(యనమల రామకృష్ణుడు)
ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల్లో విచారణ జాప్యం ప్రజాస్వామ్యా ఉనికికే ప్రమాదకరం. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, నేరస్తులకు శిక్ష పడినపుడే భావితరాలకు ఆదర్శవంతమైన సమాజాన్ని అందించగలం.
రాష్ట్రంలోనే దాదాపు 138 సీబీఐ, ఈడీ కేసులు దశాబ్ద కాలానికి పైగా వివిధ దశల్లో పెండింగులో ఉన్నాయి.
ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన నివేదిక మేరకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకు తెలిపారు. మన రాష్ట్రంలో పెండింగులో కొన్ని కేసుల విచారణలో అసాధారణ జాప్యం జరుగుతోందని కూడా వెల్లడించారు.
ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి ప్రధాన విఘాతాలుగా తయారయ్యాయి. రాజకీయాల్లో నేరస్తుల్ని నిలువరించే విషయంలో సుప్రీంకోర్టు చొరవ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ట పరుస్తుంది.
ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారం ఎన్నికల ప్రక్రియ ద్వారా.. ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజలు తమ ప్రజాప్రతినిధి అధికార దుర్వినియోగం, అక్రమాలు ప్రజలకు తెలిసినపుడే మార్పు మొదలవుతుంది.
చట్ట సభల్లోకి నేరస్తులు, ఆర్ధిక ఉగ్రవాదులు అడుగు పెట్టకుండా అడ్డుకోగలుగుతాం. అమికస్ క్యూరీ సూచన మేరకు క్రిమినల్, సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణను పర్యవేక్షించేందుకు వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలి.
శిక్షలు పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవిత కాలం నిషేధం విధించేలా పార్లమెంటు చొరవ తీసుకోవాలి. ఎన్నికల ప్రక్రియలోనే నేరస్తులు చట్ట సభల్లో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను పారదర్శకంగా, స్వచ్ఛంగా తయారు చేయాలంటే.. వారిని నిరోధించే చట్టాలు కూడా అంతే పకడ్బందీగా ఉండాలి.
రాజకీయాల్లోకి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు రాకుండా నిరోధించినపుడే ప్రజాసంపద, ప్రకృతి వనరులు కాపాడగలం. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాలు కూడా పారదర్శకంగా ఉంటాయి.
అధికారాన్ని ఉపయోగించి నల్లధనం కూడబెట్టే ప్రక్రియను నిలువరించగలం. సమాజంలో రాజకీయ-ఆర్ధిక-సామాజిక అసమానతలను తగ్గించి.. సమాజాభివృద్ధికి తోడ్పడగలం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడగలం.
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉన్న కొన్ని కేసుల్లో దశాబ్దాలుగా ఛార్జిషీట్ కూడా దాఖలవ్వకపోవడం అత్యంత ప్రమాదకరం. సామాన్య పౌరులపై నమోదయ్యే చిన్న చిన్న కేసుల్లో దర్యాప్తు, విచారణ శరవేగంగా పూర్తి చేసి.. శిక్షలు విధిస్తూ.. ప్రజాప్రతినిధులు చేసే పెద్ద పెద్ద కేసుల విషయంలో ఉదారత చూపడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.