సిద్దేశ్వరం అలుగును వెంటనే ఎందుకు నిర్మించాలంటే…

 

శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని, పూడికను తొలగించడానికి కేంద్ర జలవనరుల శాఖ చేపట్టనున్న సర్వేను ఆహ్వానిస్తున్నామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.

1984 సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యాన్ని నిర్ణయించినప్పుడు 885 అడుగులలో 308 tmc ల నీటిని నిర్వహణా సామర్థ్యంగా ఆరోజు లెక్కలు వేసారని ఆయన తెలిపారు. తదనంతరం 27 సంవత్సరాల తరువాత 2011 సంవత్సరంలో జరిగిన సర్వేలో శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిర్వహణ సామర్థ్యం 215.8 tmc లకు తగ్గినట్లుగా నిర్ధారించారని, ఈ 27 సంవత్సరాలలో 93 tmc ల నీటి నిర్వహణా సామర్థ్యం తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు.

ఈ 27 సంవత్సరాలలో సగటున ప్రతి సంవత్సరం 3.4 tmc ల లెక్కన కేవలం పూడిక వలన 93 tmc ల నీటిని కోల్పోవడమేగాక, 2011 నుండి 2021 సంవత్సరం వరకు మరో 35 tmc ల నీటిని కోల్పోయామని దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో పూడిక వలన నీటి సామర్థ్యం తగ్గడంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు జీవిత కాలం హరించివేయడమేనని ఆయన అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జీవిత కాలాన్ని పెంచడానికి, పూడిక నివారణ కోసం సిద్దేశ్వరం అలుగును నిర్మించాలని దశరథరామిరెడ్డి కోరారు.

అంతేకాక శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన సిద్దేశ్వరం అలుగుతో పాటు,గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి రిజర్వాయర్ లను నిర్మించడము వలన భారీ వరదల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చని దశరథరామిరెడ్డి తెలిపారు.

బొజ్జా దశరథరామిరెడ్డి,
అధ్యక్షులు,
రాయలసీమ సాగునీటి సాధన సమితి.

సిద్దేశ్వరం అలుగు నిర్మాణం వలన ప్రాజెక్టులోకి పూడికను నివారించవచ్చని, గుండ్రేవుల రిజర్వాయర్ వలన K.C.కెనాల్ ఆయకట్టుకు సకాలంలో నీరు ఇవ్వడమేగాక, దక్షిణ తెలంగాణా ప్రాంతానికి సాగునీరు, కర్నూలు నగరానికి త్రాగు నీటిని సరఫరా చేయొచ్చని ఆయన తెలిపారు.వేదవతి రిజర్వాయర్ వలన కర్నూలు పశ్చిమ ప్రాంతానికి త్రాగునీటితో పాటు, సాగునీటిని అందించవచ్చని ఆయన తెలిపారు.

శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని, పూడిక నివారణ కోసం చేపట్టనున్న సర్వేలో కేంద్ర జలవనరుల శాఖ ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని దశరథరామిరెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *