టీటీడీ విద్యా సంస్థలకు త్వరలో మంచి రోజులు

పత్రికాప్రకటన తిరుపతి, 21 ఆగస్టు 2021

విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి నిష్ణాతులతో కమిటీ

– ఒకటి నుంచి డిగ్రీ దాకా చదివే విద్యార్థులకు స్మార్ట్ క్లాస్ లపై అవగాహన

విద్యా శాఖపై సమీక్షలో అధికారులకు ఈవో ఆదేశం

టిటిడి విద్యా సంస్థ‌ల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పరచడానికి నిష్ణాతులతో కమిటీ ఏర్పాటు చేస్తామని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. విద్యా సంస్థ‌ల్లో ఉత్తమ ఫలితాల సాధన, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, వసతులు, యుజిసి గ్రాంట్, పరిశోధన ప్రాజెక్టులు తెచ్చే అంశాలపై ఈ కమిటీ పని చేస్తుందన్నారు. టిటిడి పరిపాలన భవనంలోని తన చాంబర్లో శనివారం ఆయన విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి విద్యా సంస్థల్లో ఒకటి నుంచి డిగ్రీ దాకా చదివే విద్యార్థులకు స్మార్ట్ క్లాస్ లపై అవగాహన కల్పించి, ఉత్తమ ఫలితాలు సాధించేలా పెద్ద సంస్థలతో శిక్షణ ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి నిర్వహణలోని శ్రీ వేంకటేశ్వర, శ్రీ గోవింద రాజ స్వామి, ఓరియంటల్, శ్రీ పద్మావతి మహిళా కళాశాలలకు యూజిసి ప్రాజెక్టులు సాధించడం పైన శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కళాశాల యూజిసి నుంచి కనీసం పది పరిశోధన ప్రాజెక్టులు తెచ్చుకోగలిగేలా కృషి చేయాలని ఈవో సూచించారు. టిటిడి కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పరచాలన్నారు. మౌళిక వసతులు, పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించడం ద్వారా శ్రీ సిటి లాంటి పెద్ద సంస్థలతో అవగాహన కుదుర్చుకుని క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాలన్నారు.

టిటిడి కళాశాలలకు న్యాక్ లో ఉత్తమ గుర్తింపు లభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.వ్యవసాయ,పశు వైద్య, ఉద్యాన, పాక శాస్త్ర విశ్వ విద్యాలయాలతో ఎంఓయులు కుదుర్చుకుని విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క‌ళాశాల‌ల స్వ‌యం స‌మృద్ధి కోసం డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించాలని చెప్పారు.

టిటిడి విద్యా సంస్థ‌లన్నింటిలో ఒకే ర‌క‌మైన యూనిఫాం ఉండాల‌న్నారు. ఉద‌యం 8 గంట‌ల‌కు త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఏ సిఏఓ శ్రీ బాలాజి, విద్యా శాఖాధికారి శ్రీ గోవింద రాజన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *