ఏడేళ్లుగా లేని ‘దళిత బంధు’ ఇపుడే రావడంలో ఆంతర్యం?

(వడ్డేపల్లి మల్లేశము)

రాజకీయ పార్టీలు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత సందర్భానుసారంగా అవసరానుగుణంగా ప్రజా ప్రయోజనం కంటే స్వప్రయోజనాలకు ఎక్కువగా పాల్పడుతూ హామీలు ఇస్తుంటాయి. నాయకులు హామీలు నెరవేర్చి, ప్రజలకు సుపరిపాలన అందించే బదులు తమ రాజకీయ, ఆర్థిక, ప్రాబల్యం కోసం ప్రయోజనాలకోసం ఎక్కువగా పాల్పడుతుంటారు.

ఈ క్రమంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కదారి పట్టి ప్రజలను బానిసలుగా చూస్తూ తాయిలాలు ఇవ్వడం ద్వారా బిచ్చగాళ్ళుగా మార్చుతూ పబ్బం గడుపుకుంటున్నారు. పరిపాలనా విధానాలలో అత్యుత్తమమైనదని పేరెన్నికగన్న ప్రజాస్వామ్య పరిపాలన లోను రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు, అధికరణ ములను జోడించిన ఆచరణలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయి.

అయినప్పటికీ అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను, ఆకృత్యాలను
ప్రతిపక్షాలు ఖచ్చితంగా నిర్మొహమాటంగా విమర్శించి అడ్డుకోక పోవడం వల్లనే ఎంతోమంది ప్రజాస్వామికవాదులు ,బుద్ధి జీవులు, మేధావులు చేయని నేరానికి జైళ్లలో మగ్గుతున్నారు. ఇది నగ్నసత్యం. ముమ్మాటికీ ఇది ప్రతిపక్షాలు తమ పాత్రను క్రియా శీలకంగా పోషించని కారణంగానే జరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు.

అలాంటిదే తెలంగాణ రాష్ట్రంలో” దళిత బంధు “పేరుతో హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం తెర ముందుకు తీసుకురావడంలో రాజకీయ ప్రయోజనం, దళితులను పావుగా వాడుకోవడం తప్ప పెద్దగా దళితులకు ఒరిగేది ఏమీ లేదు.

దళిత సాధికారత- దళిత బందు

టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దళిత సాధికారత కోసం ఏటా1000 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ఇచ్చిన హామీ ఏ మేరకు నెరవేరిందో విశ్లేషకులు, ప్రజలు, దళితులు, బుద్ధిజీవులు ఆలోచించాలి. ఇది దళితులకు సంబంధించిన అవసరమైనప్పటికీ అంబేద్కర్, పూలే ,మార్క్సిస్టులు అందరూ కూడా ఆలోచించాల్సిందే.

గత ఎడేళ్లలో ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రంలోని దళితుల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఏ మేరకు ఖర్చు చేసింది ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయవలసి ఉన్నది. దానిని అటుంచి ఏడేళ్లలో ఏనాడు రాని ఆలోచనను హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న సందర్భంగా జూన్ 27వ తేదీన అఖిలపక్ష సమావేశం పేరుతో (బహుశా అఖిలపక్షాల తొలి సమావేశం) దళితుల ఉద్దరణకు నడుం కట్టినట్లు లాకప్ డెత్ గురైన టువంటి మరియమ్మ కుటుంబానికి అనేక రాయితీలను ప్రకటించి ,దళితులను నమ్మించే క్రమంలో ప్రకటన చేయడం జరిగింది.
దానిని రైతుబంధు లాగా” దళిత బందు” అనే పేరుతో ఇటీవల హుజరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేస్తూ పైలెట్ ప్రాజెక్టుగా రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు గా ప్రకటించడం దేనికి సంకేతం?

నిజంగా దళిత సాధికారత అంటే సామాజిక ,రాజకీయ ,ఆర్థిక రంగాలలో దళితులను అభివృద్ధి చేయడం. విద్యావకాశాలను మెరుగుపరిచి, ఉపాధి ఉద్యోగాలను అందుబాటులోకి తెచ్చి, మానవ అభివృద్ధి సాధించే క్రమంలో జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా మాత్రమే దళిత సాధికారత సాధ్యమవుతుంది.

అస్పృశ్యత, అంటరానితనం, వివక్షత కొనసాగుతున్నంతకాలం ఇలాంటి పథకాలతో కుల నిర్మూలన,అభివృద్ధి జరగకపోగా పై పూత లాగా మాత్రమే పనిచేస్తాయి. అందులో ముఖ్యంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని అనడం దళిత సాధికారతకు ఏ కోశానా కూడా ఉపయోగపడదు.

గతంలో దళితులకు ఇచ్చిన వాగ్దానాలు

ప్రస్తుత ప్రభుత్వం అధికారానికి రాకముందే ముఖ్యమంత్రి పదవిని దళితులకు కట్టబెడతానని, భూమి లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని, అర్హులైన వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు.

మరి అలాంటప్పుడు కేవలం హుజరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే రెండు వేల కోట్లు ఖర్చు పెడుతూ ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామనడం లో విశ్వసనీయత ఉందా? ఎలా నమ్మడం?

అయినా దళిత బంధు పథకాన్ని కేవలం ఒక్క నియోజక వర్గానికి మాత్రమే పరిమితం చేయడంలో శాస్త్రీయత ఉందా? ఈ ప్రశ్నలకు సంబంధించి దళిత మేధావులు, బుద్ధిజీవులు, అంబేద్కర్,పూలే ఆలోచనాపరులు, మార్క్సిస్టు మేధావులు, బాధ్యత కలిగిన మిగతా పౌర సమాజం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది.

మాట తప్పిన ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, ఎందుకు?

ఎంతసేపు వాగ్దానాల రూపంలో ప్రభుత్వం నుండి యాచించడం తప్ప చట్టబద్ధమైన రాజ్యాధికారం ద్వారా శాసించే స్థాయికి చేరుకోవాలని పట్టుదల లేని కారణంగా ఎస్సీ, ఎస్టీ, బిసి ,మైనారిటీ వర్గాలు మెజారిటీ ఉండి అల్ప శాతం గా ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడంలోనే మన అనైక్యత, బానిస మనస్తత్వం బయటపడుతుంది.

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, అలాగే దళిత మేధావులు, అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వారు ముఖ్యమంత్రి మాట తప్పిన విధానాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మౌలికమైన సమస్య ముఖ్యమంత్రి పదవిని అంటిపెట్టుకుని దళితులకు మోసం చేసినా ఈ విషయాన్ని ఎందుకు నిలదీయలేదు?

చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ రాజీనామా చేయాలని ప్రతిఘటించ వలసిన అవసరం ఉండే. ఏడేళ్లలో ఏనాడు పట్టించుకోకపోగా వాగ్దానం చేసి మాట తప్పిన ముఖ్యమంత్రి చిత్రపటానికి ఇంకా పాలాభిషేకం చేయడంలో ఎంత అవివేకం దాగివుందో, ఎంత బానిస మనస్తత్వమో అర్థం చేసుకోవచ్చు.

దళిత బంధు కేవలం ప్రస్తుతం ఎన్నికల కోసం ఉపయోగపడే పథకమే. అందుకే ఎన్నికలవేల హుజురాబాద్ లో దానిని ప్రవేశపెట్టినట్లు ఓటర్లు గమనించి తదనుగుణమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దళిత సాధికారత అనేది చాలా విశాల అర్థంలో దళితుల సముద్ధరణకు సామాజిక రాజకీయ ఆర్థిక స్థాయిని పెంచే బృహత్తర కార్యక్రమం. అది ఒక్కరోజుతో అయ్యేది కాదు నిరంతర ప్రక్రియ. అంతే కాదు దీర్ఘకాలిక ప్రక్రియ.
ఎస్టీ, బిసి, మైనారిటీ లలో ఆర్థికంగా వెనుకబడి, భూమి లేక, ఉపాధి లేక సాధికారత లేకుండా లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఏక మొత్తంలో నగదు రూపేణ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం కాకుండా ఆయా వర్గాల సామాజిక, రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని శాశ్వత స్థాయిలో మార్చడానికి ఆ వర్గాల జీవన ప్రమాణాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయడమే ఏకైక మార్గం.

హుజురాబాద్ ఎంపిక లోగుట్టు

గతంలో భారతదేశంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యా వైద్య ఆర్థిక రంగాలకు సంబంధించిన కొన్ని అంశాలలో పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకున్న మాట వాస్తవమే. కానీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయబడిన ఈటల రాజేందర్ ను ఎదుర్కోవడానికి టిఆర్ఎస్ పార్టీ చేయవలసిన టువంటి కృషి బదులు ప్రభుత్వము యావత్తు హుజురాబాద్ పైనే కేంద్రీకరించడం ఎన్నికల సంఘం యొక్క వైఫల్యం గానే భావించవలసి ఉంటుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులను పక్కనపెట్టి హుజురాబాద్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకొని ఓట్లను పొందడం కోసం మాత్రమే ఆశ చూపడం ఎన్నికల పరిభాషలో నేరమే అవుతుంది. ఇప్పటికే కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసి ఆ ప్రాంత ప్రజానీకాన్ని, ప్రజా ప్రతినిధులను అధికార పార్టీ వైపు తిప్పుకోవడానికి చేస్తున్న కృషిని, జిమ్మిక్కులను గవర్నర్ గారు, ఎన్నికల సంఘం, న్యాయస్థానం పరిశీలించి ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా చేయడానికి ఏ వర్గం వ్యతిరేకం కాదు .కానీ ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల ప్రణాళికను ప్రకటించడం బాధ్యతారాహిత్యమే కాక అధికార దుర్వినియోగం కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.

దళిత మేధావులు, విద్యావంతులు,
అంబేద్కరిస్టులు, మార్క్సిస్టు లకు విజ్ఞప్తి

రాజ్యాధికారం మన చేతిలో ఉంటే మిగతా వర్గాల ప్రయోజనాలను మనమే శాసించగలము. తీర్చగలము. రాజ్యాధికారానికి గత 70 సంవత్సరాలుగా దూరంగా ఉన్న బహుజనులకు టిఆర్ఎస్ పార్టీ వాగ్దానంతో ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది. ఆ వాగ్దానాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఇప్పటికీ రాజీనామా చేసి దళిత ముఖ్యమంత్రిని నియమించే వరకు దళిత బందును వ్యతిరేకించి బహిష్కరించ వలసిందిగా విజ్ఞప్తి.

ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయడమంటే ఓట్లను కొనుగోలు చేయడమే మనం కోరేది దళితుల సాధికారత కానీ దళిత బందు కాకూడదు. దళితులలో ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని, విద్యా అవకాశాన్ని, సామాజిక స్థాయిలో ఎదుగుదలను కల్పించే దళిత సాధికారత వైపు డిమాండ్ చేద్దాం పది లక్షల నగదుతో ఓట్ల నుకొనే మరో మోసాన్ని వ్యతిరేకిద్దాం.
ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మాట తప్పి దళిత బంధు అమలు చేస్తాడని ఎలా నమ్ముతున్నారు?

దళిత మేధావులు కూడా ముఖ్యమంత్రిని కలిసి ప్రశంసించడం, అక్కడక్కడ పాలాభిషేకాలకు పాల్పడడం కూడా దళితుల బహుజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే అవుతుంది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *