నివాళి: చంద్రశేఖర్ అజాద్ కల నెరువేరుతుందా?

(వడ్డేపల్లి మల్లేశము)9014206412

ఈ మధ్య మరుగున పడిన స్వాతంత్య్రోద్యమ వీరుల సంస్మరణ మొదలయింది. ఇలా పునరాలోచనల్లోకి వచ్చిన  వారిలో భారత స్వాతంత్య్ర సంగ్రామ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనకు తన మన్ కీ బాత్ లో నివాళులర్పించారు.”  దీనితో ఆలహాబాద్ ఆజాద్ ప్కార్ దర్శనీయ ప్రదేశమయింది.

“The valor of Chandrasekhar Azad and his passion for freedom has inspired much youth. Azad sacrificed his life but did not bow down before foreign rule,”అని ప్రధాని Mann Ki Baat 46వ ఎపిసోడ్  లో పేర్కొన్నారు.

రకరకాల శక్తులు ఆజాద్ త్యాగానికి రకరకాల భాష్యం చెబుతున్నాయి. తమ రాజకీయ కార్యక్రమాలకు అజాద్ పేరును వాడుకోవాలనుకుంటున్నాయి. కాని అజాద్ కోరింది ఉత్తి స్వాత్రంత్య్ర భారత దేశం కాదు. అంతకంటే ఉన్నతమయిన భారతం. అదేంటో చూద్దాం.

ఇపుడు నిరసనలకు తావు లేని దేశంలో, సామరస్యం కనుమరగవుతున్న రాజకీయ వాతావరణంలో, ప్రత్యర్థుల  మీద అత్యాధునిక స్పై వేర్ తో నిఘా పెటిన కాలంలో, రాజద్రోహ నేరాలు తీవ్రమవుతున్నపుడు ఆజాద్ ను స్మరించుకుంటున్నాం. ఆజాద్ ను స్మరించుకోవాలసిన అసవరం ఎక్కువయింది. ఎందుకంటే, ఆజాద్ కల ఇక నెరవేరలేదు. నెరవేర్చుకోవాలన్న దీక్షతో…

దేశ ప్రజల విముక్తి కోసం ధర్మ యుద్ధమే సరైనదని దానికి సాయుధ పోరాటమే మార్గమని గట్టిగా నమ్మి చివరివరకు ఆచరించి చూపిన వాడు చంద్రశేఖర్ ఆజాద్.

ఆజాద్ తనని కాల్చుకున్నది ఈ చెట్టు దగ్గిరే… (wikimiedia commons)

1919 ఏప్రిల్ 13 వ తేదీన జలియన్వాలాబాగ్ సంఘటనలో  అమరులైన వందలాది మంది మృతి పట్ల కలతచెంది తన జీవితాన్ని దేశ మాత సేవలో గడిపి స్వేచ్ఛకై పోరాడాలని కఠోర నిర్ణయం తీసుకొని బ్రిటిష్ వారితో పోరాడుతూ అసువులు బాసాడు. బ్రతికింది 25 సంవత్సరాలు మాత్రమే అయినా చరిత్రలో వీరుడి గా నిలిచి పోయినాడు. ఆ స్ఫూర్తి నేడు కావాలి.

జననము, బాల్యము

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా బాధర్కా గ్రామములో 1906 జూలై 23న పండిట్ సీతారాం తివారి జగ రాణి దేవి లకు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినాడు. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర సీతారాం తివారి, పండిట్ జీ  అని కూడా పిలుస్తారు.


ఈ రోజు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి


కొడుకుని పెద్ద సంస్కృ పండితుడిని చేయాలని తల్లి కాంక్షించింది.అందుకే ఆయన్ని సంస్కృతం చదివించేందుకు  కాశీవిద్యాపీఠానికి పంపించింది. చదువు పట్ల పెద్దగా ఆసక్తి లేని కారణంగా పండితుడు కావాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చలేక పోయడు. అక్కడున్నపుడే ఆయన 1921 సహాయ నిరాకరణ ఉద్యమంతో ప్రభావితుడయ్యాడు.

చిన్ననాడే ఇంటి నుండి పారిపోయి కూలీ పనులు చేసి ప్రజల కష్టసుఖాలను కూడా అవగాహన చేసుకున్నాడు. ఆ స్ఫూర్తి ఉండడం వల్లనే ప్రజా జీవితాన్ని ప్రజల ఇక్కట్లను బాధ్యతగా తీసుకొని స్వాతంత్ర పోరాటంలో పనిచేయడం నేటి మన తరానికి ఎంతో ఆదర్శం. ఏమంటారు?

అంహింసా విధానం మీద అసంతృప్తి

చంద్రశేఖర ఆజాద్ కు సహచరులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్ ,ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్ లు అసాధారణ ధైర్యసాహసాలున్న వాళ్లు.  వారంతా ఆజాద్ మార్గదర్శకత్వంలో పనిచేసిన వారే.

1921లో గాంధీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమం అతని ఆలోచన కు ప్రేరణగా ,వేదికగా పనిచేసింది. ఆ ఉద్యమంలో ఆయన తన సహచరులతో కలసి క్రియాశీలక పాత్ర పోషించారు.అయితే, సహాయనిరాకరణోద్యమాన్ని మహాత్మాగాంధీ హఠాత్తుగా ఉపసంహరించుకోవడంతో  ఆజాద్ నిరాశ చెందాడు. అహింసా మార్గంలో స్వాతంత్య్ర రాదనే నిర్ణయానికి వచ్చాడు. సాయుధ విప్లవ పంథాను ఎంచుకున్నారు.

ఆయనలో పౌరుషాగ్ని తట్టిలేపింది. విప్లవ కారుని మేల్కొలిపింది. భారతదేశాన్ని బ్రిటిష్ కబంధహస్తాల నుండి విడిపించాలని మరింత పట్టుదల పెరిగింది. అరెస్ట్ అయిన తర్వాత విచారణ సందర్భంలో కోర్టులో మెజిస్ట్రేట్ నీ పేరేంటి అని అడిగితే” ఆజాద్” అని పెద్ద శబ్దంతో అరిచాడట. అందుకు న్యాయమూర్తి 15 కొరడా దెబ్బలు శిక్షగ విధిస్తే ప్రతి దెబ్బ దెబ్బ కు” భారత్ మాతాకీ జై “అంటూ గొంతెత్తి నినదించాడు. నాటి నుండి చంద్రశేఖర ఆజాద్ గా పేరు స్థిరపడిపోయింది.

ఆజాద్ అంటే స్వాతంత్రం అని కదా అర్థం. వీరుని ప్రతాపం ముందు చట్టాలు, న్యాయస్థానాలు దిగదుడుపే అని తేలిపోయింది. బ్రతికితే అలాంటి బ్రతికే బతకాలి. మనకంటూ ఓ చరిత్రను నిర్మాణం చేసుకోవాలి. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే.

ఉద్యమ కార్యాచరణ ఉధృతి

నవ జవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీలతో సంబంధాలు కలిగి అనేక ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ప్రధానంగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) స్థాపించి ఆ సంస్థ ఆధ్వర్యంలో అనుచరులతో కలిసి అనేక ఉద్యమాలు నిర్వహించాడు. లక్నో సమీపంలోని కాకోరి వద్ద ట్రైన్ దోపిడి (ఆగస్టు 9, 1925)కి పూనుకున్నారు. ఈ రైళ్లో డబ్బును తరలిస్తున్నారు. ఈదోపిడిలో రు. 4500 కొల్లగొట్టారు. ఒక వ్యక్తి మరణించాడు.

అస్ఫకల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్,రాజేంద్ర లాహిరిలకు ఉరిశిక్ష పడింది. అయితే, అజాద్ మాత్రం తప్పించుకోగలిగాడు. తర్వాత హ  తమ సంస్థను హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్  అర్మీ (HSRA)గా మార్చారు. ఈ సంస్థకు ఆజాద్ అల్ ఇండియా కోఆర్డినేటర్, భగత్ సింగ్ జనరల్ సెక్రెటరీ. ఈ సంస్థలో ఉన్నపుడే వారు అంతర్జాతీయ కార్మికోద్యమాలతో, కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ప్రభావితులయ్యారు. వారిసంస్థలోని సోషలిజం అనే మాట దీని ఫలితమే. ఆయన కలగన్నది కూడా సోషలిస్టు భారతమే.

HRSA చేపట్టిన ముఖ్యమయిన విప్లవ కార్యక్రమం  1928లో జరిగింది. ఆయే డాది నవంబర్ లో పూర్తిగా తెల్లవాళ్లతోనే ఉన్న బ్రిటిష్ పార్లమెంటరీ కమిటీ భారత్ సందర్శించింది. ఏడుగురు సభ్యులున్న ఈ బృందానికి సర్ జాన్ సైమన్ నాయకత్వం వహించారు. 1919లో అమలులోకి వచ్చిన మాంటెగు చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు ఎలా అమలు జరుగుతున్నాయో పరిశీలించేందుకు ఈ కమిటీ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ దీనిని బహిష్కరించింది.  సైమన్ గో బ్యాగ్ నినాదం ఇచ్చింది. లాహార్ లో జరిగిన నిరసనల్లో లాలా లజపతి రాయ్ పాల్గొన్నారు. అయితే, అక్కడి పోలీస్ అధికారి జెఎ స్కాట్ లాఠీ చార్జ్ చేయించాడు. ఇందులో లాలా లజపతి రాయ్ గాయపడ్డారు. తర్వాత చనిపోయారు. ఇది  ఆజాద్ కు ఆగ్రహం తెప్పించింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. స్కాట్ ను చంపేయాలనుకున్నాడు. అయితే ఆజాద్ గ్రూప్ దాడిలో అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ జెపి సాండర్స చనిపోయాడు.

మరణంలోనూ చంద్రశేఖర్ ది ప్రత్యేకతే

చంద్రశేఖర్ ను ప్రాణాలతో అరెస్టు చేయాలని పోలీసులు ఆశపడితే సహచరులను చూడడానికి అలహాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్క్కు వెళ్లిన చంద్రశేఖర్ ను పోలీసులు చుట్టుముట్టి లొంగి పొమ్మని హెచ్చరించగా పోలీసులను కాల్చి చంపి చివరికి తన బుల్లెట్లతో తానే చంపుకొని పోలీసుల ఆశను నిరాశ పర్చాడు.

1931లో అలహాబాద్ ఆల్ ఫ్రెడ్ పార్క్ (ఇపుడు ఆజాద్ పార్క్ అయింది)లో పోలీసులు ఆయనను చుట్టుముట్టారు. పోలీసులుకు లొంగిపోవడం ఇష్టంలేక ఆయన తనని కాల్చుకున్నాడు.అప్పటికి ఆయన దగ్గిర ఒక పిస్టల్ కొన్నిగుండ్లు  మాత్రమే ఉన్నాయి. వాటితోనే పోలీసుల మీద కాల్పులు జరిపాడు. చివర తననుకాల్చుకున్నాడు. కారణం, బ్రిటిష్ ఖైదీగా కాకుండా,స్వేచ్ఛా భారతీయుడిగా మరణించాలన్నది ఆయన కోరిక. అలాగే తనువు చాలించాడు.

ఆయన మరణ వార్తలో ఆలహాబాద్ శోక సముద్రం లో మునిగిపోయింది.పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలు ఉన్నా,  రసూలా బాద్ లో జరిగిన ఆయన అంత్యక్రియలకు నగరం మొత్తం కదలివచ్చింది.  వచ్చిన వాళ్లంతా ఆయన చితాభస్మం పాత్రని వూరేగింపులో పాల్గొన్నారు.

ఆ శవాన్ని ప్రజల మధ్య ప్రదర్శనకు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోరాడితే ఇదే గతి పడుతుందని పోలీసులు హెచ్చరిస్తే, ప్రజల్లో  చంద్రశేఖర్ మరణం పట్టుదలను దేశభక్తిని రగిలించింది. ధైర్యాన్ని ఇచ్చి త్యాగాలకు ప్రేరణ అయింది.

ఆజాద్ మరణం తర్వాత దేశం ఆయన్ని మర్చిపోయింది. తల్లి జాగర్నీ దేవీ పేదరికంలో మగ్గిపోయింది.  ఈ విషయం తెలుసుకున్నజవహర్ లాల్ నెహ్రూ ఆమెకు రు. 500 పంపించారు.తర్వాత  ఆజాద్ సహచరురు సదాశివ్ మల్కాపుర్కార్ ఆమెని కొడుకులాగా ఆదుకున్నాడు. ఆమె  చనిపోయినపుడు కొడుకుపాత్ర పోషించి అంత్యక్రియలు జరిపించాడు.

నాటి స్ఫూర్తిని నేటి తరానికి అందించడానికి ఈ చరిత్ర

నిండైన జీవితంతో ఎంతో గొప్పగా బ్రతకాలి అని ఆశ పడుతున్న మనం ఒక్కసారి నాటి వారి పోరాట స్ఫూర్తిని నెమరు వేసుకుంటే భారతదేశంలో నేటికీ మనం నిర్వహించవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయని  మనందరికీ తెలుస్తూనే ఉన్నది. సమాజం గురించి ,అసమానతలు అంతరాలు, భావప్రకటన స్వేచ్ఛ లేని నిర్బంధాల గురించి భారతదేశంలో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అతి చిన్న వయస్సులోనే జీవితాన్ని పోరాటంలో భాగంగా దేశం కోసం అర్పించినా
దేశ ప్రజల గుండెల్లో చంద్రశేఖర్ ఆజాద్ నిరంతరం జీవించే ఉంటాడు. మనలను తట్టి లేపుతూ మట్టి మనుషుల పురోగతి కోసం సామాజిక బాధ్యతను నిర్వర్తించమని హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆ సోయి మనకు ఉంటేనే మనం ఆయన వారసులు అవుతాం. ఆలోచించండి! సామాజిక రుగ్మతలపై పోరాడటానికి స్పందించండి. ఇదే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి.

వడ్డేపల్లి మల్లేశం సామాజిక విశ్లేషకులు,
అధ్యక్షులు జాగృతి కళాసమితి, హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట
9014206412

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *