(వడ్డేపల్లి మల్లేశము)
ఏ కాలంలోనైనా పాలకుల నిర్ణయాలలో, అవి ప్రజాసంక్షేమానికి సంబంధించినవే అయినప్పటికి, అందులో వ్యక్తిగత ప్రయోజనమే ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు మేలు చేసే పేరుతో చూపే ప్రలోభాలు, చేసే వాగ్దానాలు, ఎర వేసే ఆశల వెనక వ్యక్తి గత ప్రయోజనమే ఎక్కువ. ప్రజలెపుడూ తమ మీదే ఆధారపడేలా ఉండాలని వ్యూహం వీటిలో ఉంటుంది. ఈ ధోరణి ఇటీవల ఇది మితిమీరింది.
పూర్వం గుప్తులు ,కాకతీయులు మొగలులు.. తదితరుల వంశపాలనను శాశ్వతీకరించుకునేందుకు దాన ధర్మాలు చేసే వారు, ప్రజాహిత నిర్మాణాలను చేసే వారు. ఇలా ప్రజల అవసరాలను కూడా తీర్చి తమ పేరు శాశ్వతంగా నిలబడేందుకు ప్రయత్నించారు. ఆ రోజు సంపద మొత్తం రాజుది. అందుకే రాజు మెడలోని ముత్యాల హారం మొదలుకుని అర్ధ రాజ్యాల దాకా పిచ్చిపిచ్చిగా దానాలు చేసి వితరణ గుణం ప్రదర్శించే వారు. సమయంలో వాళ్లు ప్రజాభిమానం చూరగొనేందుకు కూడా కొన్ని చర్యలు చేపట్టే వారు. ప్రజల కష్టసుఖాలను మారువేషాల్లో తెలుసుకున్నట్లుగా మనం చదువుకున్నాం. చెరువుల కాలువలు తవ్వించి నీటిపారుదల కల్పించి ఆహార, వ్యవసాయ తదితర అవసరాలను తీర్చడానికి కృషి చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలిచిన వాళ్లు రాజుల్లాగా పిచ్చిపిచ్చి ప్రవర్తించడానికి వీల్లేదు. ఇక్కడ చట్టాలుంటాయి.
ప్రజాస్వామిక కాలంలో వికృత రూపాలు
ప్రజాస్వామిక వ్యవస్థలో పాలకులు శాశ్వత రాజులు కాదు, నిమిత్తమాత్రులు. ప్రజలే ప్రభువులు. తాము చేసిన పనికి శాశ్వత ప్రాతిపదికన గుర్తింపు కావాలని, తమ స్మారకాలు బ్రతికి ఉన్నప్పుడే నిర్మించుకోవాలని తపన కనపడడం ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇది రాచరికంలో చెల్లింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆలోచనకు తావులేదు. ఎందుకంటే ప్రభుత్వ సంపద ప్రజలది. ప్రభుత్వ నిధులు ప్రజలు చెల్లించినవి. అందువల్ల వాటిని పూర్వకాలపు రాజుల్లాగా వ్యక్తి గత ప్రతిష్ట కోసం వెచ్చించడం కుదరదు. పూర్వం రాజులు ఇష్టాను సారం పాలించే వారు. ఇపుడలా సాధ్య పడుదు. ఇపుడు సాగించాల్సింది చట్టబద్ధ పాలన.
అయితే, ఈ రోజుల్లో ప్రజాస్వామికంగా గెలుపొందిన వారు రాచరిక పాలనే సాగిస్తున్నారు. రాజుల్టాగా,చక్రవర్తుల్లాగా ఉండాలనుకుంటున్నారు. ఇటీవల యాదగిరి దేవాలయ పునర్నిర్మాణ సందర్భంలో దేవాలయ ప్రాంగణంలో రాష్ట్ర అధినేత చిత్రాన్ని చెక్కినట్లుగా విమర్శలు రావడం దానిని తొలగించడం తాజా ఉదాహరణ. అదే విధంగా ముఖ్యమంత్రి వివిధ ఆలయాలకు కోట్లాది విలువ చేసే కానుకలను తన మొక్కుబడి కింద సమర్పించుకున్నారు. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ప్రజల డబ్బుతో ఏలినవారు సొంత మొక్కుబడులు చెల్లించుకోవచ్చా?
నిర్మాణాలు, రహదారులు ,ప్రాజెక్టులు, వంటి శాశ్వత ప్రాతిపదికన నిర్మించే పనులను కూడా ప్రభుత్వ కార్యక్రమాలుగా కాకుండా సొంతంగా వితరణతో చేపడుతున్న పనులుగా సంబురాలు చేసుకోవడం దేశమంతా సర్వత్రా మనకు కనబడుతుంది. ప్రజల సొమ్ము ద్వారానే ఈ పనులు ప్రభుత్వం చేస్తున్నది. మరి ఈ పబ్లిసిటీ ఎలా చట్ట సమ్మతం. ఒక వ్యక్తి చిత్రాన్ని ప్రజల మైండ్ లోకి బలవంతంగా ఎక్కించాలనుకునే వ్యూహం ఈ విగ్రహావిష్కరణల్లో, ప్రాజక్టుల ఆవిష్కరణ పండగల్లో కనిపిస్తుంది.
ఇలా తమ హయాంలో జరిగిన పనులకు తమ సొంత గుర్తింపును కోరుకోవడం విచారకరమే కాదు ప్రజాస్వామ్యానికి విఘాతం కూడా.
ఇలా పాలకులు తమ ప్రచారాన్ని తామే చేసుకోవడమనేది ఆధునిక యుగంలో దేశవ్యాప్తంగా బాగా ముదిరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రస్తుతం తెలంగాణ లోనూ నిరంతరం కొనసాగుతున్నది. వందల కోట్ల రుపాయలు వెచ్చించి పాలకులు ప్రజల డబ్బుతో చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపును కోరుకునే విధానాన్ని మానుకోవాలి. చేసిన పనులలో, అభివృద్ధిలో పారదర్శకత ఉంటే ప్రజలే గుర్తిస్తారు. లేకుంటే అంతా అవినీతి అని అనుమానిస్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద సీఎం కాంస్య విగ్రహం
గోదావరి మీద వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును తమ గొప్పతనంగా శాశ్వతం చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో లక్ష్మీ బరాజ్ వద్ద సీఎం కెసిఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీ నాయకులు పూనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. నమస్తే తెలంగాణ పత్రికలో దీని మీద వార్తా కథనం ప్రచురించింది. దీనికోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ను గోదావరి బరాజ్ నిర్మించిన సర్ అర్థర్ కాటన్ మహాయుడితో పోల్చి విగ్రహం ఏర్పాటును సమర్థించుకునే ప్రయత్నం జరుగుతున్నది. పూర్వం కూడా ఎందరో ఇంజనీర్లు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు మహా మహా ప్రాజక్టులకు రూపకల్పన చేశారు. ఆరోజులలో వాళ్లెవరూ ఇలా విగ్రహ ప్రతిష్టకోసం పాకులాడ లేదు.
వాళ్లని ప్రజలే స్మరించుకుంటున్నారు.
హైదరాబాద్ లోని ట్యాంకు బండు పైన నాటి మహానుభావులు విగ్రహాలను ఎవరు ఏర్పాటు చేశారు. వారందరిని ఇంకా ఎందుకు మనం గుర్తించుకుంటున్నాం. వాళ్లెవరై కీర్తికాంక్షతో కాకుండా కర్తవ్యంగా భావించిన తాము చేయాల్సిన పనులు చేసి కేవలం జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయారు. అందుకే ఈ రోజు వాళ్లని గుర్తు చేసుకునేందుకు వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
టాంక్ బండ్ మీద ఉన్న అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, ఇంజనీర్లు, ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసి వెళ్ళి పోయిన వారే. అందుకే ప్రజలు వాళ్లని విస్మరించలేకపోతున్నారు.
కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిర్మించబడిన టువంటి కాలేశ్వరం ప్రాజెక్టు వద్ద వారి కాంస్య విగ్రహాన్ని పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం పలు విమర్శలకు దారి తీస్తున్నది.
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది ఆ నాటి ప్రధాని నెహ్రూ . వారి హయాంలోనే దాని నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే వారి విగ్రహాలు అయినా అక్కడ ఉన్నాయా?
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి బీడు భూములను సస్యశ్యామలం చేసిన అనేక మంది పాలకులు, మేధావులు ఉన్నారు. వారు కూడా ఇలాంటి విగ్రహాలను ఆశించలేదు.
సర్ ఆర్థర్ కాటన్ తో పోల్చడం తగదు:-
1803లో జన్మించి 1847 నుంచి 52 మధ్యన ఐదు సంవత్సరాల కాలంలో సైనిక అధికారిగా ఇంజనీర్ గా కొనసాగిన ఆంగ్లేయుడైన సర్ కాటన గోదావరి జిల్లాల కరువు ను తొలగించడానికి చేసిన ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఆనాటి ప్రజల మెప్పును పొందింది.ఇప్పటికీ వారిని చిరస్మరణీయుడిగా గుర్తుంచుకుంటారు. అ ప్రాంతంలో పుట్టిన పిల్లలకు కాటన్ పేర్లను పెట్టుకున్నారు.
కాటన్ స్వస్థలం ఇంగ్లాండ్ దేశం. ఉద్యోగ బాధ్యతల పైన ఈ దేశానికి ఆంగ్లేయుల ఆధ్వర్యంలో వచ్చి పని చేస్తున్నప్పటికీ స్థానిక ప్రజల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను చిత్త శుద్ధితో పూర్తి చేశారు అందుకే ప్రజల మనిషిగా కాటన్ ను చెప్పుకోవచ్చు. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన వారు కాంస్య విగ్రహం ద్వారా గుర్తింపు కావాలనుకోవడం, కాటన్ తో పోల్చుకోవడం ఏమిటో అర్థం కాదు.
పైగా ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంలో కార్యాలయంగా ఉపయోగించిన నాటి భవనాన్ని అనంతరకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మ్యూజియంగా శాశ్వతం చేసింది.
కానీ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అక్కడికి పర్యటించిన సందర్భంలో బసచేయడానికి రు. 10 కోట్లతో అంతస్తుల భవనాన్ని నిర్మించడం ప్రజా ధనాన్ని దుబారా చేయడం కాదా?
అక్కడ ఉన్న భవనాన్ని మ్యూజియంగా మార్చి తే ఇక్కడ అవసరం లేకున్నా కోట్లు వెచ్చించి నిర్మించడం రాజరిక వ్యవస్థ కాకపోతే మరి ఏమవుతుంది?
ఆనాటి కాలంలో ఆర్థర్ కాటన్ నిర్వహించిన పాత్రను గుర్తు చేసుకోవడం కోసం ఇప్పటికే ట్యాంకుబండు పైన నిర్మాణం చేసుకోవడం లో అర్థం ఉంది. కానీ స్వరాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణం చేసిన ప్రభుత్వ పెద్దల విగ్రహాన్ని పెట్టడంలో అంతరార్థాన్ని పాలకులే గుర్తించాలి.
కాలానుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే ప్రాంతాల ప్రజలు ప్రాజెక్టు ప్రయోజనాన్ని గుర్తించి తప్పకుండా నిర్మించిన ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలను గుర్తుంచుకుంటారు .అందులో సందేహం లేదు .కానీ స్వప్రయోజనం కోసం తమకు తామే ప్రచారానికి ప్రచారానికి పూనుకోవడం అసంబద్ధమైనదని ప్రజలు ,ప్రజాస్వామిక వాదులు, అఖిల పక్షాలు, మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలాగయితే, హైదరాబాద్ ని 1908 వరదలనుంచి కాపాడిన నాటి ఇంజీనీర్ల, నిజాం ప్రభువుల విగ్రహాలను ఎన్ని ప్రాజక్టుల దగ్గిర ఏర్పాటుచేయాలో.
నిజాం కాలంలో నవాబ్ జంగ్
ఆరవ నిజాం కాలంలో హైదరాబాదులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఇంజనీరుగా హైదరాబాద్ స్వరూపాన్నే మార్చేశాడు. ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్, నిజాం సాగర్, అలీ సాగర్ (నిజామాబాద్ జిల్లా)ల రూపకల్పన చేసిందాయనే.
తన సేవలను ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ,ఉస్మానియా వైద్యశాల వంటి అనేక నిర్మాణాలు నిర్మించే క్రమంలో అందించినప్పటికీ ఆయన విగ్రహాన్ని ఎక్కడ కూడా స్థాపించలేదు. ఎందుకంటే ఆయన స్థానికుడు .పాలకుడు కాదు. ఒక నిపుణుడు, మేధావి, బుద్ధిజీవి కనుక కీర్తిని ఆశించలేదు తన కృషిని మాత్రం కొనసాగించాడు.
నేటి పాలకులు ప్రజల డిమాండ్లను పరిష్కరించి, ప్రజా దృక్పథంతో పాలన కొనసాగిస్తే, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించ కుండా మానవాభివృద్ధి ప్రధాన అంశంగా కొనసాగిన నాడు ప్రజలు తప్పకుండా ప్రభుత్వాలను గుర్తిస్తారు. ఆదరిస్తారు. చిరకాలం జ్ఞాపకం ఉంచుకుంటారు. అది కేంద్ర రాష్ట్ర అన్ని రకాల ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది.
“కీర్తిని ఆశించడం కాదు
ప్రజల మేలు ఆకాంక్షించాలి.”
ఇది సర్వత్రా ప్రజాస్వామ్యంలో పాలకుల నైజం కావాలి.
( వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)