‘ఆవు పేడ’ తో కరోనా తగ్గదు అంటే చిత్రహింసలు పెట్టారు…

మణిపూర్ లో  సరికొత్త నాజీలు

-రాఘవ శర్మ

మణిపూర్ పోలీసులు వారిద్దరికి చుక్కలు చూపించారు. సెల్ లో వేసి చావకొట్టారు. బూతులు తిట్టారు. జాతీయ భద్రతా చట్టం కింద రెండు నెలలు జైలులో పెట్టారు. చివరకు మొన్న ఎపుడో కొట్టేసిన  IT Act Section 66(a) కింద అరెస్టు చేసిన  వాళ్లందరిని వదిలేయండని సుప్రీం కోర్టు  మొట్టిక్కాయ వేయడంతో ఒకరికి మోక్షం లభించిది.  మరొకరు ఇంకా జైలులోనే ఉన్నారు.

వాళ్ళిద్దరు చేసిన తప్పేంటంటే… ‘ఆవు పేడతో, ఆవు మూత్రంతో కరోనా వైరస్ పోదు’ అది సోషల్ మీడియాలో పోస్టు చేయడమే.

మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ పాలన నాజీల నరకాన్ని తలపిస్తోంది. అక్కడి పోలీసుల చేతిలో ఆ ఇద్దరు నిర్భాగ్యులు చిత్రహింసలను అనుభవించారు.  ఈ చట్టం కింద అరెస్టయిన వారిలో ఒకరు రాజకీయ కార్యకర్త ఎరెండ్రో లించోమ్ బామ్ కాగా, మరొకరు జర్నలిస్టు కిషోరిచంద్రదేవ్ వాంగ్ ఖేమ్ (Kishorechandra Wangkhem).

ఆవు పేడతోను, ఆవు మూత్రంతోను కరోనా వైరస్ నమయమవుతుందని బీజేపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు, సంఘ్ పరివార్ శక్తులు ఆ మధ్య తీవ్రంగా  ప్రచారం చేశాయి. ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.ఉదాహరణకు అస్సాం బిజెపి ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ (హాజో నియోజకవర్గం) పాండెమిక్ ప్రకటించినప్పటినుంచి కోవిడ్ గోమూత్రం మందని చెబుతూ వస్తున్నారు. “Coronovirus is an airborne diseases and it can be cured by using gomutra (cow urite) and cow dung)అని ప్రచారం చేశారు.

(Suman Haripriya BJP MLA credit:twitter@HaripriyaSuman)

అయితే, మణిపూర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రొఫెసర్ తికేంద్ర సింగ్ యే కరోనా వైరస్ సోకి మరణించాడు.

ఆ సందర్భంగా పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ (పీఆర్ జేఏ) అన్న పార్టీ కార్యకర్త ఎరెండ్రో లించోమ్ బామ్ (Erendro Leichombam) ‘ఆవు పేడతో, ఆవు మూత్రంతో కరోనా వైరస్ పోదు. సైన్స్ తోను, ఇంగిత జ్ఞానంతోనే నయమవుతుంది. ప్రొఫెసర్ తికేంద్ర సింగ్ ఆత్మకు శాంతి కలగాలి’ అని మే 13వ తేదీ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఎరెండ్రో మామూలు చప్పట్లు ఈలలు కొట్టేబాపతు రాజకీయ కార్యకర్తకాదు. ఆయన హార్వర్డ్ కెన్నెడీ స్కూలులో చదువుకుని వచ్చాడు.

అంతే, అది పోస్ట్ చేసిన గంటకల్లా పోలీసులు అతని ముందు ప్రత్యక్ష మయ్యారు.

తన అరెస్టు నేపథ్యం మీద  ఎరెండ్రో ‘ద వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూ ననుసరించి వివరాలు ఇలా ఉన్నాయి.

మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో ఉన్న ఎరెండ్రో ఇంటికి పోలీసులు మే 13 వ తేదీ రాత్రి వచ్చారు. గేటు తోసుకుని, నాలుగో అంతస్తులో ఉన్న పడక గదిలోకి చొరబడ్డారు.  ఆ సమయంలో అతను రాత్రి దుస్తులలో నిద్రపోతున్నాడు.

‘మా అబ్బాయిని అరెస్టు చేయదలుచుకంటే చేసి తీసుకెళ్ళండి . కానీ, బట్టలు సరిగ్గా వేసుకోనీయండి’ అని ఎరెండ్రో తల్లి పోలీసులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది.

వారామెను పక్కకు తోసేశారు. ఆమె పడిపోయింది. వృద్ధురాలైన ఆమె ఎద పై దెబ్బ తగిలింది.  అరెస్టు వారెంటు  చూపించలేదు. ఎరెండ్రోని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి జీపులో పడేసి, వెస్ట్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు.  వారిపైన ఏదో రాజకీయ ఒత్తిడి వచ్చినట్టుంది.

పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే సరికి రాత్రి 9 గంటలైంది.  ఎరెంద్రో లాగానే ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు పెట్టాడన్న ఆరోపణపై జర్నలిస్టు కిషోరి చంద్రను కూడా కాసేపటికి అక్కడికి లాక్కొచ్చారు.

పోలీసులు బూతులు తిట్టడం మొదలు పెట్టారు. జీవితంలో వారు కనీవినీ ఎరుగనంతటి దారుణమైన బూతులు.ఎరెండ్రో ఫోన్ ను పోలీసులు తీసుకున్నారు. పాస్ వర్డ్ అడిగారు. అందులో అతని వ్యక్తిగత సమాచారం చాలా ఉంది కనుక ఇవ్వలేదు. దాంతో ఎరెండ్రోను పై అధికారి(ఓసీ) గదికి తీసుకెళ్ళారు.

నలుగురు పోలీసుల సమక్షంలోనే ఇంఫాల్ వెస్ట్ జిల్లా పోలీసు అధికారి ఎన్. ఇంగోచ సింగ్ లాఠీ తీసుకుని చావబాదాడు. అయినా  పాస్ వర్డ్ చెప్పనంటే చెప్పనన్నాడు. ఇలా కొట్టడం చట్ట వ్యతిరేకమని గుర్తు చేశాడు. అయినా వినలేదు.

దాంతో ఆ పోలీసు అధికారి మరింత రెచ్చిపోయి కొడుతూనే ఉన్నాడు. చివరికి వారిద్దరినీ లాకప్ లో పడేశారు.  ‘నా అరెస్టు మెమో ఇవ్వండి’ అని ఎరెండ్రో అడిగాడు.కానీ ఇవ్వలేదు.

మర్నాడు పోలీసు స్టేషన్ కు వచ్చిన అతని తల్లిదండ్రులకు ఇచ్చారు.అక్కడున్న నిందితులలో ఒకరికి కరోనా సోకిందని ఒక గార్డు చెప్పాడు.  కోవిడ్-19 నిబంధనల ప్రకారం లాకప్ లో వేసేముందు కరోనా టెస్ట్ చేయాలని కోరినా పట్టించుకోలేదు.

మర్నాడు డ్యూటీ మేజిస్ట్రేట్ మొరింగథెమ్ హిర‌లత ముందర వారిని హాజరు పరిచారు.  పోలీసులు కొట్టారని తమకు తగిలిని గాయాలను వీరిద్దరు మేజిస్ట్రేటకు చూపించారు.  కొట్టలేదని పోలీసులు బుకాయించారు.

గాయాలను చూసిన మేజిస్ట్రేట్ పోలీసులను మందలించారు.కానీ, నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపించారు.పోలీసుల కస్టడీలో ఉన్న ఆ నాలుగు రోజులు వారిని నిద్రపోనీయలేదు.

అప్పటి వరకు వారిపైన కేసు కట్టలేదు కానీ, ఏదో ఒకటి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆ నాలుగు రోజుల తరువాత వారిని వెస్ట్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ వై. సోమోజిత్ సింగ్ ముందు హాజరుపరిచారు.

వారిని కస్టడీలోనే ఉంచడానికి ప్రభుత్వ లాయర్ జమున కల్పిత సమాచారంతో ఆరోపణలు చేశారు. కానీ, చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ వారికి బెయిల్ మంజూరు చేశారు.

వారి లాయర్ బెయిల్ షూరిటీలు తయారు చేసేలోపే మణిపూర్ ప్రభుత్వం వారినై జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేసింది.

నెల పాటు వారిద్దరినీ ఒకే సెల్ లో ఉంచి, తరువాత వేరు వేరు సెల్ లకు మార్చారు. ఈ కేసులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది.

ఈనెల 19వ తేదీన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్  షా ఆధ్వర్యంలో ని బెంచి ఈ కేసును విచారించింది. ఎరెండ్రోను ఇక ఒక్క రోజు కూడా జైలులో ఉంచడానికి వీలు లేదని, వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మర్నాడు జులై 20 వతేదీన ఎన్ఎస్ఏ కేసును ఉపసంహరించుకున్నామని, ఎరెండ్రోను విడుదల చేశామని భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చాలా తెలివిగా కేసును మూసేయడానికి సుప్రీంకోర్టుకు విన్నవించారు.

కానీ ఎరెండ్రో న్యాయవాది షాడం ఫరసాత్ మాత్రం కేసును మూసేయడానికి అంగీకరించలేదు.

తన క్లయింట్ ను రెండు నెలల పాటు అక్రమంగా జైలులో నిర్బంధించారని, హింసించారని, అతని స్వేచ్ఛను హరించారని, దానికి నష్టపరిహారం చెల్లించాలని కోరాడు.

ఈ అక్రమ నిర్బంధానికి సంబంధించి రెండు వారాలలో సమాధానం చెప్పాలని సుప్రీం కోర్టు మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించి, కేసును ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది. ఇది చాలా “‘serious matter”అని ఎరెండ్రో “lost his liberty since May ” అని బెంచ్ వ్యాఖ్యానించింది.

రెండె నెలలపాటు ఎరెండ్రోను అక్రమంగా నిర్బంధించడమే కాదు, అతని జీవనోపాదిని కూడా మణిపూర్ లోని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీసింది.  హార్వర్డ్ కెన్నడీ స్కూల్ నుంచి ఎరెండ్రో డిగ్రీ తీసుకున్నాడు.  తన ప్రజలకు సేవ చేయాలని ఇంఫాల్ లో బాలికల కోసం ఒకేషనల్ ట్రైనింగ్ స్కూల్ పెట్టాడు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక సహకారంతో ఈ ట్రైనింగ్ స్కూలు నడుస్తోంది.  నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గత ఫిబ్రవరిలో పోలీసులు ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను మూసేసి సామాగ్రినంతా స్వాధీనం చేసుకున్నారు. దీని పైన కింద కోర్టులో కేసు నడుస్తోంది.

ఇదంతా రాజకీయ కక్షసాధింపు అని వేరే చెప్ప‌న‌వసరం లేదు.

(రాఘవశర్మ సీనియర్ జర్నలిస్టు,  తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *