‘పవర్’ ప్రజావ్యతిరేక ప్రవర్తనకు పాస్ పోర్టా?

“మంత్రి నిరంజన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి. నిరుద్యోగులకు మంత్రి క్షమాపణ చెప్పాలి “

(వడ్డేపల్లి మల్లేశము)

భారతదేశ రాజకీయాలలో రాజకీయ పార్టీల నాయకులు, శాసన సభ్యులు, మంత్రులు ప్రజా జీవితంలో వివిధ వర్గాలతో మాట్లాడే తీరు లో వచ్చిన దిగజారుడు తనాన్ని ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఎన్నికల్లో గెలిస్తేనో, ఏదైనా పదవిలోకి వస్తేనో ఏమయినా నీతి వాక్యాలు దంచేయవచ్చనే ధోరణి ఈ రెండు రాష్ట్రాల్లో ముదురుతూ ఉంది.

స్వాతంత్య్ర అనంతరకాలంలో ప్రజా నాయకులు ప్రజల పట్ల అంకితభావం చిత్తశుద్ధితో ఉండేవారు. చట్టాలు, న్యాయాలకు లోబడి అవినీతికి తావు లేకుండా పని చేయాలనే తపన కనబర్చేవారు. ఇటీవల ప్రభుత్వాలలో ఉండేవాళ్లు క్రమంగా ప్రజల పట్ల తన సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నారు.   తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలలో దీని సాక్ష్యంగా అనేక సంఘటనలు  జరగడం గమనించవచ్చు.

ప్రజలను తూలనాడిన మంత్రులకు శిక్ష ఏమిటి?

నిరుద్యోగాన్ని నిర్మూలించి ఉపాధి కల్పించే విషయము తో మొదలు పెడితే ప్రతి అంశంలోనూ మంత్రులు శాసనసభ్యులు అధికారులను ప్రజలను పార్టీ కార్యకర్తలను రైతులను అవమానించి, మానసిక చిత్రవధ కు గురి చేసిన సంఘటనలు అనేకం. పరిపాలనలో దిగజారుడు తనానికి మంత్రులు అల్పంగా వ్యవహరించడం మచ్చుతునక. నాయకుడు కార్యకర్తలను సమన్వయపరిచి సంస్కరించు కొని తప్పులు చేయకుండా చూడాలి. అవసరమైతే మందలించాలి. అలాంటిదెక్కడా కనిపంచడం లేదు. పవర్ దౌర్యన్యాలకు పాస్ పార్ట్ అయింది.

కానీ ఇటీవల అనేక మంది మంత్రులు వివిధ సభలలో  విద్యార్థులను అధికారులను ప్రజలు రైతులు సామాన్య ప్రజానీకాన్ని, తమ అభిప్రాయాలు సమస్యలను దృష్టికి తీసుకు వచ్చినందుకే,  బెదిరించి ,మందలించి, నిందించిన సందర్భాలు కోకొల్లలు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన సందర్భంలో కానీ ,ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించిన సందర్భంలో వివిధ పార్టీల కార్యకర్తలను, నాయకులను, ప్రజాసంఘాల కార్యకర్తలను అరెస్టు చేసి చిత్రవధ గురి చేసిన సందర్భాల్లో లాకప్ డెత్ కూడా ఒకటి కావడం ఇటీవల అందరం గమనించినదే.

గత రెండు మూడు రోజులుగా పెరిగిన పెట్రోలు ధరలకు వ్యతిరేకంగా భూముల అక్రమ అమ్మకానికి నిరసనగా సిపిఐ కాంగ్రెస్ ఇతర పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగితే ఇష్టారాజ్యంగా రేవంత్,చాడ వెంకటరెడ్డి లను అరెస్టు చేసినప్పుడులేనిది.. నిన్న అంటే గురువారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులు అంతా హమాలి పని చేసుకొని బతకాలని సిగ్గుచేటు వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు?

బహిరంగ వేదిక మీద మంత్రి అలా యువకులను అవమానించిన ప్పుడు ఆయనకు ఎంత పెద్ద శిక్ష విధించాలో ప్రభుత్వం ఆలోచించుకోవాలి.

ఉద్యోగ ఉపాధి -వ్యవస్థ నిరుద్యోగులు

రాష్ట్రంలో 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ఖాళీలు 1 ,07,000 ఉన్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు.

 

 

కానీ ప్రస్తుతము ఒక లక్షా 30 వేల ఉద్యోగాలను ఇప్పటికి భర్తీ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించుకుంటూ ఉన్నది. ఇటీవల పీఆర్సీ నివేదిక సందర్భంగా రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఇంత తికమక గణాంకాలను ప్రభుత్వం వివరిస్తుంటే 50 వేలకు ప్రస్తుతము ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు గా తెలుస్తున్నది. ఉద్యోగాలు రాలేదని బాధతో అనేక మంది విద్యార్థులు, పరిశోధకులు, నిరుద్యోగులు, విద్యావంతులు ఆత్మహత్య చేసుకున్న టువంటి దౌర్భాగ్య కరమైన పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే చోటుచేసుకోవడం దేనికి సంకేతం?

గత 32 నెలల క్రితం స్వయంగా ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ ఎలాంటి కార్యాచరణకు పూనుకోలేదు. అనేక మంది అట్టడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగులు ఆదాయ మార్గాలు కానరాక తల్లిదండ్రులకు భారం కాలేక కొట్టుమిట్టాడుతు మరో పోరాటానికి సిద్ధపడుతున్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన వేళ
ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సును కూడా మరొక మూడు సంవత్సరాలు పెంచడం ద్వారా కూడా నిరుద్యోగులకు ప్రభుత్వం చేదు కబురు అందించి వారిపట్ల కపట ప్రేమను చాటుకుంది. మరొకవైపు నిరుద్యోగులుగా ఉన్న వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో విద్యావంతులు సైతం కూలీ పనికి వెళ్లడం, చిరు వ్యాపారాలతో పాటు బ్రతుకు తెరువు మార్గము తోచని స్థితిలో యువత నిర్వీర్యమైంది.

నిరుద్యోగుల పై మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు:-

జూలై 15 2021 అనగా నిన్నటి రోజున నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఒక సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ చదువుకున్న వారు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరంలో ఐదు మాసాల పాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయి అని అందులో హమాలీలు గా పని చేస్తే తప్పేంటని చులకనగా మాట్లాడారు.

అంతేకాకుండా హమాలి పని “ఉద్యోగమని ,ఎంప్లాయ్మెంట్ “అని నిరుద్యోగులు తప్పకుండా చేయాలని పదేపదే అనడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా భావించవచ్చు. ఈ సంఘటన
జరిగిన నుండి రెండు రోజులుగా విద్యార్థి, ప్రజా సంఘాలతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ జేఏసీ నాయకులు అభ్యుదయవాదులు అందరు కూడా మంత్రి వ్యాఖ్యలను నిశితంగా ఖండించారు.

గత ముప్పై ఒక్క మాసాలుగా నిరుద్యోగులు అందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలని ఒక లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు మంత్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కి సవాల్ విసిరారు.

అంతేకాకుండా మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులు అందరికీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు అన్నారు. ఇది ప్రజాస్వామ్యం లో సిగ్గుచేటైన సంఘటన అని, ప్రజల బ్రతుకులు మార్చలేని తెలంగాణలో బంగారు తెలంగాణ అంటే మరి నీచమైనది అని ప్రజలు ప్రజాస్వామిక వాదులు వాపోతున్నారు.

మంత్రుల తప్పిదాలకు కారకులెవరు

వివిధ సందర్భాల్లో మంత్రి దయాకర్ రావు, కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ప్రజలు అధికారుల పట్ల వ్యవహరించిన తీరు కు అదనంగా నిరంజన్ రెడ్డి అసంబద్ధ వ్యాఖ్యలకు ముగింపు పలకక పోతే రాష్ట్ర పాలనకు రానున్నవి గడ్డు రోజులే. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజాసంఘాల కార్యకర్తలతో పాటు విద్యార్థులు, యువత క్రియాశీలక పాత్ర పోషించి 1200మంది బలిదానాలకు పాల్పడితే సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేనా ప్రజా సాధికారత?

కుటుంబ సభ్యులు పక్కదారి పడుతున్న ప్పుడు తల్లి తండ్రి మందలించి దారిలో పెడతారు. అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సభ్యులు ప్రజలు, అధికారులు విభిన్న వర్గాల తో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని అదుపు చేసుకోకపోతే రాష్ట్రంలో అంతర్గతంగా నూ, పోరాడి వేరుపడిన ఆంధ్రప్రదేశ్లోనూ చులకనైతే ఫలితం ఏముంటుంది?
తెలంగాణ ఉద్యమకారులను పార్టీ నుండి తరిమివేసి ఉద్యమ ద్రోహులకు మంత్రివర్గంలో స్థానం ఇస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి.

నేరస్తులను కాపాడుతూ ప్రజలను ద్రోహులుగా చిత్రీకరిస్తే ఆపాలనే కుంటుపడుతుంది. అలాంటి చారిత్రక సంఘటనలు ప్రపంచంలో అనేకం.
వెంటనే ముఖ్యమంత్రి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు నిరుద్యోగ భృతిని బేషరతుగా మంజూరు చేసి ఇటీవల ఆరోపణలకు బాధ్యులు అయినటువంటి మంత్రులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పాలన గాడిలో పడే అవకాశం ఉందని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని విశ్లేషకులు ,రచయితలు, కవులు ,కళాకారులు, మేధావులు హెచ్చరిస్తున్నారు.

చేయని నేరానికి ప్రజా జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళాలనే తపనతో కృషి చేసినటువంటి ఎంతోమంది మేధావులు ఇవ్వాళ జైల్లో నిర్బంధించబడి శిక్షలు అనుభవిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని రాజ్యాంగంలో రాసి ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని అమలు చేసే క్రమంలో చిత్తశుద్ధిని పాటించి మంత్రుల పైన కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి స్తేనే కానీ
తప్పుడు మాటలకు ముగింపురాదు.

ఇక నుండి రాష్ట్రంలో నిర్బంధ విధానాలను అప్రజాస్వామిక సంఘటనలను
అమలు జరగకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు, కవి, రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు. హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *