“తెలంగాణ మరీ మొండిగా ఉంది, అందుకే సుప్రీంలో కేసు వేశాం”

 

“కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి  నోటిఫై చేస్తూ
కేంద్రం  గెజిట్‌ విడుదల చేయడం హార్షణీయం”

(జె శ్యామలరావు)

1, కృష్టా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు ( కేఆర్‌ఎంబీ) పరిధిలో గడిచిన 45 రోజులగా అంటే జూన్‌ 1 నుంచి తెలంగాణా రాష్ట్రం స్వతంత్రంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. శ్రీశైలం, నాగార్జునసాగర్,పులిచింతల ఈ ప్రాజెక్టుల నుంచి ఏకపక్షంగా విద్యుత్‌ ఉత్పత్తి మొదలు పెట్టింది. విద్యుత్‌ ఉత్పత్తి చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నీటివిడుదలకోసం కేఆర్‌ఎంబీకి ఇండెంట్‌ ఇస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని కేఆర్‌ఎంబీ రిలీజ్‌ ఆర్డర్‌ ఇస్తుంది. అప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది.

2, కానీ ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎలాంటి ఇండెంట్‌ లేకుండా, కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు లేకుండానే తెలంగాణా ప్రభుత్వం స్వతంత్రంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా తెలంగాణా ప్రభుత్వం జూన్‌ 28న నూటికినూరుశాతం విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని జీవో నంబరు 34 విడుదల చేసింది.
3, ఫలితంగా శ్రీశైలం జలాశయంలో జూన్‌ 1 నుంచి 30.38 టీఎంసీలు ఇన్‌ప్లో ఉంటే దానిలో 29.82 టీఎంసీలును తెలంగాణా ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించింది. దీనివల్ల శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరగలేదు. దీనివల్ల శ్రీశైలం జలాశయం నీటి నిల్వ 806.8 అడుగుల వద్ద ఉండిపోయింది. అంటే ఈ ఏడాది జూన్‌ 1 నుంచి శ్రీశైలం జలాశయంలోకి నీరు రానట్టే.

4, శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీకి నీటిని విడుదల చేయాలంటే కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలి. ఆ స్ధాయి నీటిమట్టం ఉంటేనే గ్రావిటీ ప్లోలో కనీస నీటిని విడుదల చేయగలుగుతాం. గరిష్టంగా నీటిని విడుదల చేయాలంటే 881 అడుగుల నీటిమట్టం నిల్వఉండాలి. సరిపడనంత నీటి నిల్వలు ప్రాజెక్టులో లేకపోతే, పూర్తి స్ధాయిలో మనకు కేటాయించిన నీటిని ఈ ప్రాజెక్టు నుంచి మనం వాడుకోలేం. మనకు ఇదొక ప్రతికూలమైన అంశం. అదే విధంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు విషయంలో కూడా అలాంటి పరిస్ధితి వచ్చింది.

5, ముఖ్యంగా పులిచింతల ప్రాజెక్టు విషయంలో దిగువప్రాంతాల్లో మనకు అవసరం లేకపోయినా 8టీఎంసీల నీటిని తెలంగాణా ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తికోసం వాడింది. కేఆర్‌ఎంబీ అభ్యంతరం వ్యక్తం చేసినా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం జరిగింది. ఫలితంగా 8 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోయింది.

6. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటిదాకా తెలంగాణా ప్రభుత్వం 66 టీఎంసీల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించింది. ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం కెఆర్‌ఎంబీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది.
కేఆర్‌ఎంబీ(కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు) విద్యుత్‌ ఉత్పత్తి చేయడం సరికాదని తెలంగాణా ప్రభుత్వానికి సూచించినప్పటికీ, వారు విద్యుత్‌ ఉత్పత్తి మాత్రం నిలుపుచేయలేదు.

6, దీనిపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో చాలా స్పష్టంగా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయడంతో పాటు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్‌ఎంబీకి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుల భద్రతా బాధ్యతను సీఐఎస్‌ఎఫ్‌ వంటి కేంద్ర బలగాలతో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

7, అనంతరం కేంద్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీ ద్వారా ఆదేశాలు జారీ చేసినా, వాటిని కూడా తెలంగాణా ప్రభుత్వం ఆమలు చేయలేదు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు అంశాలమీద సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఒకటి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తికి జారీ చేసిన జీవో నంబరు 34ను పక్కన పెట్టడం ఒకటి కాగా, కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయడంతో పాటు, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్‌ఎంబీ స్వతంత్రంగా నిర్వహించాలని కోరాం. ఈ ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌తో భద్రత కల్పించాలని కోరాం.

8, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిన్న కేఆర్‌ఎంబీ పరిధిని నిర్ధారిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు ఓఅండ్‌ఎం(ఆపరేషన్‌ అండ్‌ మెయింటైనెన్స్‌) కోసం కేఆర్‌ఎంబీ మరియు జీఆర్‌ఎంబీకి అప్పగిస్తారు. 14 అక్టోబరు 2021 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.

9, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం ఇది ఎప్పుడో చేయాల్సిన కార్యక్రమం ఇది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆంద్రప్రదేశ్‌కు రావాల్సిన నీటి వాటా ఈ బోర్డులు ద్వారా వస్తుంది. దాన్ని మనం పూర్తిగా వినియోగించుకోగలమని భావిస్తున్నాం. ఈ నోటిఫికేషన్‌లో కూడా కొన్ని సరిచేయాల్సిన అంశాలున్నాయి. కేంద్రప్రభుత్వంతో కలిసి వాటిని సరిచేస్తాం. మొత్తానికి ఈ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్వాగతిస్తుంది.

(విజయవాడ ఆర్‌ అండ్‌ బి భవన ప్రాంగణంలో కేఆర్‌ఎంబీపై మీడియాతో  జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు చెప్పిన విషయాలు .)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *