వైఎస్సార్ ‘జలయజ్ఞం’ చేసిన గాయాలు మానేదెన్నడు?

(జువ్వాల బాబ్జీ)

2005 సంవత్సరంలో, అప్పటి ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

32 భారీ తరహా ప్రాజెక్టులు 17 మధ్య తరహా ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. ఇందులో ప్రతీ చోట ఆయన చెప్పిన అభివృద్ధి మంత్రం సామాన్య ప్రజలకు వినటానికి బాగుంటుంది. కానీ ఆ అభివృద్ధి ఫలాలు ఏమాత్రం అందకపోగా భూములు, ఇండ్లు, జీవనోపాధిని సర్వం త్యాగం చేయాల్సిన ప్రజలకు అది ఒక శాపమంత్రం.

అందులో ఒకటి గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు. ఇది మన రాష్ట్ర రాజకీయ పార్టీలకు ఒక అభివృద్ధి నినాదం. అన్ని రాజకీయ పార్టీలు పోలవరం ప్రాజెక్టు కట్టి తీరాలనే డిమాండ్ చేస్తున్నాయి. అయితే నిర్వాసితులు అవుతున్న లక్షలాది మంది ప్రజలకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం అన్ని చర్యలు పూర్తి చేసిన తర్వాతనే నిర్మాణ పనులు పూర్తిచేయాలని అడుగుతున్నారు. దానికోసం ఇటీవల ఎనిమిది మండలాల్లో అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష కమిటీ గా ఏర్పడి నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవడం కోసం పర్యటించారు. కొంతమంది నిర్వాసితుల తో మాట్లాడటం కూడా జరిగింది. మేము అండగా ఉంటామని భరోసా కూడా ఇచ్చారు.

అయితే బాధాకరమైన విషయాలు ఏమిటంటే, భూసేకరణ జరుగుతున్న సమయంలో, అనేకమైన చట్ట ఉల్లంఘనలు ,అవినీతి అక్రమాలు, చోటుచేసుకుంటున్నాయని నిర్వాసిత గ్రామాల్లో ప్రజలు గగ్గోలు పెట్టినప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆ విషయాల పైన దృష్టి పెట్టకపోవడం విచారకరం. గిరిజనులతో పనిచేస్తున్న కొన్ని వామపక్ష పార్టీలు ఈ అంశంపై అధికారులను నిలదీసే వారు. భూములు సాగు చేసే వారు కొందరైతే, ఎక్కడో బయట ప్రాంతాలలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుని రెండు మూడు దశాబ్దాలుగా ఏనాడు భూమిని సాగు చేయనటువంటి స్థానికేతర నాన్ ట్రైబల్ రైతులు కోర్టు కేసులు వేసి కోట్లాది రూపాయలను తీసుకున్నారు .ఇందులో కమీషన్ల రూపంలో రెవిన్యూ, భూసేకరణ అధికారులకు కోట్లాది రూపాయలు ఇచ్చారు. ఇది ఈ ప్రాంత ప్రజలు అందరికీ తెలిసిందే.

సరే ఏదైతేనేమి, ఇప్పటికైనా కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడతామని ముందుకు రావడం కొంతవరకైనా ఉపశమనంగా భావించాలి. ఇప్పుడు కాఫర్ డ్యామ్ వల్ల బ్యాక్ వాటర్ ముంపు గ్రామాలలోకి ప్రవేశించడం వలన 112 గ్రామాలలోని 28 వేలమంది ప్రజలు తమ గ్రామాలను ఖాళీ చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సందర్భంగా 2019 వ సంవత్సరంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటిసారిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించి పనులను పరిశీలించి, అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పత్రికా విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ త్వరలో 41.15 కాంటూరు పరిధిలోని 28వేల మంది నిర్వాసితులను 2020 జూన్ 31వ తేదీ నాటికి పునరావాస కాలనీలకు తరలిస్తామని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది.

ఇప్పుడు 2021 సంవత్సరం జూలై నెల వచ్చింది. పునరావాస కాలనీలలో పనులన్నీ అసంపూర్తి గానే ఉన్నాయి. అంటే రెండు సంవత్సరాలు కాలంలో ప్రాజెక్టు నిర్మాణం పనులను ఎందుకు నిలుపుదల చేయలేదు. అలాచేసి ,పునరావాస కాలనీల మీద దృష్టి పెట్టి భూసేకరణ చట్టంలో చెప్పిన విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లయితే ఈరోజు అటు రాజకీయ పార్టీలు గానీ లేదా నిర్వాసిత ప్రజలు గాని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు కాదు కదా.

గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది.కానీ అదే ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు భూమి కేటాయింపుల్లో జరిగిన భూసేకరణలో భారీ ఎత్తున అవినీతి జరిగింది. దానిపైన ఎందుకు విచారణ చేపట్టలేదో అర్థం కావడం లేదు.

మొదటి నుండి పోలవరం ప్రాజెక్టు ఈ విషయంలో ప్రభుత్వాలన్నీ వాస్తవాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.:

ప్రాజెక్టు భూమి పూజ  8.12.2004 నాడు అప్పటి ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్రెడ్డి చేశారు. జీవో. ఎంఎస్, నెంబర్; 93 తీసుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుండి సైట్ క్లియరెన్స్ కోరుతూ తేదీ; 19.9.2005 ప్రకారం1,93,357 ఎకరాల వ్యవసాయ భూమి కావాలని, 1,17,034 మంది మాత్రమే నిర్వాసితులు అవుతారు అని పేర్కొన్నారు.

తర్వాత  24.5.2005 నాటి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం 1,55,182 ఎకరాల భూమి కావాల్సి ఉంటుంది అని అన్నారు.
మరొక సారి కేంద్రానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం చేసిన దరఖాస్తులో 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఇంకొక సారి 24.10.2005 నాడు కేంద్ర పర్యావరణ అనుమతులు కోరుతూ 75,177 ఎకరాలు భూమి ముంపునకు గురవుతుంది అనీ, ఆయకట్టు ద్వారా 23 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. వీటిలో ఏది నిజమో తెలియదు గానీ, భూమి పూజ సందర్భంగా చెప్పినది ముంపుకు గురయ్యే గ్రామాలు సంఖ్య: 276(ఇందులో 274 గ్రామాలు షెడ్యూల్ పరిధిలోనివి) ” పునరావాస పనులు పూర్తి చేయకుండా ముందుగా ఏ విధమైన అనుమతులు లేకండానే కాలువ పనులు ప్రారంభం చేశారు. ఆనంతరం 2007సంవత్సరం లో కేంద్ర జల వనరుల శాఖ నుండి అనుమతి పొందారు”: కాగ్ నివేదిక 2012.

చివరిగా, 2017 సంవత్సరంలో అప్పటి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన దాని ప్రకారం 371 గ్రామాలు ముంపుకు గురవుతాయి అని పేర్కొన్నారు.

సర్వేలు లోపాలు:

సర్వే సిబ్బంది సరిగా హద్దులను గుర్తించకపోవడం వలన, ముంపుకు గురయ్యే గ్రామాలను గానీ, భూములు గానీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన సర్వే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో భూములు పూర్తిగా మునిగి పోతున్నప్పటికీ, కొన్నిటిని ఎఫ్ .ఆర్. ఎల్ స్థాయి నుండి వదిలివేయడం వల్ల కోట రామచంద్రపురం ఐటీడీఏ , పోలవరం ప్రాజెక్టు ధవళేశ్వరం అడ్మినిస్ట్రేటర్ కార్యాలయం చుట్టూ నిర్వాసితులు రీసర్వే కొరకు కొన్ని ఆర్జీలు పట్టుకొని తిరుగు తున్నారనేది వాస్తవం. వీరిలో చాలామంది 41.15 కాంటూరు పరిధిలో ఉన్న వారు. మిగిలిన భూములు సర్వే చేయకుండా, వారిని పునరావాస కేంద్రాలకు తరలించటం వలన తీవ్రంగా నష్టపోతారు. గ్రామాల్లో నిర్వాసితులు తరచుగా ఎనభై ఆరు గోదారి కంటే ఎక్కువ వరద వస్తుందని.1986 సం లో పెద్ద ఎత్తున వరద వచ్చి గ్రామాల ను ముంచెత్తింది.38లక్షలు క్యూసెక్స్ నీరు సముద్రం లోకి వదిలారు. అప్పుడు బ్యాక్ వాటర్ లో భద్రాచలం రాముల వారి దేవాలయ గోపురం మీద నీళ్ళు తాకాయి. దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఏనుగు మునిగిన ఫోటోలు పరిశీలిస్తే అర్థమవుతుంది. అప్పట్లో ఏ కాఫర్ డామ్ లేదు కదా!

పోలవరం దళితులకు తీరని అన్యాయం, వివక్ష :

భూసేకరణ చట్టం 2013 లోని షెడ్యూల్డ్ 2 ప్రాజెక్టు నిర్వాసిత లేదా బాధిత కుటుంబాలకు కల్పించాల్సిన సదుపాయాల గురించి స్పష్టం చేస్తోంది. సెక్షన్స్:31(1),38(1) మరియు 105(3) ప్రకారం గిరిజనులతో పాటు భూమికి భూమి షెడ్యూల్డ్ కులాల వారికి రెండున్నర ఎకరాల వరకు ఇవ్వాలి. కానీ పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలలోని దళితులకు ఏ ఒక్కరికి సెంటు భూమి నష్టపరిహారంగా ఇవ్వలేదు.

ఇది పూర్తిగా దళితుల పట్ల వివక్షత. భూసేకరణ అధికారులు దళితులకు భూమి భూమి ఇవ్వకుండా అన్యాయం చేశారని భావించాలి. జంగారెడ్డిగూడెం మండలం, తాడువాయి పంచాయతీలోని చల్లావారిగూడెంలో సుమారు 15 వేల గిరిజనేతర కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది .అయితే భూమి లేకుండా ఏవిధమైన ప్రత్యామ్నాయ జీవనోపాధి లేకుండా కేవలం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సొమ్ముతో కుటుంబాలను ఎలా పోషించుకుంటారో ప్రభుత్వం ఆలోచించక పోవడం విచారకరం.

దళితులకు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక రక్షణలు :

ఆర్టికల్(17): సామాజిక,
ఆర్టికల్ (23): ఆర్థిక
ఆర్టికల్(:46) విద్య మరియు సాంస్కృతిక

రాజకీయ పరమైన హక్కులు. వీటి కోసం డా: బి. ఆర్. అంబేద్కర్ జీవిత కాలం పోరాడారు.

ఇవేమీ పోలవరం ప్రాజెక్టులో బాధితులుగా మారిన దళిత నిర్వాసితులకు అమలు చేయకపోవడం విచారకరం. దానికి భూసేకరణ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని ప్రయత్నం చేయడం లేదు అంటే, దళితుల గురించి ఎవరు మాట్లాడారని, వారికి ఏమీ చేయకపోయినా అడిగేవారు ఉండరని అధికార యంత్రాంగం ఒక నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక (సవరణ )చట్టం2016 ప్రకారం ఉద్దేశపూర్వకంగా అధికారులు దళితులను మరియు ఆదివాసీలను వారి భూముల నుండి ఆవాసాల నుండి తరలించి ఆర్థికపరమైన నష్టాన్ని కలుగజేస్తే తీవ్రమైన నేరంగా పరిగణించాలి. అంటే చాలా మంది రెవెన్యూ మరియు భూసేఖరణ అధికార్లు జైలుకు వెళతారు.

భూసేకరణ చట్టం 2013 లోని సెక్షన్ 87 ప్రకారం: శిక్ష/జరిమానాలు
ఎవరైనా ప్రభుత్వ అధికారి అన్నీ తెలిసి ఉద్దేశపూర్వకంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ ,అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పులు చేస్తే వారు శిక్షార్హులు అవుతారు.

అయితే,పోలవరం ప్రాజెక్ట్ లో భూసేకరణ జరిపే క్రమంలో ప్రతి గ్రామంలో దళితులు సాగుచేస్తున్న భూములను గుర్తించడంలో, సర్వే సిబ్బంది, రెవెన్యూ అధికారులు, లంచాలు కోసం చేతివాటం చూపి రికార్డులను తారుమారు చేసి అన్యాయం చేశారు. దీని విషయమై అనేకసార్లు కోట రామచంద్రపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు కుక్కునూరు సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి దళితులు మొరపెట్టుకుంటే మీ దగ్గర సరైన రికార్డులు లేవని మీకు నష్టపరిహారం ఇవ్వడం కుదరదని అవమానంగా బయటకు పంపిన అనుభవాలు కోకొల్లలు. ఇది ఖచ్చితంగా దళితుల ను” ఆర్థిక వెలివేత” కు గురిచేశారు.

దళితుల సమస్యలపై దృష్టి సారించి వారి హక్కుల సాధనకు కృషి చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఎస్సీ ,ఎస్టీ కమీషన్. దురదృష్టమేమిటంటే, గడిచిన 15 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఎస్సీ కమిషన్ చైర్మన్ పోలవరం ప్రాజెక్టు దళిత నిర్వాసితుల గ్రామాలను సందర్శించి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు చేసి ఎందుకు దళిత నిర్వాసితులకు పంచటం లేదు. గత ప్రభుత్వం రూ.15 లక్షలు వెచ్చించి భూమి లేని పేద దళితులకు పంచుతామన్న ప్రభుత్వ పాలసీ ఎందుకు విస్మరించినట్లు?

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ కానీ, లేదా ఎస్సీ కమీషన్ చైర్మన్లుగా ఉన్న మేరుగ నాగార్జున లేదా కారెం శివాజీ కానీ ఏ ఒక్క రోజు దళిత నిర్వాసితుల గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవు.
కొసమెరుపు ఏమిటంటే: నిన్న ,మొన్న పోలవరం ప్రాజెక్టు గ్రామాల్లో పర్యటించిన అఖిలపక్ష కమిటీలో సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ ఉన్నారు.2009సంలో ఎన్నికల ప్రచారంలో వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ అధికారం లోకి వస్తే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు చేసి దళిత నిర్వాసితుల కు పంచుతామని చెప్పారు.

కానీ 2014 లో అధికారంలోకి వచ్చి ఆ విషయం గురించి పట్టించు కోలేదు. కాబట్టీ పోలవరం ప్రాజెక్టులో బాధితులుగా ఉన్న దళితుల జీవితాలతో ఎలా పార్టీలు ఆడుకుంటూన్నాయో అర్థం చేసుకుని ముందుకు సాగాలని కోరుతున్నాను.

దళిత నిర్వాసితులు పడుతున్న బాధలు మీడియాకు కూడా అంటరాని గానే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టులో అత్యధికంగా నష్టపోతున్నవారు గిరిజనులు. ఆ తర్వాత రెండవ అతిపెద్ద నిర్వాసిత సామాజిక వర్గం దళితులు. కానీ దళిత వ్యవసాయ కూలీలు గురించి గానీ భూములు కోల్పోయిన దళితులకు భూమి భూమి గురించి గానీ మీడియాలో రాయకపోవడం అత్యంత దయనీయం. దళితుల పరిస్థితి చూస్తే” ఎవడికి పుట్టిన బిడ్డో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది”ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయండి.

మొన్న ముంపు గ్రామాల్లో పర్యటించిన అఖిలపక్ష రాజకీయ ప్రతినిధుల బృందానికి దళిత గ్రామాలను సందర్శించి వారు పడుతున్న బాధలు, వారికి పునరావాస కాలనీలలో అసంపూర్తిగా ఉన్న సౌకర్యాలు, భవిష్యత్తులో వారికి ఎదురయ్యే జీవనోపాధి సమస్యల గురించి తెలుసుకోవాలని ఆలోచన ఎందుకు కలగలేదోనని ఆశ్చర్యం కలిగిస్తుంది.

(బాబ్జీ అడ్వకేట్, న్యాయసలహాదారు, పోలవరం ప్రాజెక్ట్ దళిత నిర్వాసితుల జాయింట్ యాక్షన్ కమిటీ ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *