టిఆర్ ఎస్ లో చేరడం ఎల్. రమణకు నష్టమా, లాభమా?

(వడ్డేపల్లి మల్లేశము)

1885లో ఆంగ్లేయ భావజాలం ఉన్న కొంతమంది కాంగ్రెస్ పేరుతో ఏర్పాటు చేసిన  సంస్థ తర్వాత్తర్వాత  జాతీయోద్యమానికి నాయకత్వం వహించింది, స్వాతంత్య్రానంతర కాలంలో ఈ దేశానికి నాయకత్వం వహించింది. విజ్ఞాపన పత్రాల పార్టీ ఉద్యమ పార్టీగా ఎదగడం ఒక మహోన్నత పరిణాం. ఉద్యమ పార్టీలు ఉత్తుత్తి పార్టీలుగా దిగజారడం మహాపతనం. ఇటీవల దేశమంతా ఈ పరిణామం ఊపందుకుంటున్నది.

స్వాతంత్య్రం వచ్చాక  కొద్ది సంవత్సరాలు మినహా జాతీయ స్థాయిలో 2014 వరకు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఇలాంటి కాంగ్రెస్ నుంచి దూరం జరిగింది. ప్రజా పోరాటంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో  ప్రభత్వం ఏర్పడింది. టిఆర్ ఎస్ పాలన  కొనసాగుతున్నది గత ఏడు సంవత్సరాలుగా.

అయితే, ఇటీవల రాజకీయాలు బాగా పతనమవుతున్నాయనక తప్పదు. ప్రజల తీర్పును కాదని  ఓటర్లు మనోభావాలను లెక్కచేయకుండా ప్రజాప్రతినిధులు అధికారం కోసం పార్టీలు మారడం ఎక్కువయింది.

దీనిని అరికట్టేందుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1985లో రాజ్యాంగానికి  52 వ సవరణ తీసుకువచ్చి పార్టీ ఫిరాయింపులను నివారించే తొలి ప్రయత్నం చేశారు.

ఈ చట్టం మొగ్గ తొడిగినప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, అనేక లొసుగులు వుండటంతో  పార్టీలు సులభంగా మారడానికి, పదవులను అనుభవించడానికి, ప్రజలను నిమిత్తమాత్రులు గా మలచడానికి కారణమవుతూ ఉంది.

ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు  మితిమీరి పోవడానికి ఈ  చట్టానికి కోరలు లేకపోవడమే అని చెప్పక తప్పదు. ఈ చట్టం ప్రకారం ఫిరాయించడం చెల్లదు. పిరాయిస్తే చేయగలిగిందేమీ లేదు. సభ్యత్వానికి అనర్హుని చేయలేరు. అందువల్లచట్టం ఉన్నా లేనట్లే. ఫలితంగా  ధైర్యంగా ఫార్టీలు ఫిరాయించ గలగుతున్నారు

క్రమంగా జాతీయ పార్టీల ప్రాబల్యం తగ్గుతూ వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పతాక స్థాయికి చేరుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఆత్మగౌరవం పేరుతో వచ్చిన తెలుగుదేశం పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా స్థానిక ఆకాంక్షల మేరకు ఏర్పడినవే.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ అధికారము లేకుంటే, బ్రతక లేమననే నాయకులు సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇది ప్రాంతీయ పార్టీలు వచ్చాక బాగా  ముదిరిన  పరిణామం.

పూర్వం ఎన్నికల్లో గెలిచేందుకే ప్రాముఖ్యం ఇచ్చేవారు. అందుకే స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వాళ్లు కూడా చివరి వరకు అలాగే కొనసాగే వారు. వాళ్లంతా ప్రతిపక్షంలో కూర్చుని ప్రజల పక్షాన ఎలుగెత్తి గొప్ప పార్లమెంటేరియన్లుగా చరిత్రలో నిలిచిపోయారు.

మనకున్న గొప్ప పార్లమెంటేరియన్లంతా ప్రతిపక్షంలో కూర్చున్నవాళ్లే. రూలింగ్ పార్టీలో కూర్చుంటే పార్లమెంటేరియన్లు కాలేరు. జైపాల్ రెడ్డి, సోమనాథ్ చటర్జీ, జార్జిఫెర్నాండెజ్, గురుదాస్ దాస్ గుప్తా, ఇంద్రజిత్ గుప్తా, ఎల్ కె అద్వానీ, వాజ్ పేయి ప్రతిపక్షంలో ఉన్నపుడే రాణించారు.

అయితే, ఇపుడు పరిస్థితి మారిపోయింది. ఉత్తమ పార్లమెంటేరియన్ గుర్తింపు కంటే,  అధికార పార్టీలో కాసింత చోటు మేలనుకుంటున్నారు. బహుశా ఇకముందు ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ అనే జాతి అంతరించిపోతుందేమో.

ఇపుడు పరిస్థితి ఎంతగా  మారిపోయిందో చూడండి.  శాసన సభ్యులుగా గెలిచినప్పటికీ అధికార పార్టీలో ఉంటేనే  మేలు అనుకుని, ఓటు వేసి గెలిపించిన ప్రజలను ఖాతరు చేయకుండా, అధికార పార్టీలో చేరి పోవడం ఇప్పటి పరిణామం. తెలుగు రాష్ట్రాల్లో ఇది విపరీత స్థాయికి చేేరింది. దీనివల్ల  తెలంగాణలో ప్రతిపక్షం జాడే లేకుండా పోతున్నది.

కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రాంతంలో యువ నాయకునిగా అప్పుడప్పుడే తెరమీదికి వస్తున్నపుడు, 1993వ సంవత్సరంలో ఏపీటీఎఫ్ అనే ఉపాధ్యాయ సంఘం దశాబ్ధి ఉత్సవాలకు తెలంగాణ టిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా ఉన్న విషయం నాకు తెలుసు.

నిబద్ధత, నిజాయితీ హుందాతనం బలంగా ఉన్న ఆ రోజుల్లో ఆ తర్వాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి శాసనసభ్యులుగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యులుగా వివిధ హోదాలలో పని చేసినప్పటికీ దాదాపుగా గత దశాబ్ద కాలంగా పదవులకు దూరంగా ఉన్నా హుందాగా వ్యవహరించారు.

2018 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా మహా కూటమికి తన చేయూత అందించి కూటమిలో జవసత్వాలు నింపి నారనడంలో సందేహం లేదు.

అభ్యర్థిత్వాలకు పోటీ చాలా ఉన్న కారణంగా తాను పోటీ చేయకుండా కేవలం నాయకత్వ బాధ్యతలు తీసుకొని పార్టీని ఒంటిచేత్తో నడిపిన ధైర్యశాలి. ఆ సమయంలో పదవులకు ఆశించకుండా సిద్ధాంతానికి కట్టుబడిన నాయకునిగా రమణకు మంచి పేరుంది. అనేకమంది పార్టీ మారినా తను మాత్రము నమ్ముకున్న సిద్ధాంతం కోసం కృషి చేశాడే తప్ప పార్టీ మారడానికి సిద్ధపడలేదు.

టిఆర్ఎస్ పార్టీని వీడిన ప్రముఖులు

ఉద్యమ పార్టీగా తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజల మధ్య ప్రజల సహకారంతో పతాకస్థాయికి ఎగిసిన టిఆర్ఎస్ పార్టీ రాజకీయాలకతీతంగా ఉద్యోగులు, మేధావులు, కార్మికులు, కర్షకులు ,అన్ని వర్గాల వారిని ఆలోచింపజేసింది. కనుకనే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కాదని టిఆర్ఎస్ అధికారంలోకి రావడం సులభం అయ్యింది.

ఆ తర్వాత కాలంలో పార్టీలో పని చేస్తూ పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పని చేసిన అనేకమంది ప్రముఖ నాయకులు టిఆర్ ఎస్ శైలిలో ఇమడలేకపోయారు. ఇందులో కొనసాగడం ఆత్మగౌరవానికి హాని అని   ఎంతో మంది పార్టీని వీడి నారు. అందులో ఆలె నరేంద్ర, విజయశాంతి, దేశిని చిన్న మల్లయ్య, ఇన్నయ్య, చెరుకు సుధాకర్, రాములు నాయక్, వంటి అనేక మంది పార్టీకి దూరమయ్యారు.

ఆ రకంగా అనేకమంది ఉద్యమములో క్రియాశీలక పాత్ర పోషించి తమ సర్వస్వాన్ని ధారపోసిన వారు క్రమంగా దూరం అవుతూ ఉంటే ఉద్యమ సోయిలేని, ఉద్యమకారులపై దాడి చేసి, తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించ కూడదని హెచ్చరించిన వారితో ఇవాళ పార్టీ ,మంత్రివర్గం నిండిపోవడం చాలా బాధాకరమే కాదు. ఆందోళనకరం కూడా.

ఇటీవలి ఈటెల రాజేందర్ బర్తరఫ్

మన రాష్ట్రాన్ని మనం ఏలుతున్న సంతోషమే కాని ఉద్యోగిస్వామ్యంలో, రాజకీయ యంత్రాంగంలో విపరీతమైన అవినీతి పేరుకుపోయింది. రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ అక్రమార్జన ,భూదందాలకు పాల్పడ్డారని అనేక వీడియోల ద్వారా ప్రజలకు చేరువై న విషయం అందరికీ తెలిసిందే.

అంతో ఇంతో నిజాయితీగా పని చేస్తూ తొలినాటి నుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న కార్యకర్తలకు, మంత్రి వర్గంలో ఉన్న సీనియర్ మంత్రులకు కూడా ప్రభుత్వ అధినేతను కలిసే అవకాశం లేకపోవడాన్ని బట్టి ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఎంత భ్రష్టు పట్టి పోయిందో అర్థం చేసుకోవచ్చు. సీనియర్ కార్యకర్త మంత్రి అయిన ఈటెల రాజేందర్ కూడా ఈ అవమానాలకు మినహాయింపు కాలేదు.

అనేక వేదికలపైన ఈటెల రాజేందర్ పార్టీ సంస్థాగత విషయాలు, చేసిన త్యాగాలు, ప్రభుత్వ విధానాలపై నోరువిప్పి ప్రశ్నించినందుకు గాను ప్రభుత్వము నుండి, మంత్రివర్గం నుండి, పార్టీ నుండి దూరం చేయడానికి అవినీతి ఆరోపణలను తెరపైకి తీసుకువచ్చి ఒక్కరోజులోనే విచారణ పేరుతో బర్తరఫ్ చేయడం విడ్డూరం .అలాంటి ఆరోపణలు వచ్చిన వారు ఎంతోమంది ఇవాళ మంత్రివర్గంలో ఉన్నారు మరి వారిపైన చర్యలేవి?

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆధిపత్యం అణచివేత కొనసాగుతున్నదని, ఆత్మగౌరవానికి చిరునామా లేకుండా పోయిందని, మాట్లాడే అవకాశం లేకుండా చేతులు ముడుచుకునే విధానం సరైంది కాదని, ప్రభుత్వాన్ని పార్టీని ధిక్కరించి రాజీనామా చేసి ఈటెల రాజేందర్ బయటికి రావడం ఉభయ రాష్ట్రాలలోనూ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం కలిగించింది.

అయితే నియంతృత్వానికి నిలయంగా మారిన అధికార పార్టీ లోకి రావడానికి కొంత మంది కార్యకర్తలు, ముఖ్యనేతలు కూడా ఆసక్తి చూపడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

రమణ టిఆర్ ఎస్ పయనం

సుమారుగా 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక పదవులు అనుభవించిన రమణ పదవులు లేకుండా ఎంత హుందాగా వ్యవహరించారో అదే స్థాయిలో మారుతున్న కాలానికి అనుగుణంగా పదవీ వ్యామోహ పరులంతా చేరుతున్న పార్టీలోకే వెళ్లడం ఎవరినైనా కొంత అబ్బురపరుస్తున్నది.

అధికారం, పదవులు లేకపోవచ్చు. కానీ రెండు రాష్ట్రాలలో కొనసాగుతున్న జాతీయ హోదా కలిగిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధినేతగా కొనసాగుతున్న రమణకు పార్టీ మారితే వచ్చే లాభం ఏమిటో ఇప్పటికీ అర్థం కావడం లేదు.

తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడంలేదని, హామీలు అంతగా అమలు కాని సందిగ్ధస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉండడాన్ని పరిశీలించకుండానే మొక్కుబడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల రమణ లాంటి వ్యక్తుల గౌరవం తగ్గుతుంది.

గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికయిన 12 మంది శాసనసభ్యులు పార్టీ మారినప్పటికీ పదవులకు రాజీనామా చేయకపోవడం వారి పదవీ కాంక్షకు అద్దం పట్టింది. అలాంటి వారిని ఎన్నుకున్న ప్రజలు రాళ్లతో కొట్టాలని పిసిసి అధ్యక్షుడు పిలిపు ఇచ్చారు.  ఇలాంటి పరిణామాలను పరిశీలించకుండా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం రమణ లాంటి సీనియర్ నాయకులకు తగదు. ప్రజలు, ప్రజాస్వామివాదులు దీనిని గమనిస్తున్నారు.

ఆ మాటకు వస్తే ఇవ్వాళ ఏ పార్టీలోనూ ఆత్మగౌరవంతో కొనసాగే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా అగ్రవర్ణాల నాయకత్వంలో కొనసాగుతూ ఉంటే అట్టడుగు వర్గాలు, వెనుకబడిన తరగతుల వాళ్ళు తమ సామర్థ్యాన్ని, నాయకత్వ లక్షణాలను ఇతర పార్టీలకు తాకట్టు పెట్టకుండా తమ సామాజిక వర్గాల ప్రయోజనాన్ని సవాల్ గా స్వీకరించి విలువలతో కూడిన నూతన రాజకీయాలను నడపాల్సిన అవసరం ఉంది.

దిగజారుతున్న రాజకీయాలకు దూరంగా ఉంటారని, బలమైన తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం వైపు కొనసాగుతారని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.

ప్రజలు ప్రజాస్వామిక వాదుల నిర్ణయాన్ని, విశ్వాసాన్ని విలువలకు కట్టుబడిన నాయకులు పదవుల కోసం అమ్ముడు పోకుండా వినూత్న రాజకీయాలకు శ్రీకారం చుడతారని మనసారా కోరుకుందాం.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు .హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *