నదీ జలాల మీద అఖిలపక్షం నిర్వహించాలి: రాయలసీమ తీర్మానం

 

రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణ” అనే అంశంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో IMA హాల్, మదుమణి నర్సింగ్ హోమ్, నంద్యాలలో జులై 11 ఆదివారం చర్చా కార్యక్రమం నిర్వహించబడింది.

నంద్యాల పార్లమెంటు నుండి వివిధ రాజకీయ పార్టీల, రైతు సంఘాల, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రెడ్డి, తెలుగు దేశం పార్టీ ప్రతినిధి మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి, సిపిఐ పార్టీ ప్రతినిధి బాబ ఫకృద్దీన్, సామాన్న్న, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి శ్రీనివాసులు, సిపిఎం పార్టీ ప్రతినిధి నరసింహా, వెలుగోడు మండలం రైతు సంఘం ప్రతినిధి నసురుల్లా ఖాన్, బనగానపల్లె మండలం రైతు సంఘం ప్రతినిధులు కొండారెడ్డి, మూలా రెడ్డి కోవెలకుంట్ల మండలం రైతు సంఘం ప్రతినిధి శ్రీనివాస రెడ్డి, పాణ్యం మండలం రైతు సంఘం ప్రతినిధులు శంకరయ్య, శ్రీనివాస రెడ్డి, గడివేముల మండలం రైతు సంఘం ప్రతినిధలు సంజీవరెడ్డి, ఈశ్వరరెడ్డి, మహనంది మండలం రైతు సంఘం ప్రతినిధి సాకేశ్వర రెడ్డి, నూనెపల్లె రైతు సంఘం ప్రతినిధులు తోట పార్థసారథి, సుబ్బారావు, గోస్పాడు మండలం రైతు సంఘం ప్రతినిధులు బాల ఈశ్వరరెడ్డి, రామకృష్ణా రెడ్డి, నంద్యాల మండలం రైతు సంఘం ప్రతినిధులు రవి, పురుషోత్తం రెడ్డి, నంది రైతు సమాఖ్య ప్రతినిధులు ఉమా మహేశ్వర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శిరీవెళ్ళ మండలం రైతు సంఘం ప్రతినిధులు మనోజ్, రుద్రవరం మండలం రైతు సంఘం ప్రతినిధి వీర బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల పార్లమెంటు లోని వివిద గ్రామాల సర్పంచ్ లు మాజీ సర్పంచ్ లు, ప్రజా సంఘాల ప్రతినిధులు పర్వేజ్, షణ్ముఖ రావు, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉ పాధ్యక్షుల వై ఎన్ రెడ్డి, సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.

అనంతరం సమావేశం ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.

1. అంతరాష్ట్ర నది వివాదాల చట్టం 1956 ప్రకారం రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన బచావత్ ట్రిబ్యునల్ రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తి రక్షణతో చట్టబద్ద నీటి హక్కులు కల్పించింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ తీర్పే శిరోధార్యం.

2. సుప్రీం కోర్టు తీర్పు తదనంతరం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ ద్వారా అమలులోకి తెచ్చిన మీదట ఆ తీర్పుకు అనుగుణంగా నీటిని వినియోగించుకోవాలి.

3. రాజ్యాంగ బద్దంగా రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తావించిన, మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలి. ఈ నిర్మాణాల సత్వరం పూర్తి చేయాలి.

4. హైదరాబాద్ తో కూడిన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు బదులుగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మల్లించడం ద్వారా ఆదా అయిన 45 టి.ఎం.సీ. లను రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలి. పోలవరం కు తాత్కాలిక ప్రాజెక్టుగా పట్టిసీమ నిర్మాణం పూర్తై నిర్వహణలో ఉన్నందున , ఈ 45 టి.ఎం.సీ. ల నీటిని తక్షణమే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలి.

5. రాష్ట్ర విభజన చట్టంలో లేని ప్రాజెక్టుల నిర్మాణాలను ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందిన తరువాతనే ఇరు తెలుగు రాష్ట్రాలు నిర్మాణాలను చేపట్టాలి/కొనసాగించాలి.

6. బచావత్ ట్రిబునల్ తీర్పులో ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చేయబడ్డాయి. ఆ కేటాయింపుల మేరకే రాష్ట్ర విభజన తర్వాత 2015లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్ 512, తెలంగాణ 299 టియంసీలను వినియోగించుకోవాలి. గడచిన ఆరేళ్ళుగా కృష్ణా నది యాజమాన్య బోర్డు నియంత్రణలో నీటిని వినియోగించుకోవడం జరుగుతున్నది. దాన్ని కొనసాగించాలి.

7. కృష్ణా నది జలాలపై బచావత్ ట్రిబునల్ ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ 50:50 నిష్పత్తిలో నీటిని పంచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన డిమాండ్ అసంబద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమైనది. ఎట్టి పరిస్థితుల్లోను ఆమోదయోగ్యం కాదు.

8. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(ఎస్.ఆర్.బి.సి.), తెలుగు గంగ, గాలేరు-నగరి, చెన్నయ్ నగరానికి త్రాగునీరు, రాయలసీమకు త్రాగునీరు అందించే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించబడింది. ఇది అసలు ప్రాజెక్టే కాదు, కేవలం హెడ్ రెగ్యులేటర్ మాత్రమేనని తెలిసి కూడా దుష్ప్రచారం చేయడం దారుణం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చట్ట వ్యతిరేకంగా నిర్మించబడిన, అక్రమ ప్రాజెక్టు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

9. శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలాగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి జులై 5, 1963 లో ప్లానింగ్ కమిషన్ అనుమతుల ఇచ్చింది. ఈ విషయం ను బచావత్ ట్రిబ్యునల్ తీర్పు లో స్పష్టంగా పేర్కొన్నది. దీని ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం 854 అడుగులుగా చేపట్టాలి.

10. ప్లానింగ్ కమీషన్ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ అనుమతులో పేర్కొన్న విధంగా శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తికి 264 టి.ఎం.సి. లు మాత్రమే వినియోగించాలి. గోదావరి నీటిని కృష్ణా నదికి మల్లింపు తరువాత విద్యుత్ ఉత్పత్తికి 160 లు మాత్రమే వినియోగించాలి.

11. వరద జలాలు సముద్రం పాలు కాకుండా ఉండటానికి మరియు రాయలసీమ లోని ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాల వినియోగానికి, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న రాయలసీమ ప్రాజెక్టులకు మిగులు జలాల వినియోగానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని, శ్రీశైలం కుడి ప్రధాన కాలువల సామర్థ్యం 88000 క్యూసెక్కుల కు పెంచే కార్యక్రమం త్వరాగా పూర్తి చేయాలి.

12. చట్టబద్ద నీటి హక్కులున్న రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిలో 60 శాతం కూడా వినియోగించుకోనలేక పోతున్నాయి. ఈ ప్రాజెక్టులు నీటి హక్కులను సంపూర్ణంగా వినియోగించుకొనడొనికి తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం, వేదవతి పైన రిజర్వాయర్ మరియు ఎత్తిపొతల నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలి.

13. భారత ప్రభుత్వం ప్రకటించిన కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారిలో భాగంగా సిద్దేశ్వరం వద్ద నిర్మించే వంతెన తో పాటు అలుగు నిర్మాణం చేపట్టాలి.

14. భారత రాజ్యాంగం ప్రకారం, జాతీయ నీటి విధానం ప్రకారం, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తాగు నీటికి, తరువాత సాగునీటికి ప్రాధాన్యతను ఇవ్వాలి. దీన్ని ఉల్లఘించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలవిద్యుదుత్ఫత్తికి నీటిని వినియోగించడం చట్ట వ్యతిరేకం. తెలంగాణ ప్రభుత్వం తక్షణం శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల వద్ద జల విద్యుదుత్ఫాదనను భేషరతుగా నిలిపివేయాలి.

15. కేంద్ర ప్రభుత్వం తక్షణం విభజన చట్టం మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిథిని నిర్ణయించి, గజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, అమలు చేయాలి.

16. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని తక్షణం నిర్వహించి, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న వివాదాలను పరిష్కరించాలి.

17. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, నదీ జలాల సమస్యలపై కృషి చేస్తున్న ఉద్యమకారులతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి, నదీ జలాల వివాదంపై చర్చించి, సమిష్టి కార్యాచరణతో ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను పరిరక్షించుకోవడానికి రాజీలేని పోరాటం చేయాలి.

18. కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నానికి తరలించమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సును భేషరతుగా ఉపసంహరించుకొని, బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం భారత ప్రభుత్వానికి ఉత్తరం వ్రాయాలి.

19. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రస్థాయి/ జాతీయ స్థాయిలో సమావేశాలు నిర్వహించి వెనుకబడిన రాయలసీమ, దక్షిణ తెలంగాణా చట్టబద్ద హక్కుల పరిరక్షణకు తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలి. ఇరు తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచకుండా, ఇరు ప్రాంతాల అభివృద్ధికి తమ నిర్మాణాత్మక ప్రతిపాధనలు ప్రకటించాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *