హరిబాబూ, ఆ గవర్నర్ పదవి తిరస్కరించేయ్: సిపిఐ నారాయణ సలహా

బిజెపి నుంచి ఎపుడూ ఆంధ్ర ప్రదేశ్ కు గవర్నర్ పదవి దక్కలేదు.ఇటీవల బిజెపి నుంచి గవర్నర్లయిన బండారు  దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్ రావు తెలంగాణ నేతలు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి వాజ్ పేయి కాలంలో సిక్కిం గవర్నర్ గా వి.రామారావు పనిచేశారు.

ప్రధాని మోదీ కాలంలో తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కంభం పాటి హరిబాబుకు గవర్నర్ పదవి లభించింది. మూడు రోజుల కిందట ఆయన మిజోరాం గవర్నర్ గా నియమితులయ్యారు. హరిబాబు వైజాగ్ నేత. గతంలో విశాఖ ఎంపిగా ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇపుడాయన గవర్నర్ గా వెళ్లున్నపుడు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ్ ఒక సవాల్ విసిరారు.

వైజాగ్ నుంచి లోక్ సభ కు గెలిచిన నేతగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను బతికించుకోవాలనే తాపత్రయం ఉంటే, మిజోరాం గవర్నర్ పదవిని తిరస్కరించాలని సూచించారు. ఇది చిక్కు సమస్యే.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్న పాలెం జంక్షన్‌ వద్ద  రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. నేడు147వ రోజు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సీపీఐ నేత నారాయణ సందర్శించారు. ఈ పోరాటానికి మద్దతు తెలిపారు.   విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని అరుస్తూ  విద్యార్థి దశలోనే ఉక్కుపోరాటంలో పాల్గొన్నానని చెబుతూ  నాటి పోరాటంలో పాల్గొన్న నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి విశాఖ ఉక్కును కాపాడాలని అన్నారు.

ఇపుడు స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం  అన్యాయం చేస్తుంటే, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం సాగుతూ ఉంటే మాజీ ఎంపీ హరిబాబు మిజోరాం గవర్నర్ పదవి ఎలా స్వీకరిస్తారని నారాయణ ప్రశ్నించారు.

‘విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నిజంగా ప్రేమ ఉంటే మిజోరం గవర్నర్‌ పదవిని హరిబాబు తిరస్కరించాలి,’ అని అన్నారు. విశాఖ ఉక్కు పోరాటంలో పాల్గొనాలని కూడా అన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటం చేయాలని, సీఎం జగన్‌ నేరుగా ఉద్యమంలో పాల్గొనాలని కూడా నారాయణ పిలుపునిచ్చారు.

ఆగస్టు 12న విజయవాడలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, అపుడు  ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని నారాయణ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *