‘స్వార్థం కోసం ముఖ్యమంత్రులు ప్రజా ప్రయోజనాలు బలి చేస్తున్నారు!’

(వి. శంకరయ్య)

కోర్టుకెళ్లిన వ్యక్తి ఓడి పోతే కోర్టు వద్దనే ఏడుస్తాడట.
గెలుపొందిన వ్యక్తి ఇంటి కొచ్చి వెక్కి వెక్కి ఏడ్చుటాడనే సామెత తెలుగు నాట అందరికీ తెలుసు. మరీ సాగునీటి రంగ సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలు కోర్టులనాశ్రయించితే అవి ఎప్పటికి తెగుతాయో ఎవరూ చెప్ఫలేరు.

తెలంగాణ వేపునుండి కాలు దువ్వుతున్నా ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి మాటల బట్టి తాజాగా ముఖ్యమంత్రి కాబినెట్ లో ప్రసంగం బట్టి ఆంధ్ర ప్రదేశ్ బస్తీమే సవాలుకు సిద్ధంగా లేదనిపిస్తోంది. వాస్తవంలో సాగునీటి సమస్యకు తెలంగాణలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రజల రక్షణకు సంబంధం లేదు. ఆయా వేదికలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించ లేదు

2004 లో నియమింప బడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2013 లో గాని తుది తీర్పు ఇవ్వ లేదు . ఈ తీర్పు సమ్మతి కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో అదే సంవత్సరం యస్ యల్ పి వేసి స్టే తేవడంతో గెజిట్ నోటిఫికేషన్ ఆగిపోయింది. ఎనిమిది ఏళ్లు గడిచినా సుప్రీంకోర్టులో వున్న ఈ కేసు తుది తీర్పు ఇంకా రాలేదు. .

విభజన చట్టం సెక్షన్ 89 మేరకు రెండు రాష్ట్రాల సాగు నీటి సమస్యలపై విచారణ సాగిస్తున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఏడేళ్లు గడిచినా క్రాస్ ఎగ్జామినేషన్స్ ముగించ లేదు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కోర్టుల కెక్కితే ఈ తరంలో దీనికి తెర పడక పోవచ్చు. కాకుంటే ఈ లోపు మాటల తూటాలతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత సృష్టించుతారు.

ఇటీవల వరకు సఖ్యతగా వుండిన ఇరువురు ముఖ్యమంత్రులు భేషజాలు పక్కన పెట్టి సామరస్యంగా వ్యవహరించక పోతే ఇరువురూ ఏమి సాధించ లేరు. కృష్ణ నదిలో నీటి లభ్యత అంచనా వేసుకొని ప్రస్తుతం అమలులో వున్న ట్రిబ్యునల్ తీర్పులు చట్ట పరమైన నియమ నిబంధనల మేరకు నీటిని వినియోగించుకోవాలి .

పైగా కృష్ణ నదిలో లేని నీళ్ల కోసం సిగపట్లకు దిగడమంటే సాగునీటి రంగ సమస్యల కన్నా ఇతర బలమైన కారణాలు ఏవో వుండి వుండాలి. ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొనే పరిస్థితి లేదని సజ్జల రామ కృష్ణ రెడ్డి తేల్చేయడం కొస మెరుపు. బోర్డులు ట్రిబ్యునల్స్ వద్దు మేమిద్దరమే ముద్దు అన్న కెసిఆర్ ఇప్పుడు అంతెత్తున లేస్తున్నారు. ఇరువురు కలసి రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను తమ ప్రయోజనాల కోసం ప్రజల పేరుతో బలి పీఠం ఎక్కిస్తున్నారు.

టిడిపి హయాంలో అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11వ షెడ్యూల్ లోలేని పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాల గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తమ వాటా నీళ్లను మాత్రమే తాము వాడుకుంటామని బోర్డు ఆదేశాల మేరకు వినియోగించుకుంటామని చెప్పారు. అయితే గత అక్టోబర్ లో కేంద్ర మంత్రి షెకావత్ ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ లేవ నెత్తారు.

అందుకు ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో కెసిఆర్ చెప్పిన సమాధానమే చెప్పారు. తమ వాటా నీళ్లు మాత్రమే వినియోగించుకుంటా మన్నారు. వాస్తవంలో ఎవరి వాటా నీళ్లు వారు వాడుకొంటే ఇప్పుడు తగాదా ఎందుకొచ్చింది? ఇరువురు నేతల వ్యక్తిగత ప్రయోజనాలు ఒకటిగా లేక పోవడమే.

ముఖ్యమంత్రుల వాదనలు ఆనాటి సమావేశాల మినిట్స్ లో రికార్డ్ అయి వున్నాయి. అక్టోబర్ లో జరిగిన సమావేశంలోనే 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 ప్రస్తావన కెసిఆర్ తెచ్చారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి డిసెంట్ నోట్ ఎందుకు పెట్టలేదు?

ఇప్పడేమో కేంద్ర మంత్రి హామీ మేరకు సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకొని మొత్తం నీటి పంపిణీ మొదటికి తీసుకురమ్మని కెసిఆర్ డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవంలో రాష్ట్ర విభజన చట్టం మేరకు ఏర్పడిన కృష్ణ నదీ యాజమాన్య బోర్డు అధీనంలోనికి నీటి పంపిణీ మొత్తంగా వెళ్లి పోయింది. ఎవరైనా దొంగ చాటుగా వినియోగించుకున్నా పసి గట్టేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏ రాష్ట్రం గాని జలచౌర్యానికి బరితెగించే అవకాశాలు చాలా తక్కువ. ఇ

ప్పుడు తెలంగాణ మంత్రుల ప్రకటనలు చూస్తే నీళ్ల కోసం కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డిని తెరమీదకు తెస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలమ్మను నిలువరించే వ్యూహమేదైనా వుందా? ఆమె కూడా దీటుగా స్పందించి తను తెలంగాణ కోడలునని చెప్పి ఎంత వరకైనా ఎవరితోనైనా తెలంగాణ ప్రజల కోసం నిలబడతానని చెప్పి అటు కెసిఆర్ కు ఇటు జగన్మోహన్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు.

ముఖ్యమంత్రులు ఇరువురు భాయ్ భాయ్ గా వున్న సమయంలో గోదావరి కృష్ణ అనుసంధానం కోసం వర్కింగ్ గ్రూప్ ఇంజనీర్లు పనిచేశారు. కృష్ణ నదిలో క్రమేణా నీటి లభ్యత తగ్గి పోతున్నదని ఏటా 400 టియంసిలు మాత్రమే శ్రీ శైలంలో లభ్యమౌతాయని గణాంకాలతో సహా తేల్చారు.

కృష్ణ లో నీటి లభ్యత తగ్గిపోతోందని రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.
వాస్తవం ఇదైతే శ్రీ శైలం ఎగువ భాగంలో అటు తెలంగాణ గాని ఇటు ఆంధ్ర ప్రదేశ్ గాని జల దోపిడీ సాగించే పరిస్థితి లేదు. కాకుంటే ఎపి కన్నా తెలంగాణ 11 వ షెడ్యూల్ లోలేని ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించుతోంది.

ఇంతకీ కృష్ణ లో నీటి లభ్యత ఎంత? గణాంకాలు పరిశీలిస్తే నిజంగా నీళ్ల కోసం పోట్లాట కాదని అవగతమౌతుంది. కర్నాటక ఆల్మట్టి రిజర్వాయర్ నిర్మించిన తర్వాత రెండు రకాలుగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఒకటి. క్రమేణా నీటి లభ్యత తగ్గి పోతోంది. రెండు. జూలై ఆగస్టు మాసాలకు గాని వరద రావడం లేదు. 2002-03 నుండి 2019-20 మధ్య కాలంలో ఏడేళ్లల్లో మాత్రమే శ్రీ శైలం జలాశయానికి 811 టియంసిల నీరు చేరింది. 11 ఏళ్లలో ఎన్నడూ ఆ మేరకు వరద రాలేదు.

ఈ గణాంకాలు దృష్టిలో పెట్టుకొనే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీర్లు. శ్రీ శైలం వద్ద సరాసరి 400 టియంసిలు లభ్యమౌతాయని లెక్కలేశారు. ఈ రోజు శ్రీ శైలం ఎగువ భాగంలోనే కెసిఆర్ ఏకంగా 400 టియంసిలకు టెండర్ పెట్టారంటే నీళ్ల కోసమేనా? . నికర జలాలు మినహాయించగా 11 వ షెడ్యూల్ లో 77 టియంసిల సామర్థ్యంతో వున్న మూడు ప్రాజెక్టులను 120 టియంసిలకు పెంచారు. దీనికి తోడు పాత ప్రాజెక్టుల పేరుతో రెండు పథకాలకు 120 టియంసిలు పైగా ప్రస్తుతం 170 టియంసిలతో కొత్త ప్రాజెక్టులు వెరసి దాదాపు 400 టియంసిలు శ్రీ శైలం ఎగువ భాగంలో కెసిఆర్ డిమాండ్ చేస్తున్నారు.
ఇదెట్లా సాధ్యం

బచావత్ ట్రిబ్యునల్ కూడా1969 నాటికి నిర్మాణంలో వున్న ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొని 75 శాతం నీటి లభ్యత కింద 2130 టియంసిల నీటిని బేసిన్ లోని అన్ని రాష్ట్రాల మధ్య పంపకం చేసింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు పునరుత్పత్తి కింద లభ్యమయ్యే 11 టియంసిలు కలిపి మొత్తం 811 టియంసిలు కేటాయించింది.

బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఆమలులోనికి వచ్చే వరకు ఇరు రాష్ట్రాలు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు విధిగా అమలు చేయ వలసినదే. ఒక వేళ కెసిఆర్ కోరుతున్నట్లు 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు తిరిగి విచారణ జరిగినా అప్పటి వరకు కూడా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు రెండు రాష్ట్రాలు అమలు చేయాలి. బచావత్ కేటాయింపులు మేరకు ఆంధ ప్రదేశ్ కు 512 టియంసిలు తెలంగాణ కు 299.99 టియంసిలుగా వున్నాయి.

తెలంగాణకు మైనర్ ఇరిగేషన్ కింద 89.16 టియంసిలు ఎపికి 22.97 టియంసిలు ఇచ్చింది. సాగర్ కుడి కాలువకు 132 టియంసిలు ఎడమ కాలువ కు 132 టియంసిల వుండగా ఎడమ కాలువలో తెలంగాణ కు 99.75 ఎపికి 32.25 టియంసిల వున్నాయి. కృష్ణ డెల్టాకు 181.20 టియంసిలు కేటాయించి సాగర్ నుండి ప్రకాశం బ్యారేజీ వరకు లభ్యమయ్యే నీరు పోగా మిగిలిన నీటిని సాగర్ నుండి విడుదల చేయాలని చెప్పింది. అయితే డెల్టా ఆధునీకరణతో లభ్యమైన 29 టియంసిల్లో 20 టియంసిలు తెలంగాణలోని భీమాకు మిగిలిన 9 టియంసిలు పులిచింతలకు కేటాయించబడింది. కేటాయింపుల్లో ఇంత స్పష్టత వుంటే కెసిఆర్ పులిచింతల నుండి కాలువ తవ్వుతానని చెప్పడంలో ఔచిత్యం వుందా? కృష్ణ డెల్టాలో మిగిలిన నీటిలో 20 టియంసిలు భీమాకు ఇచ్చారు. ఇవి ఇవ్వబోమని ఎదుటి వారు మొండిగా వాదించే పరిస్థితి కెసిఆర్ స్వయంగా కల్పిస్తున్నారు.

శ్రీ శైలం ఎగువ భాగంలో కూడా ఎవరి వాటా ఎంతో బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. . జూరాల కు 17.9 టియంసిలు భీమాకు 20 టియంసిలు మొత్తం 37.9 టియంసిలు తెలంగాణ కు నికర జలాలు వున్నాయి. జూరాల నుండే మిగులు జలాల ఆధారంగా గల నెట్టెంపాడుకు 22 టియంసిలు(11 వ షెడ్యూల్ లో వుంది)భీమాకు గల నికర జలాలు 20 టియంసిలు తీసుకోవలసి వుంది.

శ్రీ శైలం ఎగువ భాగంలో తుంగభద్ర సబ్ బేసిన్ లో ఎపికి చెంది ఎగువ కాలువ కు 32.50 టియంసిలు దిగువ కాలువకు 29.50 టియంసిలు కెసి కెనాల్ కు తుంగభద్ర జలాశయం నుండి పది టిఎంసిలు జలాశయం కింది భాగం నుండి సుంకేసుల బ్యారేజీ వరకు గల వర్ష పాతం నుండి 29.50 టియంసిలు భైరవానితిప్పకు( తుంగభద్ర ఉపనది వేదవతి) 4.90 టియంసిలు అతి స్పష్టంగా కేటాయింపులు వున్నాయి. దురదృష్టమేమంటే కేటాయింపులు ఘనం. నీళ్లు మాత్రం శూన్యం. పైగా సుంకేసుల బ్యారేజీ నుండి కేవలం 31 టియంసిలు మాత్రమే కృష్ణ లోనికి వెళ్ల వలసి ఉంది . కాని ఏటా 150 నుండి 200 టియంసిలు కృష్ణలో కలుస్తున్నాయి. ఈ జలాల గురించే సీమ వాసులు తమ నీళ్లు కాజేస్తున్నారని ఆరోపించుతున్నారు. కాగా పునరుత్పత్తి కింద లభించిన 11 టియంసిలతో పాటు కెసి కెనాల్ ఆధునీకరణ ద్వారా లభించిన 8 టియంసిలతో మొత్తం 19 టియంసిలు శ్రీ శైలం కుడి కాలువకు లభించింది.

ఈ గణాంకాలు పరిశీలించితే కోస్తా ఆంధ్రకు 367.39 టియంసిలు రాయలసీమ కు 144.70 టియంసిలు తెలంగాణకు 299.99 టియంసిలు నీటి కేటాయింపులు ఇప్పుడు అమలులో వున్నాయి. ఒక వేళ నికర జలాలకు మించి అధికంగా వచ్చే నీటిని ముందుగా 11 షెడ్యూల్ లో వున్న ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో వినియోగించుకోవడం సహజ న్యాయ సూత్రం ఎందుకంటే మిగులు జలాల ఆధారంగా ఇవి ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టారు. లేదా మిగులు జలాలతో పాటు వరద జలాలను ఆయా రాష్ట్రాలు తమ ఇష్టం మేరకు వాడుకోవచ్చు.

వాస్తవం ఇది కాగా సుంకేసుల ఎగువ భాగంలో తెలంగాణ చడీ చప్పుడు లేకుండా ఈ పాటికే తుమ్మిల్ల ఎత్తిపోతల పథకం నిర్మించింది. తాజాగా మరొక ఎత్తిపోతల పథకం ప్రారంభించుతామని కెసిఆర్ చెప్పారు. ఎవరికి వారు ఇలా పథకాలు నిర్మించుకుంటూ పోతే ఈ దేశంలో అమలులో వున్న ట్రిబ్యునల్ తీర్పులు ఇతర చట్ట నిబంధనలు ఏం కాను? సమాఖ్య వ్యవస్థను కాపాడాల్సిన కేంద్రం మరింత ఆజ్యం పోస్తోంది మరో విశేషమేమంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణ లో లేని నీళ్ల కోసం పోట్లాడుతున్నారు. కాని మున్ముందు ఎగువ నుండి రానున్న ప్రమాదం పట్టించుకోవడం లేదు.

రేపు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోనికి వస్తే సరాసరి నీటి లభ్యత (మిగులు జలాలు) కింద ఇప్పటి వరకు ఉమ్మడి ఎపికి దక్కుతుండిన 285 టియంసిలు హుష్ కాకి అవుతాయి. పైగా ఆల్మట్టి లో అదనంగా 130 టియంసిలు నిల్వ చేసుకొనే అవకాశముంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై కాకున్నా ఇందుకు కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చిందంటున్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో పెడుతోంది. ఆల్మట్టి ఎత్తు 525 మీటర్లకు పెంచే అవకాశం ఉంది. తుంగభద్ర ఎగువున మరొక 30 టియంసిలను బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కర్నాటక కు కేటాయించి వుంది.

బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై కాకున్నా ఆల్మట్టి లో 130 టియంసిల నిల్వకు ప్రయత్నాలు సాగు తున్నా అటు కర్నాటకను గాని ఇటు అనుమతి ఇచ్చిన కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేని కెసిఆర్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఆర్డీయస్ కు కేటాయించిన నాలుగు టిఎంసిల కోసం అడ్డుపడుతున్నారంటే నిజంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమేనా? అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వివిధానాల గురించి పల్లెత్తు మాట అనడం లేదు.

గమనార్హమైన అంశమేమంటే విభజన చట్టం సెక్షన్ 89 మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టిన ప్రారంభంలో 11 షెడ్యూల్ లో వున్న తెలంగాణ కు చెందిన నెట్టెంపాడు కల్వకుర్తి శ్రీ శైలం ఎడమ కాలువ ఆంధ్ర ప్రదేశ్ కు చెంది హంద్రీనీవా గాలేరు నగరి వెలుగొండ తెలుగు గంగ ప్రాజెక్టులకు (అప్పట్లో దాదాపు 275 టియంసిలు) నీటి కేటాయింపులకు రెండు రాష్ట్రాలు తమ డిమాండ్లను ట్రిబ్యునల్ ముందు వుంచాయి. కాని ట్రిబ్యునల్ నిరాకరించింది. ఎందుకంటే కృష్ణ నదిలో పంచేందుకు క్యారీ ఓవర్ కింద వున్న 150 టియంసిలు తప్ప మిగిలి లేవని తిరస్కరించింది. తుదకు పదేపదే అభ్యర్థతో అంగీకరించింది. వాస్తవం పరిస్థితి ఇది – కాగా లేని నీళ్ల కోసం ఇరువురు రచ్చకెక్కారు

పోనీ కేంద్ర ప్రభుత్వమూ చట్ట పరంగా వ్యవహరించడం లేదు. రాష్ట్రాల మధ్య తగాదా పెంచే దిశగా వుంది . గత అక్టోబర్ లో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగాదాలు పరిష్కారం కాలేదు గాని మరింతగా అగ్గి రాజేయ బడింది. తెలంగాణ ఫిర్యాదు చేసిందని పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు నిలుపుదల చేయమని ఎపిని కోరిన యాజమాన్య బోర్డు గత అక్టోబర్ లో అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సాంకేతిక అనుమతులు లేకుండా నిర్మాణంలో వున్న రెండు రాష్ట్రాలకు చెందిన పథకాలు నిర్మాణం నిలుపుదల చేయాలని వెంటనే డిపిఆర్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు.

పాలమూరు రంగారెడ్డి దిండి పథకాలు ఈ జాబితాలో వున్నా కేంద్రం పట్టించుకోలేదు. ఇక్కడ ఆసక్తి కరమైన ట్విస్ట్ ఏమంటే పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులపై తెలంగాణ వివిధ కోర్టుల మెట్లెక్కినట్లే కేంద్ర జల వనరుల శాఖ ఆదేశాలు ఆధారం చేసుకొని పాలమూరు రంగారెడ్డి దిండి పథకాలపై ఆంధ ప్రదేశ్ కోర్టుల తలుపులు తట్టి వుంటే రాయలసీమకు ఈ దుస్థితి ఏర్పడేది కాదు. ఇప్పుడు వార్ వన్ సైడ్ గా సాగుతున్నా ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇరువురు ముఖ్యమంత్రులు సామరస్యానికి లాకు లెత్తాలి. .

(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)

One thought on “‘స్వార్థం కోసం ముఖ్యమంత్రులు ప్రజా ప్రయోజనాలు బలి చేస్తున్నారు!’

  1. గతంలో 2 టిఎంసిలు ఎక్కువగా వాడుకున్నారని ఎపి వాటాలో కట్ చేసిన కృష్ణా బోర్డు మొండిగా విద్యుత్ ఉత్పత్తికోసం నీళ్ళు వాడుకుంటున్న తెలంగాణ ను కట్టడి చేయగలదు కదా..హుజూరాబాద్ ఎన్నికలు, కాళేశ్వరం కు ఎక్కువ విద్యుత్ ఆవశ్యకత వంటి లక్షాలతో ముందుకువెళ్తున్న కేసీఆర్ తో చర్చలు ఏ విధంగా ఫలితాలు ఇస్తాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *