కోవిడ్ కు వ్యాక్సిన్ మూడో డోస్‌ అవసరమా?: బ్రిటన్ లో రీసెర్చ్ ప్రారంభం

కరోనాకు ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్‌లలో ఎక్కువగా రెండు డోసుల రకానివే. మన దేశంలో ప్రధానంగా ఇస్తున్న కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండూ రెండు డోసులవే. మరి కోవిడ్ నుంచి రక్షణకు ఈ రకమైన వ్యాక్సిన్లు రెండు డోసులు సరిపోతాయా, లేక మూడో డోస్ ఇవ్వాలా అనేదానిపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. విశేషమేమిటంటే  ఈ క్లినికల్ పరీక్షలకు నాయకత్వం వహిస్తున్నది భారతీయ సంతతి కి చెందిన డాక్టర్. ఆయన పేరు డా. దినేష్ సరలాయ.

బ్రిటన్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ అనే వైద్యసంస్థలో జరుగుతున్న ఈ పరిశోధనలలో భాగంగా, అదే సంస్థలో పనిచేసే వైద్యుడు, వైద్యకళాశాల ప్రొఫెసర్ అయిన డాక్టర్ అలెక్స్ బ్రౌన్‌కు ఈ మూడో డోస్ ఇచ్చారు.  ప్రపంచంలో మూడో డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఆయనే.

కోవిడ్ నుంచి రక్షణలో ఈ మూడో డోస్ వలన ఎలాంటి ప్రభావం ఉంటుంది, మూడో డోస్ అవసరమా, లేదా అనేది ఈయనపై చేసే పరిశోధనలద్వారా తెలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులకు ఈయన శరీరంలో కలిగే మార్పులు ఎంతో కీలకం కానున్నాయి. ప్రాథమిక ఫలితాలు సెప్టెంబర్‌లో వస్తాయని బ్రాడ్‌ఫోర్డ్ టీచింగ్ హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.

ఇలాంటి కీలకమైన పరిశోధనకు ఉపయోగపడుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇది తనకు గౌరవంగా భావిస్తున్నానని బ్రౌన్ చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్ అయిన ఈయనకు కరోనా మొదటి వేవ్‌లో వ్యాధిసోకి దాదాపు మృత్యువు అంచులదాకా వెళ్ళివచ్చారు. ఇంతకు ముందు సైన్యంలో పనిచేసిన బ్రౌన్, బ్రిటన్‌లో ఆర్థికంగా వెనకబడుతున్నవర్గాలలోని పిల్లలు వైద్య విద్యను అభ్యసించేందుకు ప్రోత్సహించే ఒక సేవా కార్యక్రమంకూడా నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *