తిరుపతి సమీపాన గంటా మండ‌పం, నామాల‌ గ‌వికి ట్రెక్

(రాఘ‌వ‌శ‌ర్మ‌)

తిరుమ‌ల కొండకు ద‌క్షిణ‌ అంచులో ఒంట‌రిగా  గంటా మండ‌పం!  వాయువ్య అంచులో  బావురుమంటున్న‌ నామాల‌గ‌వి! ఈ రెండూ అనేక ప్ర‌కృతి విప‌త్తుల‌కు త‌ట్టుకున్న‌వే. శ‌తాబ్దాల‌ పాటు  తిరుమ‌ల ఆల‌యంతో పెన‌వేసుకున్న‌వే.

ఈ మండ‌పంలో గంట మోగితే చంద్ర‌గిరి కోట‌లో విజ‌య‌గ‌న‌ర చ‌క్ర‌వ‌ర్తి భోజ‌నానికి ఉప‌క్ర‌మించే వాడు. ఈ  గుహ‌ల నుంచి తిరు చూర్ణం తీసుకెళ్ళి శ్రీ‌వారికి నామాలు దిద్దేవారు. ఇప్పుడు వీటినెవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

అప్పుడ‌ప్పుడూ   ప్ర‌కృతి ప్రియులు చుట్ట‌పు చూపుగా వ‌చ్చి పోతుంటారు. ఎప్పుడో రెండు ద‌శాబ్దాల  క్రితం ఈ రెండింటినీ ద‌ర్శించాం. మ‌ళ్ళీ  ఇప్పుడు, ఈ ఆదివారం పాతిక‌ మందితో క‌లిసి తిరుమ‌ల కొండ‌ల్లో  ఇలా తిరుగాడాం. సుబ్బ‌రాయ‌ుడు  ఉండ‌గా కొండ‌లు, కోన‌లు, వాటి దారులు, దిక్కులు ఒక లెక్కా! శేషాచలం కొండ ల సామ్రాట్టు .

ట్రెకింగ్ అంటే చాలు, ఏడుప‌దులు దాటిన భూమ‌న్ ‘ సిరికిం జెప్ప‌డు … ‘ లా బ‌య‌లు దేరుతారు (మధ్యలో ఎర్ర టీ షర్ట్ ధరంచిన వ్యక్తి).

అడవిలో సాగుతున్న ట్రెకర్స్

 

వాతావ‌ర‌ణం ఆహ్లాద కరంగా ఉంది. ఎంత న‌డిచినా అలుపు సొలుపు లేదు. నింగి నంతా మ‌బ్బులు క‌మ్మాయి. మాతో పాటే మేఘాలూ  క‌దులుతున్నాయి. అడ‌విలో చెట్ట‌న్నీ రాత్రి ఆకాశం ష‌వ‌ర్ కింద స్నానం చేసిన‌ట్టున్నాయి!


తిరుప‌తి జ్ఞాప‌కాలు -36


అందుకే అవి దుమ్ము ధూళి లేకుండా  ప‌చ్చ‌గా, స్వ‌చ్ఛంగా కళ కళ లాడుతూ ఉన్నాయి! అలిపిరి న‌డ‌క‌దారి నుంచి  మొద‌టి ఘాట్ రోడ్డును క‌లిపే ప్రాంతం అది. అక్క‌డే న‌ర‌సింహ‌స్వామి దేవాల‌యం. ఘాట్ రోడ్డు మార్గం నిర్మించ‌క‌ ముందు ఇక్క‌డి నుంచే పురాత‌న‌మైన న‌డ‌క‌దారి సాగేది.

ఆ మార్గాన్ని పున‌రుద్ధ‌రించి, అన్న‌మ‌య్య మార్గ‌మ‌ని నామ‌క‌ర‌ణం చేశారు. మెట్లు నిర్మించినా, ఎవ‌రూ  వెళ్ళ‌డం లేదు. అంతా అవ్వాచారి కోన ముందున్న ఘాట్ లోనే  నడుస్తున్నారు.

ఆ మెట్ల‌ దారిలోనే ఉత్త‌ర‌ దిశ‌గా కొంత దూరం న‌డిచాం. మెట్ల‌ పైన విరిగిప‌డిన చెట్లు. ఎవరూ ఇటీవల న‌డిచిన ఆన‌వాళ్ళు లేవు. మెట్ల నిండా ఎండిన ఆకులు.

అక్క‌డి నుంచి ప‌డ‌మ‌ర‌ దిశ‌గా అడ‌విలోకి మ‌ళ్ళాం. ఆ కొండ అంచులంతా అర్ధ చంద్రాకారంలో ఒక చుట్టు చుట్టిన‌ట్టు మా న‌డ‌క సాగింది. రెండు ద‌శాబ్దాల క్రితం వెళ్ళిన‌ప్పుడు ఆ ప్రాంత‌మంతా రాళ్ళు  ర‌ప్ప‌ల‌తో  నిండి ఉండేది.

దారి పొడవునా ఏపుగా పెరిగిన బిల్లి చెట్లు

టీటీడీ అట‌వీ శాఖ నాటిన బిల్లి చెట్లు ద‌ట్టంగా పెరిగి, ఆకాశానికి ఎగ‌బాకాయి.వేరే మొక్క‌ల మ‌ధ్య పొట్ల చెట్టు బ‌త‌క‌దు. ‘పొట్ల చెట్టుకు పొరుగు గిట్ట‌దు’ బిల్లి చెట్ల‌కు కూడా పొరుగు గిట్ట‌దు. బిల్లి చెట్ల‌ కింద గ‌డ్డి కూడా మొల‌వ‌ నివ్వదు. వ‌ర్ష‌పునీళ్ళు  భూమిలోకి ఇంకవు. అది ఏ మొక్క‌నీ బ‌త‌క‌నివ్వ‌దు.

నేలంతా బిల్లి చెట్ల ఆకులు ప‌రుచుకుని  ఉన్నాయి.ఏళ్ళ త‌ర‌బ‌డి  రాలిన‌ బిల్లి ఆకులు నేల‌ను బూరుగ‌ దూది ప‌రుపులాగా  మెత్తగా తయారు చేశాయి. అడుగు వేస్తుంటే  గాలిలో తేలుతున్న‌ట్టుంది. ఎంత న‌డిచినా అలుపు రానీయ‌డం లేదు!

నేల‌పైన రాలిన బిల్లి ఆకులకు నిప్పంటుకుంటే చాలు, అవి ఒక ప‌ట్టాన ఆర‌వు. ఎంత ఆర్పినా, ఎక్క‌డో ఒక చోట దాగిన నిప్పు రవ్వ
మ‌ళ్ళీ రాజుకుంటుంది. నిజానికి అడవి లో ఇలాంటి చెట్లు పెంచ‌కూడ‌దు.

ఈ చెట్ల‌ను కొట్టేసి పండ్ల చెట్లు పెంచితే ఎంత బాగుంటుంది! మామిడి, జామ‌, స‌పోట‌, బాదం వంటి చెట్లు నాటితే జంతువుల‌కు ఆహారంగా కూడా ప‌నికి వ‌స్తాయి.

ఎదురుగా అల్లంత దూరంలో మోకాలి మిట్ట‌. కుడి ప‌క్క మెలికలు తిరిగిన మొద‌టి ఘాట్‌రోడ్డు. ఎడ‌మ ప‌క్క రెండ‌వ ఘాటు రోడ్డు మెలిక‌లు. అర్ధ చంద్రాకారంలో కొండ అంచుల నుంచి  అలా ముందుకు సాగాం. అదిగో అల్లంత దూరాన స‌న్న‌గా క‌నిపిస్తున్న‌ శ్రీ‌వారి మెట్టు దారి.

అక్క‌డ‌క్క‌డా  నేరేడు ప‌ళ్ళ‌ను పోలిన మోగి ప‌ళ్ళ‌చెట్లు. వెన‌క‌టిరోజుల్లో ఆకులు తిని  బ‌తికార‌ని చెప్పుకోవ‌డానికి ఆన‌వాళ్ళుగా అల్లి చెట్లు. మారేడు చెట్లు, గాయాల‌కు వాడే బంజ‌రు ఆకు మొక్క‌లు. ఓహ్‌..శేషాచ‌లం కొండ‌లు వ‌న‌మూలిక‌ల నిల‌యాలు!

లోయలోకి సునాయాసంగా దిగుతున్న 75 సంవత్సరాల కుర్ర భూమన్

ఎదురుగా ఒక వింతైన పెద్ద బండ‌రాయి. ఆ రాతికి  క‌న్నులాగా, ఒక పెద్ద రంద్రం! దాని ప‌క్క‌నే మూసుకుపోయిన కన్ను లా మ‌రొక రంద్రం. ఈ ప్రాంత‌మంతా స‌ముద్ర గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు, నీటి ఒరిపిడికి ఏర్ప‌డిన రూపాలు. వింత వింత రూపాల‌లో అనేక శిల‌లు!

ఇలా వింత శిలలు

కొండ కొస‌కు చేరాం. అక్క‌డి నుంచి లోతైన లోయ‌లోకి. రివ్వున వీస్తున్న గాలి. ఆ గాలికి చెట్లు త‌ల లు విర‌బోసుకుని వ‌ర‌గ‌బ‌డిన‌వ్వుతున్న‌ట్టు గా ఉన్నాయి.

ఇక్కడ లోయలోకి దిగడం మొదలవుతుంది

లోయ‌లోకి  ఏట‌వాలుగా ఒక్కొక్కరం  దిగుతున్నాం. ఒక ప‌క్క కొండ‌, మ‌రొక ప‌క్క లోయ‌. ఎదురుగా  ఏనుగు కొండ‌. ఏనుగు వెనుక భాగాన్ని పోలి ఉంటుంది. రెండ‌వ ఘాట్ రోడ్డులో స‌గం దూరం వ‌చ్చాక త‌లెత్తి చూస్తే ఈ ఏనుగు కొండ క‌నిపిస్తుంది. చెట్ల కొమ్మ‌లు పుచ్చుకుని, రాళ్ళ‌ను ప‌ట్టుకుని  లోయ‌లోకి దిగుతున్నాం. ఏ మాత్రం ప‌ ట్టు త‌ప్పిందా,ఇహ అంతే..! తిరుమ‌ల కొండ‌కు అది ప‌శ్చిమ అంచు.

పక్క పక్క నే రెండు గుహ‌లు నోళ్ళు తెరుచుకున్నాయి. లోప‌లంతా చిమ్మ‌చీక‌టి. మొద‌టి గుహ ముందు రాళ్ళ పొయ్యి, ప్లాస్టిక్ క‌వ‌ర్లు, ఉప్పు పాకెట్లు! వంట‌లు చేసుకున్న ఆన‌వాళ్ళు. అస‌లు ఇంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రాంతానికి ఎవ‌రొచ్చి ఉంటారు!?

బ‌హుశా ఇది ఎర్ర‌చంద‌నం  స్మ‌గ్ల‌ర్ల ఆవాస‌మై ఉండ‌వ‌చ్చు? రెండ‌వ గుహ‌లో పెద్ద నీటి త‌టాకం. నీళ్ళు ఎంత స్వ‌చ్ఛంగా ఉన్నాయో!

లోనికి అడుగుపెట్ట‌గానే గ‌బ్బిలాల గుంపు ఒక్క‌సారిగా లేచాయి. ట‌ప‌ట‌పామంటూ రెక్క‌ల‌ల్లారుస్తూ బైటికొచ్చేశాయి. మేం వెళ్ళే వ‌ర‌కు పాపం ఆ గ‌బ్బిలాలు గుహ‌క‌ప్పుకు  త‌ల కిందుల వేలాడి నిద్రిస్తున్నాయి. ఈ గుహ‌లో తెలుసు, ఎరుపు, ప‌సుపు రంగుల్లో మూడు మ‌ట్టిపొర‌లు.

అర్ధ‌శ‌తాబ్దం క్రితం వ‌ర‌కు ఇక్క‌డి నుంచే శ్రీ‌వారికి నామం, తిరుచూర్ణం తీసుకు వెళ్ళే వారు. ఇవి స‌హ‌జ సిద్ధంగా ఏర్ప‌డిన గుహ‌లు కావు. తిరుచూర్ణం, నామం కోసం త‌వ్వినవి. ఈ జంట‌ గుహ‌ల‌నే ‘నామాల‌గ‌వి’ అంటారు.

ఇక్క‌డి మ‌ట్టిని ఇప్పుడు వాడ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ గుహ‌లు మ‌రుగున ప‌డిపోయాయి. ఈ జంట గుహ‌ల‌నుంచి నైరుతి దిశ‌గా చూస్తే దూరంగా శ్రీ‌వారి మెట్ల‌దారి. మ‌రింత దూరంగా స్వ‌ర్ణ‌ముఖి, క‌ళ్యాణి న‌దులు సంగ‌మించే ముక్కోటి.

మ‌ళ్ళీ వెనుతిరిగి, లోయ ఎక్కాం. కొండ అంచునే గంటామండ‌పం దిశ‌గా  మాప్ర‌యాణం.అక్క‌డంతా ఈత‌చెట్లు. అక్క‌డ‌క్క‌డా పండిన ఈత‌ప‌ళ్ళు. ఎలుగుబంట్లు తిరిగిన ఆన‌వాళ్ళు. ఈత‌ ప‌ళ్ళంటే వాటికి ఎంత ఇష్ట‌మో! అక్క‌డ‌క్క‌డా ప‌డిఉన్న దుప్పుల ఎముక‌లు.

దుప్పులు, జింక‌లు, ఎలుగు బంట్లు మట్టి లో ప‌డిపొర్లాడిన ఆన‌వాళ్ళు. బంతి జెముడు చెట్లు. ఎదురుగా నెమ‌లిగుంట‌. వ‌ర్షాల‌కు ఈ  గుంట‌లో నీళ్ళు నిల‌బ‌డేవి. నీటి కోసం నెమ‌ళ్ళు ఎక్కువ‌గా రావ‌డం వ‌ల్ల దీనికి ఆ పేరు వ‌చ్చింది.

ఎదురుగా అట‌వీ శాఖ రాళ్ళను పేర్చి నిర్మించిన పొడ‌వాటి రాతి గోడ‌.ఒక ప్రాంతంలో మంట‌లు అంటుకుంటే, అవి మ‌రో ప్రాంతానికి పాక‌కుండా ఈ గోడ కాపాడుతుంది. దీనిని ‘ ఫైర్ సేప్టీవాల్ ‘అంటారు. ఈ గోడ అట‌వీ శాఖ‌కు, టీటీడీ అట‌వీ శాఖ‌కు ఒక స‌రిహ‌ద్దు.

ఈ గోడ వెంటే న‌డుచుకుంటూ ముందుకు సాగాం. కొంత దూరం వెళ్ళాక గోడ దాటుకుని ద‌క్షిణ దిశ‌గా న‌డ‌క మొద‌లైంది. ఒక పెద్ద బీఎస్ఎన్ ఎల్ బోర్డు. ట‌వ‌ర్స్ రాక‌ముందు ఈ బోర్డు ద్వారానే టెలికాం సేవ‌లు అందేవి. ఇప్పుడిది నిరుప‌యోగ‌మే.  ఈ ప్రాంతాన్ని నీలాద్రి ప్రాంతం అంటారు.

 

గంటా మండపం నుంచి చూస్తే దూరంగా తిరుపతి నగరం

ఈ బోర్డు ప‌క్క‌నే అయిదు శ‌తాబ్దాల నాటి గంటామండ‌పం. ఇక్క‌డ‌ గంట లేదు కానీ, రాతి మండ‌పం మాత్రం  మిగిలి ఉంది. ఇప్పుడీ  గంట ఎక్క‌డున్న‌ద‌నేది ప్ర‌శ్న‌. ఆల‌యంలోనే ఉన్న‌ద‌నేది ఒక వాద‌న‌. విజ‌య‌గ‌న‌ర చ‌క్ర‌వ‌ర్తుల కాలంలో నిర్మించిన మండ‌పం ఇది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నైవేద్యం అవ్వ‌గానే గంట మోగించేవారు.

అది ఈ గంటామండ‌పం వ‌ర‌కు వినిపించేది. మ‌ళ్ళీ ఇక్కడ గంట మోగిస్తే,  అది చంద్ర‌గిరి కోట ప‌క్క‌నే ఉన్న ‘ఉరికొయ్య ‘ ద‌గ్గ‌ర వినిపించేది. నిజానికి అది ఉరికొయ్య కాదు. అది కూడా గంటామండ‌ప‌మే. అక్క‌డ గంట మోగిస్తే చంద్ర‌గిరి రాజ‌మ‌హ‌ల్‌లోకి వినిపించేది. ఆ గంట‌ను విని విజ‌య‌గ‌న‌ర చ‌క్ర‌వ‌ర్తులు భోజ‌నానికి ఉప‌క్ర‌మించేవారు.  దీర్ఘ చ‌తుర‌స్రాకారంగా ఉన్న‌పెద్ద పెద్ద బండ‌రాళ్ళ‌తో, చ‌తుర‌స్రాకారంలో పునాదిలాగా నిర్మించారు. ఆ పునాది రాళ్ళ‌పైన రాతి స్తంభాల‌ను నిల‌బెట్టారు.

అక్కడ వీచే చల్లటి గాలిలో ఇలా సేద తీరడం అద్భుతమయిన అనుభవం

ఈ రాతి  స్తంభాల‌ను ఏ మాత్రం భూమిలో పాతి పెట్ట‌లేదు. దానిపైన రాతి బండ‌ల‌తో క‌ప్పు వేశారు. ఏమాత్రం పునాదిలేకుండా, కేవ‌లం రాళ్ళ పైన నిల‌బెట్టిన ఈ మండ‌పం ఎలా నిల‌బ‌డింద‌నేది ప్ర‌శ్న! మండ‌పం మ‌ధ్య‌లో కూడా రాళ్ళ‌ను ప‌రిచారు.

కానీ, గుప్త నిధుల కోసం ఎవ‌రో మండ‌పం మ‌ధ్య‌లో త‌వ్వేశారు. ఈ మండపం ఎన్ని తుపానుల‌ను త‌ట్టుకుందో! ఎన్ని ప్ర‌కృతి భీభత్సాల‌కు ఎదురొడ్డి నిల‌బ‌డిందో! ప‌ద‌హార‌వ శ‌తాబ్దంలో నిర్మించిన ఈ మండ‌పం ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌కుండా ఉంది.

ఈ గంటా మండ‌పంలో విశ్ర‌మించాం. ఒక అనుభూతిని పొందాం. ఇక్క‌డంతా ఈత చెట్లు ద‌ట్టంగా మొలిచాయి. ఎలుగు బంట్లు తిరుగాడిన ఆన‌వాళ్ళు క‌నిపించాయి. గ‌త ఏడాది ఏనుగులు  ఈ నీలాద్రిలోనే విడిది చేశాయి.

కొండ  అంచుల‌కు వెళ్ళి చూస్తే, జూపార్కు, దూరంగా శ్రీ‌నివాస మంగాపురం.  ఈ మూల నుంచి ఆ మూలకు విస్త‌రించిన తిరుప‌తి నగరం. ఈ న‌గ‌రాన్ని ఇంత ఎత్తు నుంచి చూడ‌డం ఎంత ఆనందం! మ‌ళ్ళీ ఉత్త‌ర దిశ‌గాన‌డ‌క మొద‌లు పెట్టాం.

ఫైర్ సేఫ్టీ వాల్ ప‌క్క‌నుంచే తూర్పుదిశ‌గా మాన‌డ‌క సాగింది. మ‌ళ్ళీ అవే బిల్లిచెట్ల వ‌నం.  మెత్త‌టి ఆకుల పైనుంచి జారుతూ జారుతూ దిగువ‌కు హాయైన న‌డ‌క‌. కొంత దూరం న‌డిచేస‌రికి ఎర్ర‌మ‌ట్టి  దిబ్బ‌లొచ్చాయి.

ఇక్క‌డి నుంచే టీటీడీ అట‌వీ శాఖ వారు ఎర్ర‌మ‌ట్టిని త‌వ్వి మొక్కల కు పోసేవారు. ముందుకు సాగితే పచ్చని ప‌న‌స‌తోట వ‌చ్చింది. అక్క‌డ‌క్క‌డా ప‌క్వానికి రాని ప‌న‌స కాయ‌లు వేలాడుతున్నాయి.

ప‌న‌స‌తోట దాట‌గానే అన్న‌మ‌య్య మార్గం చేరుకున్నాం. ఉద‌యం ఎనిమిది గంట‌ల‌నుంచి, మ‌ద్యాహ్నం రెండు గంట‌ల‌వ‌ర‌కు మా వన యాత్ర. ఆరు గంటల పాటు మా అడ‌వి బాట సాగింది. ఒక అనుభూతిని  మిగిల్చింది.

(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు,తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *