రేవంత్ రెడ్డి తో కాంగ్రెస్ ‘తెలంగాణ వ్యూహం’ ఫలిస్తుందా?

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)

రేవంత్ రెడ్డి తెలంగాణ  పిసిసి అధ్యక్షుడిగా  ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ అంచనాలు తెలంగాణలో ఫలిస్తాయా ?రేవంత్ రెడ్డి కి పగ్గాలు ఇవ్వడం ద్వారా మల్కాజిగిరి తరహా సమీకరణాలు తెలంగాణ మొత్తం వస్తాయా ?

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని సుదీర్ఘ పరిశీలన తర్వాత ఎంపిక చేశారు. పలురకాల అంచనాలు ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రేవంత్ ను నియమించినట్లు తెలుస్తుంది.

విభజన తర్వాత మారిన తెలంగాణ రాజకీయ సమీకరణాలు…

2014 వరకు ఉన్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం విభజన తర్వాత పూర్తిగా మారిపోయింది. విభజన కారణంగా అప్పటివరకు కీలకపాత్ర పోషించిన తెలుగుదేశం పూర్తిగా దెబ్బతిన్నది.

తెరాస కీలక శక్తిగా అవతరించగా జగన్ పార్టీ కారణంగా ఏపీలో పూర్తిగా దెబ్బతిన్నా తెలంగాణలో స్వల్పంగా నష్టపోయి ప్రతిపక్ష పాత్రకు కాంగ్రెస్ పరిమితం అయినది. అదే సమయంలో చంద్రబాబుని , జగన్ ని అభిమానించే శ్రేణులు గణనీయంగా ఉన్నారు. వారితో రాజకీయాలు నడిపే స్థితిలో లేరు అన్నది కూడా అంతే నిజం.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ బలహీన పడగా కాంగ్రెస్ పార్టీని కూడా నామమాత్రంగా మార్చారు. కాంగ్రెస్ పనితీరు లోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేయడంతో జగన్ ను అభిమానించే శ్రేణులు తెలుగుదేశం మీద కోపంతో కేసీఆర్ వైపు మొగ్గు చూపారు.

ఈ పరిణామం తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పొషించేది బీజేపీ , కాంగ్రెస్ లో ఎవరు అన్న సందిగ్ధం నెలకొన్నది.

మల్కాజిగిరి ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ మీద ప్రభావం:

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీచేశారు. అనూహ్యంగా విజయం సాధించారు. ఇక్కడ గణనీయంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు రేవంత్ వైపు నిలిచారు అన్నది ఫలితాల సరళిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

సమీప భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అవకాశం లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని అభిమానించే వారు ఉన్నారు. రేవంత్ రెడ్డి , సితక్క ఇద్దరు పోరాటపటిమ కలిగి ఉండటం. చంద్రబాబు పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం వల్ల వారి పట్ల తెలుగుదేశం అభిమానులు సానుకూలంగా ఉంటారు.

రేవంత్ రెడ్డి ని అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ నియమిచడం వల్ల తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు అన్న అంచనాకి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది.

మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి వైపు తెలుగుదేశం శ్రేణులు మొగ్గు చూపినట్లు తెలంగాణ మొత్తం మీద ఉన్న తెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్ వైపు చూస్తే రేవంత్ రెడ్డి ఎంపిక ద్వారా కాంగ్రెసు వ్యూహం పలించినట్లే.

అదే సమయంలో రేవంత్ రెడ్డి ఎంపిక కారణంగా ఉత్పన్నమయ్యే ప్రతికూల పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు అనుకూల ముద్ర ఉన్న రేవంత్ కు పగ్గాలు అప్పగిస్తే వైయస్ ను ఆరాధించే అభిమానులు దూరం కారా ? కాంగ్రెస్ నుంచి జగన్ దూరం అయిన తర్వాత ఆ నష్టం వాటిల్లింది.

అంతే కాదు ఇప్పుడు షర్మిల తెలంగాణాలో పార్టీని ఏర్పాటు చేయడం వల్ల వైయస్ అభిమానులు అటు వైపు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఎవరిని అధ్యక్షుడిని చేసిన ఈ పరిస్థితి తప్పదు కనుక రేవంత్ ద్వారా వచ్చే అదనపు ప్రయోజనం ఎందుకు వదులు కోవాలి అన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు మరో లెక్క కూడా ఉన్నది కేసీఆర్ కు ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు అధికారానికి దూరం అయిన వైయస్ అభిమానుల కేవలం అభిమానం కారణంగా అధికారానికి దగ్గరయ్యే పార్టీని దూరం చేసుకోరు కనుక మనతో ఉంటారు అన్నది వారి లెక్క.

ఎలాగూ రేవంత్ కూడా అదే సామజిక వర్గం కావడం కూడా ఈ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ తెలంగాణలో కేసీఆర్ కి ప్రతికూల వాతావరణం , అదే ప్రాంతానికి చెందిన రేవంత్ ఎంపిక కారణంగా తెలుగుదేశం శ్రేణులు దగ్గర అయితే కాంగ్రెస్ అంచనాలు పలించినట్లే రాబోయే కాలంలో ఈ అంచనాలు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్నది చూడాలి.

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి,రాజకీయ విశ్లేషకులు
9490493436)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *