తియనన్మెన్ స్క్వేర్ సంఘటన: చరిత్ర “తిరగరాసిన” పుస్తకం

(యం. జయలక్ష్మి)

జూన్ 24, 1989 చైనా పార్టీ వందేళ్ళ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. నేటి చైనా నిలదొక్కుకోటానికి పునాదులు వేసిన రోజది.  తూర్పు యూరపులో, రష్యాలో లాగే చైనా ప్రభుత్వమూ, పార్టీ పతనమవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలు వమ్మయేట్టు చర్యలు తీసుకొన్న రోజు.

ఆ రోజున  ముగిసిన రెండు రోజుల విస్తృత ప్లీనరీ సమావేశంలో నాటి విద్యార్థి తిరుగుబాటుపై ప్రధాని, పోలిట్ బ్యూరో సభ్యుడు లీపెంగ్ నివేదికను చర్చించి ఆమోదించారు.

57మంది కేంద్ర నాయకులు పాల్గొని, ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రధానకార్యదర్శి జావోజియాంగుని అన్ని పదవులనుంచీ తొలగించారు. సంస్కరణల క్రమంలో “బూర్జువా లిబరలైజేషన్”ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడివుండాల్సిన నాలుగు మౌలిక సూత్రాలను పునరుద్ఘాటించారు.

అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంతృత్వం, మా.లె.మావో సిద్ధాంత నేతృత్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. ఈ సూత్రాలను కాదనేవారు కొందరు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపై దాడులను ఆర్గనైజు చేసారని;  ప్రజా చైనా, పార్టీల భవితవ్యాన్ని దెబ్బ తీయటానికి, సామ్రాజ్యవాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు కుట్ర స్వభావాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని బలపరిచి, ఆయనతో పాటు మరి కొద్దిమంది తీవ్రమైన తప్పుని చేసారని వివరించారు. 

1989జూన్4 నాడు “తియనన్మెన్ స్క్వేర్ లో పది వేల మంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని” ఒక విషప్రచారంతో  అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు తమ ఈ కుట్రను కప్పిపెట్టుకో జూసారు. “ స్క్వేర్ లో పది వేల మంది” కట్టుకధ అని, వాస్తవాలను బైటపెట్టారు.

ఆ తిరుగుబాటుని చైనా మరిచిపోయినా, అమెరికా, పశ్చిమదేశాలు, భారతీయమీడియా ఏటా జూన్ నెలలో గుర్తు చేస్తుంటాయి. ఈ ఏడు అంతగా చేయలేదు. కాగా చైనా పార్టీ చెప్పినదే మౌలికంగా సరైనదని చెప్పకనే చెప్పిన ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. దాని క్లుప్త పరిచయమే ఈ వ్యాస లక్ష్యం.

చైనా వ్యతిరేక దుమారాన్ని తిరిగి ప్రోత్సహిస్తున్న నేటి బైడెన్ యుగంలో నాటి చరిత్రని “తిరగరాసిన” పుస్తకం Tiananmen Square-The Making of a Protest — A Diplomat Looks Back. సాదాసీదా రచయిత కథనం కాదది: ఆనాడు చైనాలో ఇండియా దౌత్యవేత్తగా వుండిన చైనా నిపుణుడు, ప్రత్యక్షసాక్షి విజయ్ గోఖలే రాశారు.

 

ఈ మే నెలలో విడుదలైన 181పేజీల (399రూ. హార్పర్ కాలిన్స్) పుస్తకం దౌత్యప్రపంచంలో సంచలనం. ఆ తర్వాత భారత విదేశాంగశాఖ కార్యదర్శి అయిన గోఖలే కథనం విలువైనది; మరుగునపడిన అనేక వాస్తవాలను వెలికి తెచ్చినది అని గతంలో చైనాలో పనిచేసి, తర్వాత అదే పదవిని అలంకరించిన శ్యాంశరణ్, శివశంకరమీనన్ వంటివారు ప్రశంసించారు. ఎంతోకాలంగా బైటపెట్టాలనుకున్న విషయాలివి. కానీ “నేనున్న పరిస్థితులలో” కుదరలేదు’ –అని రాసారు గోఖలే. గతఏడాదే విదేశాంగ కార్యదర్శిగా రిటైరయ్యారు. ఆతర్వాతే “కుదిరింది”.

ఆ ఘటనల గురించిన పాశ్చాత్య కథనాన్ని మీ పుస్తకంలో సవాలు చేశారు. అది ఎందుకు అవసరమయ్యింది? అని టైమ్స్ ఆఫ్ ఇండియా (మే23) విదేశీ వ్యవహారాల నిపుణులు ప్రశ్నించారు. ఇరుపక్షాల మీడియా కూడా భావజాలపర పక్షపాతాలతో కూడివుంది. ఆ 50 రోజుల ఘటనలను నా సొంత  అనుభవంతో చూసాను. నిజంగా ఏం జరుగుతున్నది అని పరిశీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్తలను వండి వడ్డించారు; చైనా విద్యార్థుల్లో కొందరు కూడా అందులో భాగమయ్యారు. వారు చెప్పినవి పూర్తి వాస్తవాలు కావు; వారి ఆధారాలు (సోర్సెస్) ప్రశ్నించదగినవి అని నాకు స్వయంగా తెల్సిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అవన్నీ నా కళ్ళు తెరిపించాయి. ఈ మొత్తాన్ని పాశ్చాత్య మీడియా తమదైన “స్లాంట్”తో వక్రీకరించింది. అందుకే వీటిని బైటపెట్టాల్సిన అవసరముంది అని భావించాను అని ఆయన జవాబిచ్చారు. కరోనా గురించి చైనావ్యతిరేక పాశ్చాత్య దుమారం (భారతమీడియా దాన్నే యుద్ధోన్మాద మ్యూజిక్కుని జోడించి రిలే చేస్తుంటుంది: స్వంత విలేకరుల కథనాలు దాదాపు లేవని ఈ వ్యవహారాలు ఏకాస్త తెల్సినవారయినా ఇట్టే గ్రహించగలుగుతారు) సందర్భంలో చాలా ప్రాముఖ్యతగల మాటలివి.

అమెరికా రాజ్యం అంటే ప్రపంచవ్యాప్త దోపిడీదారు; లక్షలాది ప్రజలని, పసిపిల్లలని సైతం (ఇరాక్,సిరియా, ఆఫ్ఘనిస్తాన్) బలిగొన్న యుద్ధోన్మాదరాజ్యం; ప్రత్యేకించి నల్లవారిని అణగదొక్కిన జాత్యహంకార పోలీసువ్యవస్థ -ఇవన్నీ నేడు తెల్సినవే. ఆనాడు కాదు. వియత్నాంలో ఘోరమైనఓటమి (1975) తర్వాత అమెరికా మిలటరీ వెనక్కితగ్గిన కాలమది. 

చైనా విప్లవం, మావో విజయాలను అనుభవించడమేతప్ప, గతకాలపు అగచాట్ల, పోరాటాల లోతు తెలియని యువతరం వారి ఆందోళన అది. పాశ్చాత్య పెట్టుబడిదారీవిధానపు బూర్జువా ప్రజాస్వామ్యం బండారం తెలియని విద్యార్థులు వారు. 1970తర్వాత అమెరికాతో ప్రభుత్వపరంగా సంబంధాలు ఏర్పడి, ఇరుదేశాలూ హలో హలో అని పలకరించుకుంటున్న వాతావరణం. ఆ తర్వాత పుట్టి పెరిగిన విద్యార్థి తరంలో పాశ్చాత్యదేశాల స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వంల గురించిన పై పై అవగాహనే వుంది. “సంపూర్ణ పాశ్చాత్యీకరణ”ని, అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహ నమూనాని కూడా తలకెత్తుకున్నారు కొందరు చైనావిద్యార్థులు.

ఆ నేపథ్యంలో నాటి చైనా నాయకత్వంలో ఒక ఆందోళన మొదలైంది. “”ఎర్ర జన్యువు”ని తర్వాతి తరాలకి అందించాలి అని నేటి అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. నాడూనేడూ కూడా ఈ ‘రెడ్ జీన్’ — ఇదే కీలక సంకేతం — అన్నారు గోఖలే (టైమ్సులో). అభివృద్ధి, సంపదలు, సౌకర్యాలు, టెక్నాలజీలన్నీ కలిసి ‘రెడ్ జీన్’ని పలుచన చేసేస్తాయేమో అన్నది నాయకత్వపు ఆందోళన. ఆనాడు ఇవన్నీ ఈ స్థాయిలో లేకపోయినా, డెంగ్ లిబరల్ ఆర్థిక సంస్కరణలు మొదలై పదేళ్ళు దొర్లినాయి. విదేశీ, దేశీ పెట్టుబడిదారులను అనుమతిస్తూనే స్వతంత్ర ‘నవచైనా నిర్మాణ స్వప్నం’ మొదలైంది. “చైనా తరహా సోషలిజం” పేరిట అనుసరించిన వ్యూహం-ఎత్తుగడల పట్ల అవగాహనలో గందరగోళం నెలకొని వుంది, ముఖ్యంగా యువతరంలో; పార్టీకేడర్లో, నాయకత్వంలో కూడా వున్నది. ఆ నాటికే కొన్ని భ్రమలూ, అలజడులూ తలెత్తాయి. ఆ ప్రమాదాన్ని పసిగట్టే “బూర్జువా లిబరలైజేషన్’కి వ్యతిరేకంగా చైనా పార్టీ ఆనాడే (1987) ఒక ఉద్యమాన్ని నిర్వహించింది. ఎన్ని సంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల (Four cardinal Principles) చట్రానికి లోబడి మాత్రమే వుండాలని చైనాపార్టీ, ప్రభుత్వమూ ఆదేశిక సూత్రాలను ప్రకటించారు(పార్టీ 13వ మహాసభలో, 1987అక్టోబరు). సంస్కరణలక్రమంలో పెచ్చరిల్లిన “బూర్జువా లిబరలైజేషన్ ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడి వుండాల్సిన ఆ సూత్రాలను పునరుద్ఘాటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంతృత్వం, మా.లె. మావోసిద్ధాంత నేతృత్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. 

ఆ పరంపరలో వచ్చినవే తియనన్మెన్ స్క్వేర్ సంఘటనలు; హఠాత్తుగా వచ్చినవి కాదు.

ఆర్థిక సంస్కరణలతో ‘లిబరల్ చైనా’గా మారిపోతుందని పాశ్చాత్య దేశాలు భావించాయి. అది ‘మిస్ గైడెడ్’ పాశ్చాత్య ఊహ మాత్రమే అంటారు గోఖలే. 1989నుంచీ భారత విదేశాంగశాఖ, రాజకీయ నాయకత్వంకూడా దాన్ని విశ్వసించటం లేదు. ఆమాట పాశ్చాత్యులకు చెప్పాం కూడా. అయినా చైనా మార్కెటు, అక్కడ వస్తున్న లాభాలతో వారు మిన్నకుండి పోయారు అన్నారు గోఖలే(టైమ్స్).

“పాశ్చాత్యీకరించబడిన” ఆసియా అగ్రరాజ్యంగా చైనా వుండబోదు. దీన్ని భారతీయులు కూడా బాగా అర్థంచేసుకోవాలి. మనతో సరిహద్దుతగాదా చైనా కమ్యూనిస్టులు సృష్టించినది కాదు; అంతకు ముందటి “జాతీయ” చైనా, అమెరికా అనుకూల చియాంగ్ కై షేక్ కాలపు చైనా వైఖరీ ఇదే. వారెవ్వరూ మెక్ మహన్ లైనుని, సిక్కింని (దలైలామా కూడా 2008దాకా) గుర్తించలేదు అని ఎత్తిచూపారు గోఖలే. తైవాన్ నేటికీ గుర్తించదు.

ఆనాటి ఘటనల గురించి ఎన్నో కథనాలున్నాయి. భారత దృక్కోణం గల “విశిష్టమైన కాంట్రిబ్యూషన్ ఈ పుస్తకం” అని ప్రశంసించారు సి. ఉదయభాస్కర్; చైనా వ్యూహ వ్యవహారాల నిపుణుడు, వ్యాఖ్యాత ఆయన.

ఇప్పటిదాకా చెప్పని కథనాన్ని ఎంతో నచ్చచెప్పేరీతిలో, ఆచితూచి రాసిన (persuasive and precise) పుస్తకం అన్నారాయన. నేను కళ్ళారా చూసిన వాస్తవాలకు అన్వయంజోడించి, 30ఏళ్ళతర్వాత వెనక్కిచూసుకుంటే అర్థమయ్యే దృష్టితో (hind sight) రాసిన 10 అధ్యాయాల పుస్తకం అని చెప్పుకున్నారు గోఖలే.

ఆనాడు 500బిలియన్ డాలర్లున్న చైనా జీడీపీ నేడు 14000బిలియన్లకు చేరుకున్నది. చైనా ప్రజలు నేడు సంపన్నవంతులై, గర్వంతో తలఎత్తుకొని వున్నారు. డెంగ్ చూపెట్టిన, ఆతర్వాత నాయకులంతా అనుసరించిన మార్గంతో వారు ఈ స్థాయికి చేరారు. 1989తర్వాత నేటివరకూ అక్కడి యువతరం, విద్యార్థులు ఎన్నడూ నిరసన తెలిపే అవసరం రాలేదు. ఇప్పటి చైనామార్గం స్థానంలో “ప్రజాస్వామ్యం పేరిట మరోవ్యవస్థని కోరుకుంటారేమోనన్న సూచనలేవీ మెజారిటీప్రజల్లో కన్పించటంలేదు” అని నిర్ధారించారు గోఖలే ముగింపులో (ఉదయభాస్కర్). పాశ్చాత్యదేశాలకు తమ తప్పులను గుర్తించటానికి 30ఏళ్ళు పట్టింది అంటారు గోఖలే.

ఆనాటి కొందరు విద్యార్థినేతల సరుకు; చాటుగా భోజనాలుచేస్తూ నిరాహారదీక్షలు చేసినవారు; పాశ్చాత్యదేశాల, మీడియాల ఆకర్షణ గలవారు –వీరిగురించి పుస్తకంలో బైటపెట్టారు.నిజానికి నిరాహారదీక్షలు చేయరాదని విద్యార్థుల ఫెడరేషన్ తీర్మానించింది కూడా. అయినా ఒక నాయకుడు మీడియాముందు ఈ “డ్రామాను” మొదలుపెట్టాడు. విద్యార్థులలోబాగా చీలిక వుండేది; తమనితాము నాయకులుగా చెప్పుకునేవారు, రహస్య ఎజెండాలతో ఎలాపనిచేశారో బయటపెట్టారు గోఖలే. సంస్కరణలగురించి పార్టీనాయకత్వంలో విభేదాలు, చర్చలు కొనసాగుతున్నకాలం. అలాంటి ఒక పొలిట్ బ్యూరో సమావేశంలో హుయావో బాంగ్ గుండెపోటుతో 15-4-1989న మరణించారు. డెంగ్ అనుయాయే అయినా, కళ్ళెంలేని లిబరలైజేషన్ వైపు మొగ్గిన నేత. అది తప్పేనన్న ఆత్మవిమర్శతో ప్రధానకార్యదర్శిగా (16-1-1987) రాజీనామాచేసి, పొలిట్ బ్యూరోలో వుండగా మరణించారు. నాటి సంతాపవాతావరణాన్ని, విభేదాలను వాడుకొని విద్యార్థులని ఎగదోసాయి పార్టీలోని కొన్ని శక్తులు, లాబీలు. దానికి ఆజ్యంపోసాయి విదేశాలు, విదేశీమీడీయా. అలా ఏప్రిల్18-22న సంతాపంపేరిట వేలాదిమంది తరలివచ్చారు; అదే ముదిరి 50రోజులు కొనసాగింది. ప్రధానే మైదానంలోకివచ్చి తమతో చర్చలు జరుపాలని మొండిడిమాండు పెట్టారు కొందరు. ప్రధాని లీపెంగ్ జనంమధ్యకి వచ్చి, నేలపైకూర్చొని మే18న జరిపిన సుదీర్ఘచర్చలను, ఫోటోలను ఆనాటి చైనా టీవీ, పత్రికలు ప్రచురించాయి.

300మందికిపైగా కీలకపార్టీ, ప్రభుత్వ నాయకులంతా వుండే కేంద్రస్థానం అది; వారి నివాసాలు, ఆఫీసులు, ప్రభుత్వ సెక్రటేరియట్ కూడా అందులోనే. అలాంటిస్థానాన్ని లక్షమంది విద్యార్థులు చుట్టుముట్టిన నెలతర్వాత, మే18న పొలిట్ బ్యూరో నిర్ణయంతో, మే20నగానీ మార్షల్ లా ప్రకటించలేదు. ఆతర్వాతే సైన్యప్రవేశం; కానీ నగరం వెలుపలే ఉంచారు. మే15-16న రష్యానేత గోర్బచేవ్ పర్యటన సందర్భంగా స్క్వేర్ లో కార్యక్రమాలకోసం ‘గ్రౌండుని క్లియర్’చేయాలా అని చర్చించారు. కానీ చేయలేదు. జూన్ 3 రాత్రిదాకా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. ప్రపంచ మానవాళి చరిత్రలో ఇలాంటి తిరుగుబాటుని అన్నిరోజులు అనుమతించిన రాజ్యం మరొకటిలేదు. ఏదైనావుంటే ఎవరైనా ఉదహరించవచ్చును. చర్చలద్వారా 90-95 శాతంమందిని నచ్చచెప్పి ఇళ్ళకు పంపేశారు. వారు పోగా ఇంకా5నుంచి10వేలమంది దాకావుంటారు. 

“మొత్తం” ఎంతమంది చనిపోయారు? చైనాలెక్క 300 (సైనికులతోసహా). జూన్3రాత్రి గురించి నేటికీ వ్యాప్తిలోవున్నపుకార్లు: పదివేలమంది. అమెరికాగూఢచారి సంస్థ NSA-500 మందిదాకా; యామ్నెస్టీ 1000దాకా; NYT(జూన్21)400-800దాకా. స్క్వేర్ లో విద్యార్థుల మరణాలే లేవని, ఇతరచోట్ల అల్లర్లలో చనిపోయారని చైనా ప్రకటించింది. నిజమే ‘ అక్కడ అలాంటి ఆధారాలేవీ లేవ’ని వాషింగ్టన్ పోస్టు, CBS విలేకరులు; “అక్కడ ఎలాటి ఊచకోతనీ చూడలేద”ని సంఘీభావంగా జనంమధ్యేవున్న తైవాన్ విలేకరి; “అక్కడ” రక్తపాతం జరుగలేదని 2011లో అమెరికా రాయబార కార్యాలయం పంపిన రహస్య కేబుల్స్ చెప్పాయి. పాశ్చాత్యకపటాన్ని (నేటి భాషలో పోస్టుట్రుతుని చైనా నిర్దిష్టంగా బట్టబయలుచేసింది. దానితో కొన్ని ఏజెన్సీలు (VOA) తమతప్పులను కొంత అంగీకరించాయి. ఆరోజుల్లో ఆంధ్రజ్యోతి కూడా దీన్ని రిపోర్టుచేసినట్టు గుర్తు.

మరయితే జూన్ 3 రాత్రి ఏంజరిగింది? పూర్తివివరాలు ఈ పుస్తకంలోనూ లేవు. జర్నలిస్టిక్ నియమాలను తుంగలోతొక్కి ఊహాగానాలతో, రూమర్లతో, కట్టుకథలతో పాశ్చాత్యమీడియా పచ్చికపటంతో ఎలా వ్యవహరించిందో అద్భుతంగా వెల్లడించారు గోఖలే — అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఈ “తిరగరాసిన చరిత్ర”ని తరచిచూడాల్సిన అవసరం వుంది.

 

 

2 thoughts on “తియనన్మెన్ స్క్వేర్ సంఘటన: చరిత్ర “తిరగరాసిన” పుస్తకం

  1. చాలా బాగుంది. చదవ దగ్గ పుస్తకం. మంచి కథనం. మరిన్ని వివరాలు ఉంటే బాగుండేది అనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *