వైఎస్ దొంగైతే, జగన్ గజదొంగ: మంత్రి జగదీష్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీదకాదు, ఆయన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మొదలు పెట్టింది. కృష్ణాజలాల విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే, ఆయన కుమారుడు, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ అంతకన్నా పెద్ద దొంగ అని మంత్రలు క్యాంపెయిన్ చేస్తున్నారు. మూడు రోజుల కిందట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  మహబూబ్ నగర్ జిల్లాలో తండ్రికొడుకుల మీద ఈ దాడి మొదలుపెట్టారు. దీనిని స్వరం పెంచి ఈ రోజు మరొక మంత్రి జగదీష్ రెడ్డి ముందుకు తీసుకువెళ్తున్నారు. జగన్ మీదే కాకుండా ఏకంగా వైఎస్ మీద కూడా గురిపెట్టేందుకు  కారణమేమై ఉంటుంది?

ఇది జగన్ మీద కాకుండా తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ పెట్టుకుని రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్న ఆయన కూతురు షర్మిల మీద కూడా విసిరిన బాణమా?

ఎందుకంటే షర్మిల జూలై నెలలో రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున (జూలై 8)న తన రాజకీయ పార్టీ ప్రకటించాలనుకుంటున్నారు. ఈ మధ్య లో ఆమె రాష్ట్రంలో భరోసా యాత్రచేస్తున్నారు. కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలను, నిరుద్యోగుల కుటుంబాలను, రైతుల కుటుంబాలను కలుసుకుంటున్నారు. ఆమె పార్టీ పెట్టేలోపు, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం ఇందులో ఉందా?

ఏమయినా సరే, వైఎస్, జగన్ మీద దాడి కి జల ప్రాముఖ్యమే కాదు, రాజకీయ ప్రాముఖ్యం కూడా ఉందేమో ననిపిస్తుంది.

ఇంతకీ మంత్రి జగదీష్ రెడ్డి ఏమన్నారో చూడండి:

తెలంగాణా ను వంచించి నీళ్లు దోచుకపోవడంలో తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దొంగ అనుకుంటే ఆయన తనయుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతకు మించి దొంగలా తయారయ్యారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.

తెలంగాణా రాష్ట్రానికి కాంగ్రెస్,బిజేపి లతో సహా కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడూ అన్యాయమే చేశారని ఆయన విరుచుకుపడ్డారు.రాయలసీమ లిఫ్ట్ నిర్మాణపు పనులు ఆపితేనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తో చర్చలు ఉంటాయని ఆయన తేల్చిచెప్పారు. ఆ లిఫ్ట్ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని టి ఆర్ యస్ ప్రభుత్వం మొదటినుండి నిర్ద్వంద్వంగా వ్యతిరేఖిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు శుక్రవారం సాయంత్రం టి ఆర్ యస్ ఎల్ పి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ శాసన సభ్యులు నలబోతు భాస్కర్ రావు,నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య,హుజుర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి లతో కలసి పాల్గొన్నారు.

రోజు మూడు టీ యం సి ల నీళ్లను తరలించే ఈ ప్రాజెక్టు తో ఐదు జిల్లాలు నష్టపోతాయని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి స్టే తెచ్చినప్పటికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ధిక్కారణకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఆ విషయాన్ని కూడా ట్రిబ్యునల్ కు నివేదించిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తావించారు. కేంద్రప్రభుత్వం దృష్టికి రాయలసీమ ప్రాజెక్ట్ పై పలుదఫాలుగా లేఖలు రాయడమే కాకుండా కేంద్రజలశక్తి మంత్రికి ఘాటైన లేఖ రాసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.

తెలంగాణాను ఎండబెట్టడం ఆంధ్రపాలకులకు మొదటి నుండి అలవాటైపోయిందని ఆయన విమర్శించారు. తెలంగాణా కు ఎత్తిపోతల పధకాలే శరణ్యమని తెలిసినా సమైక్య పాలకులు ఉద్దేశపురకంగా వాటిని నిర్లక్ష్యం చేశారన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణా ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు కేవలం శిలా ఫలకాలకే పరిమితమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణా దోపిడీకి చంద్రబాబు నాయుడు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వై యస్ రాజశేఖర్ రెడ్డి వంద అడుగులు వేశారన్నారు.

జలయజ్ఞం పేరుతో వైఎస్ జలదోపిడికి పాల్పడిన రోజున వంత పాడిన నేతలే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకపడుతున్నారని ఆయన చెప్పారు. కొందరు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి పై పిల్ల కాకుల్లా మాట్లాడుతున్నారన్నారు.తెలంగాణా రాకుండా చేయడానికి వైఎస్ పన్నిన కుట్రలు జగద్విదితమే అన్నారు.

ఆనాడు కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ నేతలు ఎవ్వరూ జలదోపిడిని, తెలంగాణ వ్యతిరేకతను అడ్డుకోలేక పోయారన్నారు.కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టు లను వ్యతిరేఖించారన్నారు.అప్పుడు వైఎస్ కుమద్ధతుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసిన వారే ఇపుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

తెలంగాణ సమాజానికి అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వంత పాడడం విడ్డురంగా ఉందన్నారు.అటువంటి వైఎస్ ఇప్పుడు లేరని ఆంద్రప్రదేశ్ కు అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే హారతులు పట్టిన వారే ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారన్నారు.అటువంటి వైఎస్ లేకున్నా ఇక్కడి కాంగ్రెస్ నేతలు పెదవి విప్పిందేకు ఎందుకు జంకుతున్నారని ఆయన నిలదీశారు.

తెలంగాణా వాటాకు చెందిన ఒక్క నీటి బొట్టునూ వదులు కునేందుకు సిద్దంగా లేము అన్నారు.చట్టపరంగా ఇప్పటి వరకు తెలంగాణ నీటి వాటాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.చట్టాన్ని అతిక్రమించి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నీటి దోపిడీకి పాల్పడితే చూస్తూ ఉరుకోబోమని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *