నివాళి: విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 90 వ జయంతి నేడు

( వడ్డేపల్లి మల్లేశము)

భారతదేశ  స్వాతంత్య్రానంతరం కూడా విలువల కోసమే తన జీవితాన్ని ప్రజలకు అర్పించిన  రాజకీయ నాయకులు ఎందరో! ఎందరెందరో!

అందులో భారత ఏడవ ప్రధాన మంత్రిగా పనిచేసిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (జూన్ 25, 1931- నవంబర్ 27, 2008) ఒకరు. మాండ రాజ వంశానికి చెందిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ తొలి నుంచి ప్రజల పక్షానే నిలబడ్డారు. పదవ యేటానే ఆయన మాండా రాజా అయ్యారు.

5000 సంవత్సరాలు రాజులు కొరడా ఝళింపించి  ప్రజలను భయపడించారు.వాళ్లకి చదవు సౌభాగ్యం లేకుండా చేశారు.  ఇక చాలు, ఇపుడు వాళ్లతో అధికారం పంచుకోవాలి.ఇపుడు మనమంతా కలసి సామాజిక సాధికారత సాధించిన భారతదేశాన్ని నిర్మించాలి. ఇపుడు నేను చేసిందదే,’ అని 1998లో కుటుంబ సభ్యలతో అన్నట్లు ఆయన మనవడు ఇంద్రశేఖర్ సింగ్  ఆ మధ్య రాశారు. నిజానికి ఆయన మండల్ సిఫార్సుల దుమ్ము దలపడం మనేది రాజకీయ వ్యూహంలో భాగం కాదు, ఆయన ఆయన నమ్మిన సిద్ధాతం. మండల్ కంటే ముందు ఎపుడో ఆయన  రైతులు వైపు, వెనకబడిన వర్గాల సంక్షేమం వైపు దృష్టి సారించారు. బంధువర్గానికి, శక్తివంతమయిన ఠాకూర్లకు, ఆగ్రకులాలకు తాను శత్రువవుతాడని తెలిసినా ఆయన వెనకబడిన కులాల సామాజిక న్యాయం నినదాం  వదల్లేదు.

ఈ రోజు ఆయన 90వ జయంతి. ఈ సందర్భంగా ఆయ, జీవిత విశేషాలను పరిపాలనా దక్షతను వ్యక్తిత్వ విలువలను ముచ్చటించుకోవాలి.

వి.పి.సింగ్ కొన్ని ప్రత్యేకతలు

వి.పి.సింగ్ అనగానే భారతదేశ రాజకీయాలలో కీలకమైన క్రియాశీలకమైన పాత్ర పోషించారని అనేకమంది ఇప్పటికీ అంగీకరిస్తారు. మాండా రాజవంశానికి చెందిన వారసుడు అయినప్పటికీ ప్రజాస్వామిక జీవితం పట్ల తనకు గల విశ్వాసాన్ని వివిధ హోదాలలో పని చేసినప్పుడు అమలు చేసిన సిద్ధాంతకర్త ,రాజ్యాంగబద్ధంగా పాలించిన ప్రజాస్వామికవాది.

మండల్ కమీషన్ నివేదిక ప్రకారం గా భారతదేశ రాజకీయాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించిన చిరస్మరణీయుడు.

ఖలిస్తాన్ ఉద్యమ సమయంలో పంజాబ్ లో జరిగిన అల్లకల్లోలo పైన ప్రత్యక్షంగా ప్రధాని హోదాలో సిక్కు మందిరాన్ని సందర్శించి పరిస్థితులను అవగతం చేసుకోవడానికి బయలుదేరినప్పుడు పాత్రికేయులు, సన్నిహితులు అక్కడికి వెళ్లడం ఇబ్బందికర మేమో, ఉగ్రవాదులు ఒకవేళ హత్య చేస్తే ఎలా అని అడిగారట.

అందుకు వి.పి.సింగ్ జవాబిస్తూ అలాంటి పరిస్థితే జరిగితే నన్ను స్వర్ణ దేవాలయం ముందు పూడ్చి పెట్టండని ఇచ్చిన సమాధానం ఎంత సందర్భోచితం, వీరోచితమో అర్థం చేసుకోవచ్చు.

అంతకు ముందున్న ప్రభుత్వాలు రాజవంశాల కు సంబంధించిన వారి వారసులకు అనేక రకాల ప్రాధాన్యతనిస్తున్న వాటిని తాను ప్రధాన మంత్రిగా నిరాకరించి ప్రజాస్వామ్యంలో రాచరిక మేమిటని ఆచరించి చూపిన మానవతావాది.

రెండవ డిసెంబర్ 1989 నుండి 10 నవంబర్ 1992 వరకు ప్రధాన మంత్రిగా కేవలం 343 రోజులు మాత్రమే పని చేసినప్పటికీ ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో అక్కడ చిక్కిపోయిన భారతదేశపు వలసకూలీ లను, కార్మికులను, ఉద్యోగులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతోనే వేలాదిమందిని భారతదేశానికి రప్పించి నటువంటి పరిపాలనాదక్షుడు వి.పి.సింగ్.

మండల్ సిఫార్సుల అమలు వెనక శక్తి

విద్యా ఉద్యోగాలలో రాజ్యాంగం అమలైన నాటినుండే ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలవుతున్న ప్పటికీ అనేక కారణాల వలన బీసీలకు సంబంధించి రిజర్వేషన్ సౌకర్యం రాజ్యాంగంలో అమలుకు నోచుకోలేదు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు భారత ప్రధానమంత్రి ,ప్రభుత్వము ప్రత్యేక కమీషన్ను ఏర్పాటు చేసి బీసీల గురించి పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం మాత్రం కల్పించబడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 1979 జనవరి 1వ తేదీన అప్పటి జనతా పార్టీకి చెందిన ప్రధాన మంత్రి మురార్జీ దేశాయ్ బిపి మండల్ అధ్యక్షతన మండల కమిషన్ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన తరగతులు ఇతర వెనుకబడిన వారి స్థితిగతులను అధ్యయనం చేసి న కమిషన్ సామాన్య జీవన స్రవంతిలో వీరిని కలిపే విధంగా అనేక నిర్మాణాత్మక సూచనలు చేస్తూ సిఫారసు చేసింది.

అయితే ఆ సిఫారసులు వచ్చే వరకే మురార్జీ దేశాయ్ గారు భారత దేశ ప్రధానిగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు సుమారుగా పది కాలాల పాటు ఈ కమిషన్ సిఫారసులను పట్టించుకోని కారణంగా బీసీల సమస్యలు తొక్కి పెట్టబడినవి.

వి.పి.సింగ్ ప్రధానిగా 1989 లో వచ్చిన ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానిగా వి.పి.సింగ్ పూర్తి స్థాయి కమిషన్ సిఫారసులను అధ్యయనం చేసి న్యాయబద్ధంగా ఉన్నందున ప్రభుత్వం ఆమోదించి వెంటనే బిసిలకు విద్య,ఉద్యోగాలలో27 శాతం రిజర్వేషన్లు అమలు కు ఉత్తర్వులిచ్చింది. కానీ ఉత్తర భారత దేశంలో కొందరు ప్రధానంగా అగ్ర కులాలకు చెందిన వారు ప్రతిభ నాశనం అవుతుందనే ఉద్దేశంతో అల్లర్లకు పాల్పడి ఉత్తర్వులు అమలు కాకుండా అడ్డుకున్న ప్పటికీ అమలు పైన స్టే ఇచ్చినటువంటి సర్వోన్నత న్యాయస్థానమే తిరిగి ఉత్తర్వులు చట్టబద్ధం అని చెల్లుబాటు అవుతాయని తీర్పు ఇవ్వడం ద్వారా మండల్ కమిషన్ సిఫారసులు అమలు లో వి.పి.సింగ్ విజయం సాధించాడు.

తను తీసుకున్న నిర్ణయం ఈ దేశంలో అమలు కాకపోతే అమలు అయ్యే అంతవరకు నేను ఢిల్లీలో అడుగుపెట్టని స్వీయ బహిష్కరణ చేసుకున్న ఒక ఉన్నత విలువలకు కట్టుబడిన ప్రధానిగా చెప్పుకోవచ్చు. ఆ రకంగా తిరిగి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు ఢిల్లీలో అడుగు పెట్టినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వంలో అవిశ్వాస తీర్మానం కారణంగా వి.పి.సింగ్ సంవత్సరంలోపే పదవిని కోల్పోవలసి వచ్చింది.

అయినప్పటికీ తొలి రిజర్వేషన్ ప్రతిఫలాన్ని ఉత్తర రూపంలో మొదటి లబ్ధిదారుడు అయినటువంటి మెదక్ జిల్లాకు చెందిన రాజ శేఖరా చారి గారికి స్వయాన వి.పి.సింగ్ నియామక ఉత్తర్వులు అందజేయడం చరిత్రలో నిలిచిపోయింది.

ఆ కమిషన్ సిఫార్సుల అమలు ఆధారంగా భారత దేశ వ్యాప్తంగా విద్య, ఉద్యోగం, రాజకీయాల చట్టసభల్లో కూడా 52 శాతం గా ఉన్నటువంటి బీసీ వర్గాలకు

ఎవరి వాటా వారికి అన్నట్టుగా 52 శాతం రిజర్వేషన్ అమలుకు పూనుకుని వెనకబడినవర్గాల పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించిన వారవుతారు.

ప్రధానిగా కొన్ని కీలక నిర్ణయాలు

ప్రధాని బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే  ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో పంజాబ్లో ముఖ్యంగా స్వర్ణ దేవాలయం పైన జరిగినటువంటి సైనిక దాడి వల్ల జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని అంచనా వేసి క్షమాపణ చెప్పడానికి ప్రధాని వెళ్లి అక్కడి పరిస్థితులను చక్కదిద్డడం జరిగింది. తద్వారా సిక్కులను జన జీవన స్రవంతిలో తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేశాడు.

బెనజీర్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం భారత సరిహద్దుల్లో యుద్ధాన్ని ప్రారంభించేందుకు చేసిన కవ్వింపు చర్యల ను ఆయన గట్టిగా అడ్డుకున్నారు.

వివిధ పదవులలో వి.పి. సింగ్ చర్యలు

1931 జూన్ 25వ తేదీన అలహాబాదులో జన్మించిన వి.పి.సింగ్ 77 ఏళ్ల వయసులో 2008 నవంబర్ 27వ తేదీన న్యూఢిల్లీలో కన్నుమూసాడు. 1987 ముందు భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పని చేసిన వీరు 87- 88 మధ్యన janmorcha పార్టీలో పనిచేశారు.

1988లో కొన్ని ప్రతిపక్షాలను కలుపుకొని జనతాదళ్ పార్టీ ఏర్పాటు చేసి 2006 వరకు అందులోనే కొనసాగారు. అలహాబాద్ ,పూణే విశ్వవిద్యాలయాల నుండి ఉన్నత విద్యాభ్యాసం గడిచిన వి.పి.సింగ్ మంచి పరిపాలనాదక్షుడు గా పేరు తెచ్చుకున్నారు.

1984 నుండి 87 వరకు రాజీవ్గాంధీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి గాను ,1987లో రక్షణమంత్రి గాను పని చేసి ఆర్థిక, రక్షణ రంగాల పటిష్టతకు, ప్రక్షాళనకు ఎంతో కృషి చేశారు .ఇందులో భాగంగానే బోఫోర్స్ కుంభకోణం సందర్భంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి తద్వారా ప్రభుత్వము నుండి బయటికి వచ్చాడు.

1980 నుండి 82 మధ్య కాలంలో ముఖ్యమంత్రి గా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన కాలంలో అక్కడి ప్రధాన సమస్య అయిన బందిపోటు దొంగల ఆగడాలను నిలువరించడానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ అదుపు కాకపోవడంతో ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి తన నైతికతను చాటుకున్నాడు. కానీ బందిపోటు దొంగలు ప్రభుత్వానికి లొంగి పోయినప్పుడు వి.పి.సింగ్ వ్యక్తిగతంగా పర్యవేక్షించిన ప్పుడు కూడా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు.

భారత రాజకీయాలు విషపూరితమైనవ ని భావించిన భారత రాజకీయ పార్టీలు 1989 ఎన్నికలలో రాజీవ్ గాంధీని ప్రధానికాకుండా అడ్డుకోవడానికి అతనికి వ్యతిరేకంగా వామపక్షాలు, భారతీయ జనతా పార్టీతో సహా కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేయడానికి జరిగిన కృషికి వి.పి.సింగ్ నాయకత్వం వహించడం ప్రధానంగా చెప్పుకోతగ్గది. తద్వారా1989లో వి.పి.సింగ్ పాత్ర భారత రాజకీయాల దిశను మార్చిందనడంలో సందేహం లేదు.
భారతీయ జనతాపార్టీ కూడా మద్ద చేస్తున్నటువంటి కూటమికి నాయకత్వం వహిస్తూ ప్రధానిగా కొనసాగినప్పటికీ అద్వానీ దేశవ్యాప్తంగా చేస్తున్న రథయాత్రపై దీర్ఘంగా ఆలోచించి దుష్ఫలితాలను అడ్డుకోవడం కోసం అరెస్టు వారెంటు జారీ చేయడం ద్వారా వి.పి.సింగ్ తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. కానీ పదవిని మాత్రం కోల్పోయాడు.

నేటి పాలకుల కర్తవ్యం

భిన్న సమయాలలో, క్లిష్టపరిస్థితుల్లో, సంఘర్షణల సందర్భంలో సంవత్సరానికి లోపే ప్రధానిగా పని చేసినప్పటికీ తన రాజకీయ చతురతను వినియోగించడం ద్వారా మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయడం తో భవిష్యత్తుకు చక్కని బాట వేసిన టువంటి మార్గదర్శిగా భారత రాజకీయాలలో నిలిచిపోయిన వి.పి.సింగ్ గారిని నేటి పాలకులు రాజకీయ పార్టీల నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అసమానతలు, అంతరాలు, వివక్షత, పేదరికం, నిరుద్యోగం, ఆకలిచావులు, నిర్బంధం, అణచివేత వంటి అనేక సమస్యలతో తల్లడిల్లుతున్న భారతావనిలోని అసంభద్దతలను పరిష్కరించడానికి పాలకులకు 74 సంవత్సరాలు కూడా సరిపోలేదు అంటే నేటి ప్రభుత్వాలపై ఎంత బాధ్యత ఉందో, ఎన్ని లక్ష్యాలు మిగిలిపోయినయో ఆలోచించి అడుగులు వేయవలసిన అవసరం ఉంది. ఇదే వారికి మనం ఇచ్చే జయంతి విలక్షణమైన నివాళి.

( ఈ వ్యాసకర్త కవి రచయిత సామాజిక రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *