పుస్తకాల సువాసనంటే నాకు బలే ఇష్టం, అది మత్తెక్కిస్తుంది…

ఇంతకీ పుస్తకాలు వెదజల్లే వాసనని ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా?: (Bibliosmia)

(బి వెంకటేశ్వర మూర్తి)

నా బాల్యం సంగతులు రాసేప్పుడు నేను చిన్న పిల్లాడినై పోయి, ఆనాటి అమాయకత్వాన్ని మనసులోకి తెచ్చుకుని వీలైనంత నిజాయితీగా రాయాలని ప్రయత్నిస్తాను. ఇలా చేయడం నాకెంతో తృప్తినిస్తుంది. హాయిగా కూడా ఉంటుంది. 

కొత్త పుస్తకం వాసన నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే. అక్షరాలు ముద్రించిన అచ్చు పుస్తకమైనా, మనల్ని రాయమని ఆహ్వానించి నట్టుండే తెల్లకాయితాల నోటు పుస్తకమైనా సరే, కొత్త పుస్తకం నా చేతి కందిన వెంటనే దాన్ని తెరిచి రెండు పేజీల మధ్యన మొహం పెట్టి వాసన చూస్తుండే వాడిని. టెక్స్టు బుక్కులు, నోట్సుల్లో వేటి వాసన దానిదే. దేనికదే ప్రత్యేకం. అప్పట్లో నాకు తెలుగు పుస్తకాల వాసన మరీ ఇష్టం. 

ఎప్పుడో చిన్నప్పుడు మొదలైన ఈ అలవాటు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నట్టే ఉంది. మొన్నటికి మొన్న నా ఎల్ కెజీ మనవరాలు తనకి ఆన్ లైన్ ఆర్డర్ లో హోమ్ డెలివరీ వచ్చిన కొత్త పుస్తకాలను నాకు చూపించి వచ్చీ రాని ముద్దు మాటల్లో వాటి విశేషాలు చెబుతూ సంబర పడిపోతుంటే దాని అమాయికమైన ఆనందానికి ఒక వైపు మురిసిపోతూనే ఆ రంగుల బొమ్మల పుస్తకాలను మధ్యకు తెరిచి ముక్కు దగ్గర పెట్టుకుని ఆ సువాసనల్ని ఆఘ్రాణించడం నాకు గుర్తే. నా ఈ వింత చర్యను మా ఇంట్లోని ఒకరిద్దరు గమనించే ఉంటారు. కరోనా కష్టకాలం కదా, వాసన చూసినా అపచారమే. వాళ్ల అనుమానం వాళ్లది. అయినా మనం చేయ గలిగిందేమీ లేదు.

హైస్కూల్లో చదువుకునే రోజుల్లో మనం పాసై పోయిన పాత క్లాసు తాలూకు టెక్స్టు పుస్తకాలను హాఫ్ రేటుకు ఎవరో ఒకరికి అమ్మడం, మనం చేరబోయే కొత్త క్లాసు పుస్తకాలను మరెవరో తెలిసిన వాళ్ల దగ్గర హాఫ్ రేటుకు కొనడం అప్పట్లో అదో పెద్ద కార్యక్రమం. నేను కొంచెం క్లవర్ (స్టూడెంటు)గా ఉండేవాడిని కాబట్టి మన టెక్స్టు బుక్కులకు కొంచెం డిమాండు ఎక్కువ. మన పుస్తకాలతో చదివితే వాళ్లు కూడా క్లవర్ (క్లవర్ అంటే బాగా చదువుతాడనీ, కొంచెం తెలివైన వాడని అర్థమన్నమాట) అవుతారని సెంటిమెంటు. పైగా నా టెక్స్టు బుక్కులతో పాటు నోట్సులు (నోట్సులంటే నోటు బుక్కులు. వీటిలోనే మనం కొశ్చనాన్సర్లు రాసుకునేది, క్లాసువర్కు, హోంవర్కు లెక్కలు చేసేది.) కూడా ఫ్రీ కదా, అందుకోసమన్న మాట. 

ఈ పాత పుస్తకాలు కొనేటప్పుడు మనకు కొంచెం అదృష్టం బాగుంటే అట్ట పేజీలతో సహా కొంచెం కొత్తగానే అనిపించే టెక్స్టు బుక్కులు దొరికేవి. పాతవైనా, కొత్తవైనా డబ్బులిచ్చి కొనుక్కుని వాటిని మన సొంతం చేసుకున్నాక ఆ పుస్తకాలపైన మనకు అమితమైన శ్రద్ధ, ప్రేమ పుట్టుకొస్తాయి. ఇంకో సంవత్సరం పాటు వాటితోనే మన లోకమైనప్పుడు ఆ మాత్రం శ్రద్ధ తీసుకోక తప్పదు కదా. కాబట్టి అప్పుడు వాటికున్న పాత (కవర్) అట్టలు పీకేసి, మనకు నచ్చే విధంగా కొత్త అట్టలు వేసుకుంటామన్న మాట. 

మొన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా (పార్ట్ 1) కథానాయకుడులో ఆడపిల్లలు నాగేశ్వర్రావు బొమ్మని పుస్తకాలకు అట్టలుగా వేసుకుంటున్నారయ్యా అంటూ ఏఎన్నార్ కున్న గ్లామర్ గురించి ప్రకాష్ రాయ్ (చక్రపాణి క్యారెక్టరు) వాదిస్తాడు. ఆయన చెప్పింది కొంతవరకు నిజమే కావచ్చు గానీ ఒక్క ఆడపిల్లలే కాదు మగ పిల్లవాళ్లం కూడా సినిమా యాక్టర్ల అట్టలు వేసుకోవాలని ఉబలాట పడే వాళ్లం. ఒక్క నాగేశ్వర్రావనే కాదు, ఎన్టీరామారావు, కృష్ణ, శోభన్ బాబు ఎవ్వరి సినిమా బొమ్మల న్యూస్ పేపర్లు దొరికినా ఏదో ఒక పుస్తకానికి అట్టగా స్థిరపడిపోయేవి.

కొత్త తరగతిలో క్లాసులు ప్రారంభమైన తర్వాత మొదటి వారమో, పది రోజులో అన్ని సబ్జెక్టుల నోట్సులను ఒకే `రఫ్ నోట్ బుక్ లో రాసుకునే వాళ్లం. ఈ రఫ్ నోట్ బుక్ కాన్సెప్టు మొదట్లో మనకి తెలియదు. పాత క్లాసుల నోట్సుల్లో రాయకుండా మిగిలిపోయిన ఖాళీ కాయితా లన్నింటినీ చించి కట్టగా పేర్చి, వీటిని ఏం చేయాలబ్బా ఆని ఆలోచిస్తుంటే, వాటన్నింటినీ కలిపి కొత్త నోట్సుగా కుట్టి రఫ్ నోట్ బుక్ గా వాడుకోవచ్చని నా స్నేహితుడొకడు ఐడియా ఇచ్చాడు. రఫ్ నోట్ బుక్ కు మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. రెగ్యులర్ సైన్స్ నోట్సులో ఉమ్మెత్త పుష్పమో, జీర్ణ మండలం బొమ్మనో గీయడానికి ముందు రఫ్ బుక్ లో గీసి ప్రాక్టీసు చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకి పొద్దు పోనప్పుడు ఏవో మనకి వచ్చిన తిక్కతింగిరి బొమ్మలు కూడా గీసుకోవచ్చు. నా రఫ్ బుక్కులో కాదు గానీ, నా స్నేహితుల రఫ్ బుక్కుల్లో ఐతే అప్పుడప్పుడు లీజర్ పీరియడ్ లలో చుక్కలాట కూడా ఆడుకునే వాళ్లం. ఫలానా పీరియడ్ లో మన క్లాసుకు రావలసిన సారు శలవు పెట్టినప్పుడు ఎప్పుడో ఒక్కోసారి మాకు లీజర్ పీరియడ్ వచ్చేది. 

పాత క్లాసు పాసై కొత్త క్లాసుకు చేరాక, వారమో పది రోజుల్లోనో ఏ సబ్జెక్టుకు ఏ సారు వస్తాడో తెలిసిపోయేది. అది తేలే దాకా అదో రకమైన ఉత్కంఠ. ఫలానా సారు బాగా చెబుతాడనీ, ఇంకో సారు హోంవర్కు చెయ్యకపోతే కొడతాడనీ, మరో సారు పాఠం మధ్యలో కొశ్చనాన్సర్లు అడిగి కరెక్టు చెప్పిన వాళ్లతో ఆన్సరు చెప్పలేని వాళ్లకందరికీ ముక్కు చెంపలు కొట్టిస్తాడనీ ఇట్లా అనేక విషయాలు పిల్లలం మాలో మేం చర్చించుకునే వాళ్లం. ఫెయిలయ్యి మళ్లీ అదే క్లాసులో ఉంటున్న వాళ్లో, పై క్లాసులకు పోయిన సీనియర్లో మాకు రాబోయే కొత్త సార్ల గురించి ఈ సంగతులన్నీ చెబుతుండే వాళ్లు. అసలు కొత్త క్లాసుకు మారినంక కొత్త తరగతి గది కూడా నాకు బాగా నచ్చేది. కొన్ని రోజుల పాటు ఆ కొత్త గదిలోకి అడుగు పెట్టిన ప్రతిసారీ అదేదో కొత్త లోకం లోకి వెళుతున్నట్టు, మరింతగా గొప్పవాళ్లమై పోతున్నట్టు అనిపించేది. 


If a book is new, it smells great. If a book is old, it smells even better. It smells like ancient Egypt. A book has got to smell.


 

 ఏ సబ్టెక్టుకు ఏ సారు వస్తాడో ఖరారై పోయినంక వాళ్లు ఎన్ని పేజీల నోట్సులు పెట్టాలో చెప్పేవాళ్లు. కొంతమంది షావుకార్ల పిల్లవాళ్లు నోట్సుల కోసం నోటుబుక్కులు అంగడిలో కొనుక్కునే వాళ్లు. నేను, మా అన్న మాత్రం తెల్ల కాయితాలో, నల్ల కాయితాలో దస్తాల లెక్కన కొనుక్కుని నోట్సులు కుట్టుకునే వాళ్లం. నల్ల కాయితాలు నల్లగా ఏం ఉండవు. కొంచెం కాకీ రంగులో ఉంటాయి. అంటే పోలీసు నిక్కరు రంగన్న మాట. ఇవి కొంచెం ధర తక్కువ. ఎక్కువ పేజీలు అవసరమైన లెక్కల నోట్సులను నల్ల కాయితాలతో కుట్టుకునే వాళ్లం. దస్తా అంటే రెండు డజన్ ల ఠావులు. తెల్ల కాయితాలు, నల్ల కాయితాలు కొనుక్కునే టప్పుడు అంగట్లో ఒక సారి, ఇంటికి వచ్చినంక ఇంకోసారి దస్తాలో 24 ఠావులు ఉన్నాయో లేవో నని జాగ్రత్తగా ఎంచి చూసుకునే వాళ్లం. ఎంచే టప్పుడు ఒక ఠావుకు ఇంకో ఠావు కరుచుకుని లెక్క తప్పు పోకుండా చూసుకోడానికి మధ్య మధ్యలో చూపుడు వేలినో బొటనవేలినో నాలుక మీద ఎంగిల్లో అద్దుకుని తడి చేసుకోవాలి. ఇది నేను పెద్దవాళ్లను చూసి నేర్చుకున్నదే.

నోట్సులు కుట్టుకునే కార్యక్రమం కూడా చాలా పెద్దదే. మా అమ్మనో, పెద్దన్నయ్యో, మామయ్యనో మాకు నోట్సులు కుట్టి ఇచ్చే వాళ్లు. మా ఇంట్లో పుస్తకాలు కుట్టుకోడానికి ఉంట దారమూ, పుస్తకాల సూదీ ఉండేవి. పుస్తకాల సూది బట్టలు కుట్టే సూది కంటే చాలా పెద్దదీ, సంచులు కుట్టే దబ్బనం కంటే చాలా చిన్నదిగా ఉండేది. ముందుగా ఠావులన్నింటినీ అరఠావుల సైజుకు చించుకోవాలి. ఠావు కాయితాలను రెండు మూడు కలిపి సరిగ్గా మధ్యకు, అంచులు ఒక దాని మీదొకటి కూచునేటట్టు కరెక్టుగా మడిచి, గట్టిగా గోటితో రుద్ది, మధ్యలో స్కేలు పెట్టి సర్రుమని చించెయ్యాలి. ఒక్కోసారి మా మామయ్య రెండు అర ఠావుల మధ్యలో దారం పెట్టి అడుగున గట్టిగా పట్టుకుని పైనుంచి దారాన్ని సర్రున లాగి పర్రుమని చించేసే వాడు. నాకు బలే ఆశ్చర్యమనిపించేది.

కాయితాలన్నింటినీ అరఠావు సైజులో చించి సిద్ధం చేసుకున్నంక వాటిని బొత్తుగా పెట్టి మధ్యకు మడిచి పుస్తకాల సూదీ, ఉంట దారంతో నోట్సులు కుట్టుకోవాలి. దీనికో లెక్క ఉంది. పది అరఠావులతో నలభై పేజీల నోట్సు అవుతుంది. నోట్సు అరవై పేజీలు, నూరు పేజీలు ఉండేట్టయితే దారాన్ని రెండు పొరలు కలిపి సూది తూములో దూర్చి కుడితే కుట్టు గట్టిగా ఉంటుంది.

కాయితాలు కొనుక్కోడానికి అంగడికి పోయినప్పుడు అట్ట వేసుకోడానికి బ్రౌన్ అట్ట పేపర్లు కూడా మర్చిపోకుండా తెచ్చుకోవాలి. మనం రెండు దస్తాల కంటే ఎక్కువ తెల్ల కాయితాలు కొనుక్కుంటే ఆ యొక్క షాపు వాడు పదో పన్నెండో లేబుల్స్ ఫ్రీగా ఇచ్చేవాడు. లేబుల్స్ అంటే నేమ్, సబ్జెక్ట్, క్లాస్, సెక్షన్, స్కూల్ అని ప్రింటు చేసి ఉన్న బెత్తెడు సైజు కాగితం స్లిప్పులు. అంత చిన్న స్లిప్పుల్లోనే ఒక పక్క గులాబీ పువ్వు, ఇంకు బుడ్డీ-కలం, చిలక, పిట్ట, ఏనుగు ఇట్లా ఏవేవో బొమ్మలు ఉండేవి. ఈ లేబుల్స్ పైన మన పేరు, తరగతి వంటి వివరాలు పెన్నుతో గుండ్రంగా రాసుకుని టెక్స్టు బుక్కులు, నోట్సులకు వాటి అట్టల పైన అతికించుకోవాలి. నేమ్ అని ఉన్న చోట అడ్డగీత పైన బి వి మూర్తి అని నా పేరును స్టయిల్ గా రాసుకునే వాడిని. తెలుగు టెక్స్టు బుక్కు, నోట్సు పైన మాత్రం పేరుతో సహా అన్నీ తెలుగులో రాసుకునే వాణ్ని. మిగత అన్ని సబ్జెక్టుల పుస్తకాలకు ఇంగ్లీషులోనే రాసుకునే వాణ్ని. ఐదు, ఆరు తరగతులప్పుడు మా అన్నలో, మా నాయనో నాకు లేబుల్స్ పైన పేరు రాసిచ్చే వాళ్లు. చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడు నా పుస్తకాలకు అట్టలు వేయడం, వాటి పైన బంకతో లేబుల్స్ కరిపించడం, పేర్లు రాయడం మా అన్నల పనే. మా అమ్మ, నాయన వాళ్లకు ఆర్డర్ వేసే వాళ్లు. అన్నలు మంచి వాళ్లే గానీ ఒక్కోసారి మనల్ని సతాయిస్తారు. వాళ్లు మనకు పని చేసి పెట్టేవాళ్లే కానీ కొంచెం మన పైన జులుం చేసే వాళ్లు. వాళ్లు కుర్చీలో కూర్చుని లేబుల్స్ పైన పేర్లు రాస్తుంటే నన్ను చేతులు కట్టుకుని నిలబడమనే వాళ్లు. మనం ఎన్నో తరగతి పాసై ఎన్నో తరగతికి పోయినామో వాళ్లకు తెలిసినా ప్రతి లేబుల్ పైన రాసేటప్పుడు నన్ను అడిగేవాళ్లు. వాళ్లు అడిగినప్పుడల్లా మనం చేతులు కట్టుకుని జవాబు చెప్పాలన్నమాట. రెండు మూడు లేబుల్స్ రాసినంక, డిసిప్లిన్ అయిపోయి ఇంక కొంచెం క్లోజు అయినాము కదా అని మెల్లగా పక్కనున్న స్టూలు మీద కూర్చోబోతే స్టాండప్ అని అరిచే వాళ్లు. మళ్లీ చేతులు కట్టుకుని నిలబడాలన్న మాట. ఇట్లా అన్ని లేబుల్స్ రాయడం అయిపోయే వరకు చేతులు కట్టుకుని నిలబడాలంటే నాకు దుఃఖం వచ్చేది. అయినా ఓర్చుకునే వాణ్ణి. ఒక్కోసారి వీళ్ల జులుం భరించలేక నాకు మండిపోయినప్పుడు, ఆఫీసు నుంచి వచ్చినంక మా నాయనకు కంప్లయింట్ చేసినానో ఇంక అంతే. మా నాయన చేతిలో వాళ్లకు బాగా పూజ అయ్యేది. అయితే ఇందులో ఒక డేంజరుంది. కంప్లయింట్ చేసి వాళ్లకు పూజ జరిపించినాక ఒకటి రెండు రోజులు మనం వాళ్లకు ఒంటరిగా దొరకకూడదు. దొరికినామో చెవి పిండో, నెత్తిన గట్టిగా మొట్టికాయ వేసో కసి తీర్చుకునే వాళ్లు. మా రెండో అన్న బలే కచ్చిపోతు. నన్ను ఎక్కువగా కొడుతుండే వాడు. నెత్తిన మొట్టికాయ మొట్టితే నొప్పి చెవుల్లోకి దిగేది. బుడిపి కట్టేది. అంత గట్టిగా మొట్టేవాడు. 

మా అన్నల జులుం భరించలేక, ఏడో తరగతి నుంచి లేబుల్స్ పైన నా పేరు, క్లాసు, వగైరా వివరాలను నేనే రాసుకునేవాణ్ణి, స్టయిల్ గా. నేను గుండ్రంగా, ముద్దుగా పేరు రాసుకోడం చూసి నా ఫ్రెండ్సులు చాలా మంది వాళ్ల పుస్తకాల అట్టల లేబుల్స్ పైన పేరు రాసివ్వమని నన్ను అడిగే వాళ్లు. చాలా క్లోజు ఫ్రెండ్సులకు మాత్రమే నేను పేర్లు రాసిచ్చేవాడిని.

(మూర్తి  జర్నలిస్టు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేశారు.బెంగుళూరు.)

3 thoughts on “పుస్తకాల సువాసనంటే నాకు బలే ఇష్టం, అది మత్తెక్కిస్తుంది…

  1. నా ప్రియ మిత్రుడు మూర్తి రాసిన వ్యాసం చదివిన తరువాత పుస్తకాలు కూడా పువ్వుల్లా వాసన వేస్తాయని తెలిసింది . ఇందులో నాకు పెద్దగా అనుభవం లేదు. వినలేదు . ఏళ్ళు గడిచే కొద్దీ పుస్తకం పాతపడటం, పేజీలు రంగు మారడంతెలుసు. ఈ గమ్మత్తేమిటో చూద్దామని నిన్ననే పోస్టులో వచ్చిన కొత్త పుస్తకం తెరిచి వాసన చూసాను. అప్పుడే అచ్చైన పుస్తకం కావడంతో ఆ పేజీలు అదోరకమైన వాసనవేసిన మాట నిజం. బహుశా ప్రింటింగ్ కి వాడిన కెమికల్సు వాసనేమో అనిపించింది . వెంటనే నా మినీ లైబ్రరీలో వున్న ఓ 50ఏళ్ళ పుస్తకం తెరిచి వాసన చూసాను.అదోరకమైన పాత వాసన వేసింది. మత్తేక్కించే సువాసనలు నాకు వేయలేదు. ఈ సువాసనలకు ఏదో చాలా లోతైన, నిగూఢమైన అర్ధం వుండి వుంటుంది లేకపోతే bibliosmia అనేమాట డిక్షనరీలోకి ఎలా వస్తుంది ? కచ్చితంగా ఇటువంటి వాసనల్ని గురించి పరిజ్ఞానం లేకపోతే ఎంతో మంది పండితులు అలా రాయరుకదా?
    బాగా పఠనాసక్తి వున్న వాళ్ళ చేతిలో నిత్యం ఏదో పుస్తకం కనిపిస్తుంది . అలాంటి వాళ్ళని పుస్తకాల పురుగు అని పిలుస్తాం.
    పుస్తకాలలో ఎంతో విజ్ఞానం నిక్షిప్తమై వుంటంది.పుస్తకం ఓ నిక్షిప్త ఖని. అమూల్యమైన విజ్ఢాన సంపద వాటిల్లో పోగుపడివుంటుంది. అదొక తరగని సంపద. విజ్ఞాన భాంఢాగారం.ఆ విజ్ఞానాన్ని చదివితేనే అవి వెదజల్లే సువాసనల్ని ఆస్వాదించగలం. ఆ పరిమాళాల మత్తులో మైమరచి పోగలం.
    పుస్తకాలు చదువుతున్న కొద్దీ మనలో విజ్ఞాన తృష్ణ పెరుగుతుంది. అప్పుడే అవి వెదజల్లే విజ్ఞాన పరిమళాల్ని ఆస్వాదించగలం. కొత్త పుస్తకాలు మంచి వాసన వేస్తాయి. పాత పుస్తకాలైతే మరీ మంచి వాసన వేస్తాయన్న పెద్దల వ్యాఖ్యలో బహుశా ఈ అర్ధం కూడా ఇమిడి వుండొచ్చు అని నాకు అనిపించింది. మూర్తి గారు చెప్పిన్నట్టు పుస్తకాలు వేసే వాసనలతోబాటు అవి వెదజల్లే విజ్ఞాన పరిమళాలని కూడా మనం ఆస్వాదించగలిగితే ఈ సువాసనల్ని మనం గుండెలనిండా పీల్చుకుని ఆ మత్తులోకి జారిపోగలం అనిపించింది. చక్కని వ్యాసం అందించిన మూర్తి గారికి అభినందనలు .

  2. డియర్ సూర్యమోహన్
    నా రచనపై మీ స్పందనకు ధన్యవాదాలు.
    ఊరికే నన్ను ఆట పట్టించడానికి కెమికల్సూ, పాత వాసన అంటూ రాసుకొచ్చారు కానీ మనసుతో ఆఘ్రాణించే పుస్తకాల వాసన గురించి మీకు మాత్రం తెలియదా ఏమిటి?
    పదాలకు రంగూ రుచీ వాసనా ఉంటాయని మహాకవి శ్రీశ్రీ ఓ సందర్భంలో అంటారు. నిజమే మరి. అనడమే కాదు, తన రచనల్లో, ముఖ్యంగా కవితల్లో ఆ సంగతిని కలం ఝళిపించి నిరూపించాడు కూడా. అంతే కాదు, శ్రీశ్రీ పదాలకు కులుకూ, నడకా కూడా ఉన్నాయని ఆయన కవిత్వం చదువుతున్న ప్రతిసారీ నాకు అనుభవమవుతూ ఉంటుంది. మీకూ అంతే కదా, కాదంటారా?
    అనంతపురం విశాలాంధ్ర బుక్ హౌస్ కు వెళ్లిన ప్రతిసారీ లోపలికి కాలు మోపగానే పుస్తకాల వాసన గుప్పుమని కమ్మేస్తుంటుంది. అంతెందుకు, మీకిష్టమైన ఏదో ఒక పుస్తకం చదివెయ్యాలన్న నిర్ణయంతో, కాస్తంత విల్లింగ్ నెస్ తో మీ ఇంట్లోని మినీ లైబ్రరీ గదిలోకి వెళ్లి చూడండి, సదరు bibliosmia మీకు అనుభవమవుతుందో కాదో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *