తిరుమల అడవుల్లో జొన్నరాతి దిబ్బకు ఈవెనింగ్ ట్రెక్…

(భూమన్, ప్రొఫెసర్ కుసుమకుమారి)

అనుకోకుండా మళ్లీ ఒక సారి శేషాచలం అడవుల్లోకి వెళ్లే అవకాశం దొరికింది. ఈ సారి సూర్యాస్తమయానికల్లా చామలకోన కు  వెళ్లాలనుకున్నాం. అక్కడి శిఖరం మీది నుంచి సూర్యాస్తమయం చూడాలన్నది మా ఉద్దేశం.

మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల వేద పాఠశాలనుంచి కుమారధార వరకు నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేశాము. అక్కడి నుంచి  అన్నదమ్ముల బండ వైపు మళ్లాము. తర్వాత జొన్నరాతి దిబ్బ కు బయలుదేరాం.

 

ఈ యాత్రలో మా తోపాటు కొంతమంది అటవీ శాఖ అధికారులు ఉన్నారు.  జొన్నరాతి దిబ్బ  నుంచి  వై జంక్షన్ దాకా వెళ్లాం. వై జంక్షన్ నుంచి ఎడమవైపు ప్రయాణం చేసినట్లయితే తలకోన శిఖర బాగానికి చేరుకోవచ్చు.

భూమన్, శ్రీమతి ప్రొఫెసర్ కుసుమకుమారి

తలకోనలో మనకు కనిపించే జలపాతం పుట్టుక ఈ శిఖరం మీద చిన్న బుగ్గ (spring) లాగా కనిపిస్తుంది. వై జంక్షన్ నుంచి కుడి వైపు ప్రయాణిస్తే మనం మొగిలిపంటకు చేరుకోవచ్చు. దానిని రుద్రగళము, యుద్ధగళము అనికూడా అంటారు.

 

ఇక్కడ ఏమారితో లోయలోకి పడిపోవడమే…
దట్టమయిన అడవిలో నడక ఒక అద్భుతమయిన అనుభవం

ఈ రుద్రగళం మీదుగా తరిగొండ వెంగమాంబ  తరిగొండ నుంచి బయలుదేరి తలకోన మీదుగా మెుగిలిపంటకు వచ్చి కొన్నాళ్లు  తపస్సు చేశారని చెబుతారు. తరిగొండ వెంగమాంబ 18వ శతాబ్దపు  తెలుగు కవయిత్రి. ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు. వెంకటచల మహాహత్మ్యం, ద్విపద భాగవతం కావ్యాలు రాశారు. ఇది మూడు వందల సంవత్సరాల కిందటి మాట. ఇక్కడే ఆమె గీచిన ఆంజనేయుడి చిత్రం కూడా ఉంది.

తరిగొండ వెంగమాంబ గీచిన ఆంజనేయుడి చిత్రం

ఇది శిధిలా వస్థలో ఉంది. దీనిని మనం కాపాడు కొనకపోతే, అది మాయమైపోయే ప్రమాదం ఉంది.

అక్కడి నుంచి కొంచెం కుడివైపు వెళితే,  2500 సం. క్రితం నాటి ప్రాచీన మానవుడు గీచిన  చిత్రాలు (prehistoric art) కనిపిస్తాయి.

ఆదిమ మానవుడు గీచిన చిత్రాలు

అక్కడినుంచి దిగువకు ప్రయాణిస్తే, కెపి డ్యామ్- అన్నదమ్ముల బండ- తూవెలుగుండు-వై జంక్షన్ (దీనినే మూడు  రాళ్ల కురువ అని కూడా పిలుస్తారు)- మొగలిపెంట షెడ్-రుద్రగల తీర్థం-మూడేళ్ల కురువ-కంగిమడుగు- సిద్దలేరు ఏరియా- కుక్కలదొడ్డి(కోడూరు-తిరుపతి రూట్).

మూడేళ్ల కురవ, కంగుమడుగు, సిద్దలేరు, ఎర్రెడ్డి మడుగు, కలివిలేటి కోన, త్రిశూల తీర్థం వస్తాయి. ఇలా వెళితే బాలపల్లి మీదుగా కోడూరు చేరుకోవచ్చు.

కంగుమడుగు నుంచి అటు ఎడమవైపు వెళితే, గంజన జలపాతం వస్తుంది. ఈ సారి ఇవన్నీ తిరగకుండా మేము చామలకోన, అన్నదమ్ముల బండ చేరుకున్నాం. చామలకోన అందాలు ఎంత చూసినా తనివి తీరదు.

 

ప్రకృతిలో ఇంత సౌందర్యముందా అని చూపరులు ఆశ్చర్యపోతారు. ఇక్కడి  జొన్న తిప్పకు వెళ్లే దారి మలుపు ఎంత అద్భతంగా ఉంటుందొ. ఈ జొన్నరాతి తిప్ప అనేది శేషాచలం అడవుల్లో అత్యంత ఎత్తయిన శిఖరం. అక్కడి నుంచి సూర్యాస్తమయం చూడాలన్న మా కోరిక నెరవేరలేదు.  ఎందుకంటే, ఆ రోజు మబ్బు పట్టడం వల్ల సూర్యాస్తమయం కనిపించలేదు. సూర్యాస్తమయం చూడకుండానే వెనుదిరిగి  వచ్చినా, అనేక అద్భుతమయిన ప్రదేశాలను దారిపొడీతా చూసిన సంతృప్తి మిగిలింది.

అన్నదమ్ముల బండదగ్గిర నుంచి ఎడమవైపు వెళితే కూడా ప్రాచీన మానవులు గీచిన చిత్రాలున్నాయని అక్కడొక మిత్రుడుచెప్పాడు. అక్కడికి మరొక సారి వెళ్లాలనుకున్నాం. చామలకోన లోయలో కళ్యాణి డ్యాం వైపు నుంచి వచ్చినట్లయితే, ప్రాచీన కట్టడాలు చాలా ఉన్నాయని మరొక మిత్రుడు చెప్పాడు. వీటిని పరిశీలించేందుకు మరొక ట్రిప్ రాక తప్పదనపించింది.

రెండేళ్ల కిందట ఒక సారి కళ్యాణి డ్యాం దగ్గిర నుంచి ఆదారిన వెళ్లే ప్రయత్నం చేశాం. అది దట్టమయిన అడివి. ఏనుగులు సంచరించే ప్రాంతం. అపుడు మాప్రయత్నం ముందుకు సాగ లేదు. ఇపుడు మరొక సారి చేయాల్సిందే ననిపించింది.

ఈ అడవుల్లో ప్రయాణించే కొద్ది కొత్తవిశేషాలు బయపడుతుంటాయి. ఈసారి తెలిసిన విశేషం, కర్నాటక భక్తులు తిరుమల వచ్చే మార్గం. ఈ ప్రాంతంలో టెంకాయలకోన  అనే ప్రదేశం ఉంది. పూర్వం కర్నాటక నుంచి తిరుమల వచ్చే వాళ్లు ఈ కోనమీదుగా నడక సాగించే వారట. ఈ దారి కూడా అన్వేషించాల్సిన అవసరం ఉంది.

చామలకోనలో మూడు నాలుగు వ్యూపాయింట్స్ ఉన్నాయి. ఇంతవరకుఎపుడూ  వెళ్లని వ్యూపాయింట్ దగ్గిరకు ఈ సారి మేం వెళ్లగలిగాం. ఒకచక్కటి గోడలాగా  నిర్మించినట్లున్న కొండ ఒక అద్భతమయిన దృశ్యం. ఇక్కడికి చేరుకునేది దారి చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

ఏ మాత్రం స్లిప్ అయినా లోయలోకి పడిపోతారు. ఈ దారిలో  ఈత చెట్లన్నీ బాగా పండిన ఈత పళ్లతో నిండుగా ఉన్నాయి. వీటిని తినేందుకు ఎలుగుబంట్లు వస్తుంటాయి.ఈ సారి మాకు పెద్ద ఎలుగుబంటు కనిపించింది. అవి ఈతపళ్ల కాలంలో ఈ దారిలో విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.

కొంచెం చీకటి పడితే ఈ ప్రాంతంలో వన్యమృగ సంచారం ఎక్కువుతుంది. నాలుగయిదు రోజుల కిందట  ఇక్కడికి ఒక ఏనుగు కూడా వచ్చిందని,అది కుమారధార ప్రాజక్టులోని నీళ్లు తాగేందుకు వచ్చిందని అటవీ శాఖ అధికారి ఒకరు చెప్పారు.

ఏనుగుల లద్దెలు
శిఖరం మీద ప్రయాణం

ఇక ఎక్కువ సేపు అక్కడ ఉండ లేమని తెలుసుకుని సాయంకాలం ఆరుగంటల కల్లా తిరుగు పయాణం కట్టాం. ఈ సాయంసంధ్యలో అడివి వాతావరణ మారిపోవడం మనం దారిపొడుగునా గమనించవచ్చు.

చాలా జంతువులు ముఖ్యంగా జింకలు, నెమళ్లు సంచరిండం మొదలవుతుంది. రకరకాల జంతువుల,పక్షలు అరుపులతో అడవి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.  ఇదెంత ఆహ్లాదకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అందమయన, సహజ సౌందర్యం ఉట్టిపడే ప్రకృతిని చూడటం  కంటే మహాభాగ్యమేముంటుంది.  ఇలాంటి వాటికి పర్యాటకు లు వచ్చేలా పర్యావరణం దెబ్బతినకుండా ఏర్పాటు చేయాలి. అన్నదమ్ముల బండ నుంచి జొన్నరాతి తిప్పవరకు దారిలో అక్కడక్కడా బెంచీలు ఏర్పాటుచేస్తే, ప్రకృతి ప్రేమికులు కొద్ది సేపు ఇక్కడి ఆందాలను కూర్చుని ఆస్వాదించేందుకు వీలవుతుందని నా అభిప్రాయం.

ఇంటీరియర్ ఫారెస్టు లోకి కాకపోయినా, అనుమతించగలిగిన ప్రదేశాలకు సందర్శకుల రాకపోకలకు ఏర్పాటు చేస్తే, ప్రజల్లో ఈ ప్రకృతి

సౌందర్యం పట్ల అవగాహన పెరుగుతుంది. ప్రకృతిని కాపాడుకోవాలనే స్పృహ పెరుగుతుంది.  దీని వల్లే ప్రయోజనమే కాని, నష్టమేమీ లేదు.  ఈ విషయం మీద  తొలినుంచి నేను క్యాంపెయిన్  నిర్వహిస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రదేశాలకు యాత్రలను అనుమతిస్తే, వారి ఆరోగ్యమేకాలు, ఆరోగ్యకరమయిన ఆలోచనలు కూడా వస్తాయి. ఇలాంటి ఏర్పాట్లు గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి.

 

(భూమన్ ప్రకృతి ప్రేమికుడు, ప్రొఫెసర్ కుసుకుమారి, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం(అనంతపురం)మాజీ వైస్ చాన్స్ లర్)

 

One thought on “తిరుమల అడవుల్లో జొన్నరాతి దిబ్బకు ఈవెనింగ్ ట్రెక్…

  1. అడవి
    నువ్వు అంటే నాకిష్టం
    గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలి
    రుచి మరిగిన వాడిని నేను
    ఫాన్ విసిరే గాలిలో శరీరాన్ని ఆరేసు కొనడానికి
    అలవాటు పడ్డ వాడిని నేను
    అయినా అడవి నువ్వు అంటే నా కి ష్టం
    రేపటి లోకానికి ఈ నాటి తల్లి వి నీవు
    రేపటి ఆకాశానికి
    ఈ నా డే పూచిన సూర్య పుష్పా నివి నీవు
    నీ పేరు వింటే చాలు
    నా కు పూనకం వస్తుంది
    నీ చల్లని కను రెప్ప ల నీడలో నా వాళ్ళు సేద దీ రారు
    నీ కొమ్మ లే, నీ గాలు లే, నీ ఆకు లే సాక్షిగా
    నా వాళ్ళు నే లకు ఒరి గారు
    అడవి నా అడవి
    ఆ ఆయుధాలు దాచి ఉంచు
    ఆ బాణాలను ఏరి ఉంచు
    నీ తోడు అడవి
    ఈ దేశాన్ని ప్లాస్టిక్ విష పుష్పాల
    ఉద్యాన వనాల నుంచి రక్షించ డానికి
    ఏదొ ఒక నాడు నేనూ
    నీ సాయ మే కోర తాను
    – దే వీ ప్రియ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *