పానాసోనిక్ స్థాపించిన జపాన్ బాల కార్మికుడీయనే…

(సలీం బాషా)

జపాన్ లోని ఒక పిల్లాడు మారుమూల పల్లె లో పుట్టి, తొమ్మిదేళ్ల వయసులో స్కూల్ వదిలేసి, కుటుంబాన్ని పోషించడానికి ఏవో చిన్నచిన్న పనులు చేశాడు.

సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తను పనిచేసే షాప్ కి వెళ్లేవాడు. ఆ షాపు శుభ్రం చేయడంతో అతని దినచర్య ఆరంభమయ్యేది. అలాగే తన యజమాని పిల్లలను కూడా తనే చూసుకునేవాడు. కొన్నాళ్ళకు లక్కీగా ఒక ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో చిన్న పని దొరికింది. దాంతో ఆ పిల్లాడు ఎంతో సంబరపడ్డాడు.

అప్పట్నుండి బల్బులే అతని ప్రపంచమయ్యాయి ఎలక్ట్రిక్ బల్బులు తయారీ ని చూస్తూ అతను నిజంగా ఆశ్చర్యపోయేవాడు. ఆ ఎలక్ట్రిక్ బల్బ్ లతో ఎన్నో ప్రయోగాలు చేసేవాడు.

ఒక రోజు ప్రయోగాల్లో భాగంగా బల్బులు పెట్టడానికి ఒక కొత్త రకం సాకెట్ ను కనిపెట్టాడు. ఎంతో ఉత్సాహంతో దాన్ని తీసుకుని తన యజమాని వద్దకు పరుగెత్తుకొని వెళ్ళాడు.

అతని యజమాని దాని మీద ఆసక్తి చూపించలేదు. ఇది పనికి రాదు అని అన్నాడు. కానీ పిల్లాడు దాని పట్ల ఎంతో ధీమాగా ఉన్నాడు. తనంతట తానే ఒక ఫ్యాక్టరీ పెట్టి అలాంటి సాకెట్ లు తయారు చేసి అమ్మాలనుకున్నాడు.. అయితే దానికి సరిపడా డబ్బులు అతని వద్ద లేవు. పైగా పెద్దగా చదువుకున్నవాడు కాదు.

దాంతో నిరాశ నిస్పృహలకు గురి అయ్యి డీలా పడిపోయాడు. తన స్నేహితుల దగ్గరికెళ్ళి తన సమస్య గురించి వాళ్ళకు తెలియజేసి సహాయం చేయమని అడిగాడు. దానికి వాళ్ళు అతన్ని అపహాస్యం చేశారు.

దానితో ఆ పిల్లవాడు మరింత నిరాశ పడిపోయాడు. “నా దగ్గర డబ్బు లేదు, చదువు లేదు, అనుభవం అంతకన్నా లేదు. ఇలాంటి సమయాల్లో నేనేం చేయగలను” అని తీవ్రంగా ఆలోచించాడు.


నేలనుంచి నింగి దాక-1


అప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాడు. కొంతకాలం అక్కడే పని చేసి కొంత డబ్బు పోగు చేసుకోవాలనుకున్నాడు. అలాగే చేశాడు కూడా. అలా 22 ఏళ్ళ వయస్సులో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఒక చిన్న తయారీ సంస్థను మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు.

అతని ఇంటినే వర్క్ షాప్ లాగా మార్చేశాడు. భార్య, తను కలిసి ఎలక్ట్రిక్ సాకెట్ల ను తయారు చేయడం మొదలు పెట్టారు. కానీ ఒక్క సాకెట్ కూడా వాళ్లు అమ్మలేక పోయారు. నెలలు గడుస్తున్నా దుకాణదారులు ఎవరు వాటి మీద ఆసక్తి చూపలేదు. దాంతో అతను అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.

అప్పుడు అతనికి అన్ని ద్వారాలు మూసుకుపోయి నట్టు అనిపించింది. సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అతనికి ఎక్కడినుండో వెయ్యి సాకెట్ల ఆర్డర్ వచ్చింది. అది అతని జీవితాన్ని మార్చేసింది. దాంతోపాటు ప్రపంచ టెక్నాలజీ రంగానికి కూడా కొత్త ఆవిష్కరణలను అందించింది. అలా మొదటి ఆర్డర్ వచ్చి ఇప్పటికి వంద సంవత్సరాలు అయిపోయింది.

అప్పటినుండి ఇప్పటివరకు అతని ఆర్డర్ల ప్రవాహం ఆగలేదు. ఇప్పుడు ఆ కంపెనీ మహావృక్షంగా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది.

బ్యాటరీతో నడిచే సైకిల్ బల్బు అతను కనుక్కున్న ఉత్తమ ఆవిష్కరణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 1920 లలో కొవ్వొత్తులు, ఆయిల్ దీపాలను సైకిల్ దీపాలుగా ఉపయోగించారు అవి కొన్ని గంటలు మాత్రమే కొనసాగేవి. ఈ సమస్యని త్వరగా గ్రహించి, సమర్థవంతమైన సైకిల్ బల్బులు అభివృద్ధి చేయడం కంపెనీకి లాభదాయకంగా ఉంటుంది అని గ్రహించాడు. ఓవల్ ఆకారపు బల్బులను సృష్టించాడు. అలా ఓ కొత్త ఆవిష్కరణలకు నాంది పలికాడు.

1930లో తన కంపెనీ అమ్మకాలు పడిపోయిన నేపథ్యంలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఉత్పత్తిని సగానికి తగ్గించాడు. “మేము కార్మికులను తొలగించడం ద్వారా కాకుండా సగం రోజులు మాత్రమే పని చేయడం ద్వారా ఉత్పత్తిని సగానికి తగ్గించుకుంటాము.

వారు ఇప్పుడు పొందుతున్న వేతనాలను మేము చెల్లిస్తూనే ఉంటాము, కాని సెలవులు ఉండవు.” అని ప్రకటించాడు. ఈ వ్యూహం పనిచేసింది, సంస్థ నిలబడింది. అతని నాయకత్వ లక్షణాలకు, నిర్వహణ నైపుణ్యాలకు ఒక చక్కటి ఉదాహరణ ఇది.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో కంపెనీ చాలా నష్టపోయింది, కాని నాయకుడిగా అతని యొక్క అద్భుతమైన నైపుణ్యాల కారణంగా కంపెనీ బయటపడింది. యుద్ధానంతర కాలంలో, కంపెనీ వాషింగ్ మెషీన్లు, రైస్ కుక్కర్లు, ఎయిర్ కండిషనర్లు, అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్పత్తి-Monochrome టెలివిజన్లు (టీవీలు) వంటి పరికరాలతో ముందుకు వచ్చింది. 1950 లలో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది . అతను స్థాపించిన కంపెనీ తన మొదటి రంగుల టీవీ ని 1960 లో ఆవిష్కరించింది.

“మీరు బాగా చదువుకున్న, తెలివైన వ్యక్తి కావచ్చు, కానీ ఆ లక్షణాలు మిమ్మల్ని విజయవంతమైన వ్యాపారవేత్తగా చేయవు. మీరు చేపట్టే ప్రతి పని గొప్పదిగా ఉండాలి. అది నిజాయితీగా మీ పనితీరును ప్రతిబింబించాలి”. అన్న మాటలు అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

ఒక శతాబ్దం కిందట చదువు సంధ్య లేని ఒక బీద పిల్లవాడు వాడు దినదిన ప్రవర్ధమాన మై ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఆ పిల్లవాడు లేడు.. కానీ కంపెనీ ఉంది. ఇప్పుడు 272,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

దాని 100 వ సంవత్సరం (2018,) పూర్తయినప్పుడు వార్షిక ఆదాయం 72.32 బిలియన్ డాలర్లు. కంపెనీ నిరంతరం విజయాల నిచ్చెనను అధిరోహించింది. విజయవంతం కావాలనే సంకల్పం, అద్భుతమైన నిర్వహణ నైపుణ్యాల వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయి.

అతని జీవితం ఎందరికో స్ఫూర్తి. ఇంతకీ ఆ కంపెనీ పేరు చెప్పలేదు కదూ. దాని పేరు పానాసోనిక్ (panasonic)!! ఈ కథలోని పిల్లవాడే ఆ కంపెనీ యజమాని అయిన కోనోసుకే మట్సుషిత.(Konusuke Matsushita)
నేలనుండి నింగి కి ఎదిగిన తారాజువ్వలా దూసుకుపోయిన ఒక విజయవంతమైన వ్యాపారవేత్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *