తెలుగు నేల నీటి సమస్యను నిప్పుగా మార్చవద్దు: కెసిఆర్ కు సలహా

(టి.లక్ష్మీనారాయణ)

ఇపుడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నదీజలాల పంపకానికి సంబంధించి అమలులో ఉన్న బచావత్ ట్రిబునల్ తీర్పు ఉభయ రాష్ట్రాలకు శిరోధార్యం. ఆ తీర్పుకు అనుగుణంగానే కృష్ణా నదీ జలాలను వినియోగించుకోవడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలి.

మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్చను బచావత్ ట్రిబునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కల్పించింది. ఆ స్వేచ్చను బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ హరించింది.

దానిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ వ్యాజ్యంలో భాగస్వామి అయ్యింది.

సుప్రీం కోర్టులో ఆ కేసు తేలే వరకు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేదైనా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అదనంగా కేటాయించిన నీటి ఆధారంగా ప్రాజెక్టుల నిర్మాణం ముమ్మాటికి అక్రమమే.

కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అదనంగా కేటాయించిన నీటి ఆధారంగా అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకొన్నాయి.

కర్నాటక ప్రభుత్వం చేపట్టిన అలాంటి అక్రమ ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతి మంజూరు చేయడం దుర్మార్గం. దాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గార్లు గానీ ప్రశ్నించిన పాపానపోలేదు.

ఫై రాష్ట్రాల అక్రమ నీటి వినియోగాన్ని అరకట్టలేమని కేసీఆర్ గారు చేతులెత్తేస్తూ గతంలోనే బహిరంగ ప్రకటన చేశారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత ఎగువ రాష్ట్రంగా మారిన తెలంగాణ రాష్ట్రం (అక్రమంగా) నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ సక్రమమైనవే, ఆంధ్రప్రదేశ్ ప్రశ్నించకూడదు.

అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత ప్రాజెక్టులే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్మించి, వినియోగంలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కూడా అక్రమ నిర్మాణమే అంటూ రంకెలు వేస్తూ, అలంపూర్ సమీపంలో 60, 70 టీయంసిల సామర్థ్యంతో జలాశయాన్ని, భీమా ఉపనది కృష్ణా నదిలో కలిసే ప్రాంతంలో మరొక ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామంటూ ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిలో తీర్మానం చేయడం నీటి సమస్యను నిప్పుగా మార్చడమే.

రాష్ట్ర విభజన చట్టంలో కల్వకుర్తి, నెట్టంపాడు, తెలుగు గంగ, హంద్రీ -నీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులను మాత్రమే పెండింగ్ ప్రాజెక్టులుగా పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేపట్టిన ఎస్.ఎల్.బి.సి. ఎందుకు ఆ జాబితాలో లేదో తెలంగాణ సమాజం ఆలోచించాలి.

ఆ జాబితాలో లేని, జూరాల నుండి ప్రతిపాదించబడిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా శ్రీశైలం జలాశయం నుండి 800 అడుగుల నీటిమట్టం నుండి నీటిని తోడే పథకం అక్రమ ప్రాజెక్టుకాక, సక్రమ ప్రాజెక్టు ఎలా అవుతుంది.

బచావత్ ట్రిబునల్ వినియోగ ప్రాతిపదికపై ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించింది. పర్యవసానంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టియంసిల కేటాయింపు జరిగింది. జూరాల, రాజోలిబండ మళ్ళింపు పథకం, కేసీ కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువ మరియు దిగువ కాలువ, నాగార్జున సాగర్ కుడి మరియు ఎడమ కాలువలు, కృష్ణా డెల్టాకు విస్పష్టంగా నీటిని కేటాయించడం జరిగింది.

దాన్ని వక్రీకరించడానికి, ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించలేదని అడ్డగోలుగా వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబునల్ కేటాయింపులను మార్చడానికి వీల్లేదని విస్పష్టంగా తన తీర్పులో పేర్కొన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.

(టి.లక్ష్మీనారాయణ,సమన్వయకర్త,ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)

 

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/telangana-cabinet-flays-andhra-irrigation-projects/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *