ఈ రోజు ఆల్లోపతి డాక్టర్ల జాతీయ నిరసన దినం

(డాక్టర్ . యస్. జతిన్ కుమార్)   

దేశ వ్యాప్తంగా, భారత అల్లోపతీ వైద్యుల సంఘం జూన్ 18 న  డాక్టర్లపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక  రోజు  నిరసన దినం పాటిస్తున్నది.

కేంద్ర సంస్థ పిలుపులో భాగంగా తెలంగాణా రాష్ట్ర శాఖ సభ్యులు కూడా నిరసన దినం పాటిస్తున్నారు. ప్రజలు ఆరోగ్యపరంగా ఒక అత్యవసర స్థితి వున్న ఈ సమయం లో డాక్టర్లు నిరసనలకు, సమ్మెలకు పూనుకోవటం భావ్యమా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.    ఈ సందర్భం లో వైద్య రంగానికి చెందిన  కొన్ని సమస్యలు తప్పకుండా పరిశీలించాలి.   

గత ఏడాదిన్నరగా కొరొన కోరల లో చిక్కి దేశమంతా విలవిలలాడి పోతున్నది. అధికారిక లెక్కల ప్రకారం  2.9 కోట్ల మంది వ్యాధి బారిన పడ్డారు. 3.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తవంలో ఈ సంఖ్యలు ఇంతకు మించి  అనేక రెట్లు వుండవచ్చని అంతర్జాతీయ  అంచనాలు వున్నాయి. సామాన్య రోగులే కాదు, 740 మంది పైగా డాక్టర్లు, వేల మంది పారా మెడికల్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 2.85 కోట్ల మంది కరోనా వ్యాధి నుండి బయట పడ్డారు. కోట్ల మంది ప్రాణాలు కాపాడే విద్యుక్త ధర్మం నెరవేర్చుతూ  వైద్య సిబ్బంది తమ ప్రాణాలు బలి పెట్టారనేది వాస్తవం.

 ప్రాణ త్యాగం చేసిన వారే కాక ప్రతి నిత్యం మృత్యువు తో పోరాడుతున్న అనేక మంది రోగుల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అనేకమంది వైద్యులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. దేశంలో ఇప్పటికి  38 కోట్ల మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. 26 కోట్ల మందికి టీకాలు ఇచ్చారు. ఇదంతా, తాము కూడా వ్యాధి బారిన పడే అవకాశం హెచ్చుగా వున్నప్పటికీ, వారు  తమ విధులు నిర్వహించటం వల్లనే సాధ్యమయ్యింది.   

 ఇంత పెద్ద మహమ్మారి కబళిస్తుంటే సర్వ విధాలా ప్రయత్నం చేసినప్పటికీ, డాక్టర్లు  అందరి ప్రాణాలు కాపాడలేకపోవటం కూడా వాస్తవమే. అయితే కొన్ని మృత్యువులను ఆరికట్టటం సాధ్యమయి వుండేది అనే వాస్తవాన్ని కూడా అందరూ  అంగీకరించాలి. సరి అయిన మౌలిక వసతులు, అత్యవసర మందులు, ఆక్సిజన్  వంటివి పుష్కలంగా లభించి వున్నట్లయితే  మానవ విషాదం కొంతయినా  తగ్గించగలిగే వారము. 

కారణం ఏదైనా గాని , తమ వారిని  కోల్పోయిన వారు కొన్ని సందర్భాలలో , సంయమనం కోల్పోయి, అక్కడ ప్రత్యక్షం గా వున్న డాక్టర్లపై దాడులు చేస్తున్నారు. ఏ తప్పు చేయని డాక్టర్ల మీద భౌతిక దాడులు చేయటం, తీవ్రంగా గాయ పరచటం, జరుగుతోంది.  ఈ దాడులలో కొందరు వైద్యులు  ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. కనుక సహజంగానే డాక్టర్ల  సంఘాలు ఆందోళన వెలిబుచ్చటం జరుగుతోంది.  అవి తమ నిరసన తెలియ పరుస్తున్నాయి. తమ పై  భౌతిక  దాడులు ఆగిపోయేలా  తగు రక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 డాక్టరుకు, రోగికి మధ్య అతి దగ్గరిదైన , ఆత్మీయమైన సంబంధం వుంటుంది. పరస్పర విశ్వాసం వుంటుంది. ఈనాడు ఆ విశ్వాసం లోపించి వీరి మధ్య ఒక వైరుధ్యం చొచ్చుకుని వచ్చింది. ఏ క్షణంలో శత్రు కూటములు గా మారిపోతారో అనే సందిగ్ధ , అవాంఛనీయ వాతావరణం నెలకొని వుంది. డాక్టరు అంటే, ఆరోగ్యప్రదాతగా కాక తమ జేబులు, బాంకు ఖాతాలు లూటీ చేసే దోపిడిదారుగా కనిపిస్తున్నాడు. ఇక డాక్టర్లకేమో ఒక రోగి, అతని బంధువులు  నిస్సహాయ స్థితిత్లో చికిత్స పొందటానికి వచ్చిన మనుషుల్లా కాక, అనుకోనిది జరిగితే  తమ మీద దాడి చేయటానికి వచ్చిన గూండాముఠాలుగా  కనిపిస్తున్నారు. 

           ఈ నేపధ్యంలో తాము చికిత్స చేయగలిగి వుండి  కూడా అనేకమంది  డాక్టర్లు, భయ భీతులవల్ల కొద్దిపాటి క్లిష్టత, తీవ్రత గల రోగులను  అంగీకరించక, పెద్ద హాస్పిటల్ కు పంపించి వేయటం కూడా జరుగుతోంది. అందువల్ల ప్రజలు  ప్రభుత్వ రంగం లో అయితే ఊహించని శ్రమ దమాదులకు, సౌకర్యాలలేమికి, అధికార అలసత్వానికి గురి అవుతున్నారు.  ప్రైవేట్  రంగం లో అయితే   చికిత్స ఖర్చులు తడిసి మోపడయి, ప్రజలకు భరించలేనివి గా మారి ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు.  ఈ స్థితిలో ప్రాణనష్టం సంభవించగానే ఆగ్రహోద్రేకంతో బ్రద్దలవుతున్నారు. ఈ స్థితిలో రంగ ప్రవేశం చేసి  తమ స్వప్రయోజనం కోసం  పరిస్థితిని  విషపూరితం చేసి తమ ప్రాభవాన్ని, ప్రభావాన్ని పెంచుకునే ‘మధ్యవర్తుల’, ‘పెద్దమనుషుల’  పాత్ర తక్కువేమీ  లేదు. అనేక సందర్భాలలో మీడియా కూడా సత్యాసత్యాల  విచక్షణ చూపకుండా పరిస్థితి విషమించటానికి  తెలిసో, తెలియకో  దోహద  పడుతోంది.

ఈ కోరోనా విజృంభణ  వల్ల మన దేశంలోని ఆరోగ్య రంగం ఎంత బలహీనంగా వున్నది ప్రజలు కూడా గ్రహించ కలిగారు. ప్రాధమిక వైద్య సౌకర్యం నుండి ఉన్నత స్థాయి పరిరక్షక కేంద్రాల వరకు “పైకి పటారం, లోన లొటారం” అన్న స్థితి  తెలియ వచ్చింది. దశాబ్దాల కాలంగా ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాల నేర ఫలమే ఇది. జాతీయ ఉత్పత్తిలో కనీసం 1.5% కూడా ఆరోగ్య రంగం మీద ఖర్చు చేయకుండా, రోజు రోజుకూ పెరిగిపోతున్న జనాభా అవసరాలకు ఏ మాత్రం సరి తూగని వసతులు, సదుపాయాల తో కాలం నెట్టుకు వస్తున్న ఆరోగ్య రంగం ఇది. దీనికి పూర్తి బాధ్యత ఇన్నాళ్లుగా నిర్లక్ష్యం వహించిన పాలక వ్యవస్థ దే.  

వ్యాధి గ్రస్తులను అపారమైన నష్టాలకు, అంతులేని యాతనలకు గురి చేస్తున్నది  ప్రణాళిక రహితంగా,  బాధ్యతా రహితంగా కేవలం మెరమెచ్చు మాటలతో  హడావుడి చేస్తున్న  ప్రభుత్వాలు. నిందను మోస్తున్నది , ప్రజల ఆగ్రహానికి గురవు తున్నది  మాత్రం, అరకొర  సాధనాలతో, చాలీ చాలని సిబ్బందితో, అత్యధిక సంఖ్యలో వస్తున్న రోగులకు సంతృప్తికరంగా  చికిత్సలను అందించలేక మధన పడుతున్న డాక్టర్లు.  ఇక అటు ప్రైవేటు రంగంలో కొన్ని సంస్థల అక్రమ పద్ధతులకు,   యాజమాన్యపు లాభార్జన ఆశలకు, మరోపక్క ప్రజల కోపోద్రిక్తతలకు  మధ్య నలిగి పోతున్నది కూడా డాక్టర్ లే. యే వృత్తిలో అయినా అతి కొద్దిమంది తమ బాధ్యతను సరిగా నిర్వహించరనటం తెలిసినదే. వైద్యరంగం కూడా దానికి మినహాయింపు కాదు.                       

చేయని తప్పుకు, డాక్టర్లను శిక్షించటం భావ్యమా విజ్ఞులు ఆలోచించండి, రోగిని కాపాడటానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్న వారి పై ఈ విధమైన పైశాచిక  దాడులు చేయటం ఏ నాగరిక సమాజమైనా ఆమోదిస్తుందా? డాక్టర్లపై జరుగుతున్న ఈ అమానవీయ, దారుణమైన దాడులను తీవ్రంగా ఖండించవలసిందే.  వైద్యులు ప్రాణాలు నిలబెట్టేవారే కానీ, ప్రాణాలు తీసే వారు కాదు. వారి చేతిలో లేని ,అనివార్యమైన పరిస్తితులలో  ప్రాణాలు కాపాడలేని నిస్సహాయ స్థితి ని వారు కూడా  భరించలేరు. మృతుని ఆత్మీయులతోపాటు డాక్టర్లు కూడా ఎంతో వేదనకు గురవుతారు. 

ఆ స్థితిలో వున్న వారి పై అమానుష దాడులు జరగటం ఒక ఆటవిక ప్రవృత్తిని సూచిస్తుంది, ఇటువంటి అకారణ, అనాలోచిత దాడులను డాక్టర్లు మాత్రమే కాదు సమాజంలోని  అందరూ నిరసించాలి. విజ్ఞత తో వ్యవహరించి పరిస్థితిని మానవీయం చేసుకుందాం. డాక్టర్లు నిర్భయంగా తమ విధి నిర్వహణ చేసి, బాధ్యతతో మరిన్ని ప్రాణాలు కాపాడే  వాతావరణం నెలకొలపాలి, అయితే దీనికి డాక్టర్లు-సమాజాన్ని, ప్రజలను నిందించటం, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయటం మార్గం కాదు. అలాగే వైద్యుల మీద దాడి చేస్తే పరిస్థితులు బాగుపడవని ప్రజలు గుర్తించాలి.

డాక్టర్లు ప్రజలలో భాగమే. ప్రజారోగ్య సంరక్షణ వారి ప్రధమ బాధ్యత. ప్రజలకు, డాక్టర్లకు మధ్య ఏర్పడుతున్న వివాదాలకు కారణం ఏమిటో ఇరువురు గుర్తించాలి, గ్రహించాలి. ఆరోగ్య రంగాన్ని మెరుగు పరచటానికి ఇరువురూ కలిసి ప్రయత్నించాలి.   ప్రజారోగ్య రంగాన్ని గాలికి వదిలివేసి, 75% కార్పొరేటు, ప్రయివేటు సంస్థల ఆధీనం చేసిన ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి అవసరమైనప్పుడు  కూడా ప్రైవేట్  రంగలో వున్న మౌలిక వసతులను సమాజ  శ్రేయస్సుకు  ఉపయోగించుకోని  ప్రభుత్వ నిరాసక్తతను నిలదీయాలి. ప్రజల అవసరాలను తమ పెచ్చుమీరిన లాభ మార్గాలుగా  మలచుకుంటున్న ఆధిపత్య సంస్థలను కట్టడి చేయలేని ప్రభుత్వ అసమర్థతను  ఎండగట్టాలి .  

వ్యాధులకు చికిత్స లభించటం కాదు, వ్యాధులను నివారించేలా వ్యవస్థను తీర్చి దిద్దాలి. గ్రామీణ స్థాయి నుండి నగర స్థాయి వరకు కుంగి కునారిల్లుతున్న ప్రజారోగ్య వ్యవస్థకు  తిరిగి  ప్రాణ ప్రతిష్ఠ చేసేలా ప్రభుత్వాన్ని నిలదీయాలి. పాలక విధానాలన్నీ అధిక ప్రజల ప్రయోజనాలకే  రూపుదిద్దేలా ఉద్యమించాలి.  ఆ ఉద్యమంలో ప్రజలూ, వైద్యులూ  అవిభాజ్య భాగాలు. ఐక్యంగా సాగవలసిన మిత్రులు. ఆ మైత్రి పరిఢవిల్లితేనే  డాక్టర్లపై భౌతిక దాడులు ఆగిపోతాయి. పోలీస్ రక్షణలు, ప్రభుత్వం చేసే  కఠినమైన చట్టాలు ఈ సమస్యకు పరిష్కారం కాలేవు. ప్రజల, డాక్టర్ల మధ్య విభేదాలు పెంచుతూ పాలకులు తమ బాధ్యతారాహిత్యాన్ని కప్పి పుచ్చుతున్నారు. తస్మాత్ జాగ్రత్త !         

డాక్టర్లకు-సమాజానికి మధ్య సామరస్యం  వర్ధిల్లాలి. రక్షించే వాళ్ళను రక్షించుకోండి.   

(డాక్టర్ . యస్. జతిన్ కుమార్, ఆర్థోపేడిక్ సర్జన్, హైదరాబాద్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *