కృష్ణా బోర్డు ( KRMB ) కార్యాలయం రాయలసీమలోని కర్నూలులో ఏర్పాటు చేయాలని అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాయలసీమ ఉద్యమ సంస్థలు నిర్ణయించాయి. అశోక్ చొరవతో నిన్న జరిగిన అంతర్జాల సమావేశంలో ఆమేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమావేశంలో నా అభిప్రాయం…
విభజన చట్టం ప్రకారం కృష్ణా యాజమాన్య కార్యాలయం ఏపీకి వస్తుంది. ఏపీ ప్రభుత్వం ఎక్కడ కోరితే అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలి. కార్యాలయ పరిధి తెలంగాణ , ఏపీ ప్రభుత్వం మధ్య కృష్ణా నది జలాల వినియోగంపై ఏర్పడే వివాదాలను పరిష్కరించడం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కృష్ణ నీరు ఏపీకి వచ్చే వాటా పూర్తిగా రాయలసీమ , వెలుగొండ ప్రాజెక్టుల కోసం ఉపయోగించాలి. అంటే సమీప భవిష్యత్తులో కృష్ణ నీరు రాయలసీమకు చెందుతుంది. కృష్ణా నదికి ఏపీలో ముఖద్వారం కర్నూలు. తెలంగాణ రాజధానికి అత్యంత సమీపంలో కర్నూలు ఉంటుంది. సహజ న్యాయసూత్రాలను పరిగణనలోకి తీసుకొన్నా , పాలన సౌకర్యం రీత్యా చూసినా కర్నూలు నగరంలో బోర్డు ఏర్పాటు చేయడం ధర్మం.
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని నిర్మాణం చేస్తామని చట్టం చేసింది. అదే చట్టంలో హైకోర్టుతోబాటు న్యాయ స్వభావం కలిగి ఉన్న సంస్థలు ఏర్పాటు అని పేర్కొన్నారు. బోర్డు కూడా వివాదాలు పరిష్కరించే వేదిక. అందుకే కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలొనే ఏర్పాటు చేయాలి.
రాజకీయ పార్టీలు నేడు ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా నేటికి బోర్డు కార్యాలయం రాయలసీమ హక్కుగా ఉన్నది అన్నా 2014 నుంచి ఈ అంశాన్ని భుజానికెత్తుకొని పోరాడుతున్నా రాయలసీమ ఉద్యమ సంస్థలదే. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. హైకోర్టు రాయలసీమ ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఏపీ ప్రభుత్వం అసంబద్దంగా విశాఖపట్నంలో బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పొరబాటు నిర్ణయం. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని న్యాయ రాజధాని కర్నూలులో కార్యాలయ నిర్మాణం చేయాలి. ప్రజలను నిత్యం అప్రమత్తం చేయడం రాయలసీమ ఉద్యమ సంస్థల బాధ్యత. ఈ కృషిలో రాజకీయ అనుబంధాలు పక్కన పెట్టి ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడు KRMB కార్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న కల సాకారం అవుతుంది.
-మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి