సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ… ఏం రాశారంటే

తేదీః 17-06-21

గౌరవనీయులైన
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు

రాష్ట్రంలో ఇప్పటికే వరుస విపత్తులతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ధాన్యం బకాయిలు సరైన సమయంలో చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

చెల్లించాల్సిన బకాయిలు రోజురోజుకూ పెరిగిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట బీమా చెల్లింపుల్లో, ధాన్యం బకాయిలు చెల్లించడంలో, మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడంలోనూ విఫలమయ్యారు.

రైతు ప్రభుత్వం అని చెప్పి.. ఆ రైతులనే నిండా ముంచే విధానాలను అవలంబిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమచేసే విధానాన్ని అమలు చేశాం. మీరు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపు గడువును 21 రోజులకు పెంచారు.

అయినా ఆ గడువులోపు రైతులకు నగదు ఇవ్వడం లేదు. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేసి రెండు నెలలు దాటినా ఉలుకూ, పలుకు లేదు. ఈ నేపథ్యంలో పంటలు పండించేందుకు తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు?

ఖరీఫ్ కు పెట్టుబడులు ఎవరిస్తారు? ఇప్పటికే రబీకి అన్నదాతలు అప్పులు చేశారు. రైతులకు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయి. వాటిని ఎవరు భరిస్తారు?

అన్నదాతలను ఈ ప్రభుత్వం అప్పులు పాలు చేస్తోంది. రైతులు అమ్మిన ధాన్యం డబ్బులు కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

రైతులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.4వేల కోట్ల పైనే ఉన్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చాలావరకు రైతులు ధాన్యం విక్రయించగా రైతులకు నగదు జమ కాలేదు.

ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2500 కోట్లు బకాయిలు ఉన్నట్లుగా రైతులు చెబుతున్నారు. తక్షణమే ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించాలి. ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఇప్పటివరకు కేవలం 27.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. 45 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి విస్మరించారు.

రాయలసీమలో 2020 ఖరీఫ్ లో ప్రకృతి విపత్తుల వల్ల మొత్తం వేరుశనగ పంట నష్టపోయింది. రైతులకు చెల్లించాల్సిన ఇన్ పుట్ సబ్సీడీ ఇంతవరకు చెల్లించలేదు. ఎప్పుడిస్తారో కూడా వెల్లడించడం లేదు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లూ అరకొరగా చేశారు. బకాయిలు కూడా చెల్లించలేదు.

ధాన్యం ఏ- గ్రేడు రకం క్వింటాల్ ధర రూ.1,888 ఉండగా, సాధారణ రకం రూ.1,868 ఉంది. 75 కిలోలకు రూ.1,416 చెల్లించాలి. రైతు ఇంటికి వచ్చిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నారు.

గతంలో ఎన్నడూలేని విధంగా బీపీటీ-54 రకం ధాన్యం 75 కిలోల బస్తాను రూ.1050కు కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్‌లో ధాన్యం క్వింటాళ్లు రూ.11వందల నుంచి రూ.1350కు కొనుగోలు చేస్తున్నారు.

రైతులు క్వింటాలుకు రూ.300 నుంచి రూ.800 వరకు నష్టపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు ప్రైవేట్‌ వ్యాపారుల ధరలకు పొంతన లేదు. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదు. ఆరుగాలం కష్టించిన శ్రమ వృథా అవుతోంది.

ధాన్యం కొనుగోలుకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పేరుతో హడావుడి చేస్తున్నారు. రాష్ట్రంలో 16 లక్షల పైనే కౌలు రైతులు ఉన్నారు. ఇప్పటికే మీ చేతగానితనంతో ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి సాయం అందడం లేదు.

సున్నావడ్డీ రుణాలు, పంట బీమా, ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లోనూ తీవ్రంగా నష్టపోయారు. తెలుగుదేశం హయాంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి వారికి అండగా నిలబడటం జరిగింది.

ఆ విధానాలను ఎందుకు రద్దు చేశారు? రైతు భరోసా పథకంలోనూ కౌలు రైతులకు మొండిచేయి చూపారు. వీరికి విత్తనాలు, ఎరువులు కూడా అందని పరిస్థితి. మరోవైపు 16 లక్షల మంది కౌలు రైతులకు భరోసా ఇస్తామని చెప్పి.. చివరకు 41 వేలకు కుదించారు.

ఇప్పుడు ప్రభుత్వ అసమర్థత వల్ల కౌలు రైతులు ధాన్యం కూడా అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ చర్యలతో కౌలు రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఈ-క్రాప్ లో నమోదు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మిల్లర్లు, వైకాపా నాయకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారు.

మీ నిర్లక్ష్యంతో ఈ-క్రాప్ బుకింగ్ పై అవగాహన కల్పించకపోవడంతో అనేక మంది పేర్లు నమోదు చేసుకోలేదు. దీంతో నష్టపోతున్నారు.

పంటచేలో పనిచేసుకోవాల్సిన రైతుల్ని రోడ్డున పడేసి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను ఆదుకోవాలి.

వరితో పాటు అపరాలు, నూనెగింజలు పంటలు పండించిన రైతులు కూడా తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పెసర, మినుములు, కందులు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు మార్కెట్లు లేక, దళారులకి అమ్మితే కనీస మద్దతు ధర లభించక నష్టపోతున్నారు.

టమోట, మామిడి, జొన్న, మొక్కజొన్న, అరటి, మిర్చి, కొబ్బరి, సుబాబుల్, రొయ్యలు సాగుచేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. కడియంలో పూల విక్రయాలు పడిపోవడంతో రహదారి పక్కనే పారబోయడం చూశాం. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలి. ఆయా పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన పంటలకు తక్షణమే చెల్లింపులు జరపాలి.

-నారా చంద్రబాబునాయుడు
ప్రతిపక్ష నేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *