శనివారం పొద్దునే సరిగ్గా 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మరొకసారి పెరిగాయి. ఈ నెలలో ఇలా ధరలు పెరగడం ఏడోసారి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, లీటర్ డీజిల్‌పై 25 పైసలు పెరిగింది. ప్రభుత్వం పెంచింది పైసల్లోనే మనం చెల్లించేది రుపాయల్లో. ఆందుకే ప్రతిరోజూ భారతదేశంలో ధరలు పెరిగిన బాధతో మన జీవితం ప్రారంభమవుతుంది.
అసలు పెట్రోలు ధరలు ఎలా పెంచుతారు?
సాధారణంగా వస్తువుల ధరలు వాటిని తయారు చేసేందుకు అయ్యే ఖర్చును బట్టి నిర్ణయిస్తారు. ఇండియాలో పెట్రోలు, డిజిల్ ధరలను , ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వగైరా ఆయిల్ కంపెనీలు ముడిచమురును కొని రిఫైన్ చేసి పెట్రోలు, డీజిల్ తయారు చేసేందుకు అవుతున్న ఖర్చు ప్రకారం నిర్ణయించడం లేదు.
భారతదేశంలో ఇపుడు డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్(Dyanmic Pricing Mechanism: DPM)అమలులో ఉంది.ఈ సిస్టమ్ లో పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ముడిచమురు ధరతో ముడిపడి ఉంటాయి. ముడి చమురు ధర డాలర్లలో ఉంటుంది. దానిని రూపాయల్లోకి మార్చాలి. అంటే ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్ ధర పెరగినపుడే కాదు, రుపాయ ధర పడిపోయినపుడల్లా కూడా పెట్రోలు, డిజిల్ ధరలు పెరుగుతూ ఉంటాయి.
పెరిగిన ముడిచమురు ధరకు భారతదేశంలో భారీ వడ్డింపులుంటాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే టాక్స్ లు, డీలర్ల కమిషన్, వ్యాట్ అన్ని కలిసే సరికి తడిసి మోపెడవుతాయి. మన పెట్రోలు డీజిల్ ధరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టాక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వచ్చేది ఇందులోనే. అందువల్ల ఈ ప్రభుత్వాలు విపరీతంగా ఉచిత సంక్షేమ పథకాలు పెట్టే డబ్బంతా ఇందులో నుంచే వస్తుంది. అందువల్ల ఏ ప్రభుత్వం ఏపుడూ పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించదు. నిజానికి క్రూడాయిల్ ధరలు విపరీతంగా పడిపోయి పాతాళం చేరుకున్నపుడు భారతదేశంలో ధరలు తగ్గడానికి బదులు పెరిగాయి. అపుడు భారత ప్రభుత్వం పెట్రోల్ , డిజిల్ మీద లీటర్ కు రు. 13 నుంచి రు.16దాకా ఎక్సైజ్ సుంకం పెంచి ప్రజల నడ్డి విరిచింది. అపుడు రాష్ట్రాలు వూరు కున్నాయా? అవి సేల్స్ టాక్స్/వ్యాట్ పెంచాయి.
డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అనేది 2017 జూన్ 16న అమలులోకి వచ్చిం. అంతకు ముందు అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం (Administered Price Mechanism: APM) అమలులో ఉండింది. ఎపిఎం రోజులలో ప్రతినెల ఒకటో తేదీన, 16వ తేదీన ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేవాళ్లు. ప్రభుత్వాలు టాక్స్ లు భారీగా పెంచుతున్నాయ్ కాబట్టి ప్రతినెల ఒకటో తేదీన, 16 వ తేదీన భారీ గా పెంచితే ప్రజలు ఆందోళన చెందుతారని మోదీ ప్రభుత్వం ఎపిఎం నుంచి డైనమిక్ ప్రైస్ మెకానిజమ్ కు మారింది. కాని అసలు ఉద్దేశం ఏమోకాని రోజూ ధరలు పెరగడం ప్రజలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంది.
ఎందుకంటే రోజులు ధరలు పెరిగితే, పైసల్లోనే ఉంటాయి కాబట్టి ప్రజలకు నొప్పి తెలియదు అని మోదీ ప్రభుత్వం భావించింది. అందుకే మీరు గమనించారో లేదో ధరలు ఎపుడూ పైసల్లోనే పెరుగుతూ ఉంటాయి. ః
రుపాయల్లో పెరగడం చాలా అరుదు. ఉదాహరకు ఈ రోజు అంటే శనివారం (జూన్ 12, 2021) పెట్రోల్, డీజిల్ ధరలు మరొకసారి పెరిగాయి. ఈ నెలలో ఇలా ధరలు పెరగడం ఇది ఏడోసారి. లీటర్ పెట్రోల్‌పై కేవలం 28 పైసలు, లీటర్ డీజిల్‌పై కేవలం 25 పైసలు పెరిగింది.
విడిగా చూస్తే పెరిగింది పైసలే. కాని ఇది ఏడోసారి ఈనెలలో. ఈ నెలాఖరుదాకా పైసలను లెక్కించండి. రుపాయలవుతాయి. ప్రభుత్వం పైసలలో ధరలు పెంచి నొప్పి తెలియకుండా టాక్స్ సుత్తితో మొత్తాలనుకుంది. కాని, అలా జరగడం లేదు. ధరలు పెగడమే కాని, తరగడం లేదు.
ఇపుడు దేశంలో లీటర్ పెట్రోలు ధర రు.100 సమీపిస్తా ఉంది. చాలా చోట్ల రు.100 దాటింది. హైదరాబాద్ లో పెట్రోలు ధర రు.99.62 పైసలు, డీజిల్ ధర రు.94.57 పైసలు అయింది. ఇక విజయవాడలో పెట్రోలు ధర రు. 102.11పైసలు, డీజిల్ ధర 96.49 పైసలకు చేరుకుంది.
డైనమిక్ ప్రైసింగ్ మెకానిజం ప్రకారం, ప్రతిరోజూ పొద్దున ఆరుగంటలకు పెట్రోలు, డీజిల్ ధరలను సవరిస్తారు. అందుకు మనకు రోజు పొద్దున కళ్లు తెరవగానే వినిపించే దుర్వార్త, పెట్రోలు ధరలు పెరగడం. ధరలు పెరగడంతో మన జీవితం ప్రారంభమవుతుంది.