విత్తనం వేసి ఆకాశం వేపు చూసే దౌర్భాగ్యం రాయలసీమది… ఎన్నాళ్లిది!

(వి. శంకరయ్య)

గొంతుక జీర పోలేదు. రెండేళ్లుగా ఊపిరి బిగబట్టి వుండిన సీమ గొంతుక వున్నట్లుండి మే 31 వతేదీ అనూహ్యంగా గర్జించింది. సీమలో 51 శాసన సభ స్థానాలు వుంటే 49 స్థానాలు కైవశం చేసుకున్న వైకాపా ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగానే ఈ పరిణామం భావించాలి. పాదయాత్ర సందర్భంగానూ తదనంతర కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన బాసలు హామీలు సీమ వాసులు ఇంకా మరచి పోలేదు.

అందుకు విరుద్ధంగా సంభవిస్తున్న పరిణామాలను ఉద్యమ కారులు జీర్ణించుకోలేకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేడు రాయలసీమలో తీవ్ర మైన మథనం కొనసాగుతోంది. కొందరు మనసు విప్పి మాట్లాడ లేకున్నారు. కొందరు ఆగ్రహంతో ఊగి పోతున్నారు. మరి కొందరు ఈ పరిణామాలను భరించ లేకున్నారు. వీరంతా టిడిపి హయాంలో సీమ పరిరక్షణ కోసం పోరాడిన ఉద్యమ కారులే!

గత సంవత్సర కాలంగా సీమ సోషల్ మీడియా పరిశీలిస్తే రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వమొచ్చినా సీమ తల రాత మారదనే నిరాశతో కూడిన ఆగ్రహం ప్రధానంగా సీమ (ఆక్టివిస్టులు) యువత లో వ్యక్తం కావడం గమనించ గలం.

యాదృచ్చికంగా మే 31 వతేదీ సిద్దేశ్వరం అలుగు ప్రజా పునాది వార్షికోత్సవం రావడంతో రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో సిద్దేశ్వరం అలుగుతో పాటు సీమ పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు సత్వరం చేపట్టాలనే డిమాండ్ తో కరోనా నిబంధనలు దృష్టిలో పెట్టుకుని “ఇంటి సత్యాగ్రహం” నిర్వహించినారు.ఇది సరి కొత్త మలుపు.

అయితే తాజాగా వారం రోజుల్లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు సీమలో సాగుతున్న అంతర్మధనానికి ప్రతి రూపంగా వుంది. సీమ ఆక్టివిస్తులు కొందరు టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ తో సమావేశం కావడంపై మరి కొందరు విరుచుకు పడ్డారు.

ఈ సంఘటనకు పూర్వ రంగ ముంది. టిడిపి హయాంలో సీమ పరిరక్షణ పేర ఉద్యమం సాగింది. ఇందులో పలువురు పాల్గొన్నారు. టిడిపి పాలన ముగిసి వైకాపా అధికారంలోనికి వచ్చి రెండేళ్లయినా ఆశించిన మార్పు రాలేదు.

ఫలితంగా రాజకీయాలతో నిమిత్తం లేకుండా సీమ పరిరక్షణ కోసం గతంలో పోరాటం చేసిన పలువురు యువకులు ప్రస్తుతం టిడిపి నేత లోకేష్ తో సమావేశమయ్యారు. కాని కేవలం రాజకీయ కారణాలతో ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇది కంటగింపు అయింది.

ఈ సందర్భంలో కొందరు వాడిన భాష అభ్యంతరంగా కూడా వుంది. అంతే కాదు. వీరికి సీమ ఆక్టివిస్తులుగా ఎవరు అధికారం ఇచ్చారని కొన్ని పోస్టులు చూచాను. ఇది మరీ చోద్యంగా వుంది. నాయకత్వం ఒకరు ఇస్తే వచ్చేది కాదు. ఎవరు ముందుండి చొరవ తీసుకొంటే ప్రజలు వారికి పట్టం గడతారు.

ఏది ఏమైనా ఈ పరిణామాలు అవాంఛనీయమైనవి. ఇంత ఎందుకు చెబుతున్నానంటే వాస్తవంలో సీమ పరిరక్షణ ఉద్యమం గొంతుక జీర పోలేదు. అది మే 31 వతేదీ గర్జించింది. తిరిగి క్రియాశీలమైన యువత మరో పోరాటానికి సరైన రహదారి ఎంచుకుంటున్నారు.

ఇదిలా వుండగా మే 31 వతేదీకి చారిత్రక నేపథ్య ముంది. టిడిపి హయాంలో 2016 మే 31 వతేదీ కృష్ణ నదిపై సంగమేశ్వరం వద్ద తీవ్ర నిర్భంధాల మధ్య రైతులే సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి పునాది రాయి వేశారు. అంతేకాదు. సిద్దేశ్వరం కు అంత కన్నా మించి మరొక చారిత్రక ప్రాధాన్యత వుంది.

అవిభక్త మద్రాసు రాష్ట్రంలో కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు నిర్మించేందుకు రూపకల్పన జరిగినప్పుడు ఇచ్చటనే రిజర్వాయర్ నిర్మించాలను కున్నారు.

ఈ పథకం ద్వారా తమిళ నాడుకు ఏమేరకు నీళ్లు తరలించుకు పోయేవారో ఏమో గాని ఇది అమలు జరిగి ఉంటే రాయలసీమ జిల్లాల్లో దాదాపు పది లక్షల ఎకరాలకు ఆనాడే శాశ్వత సాగునీటి వసతి కలిగేది.

ఇది ప్రధమంగా రాయలసీమకు జరిగిన అపకారం. తదనంతరం కూడా సీమ వాసులు మరొక మారు మోస పోయారు. రాయలసీమకే చెందిన ఒక నేత ముఖ్యమంత్రిగా వున్నా సిద్దేశ్వరం వద్ద రిజర్వాయర్ కాకుండా శ్రీ శైలం వద్ద కేవలం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.

ఈ సందర్భంలో గమనార్హమైన అంశ మొకటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆవశ్యకత గురించి ఆనాడు పోరాడిన వామపక్ష ప్రజాతంత్ర శక్తులు అంతకు మించి ఎక్కువగా శ్రీ శైలం వద్ద జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణం వద్దని సిద్దేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరగాలని కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ఆగి పోయినందున ఫలితంగా రాయలసీమకు సిద్దేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించితే సాగు నీటి వసతి కల్పించ వచ్చని ఆందోళన చేశాయి.

ఈ తరం వారికి ఇది తెలియని అంశం. సిపిఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య సిపిఐ నేత వైవి కృష్ణారావు రచనలు ప్రకటనల్లో ఈ అంశం గమనించ గలం. శ్రీ శైలం కేవలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా నిర్మింపబడి మరొక మారు సీమ కు అన్యాయం జరిగింది.

ఇంతటి చారిత్రక నేపథ్యం గల సిద్దేశ్వరం ప్రాజెక్టు హుష్ కాకి అయినా సీమ వాసుల్లో ఇది సెంట్ మెంట్ గా మిగిలి పోవడమే కాకుండా కృష్ణ నదిలో ప్రవాహం తగ్గి పోతున్న నేపథ్యంలో సీమ అవసరాలు తీర్చే పథకంగా సిద్దేశ్వరం అలుగు పథకం అవతరించింది.

రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బారాయుడు సిద్దేశ్వరం అలుగుతో పాటు గుండ్రేవుల రిజర్వాయర్ కొరకు వయసుపై బడినా పడిన శ్రమ అనన్యం. కాని ప్రస్తుతం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. .

ఈ సందర్భంలో ఒక విషయం గమనించాలి. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల ప్రజల మనోభావాలకు సీమ వాసుల ఆశలు ఆకాంక్షలకు స్పష్టమైన సరళ రేఖ వుంది. సీమ వాసుల్లో ఎవర్ని కదిపినా వయసుతో వృత్తితో నిమిత్తం లేకుండా నీళ్లు నీళ్లు తప్ప వేరే మాట వినిపించదు.

నీళ్ల కోసం మొహం వాచి పోవడమే ఇందుకు కారణం. కనీసం తాగునీరు లేకుండా వలసలు పోవడమే ఇందుకు ప్రాతిపదిక. తరతరాలుగా గొంతెండి పోతున్న సీమ వాసుల గొంతు నుండి మరొక మాట ఏలా వస్తుంది?

పొలంలో విత్తనం వేసి ఆకాశం వేపు చూచే దౌర్భాగ్యం పోయి గొంతెండి పోతున్న తమకు నీళ్లిచ్చే వరకు వలస బతుకులు అంతం చేసే వరకు సీమ వాసుల్లో అసంతృప్తి ఆగ్రహం ఆందోళన నివారించడం ఎవరి తరమూ కాదు.

(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *