చినవీరభద్రుడికి ఎన్టీఆర్ అవార్డు మీద చర్చ…

(ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఉన్నతోద్యోగి అయిన వాడ్రేవుకు చిన వీరభద్రుడికి ఆ మధ్య ఎన్టీఆర్ తెలుగు భాష పురస్కారం లభించింది. దీనిని ప్రకటించింది ఎన్టీర్ భార్య లక్ష్మీ పార్వతి.  ఇంగ్లీష్ అదే పనిగా ప్రోత్సహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో  ఆమె కూడా గౌరవ ప్రదమయిన హోదాలో ఉన్నారు. ఇలాంటిప్రభుత్వంలో ఉంటూ ఎన్టీఆర్ తెలుగు భాషా పురస్కారం తీసుకునే నైతిక అర్హత చినవీరభద్రుడికిగాని, ఇచ్చే నైతిక అర్హత లక్ష్మీ పార్వతికి గాని లేదని ‘జనసాహితి’ ఒక కరపత్రం వేసింది. దీని మీద సాగుతున్నచర్చకు జనసాహితికి చెందిన దివికుమార్ ఇస్తున్న సమాధానం.)

(దివి కుమార్)

మిత్రులు అరణ్య కృష్ణ గారికి!

మీరు లేవనెత్తిన విమర్శలపై మూడు అంశాలుగా జవాబు ఇస్తాను.
1. సుమారు 17-18 సంవత్సరాలకు పూర్వం akashic (ఆకాశిక్) అనే ద్విభాషా పత్రికలో ప్రపంచీకరణకు వ్యతిరేకంగా 2-3 సంచికలలో నేను ఒక పేరున్న ఉన్నతాధికారితో సంఘర్షణ పడ్డాను. మేమిద్దరం ఒకే శాఖలో అనగా బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగస్తులo. అయితే ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాలపైన అత్యూన్నతాధికారి! నేను ఒక పంచాయతీ గ్రామంలో టెలిఫోన్ టెక్నీషియన్ని! మా ఇరువురివి పరస్పర విరుద్ధమైన దృక్పథాలు. నాది కార్మికవర్గం పక్షం అయితే ఆయనది పాలకవర్గం తరఫున!
అందుచేత ఉద్యోగస్తులు అందరూ ఒకటేనన్నట్లు అరణ్యకృష్ణ లాంటివారు రాయటం కరెక్ట్ కాదు.

అలాగే మేధావులు కూడా ప్రజాపక్షం మేధావులు, పాలకపక్షం మేధావులు ఉంటారు. మా ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలలో , సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు మార్గాలు సుగమం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడటం ఒక చైతన్య పూరిత అంశంగా ఉండేది. తద్విరుద్ధంగా పై ఉన్నతాధికారి ప్రభుత్వానికి అంటకాగి నిలబడ్డారు.
ఐఏఎస్ అధికారులు అందరూ ఎస్.ఆర్.శంకరన్ లు కానట్లే వాడ్రేవు చిన వీరభద్రుడులూ కాదు.

వారి వారి వర్గచైతన్యపు స్థితిగతులను బట్టి ఇది ఉంటుంది.
మీ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలకు ఎవరు జీతం ఇవ్వరు కదా అని కూడా అన్నారు. అవును ఇవ్వరు. కానీ పనిష్మెంట్లు ఇస్తారు. జీతం నష్టపోవాల్సి వస్తుంది.

ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై పోరాటంతో పాటు, అధికార నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాడాల్సి ఉంటుంది. ప్రభుత్వం తొడ కోసుకోమంటే మెడ కోసుకునే రకం అధికారులు కూడా ఉంటారు.

అల్లం శేషగిరిరావు గారి ‘ వరడు ‘ కథను ఒకసారి మళ్లీ చదువుకుంటే కొందరు అధికారుల స్వభావం కూడా తెలుస్తుంది. చెప్పదలచుకున్నది ఒకటే. ఉద్యోగస్తులు అందరూ ఒకటి కాదు. వర్గ దృక్పథంతో పరిశీలించు కోవలసిందే.

2. భాషకు సంబంధించినది. దయచేసి మిత్రులను జోసఫ్ స్టాలిన్ రాసిన భాషాశాస్త్రం చదవమని కోరుతున్నాను. మీకు అంత అవకాశం లేకపోతే ఆంధ్రజ్యోతిలో 5- 3 – 2013న నేను రాసిన వర్గాల కులాల ప్రాంతాల వారీ భాషలు ఉంటాయా? అనే వ్యాసం పరిశీలించమని కోరుతున్నాను. అందులో చెప్పిన విషయం ఏమిటంటే వర్గాల కులాల ప్రాంతాల వారీ భాషలు ఉండవు అని! భాష ఒక జాతి యొక్క సమస్త వర్గాల ఉమ్మడి పరికరం. అది ఆ జాతి వారి సమష్టి కార్యకలాపాలలో భాగంగా రూపొందినది.

3. జాతుల సమస్య. భారతదేశం అంతా ఒకే జాతి అనేది ఆర్ ఎస్ ఎస్ భావజాలం మాత్రమే కాదు, భారత దళారీ బూర్జువా వర్గానికి అవసరమైన భావజాలం కూడా! (హిందువులు ముస్లింలు వేరు వేరు జాతులు అనే ద్విజాతి సిద్ధాంతం కూడా ఉందనుకోండి) విశాల భారతదేశంలోని సమస్త జాతుల, సమస్త ప్రదేశాలలోని సంపదలను, మార్కెట్లను కొల్లగొట్టు పోవటానికి అటు సామ్రాజ్యవాదులకు ఇటు బడా బూర్జువా వర్గానికి ఉపయోగపడే భావజాలం ఈ ఏకజాతి సిద్ధాంతం. కాంగ్రెస్ వాళ్లు కూడా కొంత ఎక్కువ తక్కువతో దానిని అమలు పరచడానికి ప్రయత్నించిన వాళ్లే!
ఈనాటి మకరీంద్ర మోడీనే కాదు, ఆనాటి ఇందిరాగాంధీ కూడా పై ఆధిపత్య వర్గాల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని నిరంకుశoగా అమలు పరిచింది. దానిని ఏమేరకు ధిక్కరిస్తే ఆ మేరకు అది భారత ప్రజాస్వామిక విలువలకు దోహదపడుతుంది.

మొన్న బెంగాలీ ఎన్నికలలో మమతా బెనర్జీ గెలిస్తే బాగుండునని లోలోపల అయినా మన లాంటి వాళ్లు అందరూ ఎందుకు కోరుకున్నాము? అది జాతులకుండే స్వేచ్ఛా భావనకు ఒక వ్యక్తీకరణ. అలాంటి ఎంత చిన్న Space నయినా ప్రజాస్వామిక దృక్పథం గలవారు తమ తమ పద్ధతులలో స్వీకరించగలగాలి.

శ్రీ శ్రీ జలగం వెంగళరావుని బానిసకొక బానిసకొక బానిస అన్న విషయం మా కరపత్రంలో ప్రస్తావించాము. ప్రపంచ సామ్రాజ్యవాదులకు బానిసలైన భారత దళారీ బూర్జువా వర్గానికి(1), రాజకీయ బానిసయిన ఇందిరమ్మ ప్రభుత్వం(2), ఆ కేంద్ర ప్రభుత్వానికి బానిసైనవాడు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంగళరావు (3).. అని శ్రీశ్రీ తాత్పర్యం.

కేంద్ర ప్రభుత్వాన్ని మిథ్య అనటమే కాక, ఇందిరమ్మ కేంద్రీకృత నిరంకుశ ఏకపక్ష అధికార పెత్తనాన్ని ఎన్టీ రామారావు ధిక్కరించడo, ఆ మేరకు అది తెలుగు జాతీయతను ప్రదర్శించడమే అవుతుంది. అది నేటి నూతన ప్రజాస్వామిక విప్లవ క్రమానికి తోడ్పడే బూర్జువా ప్రజాస్వామిక భావన.
ఈ సందర్భంగా మరొకసారి ప్రజాసాహితి సంపాదకీయం ఒకటి గుర్తు చేస్తాను. సంస్కృతిలో మిగుల్చుకోవాల్సినది… వదుల్చుకోవాల్సినది. (అందులో చలం గారి గురించి రాసిన భాగాన్నే వీరభద్రుడిపై విమర్శ.. సందర్భంగా చెరుకూరి జ్యోతి ఉటంకించినది).

నాలుగు రోజుల నాటి జనసాహితి కరపత్రంలో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఒక మేరకు ఎన్టీరామారావు నిలబెట్టాడు అని ఇందిరా గాంధీ పై పోరాటం సందర్భంగా రాసిన దాంట్లో ఒక మేరకు అన్న పదం యొక్క తూకాన్ని గమనించ వలసినదిగా కోరుతున్నాను.

పైన నేను పేర్కొన్న మొదటి అంశంలో ‌సాధారణ ఉద్యోగస్తులకు – నిరంకుశ అధికారులకు నడుమ పాటించాల్సిన వర్గ విచక్షణను మిత్రుడు అరణ్య కృష్ణ గారు పాటించలేదు సరికదా, అలాంటిది కుదరని భాష విషయంలో దానిని వ్యక్తపరిచారు.

ముగింపుగా ఒక్క విషయాన్ని గుర్తు చేస్తాను 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు అనుకూలంగా డంకెల్ డ్రాప్ఫ్ట్ పైన సంతకం పెట్టి , తాను పార్లమెంటు సభ్యుడు కానందున, నంద్యాల నుండి పోటీ చేశారు. మేము (అనగా అరుణోదయ రామారావు నేను తదితరులo) కూచిపూడి యక్షగాన వీధి భాగవత ప్రక్రియలో అప్పుల భారతం అనే కళారూపాన్ని నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం లోని దాదాపు ప్రతి మండల కేంద్రంలో ప్రదర్శించాము.
ఆ కళారూపానికి సూత్రధారుడు రామారావు అయితే అతని శిష్యుడు ఉదయి. ప్రధానపాత్ర పేరు పరమ వీర నారసింహ మహారాజ్. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అంటే దేశ ప్రజలకు తీరని అన్యాయం చేయడమేనని విస్పష్టంగా సాధారణ ప్రజలకు కూడా అర్థం అయ్యేటట్లు కళారూపం ప్రదర్శించిన ఆ ప్రధాన ( పరమ వీర నారసింహ మహారాజ్. ) పాత్రధారుడిని నేనే!

ఒక సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుడనయి వుండీ, ప్రభుత్వ లొంగుబాటు విధానాలకు, దేశ ప్రధానికి వ్యతిరేకంగా, అందులో ఆయన ఎన్నికలలో నిలబడిన సందర్భంలో , ఆయన పాత్రలోనే అనేక సార్లకు పైగా ప్రదర్శించాను. వాడ్రేవు చినవీరభద్రుడు మీ.. నా కంటే చాలా ఎక్కువ చదువుకున్నవాడు. అయితే ఆయన మీ, నా చైతన్యాన్ని ప్రదర్శించాలని నేనేమీ కోరుకోవడం లేదు.

కొడవటిగంటి కుటుంబరావు గారు సుమారు 50 ఏళ్ల క్రితం బూర్జువా సంస్కృతి అని ఒక వ్యాసం రాశారు. దాని ముగింపు లో మనకి కనీసం బూర్జువా సంస్కృతి అయినా ఇంకా అలవడలేదే అని కొ.కు. వాపోయారు. వాడ్రేవు చిన వీరభద్రుడు లాంటి వారి విషయంలో కూడా మనం ఇంకా అలాంటి పరిస్థితుల్లోనే ఉoదటమే విషాదం. కనుక , చివరకు వీరభద్రుడు విజ్ఞతకు విజ్ఞప్తి చేశాం. గ్రహించగలరు …

తాజాకలం:

వాడ్రేవు చిన వీరభద్రుడుని బూర్జువా వ్యక్తిత్వం అయినా ప్రదర్శించమని కోరినట్లే, ఆంధ్ర – తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ,
నారా చంద్రబాబు నాయుడూ …, ఎన్టీరామారావు ఇందిరాగాంధీని ధిక్కరించి పోరాడినట్లయినా , నేటి ఫాసిస్టు తరహా కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని ఎదిరించి పోరాడితే బాగుండుననుకునే పరిస్థితులలో మనం లేమా??..

తమ స్వప్రయోజనాల కోసమే కావచ్చు వాళ్లు ఏ మేరకైనా అలా పోరాడిన పక్షంలో ఆ మేరకు ప్రజాస్వామికవాదులు, పై వారికి తమ తమ పద్ధతులలో మద్దతు అందించడం తప్పు ఎలా అవుతుందో నాకైతే తెలియడంలేదు.
అలా వారు పోరాడ లేకపోవటాన్ని, దురాక్రమణ పూరిత రాజకీయాలను ఎదుర్కోలేక పోవటాన్ని లొంగుబాటు తనమని చెప్పడం కూడా తప్పు ఎలా అవుతుంది? నిరంకుశ అధికారుల విషయంలో స్థూలంగా వర్గదృక్పధాన్ని పాటిస్తూ, ఉద్యమ సందర్భంలో వ్యక్తుల పట్ల విడి విడి అంచనాలకు (సూక్ష్మ స్థాయిలో) రావాల్సి వచ్చినట్లే, పాలక రాజకీయులలో కూడా అలాంటిది అవసరం పడుతుంది.

ఇరాక్ దేశాధినేత సద్దాం హుస్సేన్ కూడా చాలా దురాగతాలు చేసిన వాడే కనుక, అతడిని అమెరికా సామ్రాజ్యవాదం వేటాడి, వెంటాడి చివరకు ఉరితీస్తే, మేము ఎందుకు బాధ పడాలి అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు.
తెలుగు భాష విషయంలో , ఎన్టీ రామారావుతో, నేటి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను గాని, నారా చంద్రబాబు నాయుడునిగాని ఒకే త్రాసులో తూయటం కరెక్ట్ కాదని నా గట్టి అభిప్రాయం.

(కవి అరణ్య కృష్ణ ఫేస్బుక్ లో జరిగిన చర్చ తెలియని వారి కోసం)

ఇది కూడా చదవండి

 

https://bit.ly/3fI68cY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *