‘ఎన్టీఆర్ అవార్డుకు వాడ్రేవు చినవీరభద్రుడు అనర్హుడు’

(జనసాహితి)

ఈనెల మే 29న ఎన్.టి.ఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి ఆధ్వర్యాన, నాగార్జున విశ్వవిద్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ పాఠశాలవిద్య సంచాలకులయిన శ్రీవాడ్రేవు చిన వీరభద్రుడుకి, ఎన్.టి.ఆర్ సాహితీ పురస్కారాన్ని అందించనున్నారు. పై అవార్డును తెలుగు భాషా వికాసాన్ని కోరిన ఎన్.టి.ఆర్ పేరుతో ఇచ్చి పుచ్చుకోవడాలు జరుగుతున్నది కనుకనే మా అభ్యంతరం!

వైయస్ జగన్మోహన రెడ్డి ప్రభుత్వం, అధికారం చేపట్టి ఆరు నెలలు తిరగకుండానే, అప్పటివరకు ఐసీయూలో ముక్కుతూ మూలుగుతూ ఉన్న తెలుగు భాషకు, వెంటిలేటర్ లను కూడా తొలగించివేసే హంతక ప్రయత్నం చేసింది. ప్రాథమిక పూర్వ విద్య నుండి మొత్తం విద్యాబోధన అంతా ఇంగ్లీషు మాధ్యమంలోనే జరిపేటట్లు ఒక అశాస్త్రీయమైన మొండి నిర్ణయం తీసుకుంది.

ప్రాథమిక స్థాయిలో కూడా మాతృభాషలో బోధనా మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలుకుతూ, తెలుగు
భాషపట్ల రాష్ట్ర ప్రభుత్వపు ఈ దుశ్చర్యను తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా ఉన్న శ్రీమతి లక్ష్మీ పార్వతి ఖండించకపోగా సమర్థించటాన్ని, తెలుగు భాష ఉసురుతీసే పై నిర్ణయం అమలుకు శ్రీవాడ్రేవు చినవీరభద్రుడు ప్రదర్శించిన అత్యుత్సాహాన్ని తెలుగు భాషాభిమానులు గమనిస్తూనే ఉన్నారు. ఎన్.టి.ఆర్ ఆశయానికి వీరిరువురూ తూట్లు పొడుస్తున్నారు. ఆ విధంగా తెలుగుకు తీరని అన్యాయం చేస్తున్నారు. కనుక ఎన్.టి.ఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ పేరుతో సాహిత్య పురస్కారo అందిoచే నైతిక హక్కు శ్రీమతి లక్ష్మీ పార్వతికి, అందుకునే నైతిక అర్హత శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడుకి ఎక్కడిది? అని తెలుగు భాషాభిమానులు ఎవరైనా ప్రశ్నిస్తారు.

తెలుగు భాష పేరు ప్రతిష్టలను దేశవ్యాపితంగానే కాక ప్రపంచ స్థాయిలో గుర్తింపులోకి తెచ్చిన ఎన్.టి.ఆర్ ఎక్కడ ? తెలుగు భాషను నడి బజార్లో ఖూనీ చేయటానికి తెగబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపక పోగా, దాని అమలుకు, అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న వాడ్రేవు చిన వీరభద్రుడు ఎక్కడ? ఎన్.టి.ఆర్ . పేరిట సాహిత్య అవార్డు పొందే నైతిక అర్హత ఆయనకు ఎక్కడిది??

సరిగా 39 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభ దినాలలో 1982 మే నెలలో తిరుపతి పట్టణంలో నిర్వహించిన ఒక పెద్ద మహాసభలో , ఎన్.టి.ఆర్ , తాము అధికారంలోకి వస్తే తెలుగు భాషకు ఎలాంటి సముచిత స్థానం కల్పిస్తారో ఒక తీర్మానం రూపంలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్య అంతా తెలుగు మాధ్యమంలోనే బోధిస్తామని ఆ తీర్మానంలో వాగ్దానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్త శాఖల పరిపాలన అంతా తెలుగులోనే సాగుతుందని తీర్మానించారు. అంతేకాక ఇంగ్లీష్ తో సహా ఇతర భాషలు నేర్చుకోవడం ఐచ్ఛిక (ఆప్షనల్) విషయంగా
మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉండగలదని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలుగు భాషకు గౌరవాన్ని పెంచారు.

ప్రభుత్వానికి వచ్చే అర్జీలు తెలుగు భాషలో ఉన్నట్లయితే వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చారు. కొన్ని ప్రవేశ పరీక్షలను తెలుగు భాషలో రాసిన వారికి అదనపు మార్కులు కల్పించారు అంతేగాక విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠాలు, పరీక్షలుకూడా తెలుగులో నిర్వహించే పద్ధతిని ప్రవేశ పెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేశారు. తెలుగు అకాడమీని, ఎస్ సి ఈ ఆర్ టి (రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి) ని, తెలుగు మాధ్యమంలో ఉన్నత విద్యను పటిష్టం చేశారు. హైదరాబాద్ ట్యాంకుబండ్ మీద 33 మంది తెలుగు వైతాళికుల విగ్రహాలను ప్రతిష్టింప చేశారు.

నేడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (సంచాలకులు)గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు కేవలం ఉన్నతాధికారి మాత్రమే కాదు, తెలుగు భాషలో పేరున్న సాహిత్యకారుడు కూడా! కవిత్వం, సాహిత్య విమర్శ – విశ్లేషణ, యాత్రా సాహిత్యం, లోతైన తాత్విక రచనలు చేసిన పేరెన్నికగన్న, చేయి తిరిగిన సాహితీవేత్త శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు.
‌అయితే 2019లో కొత్తగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విద్యా బోధన అంతా ఇంగ్లీషులోనే అనే నిర్ణయం, తెలుగు భాషకు తీరని నష్టం కలిగించేది. సర్వం ఇంగ్లీష్ మయం కావించే ఈ తలకిందుల విద్యా బోధనా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించి అమలు చేయ ప్రయత్నించగా , మహాభారత కవి తిక్కన చెప్పినట్లు, శ్రీ చిన వీరభద్రుడు, దక్షుడై ఉండి ఉపేక్ష చేశారు.
ఇంగ్లీషు భాషలో ప్రసిద్ధి పొందిన కవి విలియమ్ వర్డ్స్ వర్త్ నాలుగు కాసులకోసం ఆస్థాన కవి( poet laureat) పదవిని అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తూ రాబర్ట్ బ్రౌనింగ్ అనే కవి 1843లో రాసినట్లు. ..
పేరాశతో పెద్దపులిని నమ్మిన వెర్రి పండితునిలా శ్రీ వాడ్రేవు ప్రవర్తించారు.

వివిధ దశలలో న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వo తీసుకున్న మొత్తం ఇంగ్లీషులోనే బోధన అనే నిర్ణయాలను అడ్డుకుంటూ వచ్చాయి.
విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు తాము ఆ పని చేస్తున్నట్లు కృత్రిమమైన ఆమోద సృష్టి ప్రయత్నాలన్నిటా పాఠశాల
విద్యాశాఖ సంచాలకునిగా శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ప్రభుత్వానికి లొంగి పోయి, అనైతిక పద్ధతులలో అధికార బలప్రయోగంతో వ్యవహరించినట్లు తీవ్ర విమర్శల పాలయ్యారు. అంతేకాక కేంద్రంలోని సి. బి. ఎస్. ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) వారితో తాను స్వయంగా సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలన్నింటిని సి. బి. ఎస్. ఈ. కి అనుబంధం కావించారు, ఇక్కడి విద్యాబోధన, పరీక్షా విధానం అంతా సి. బి. ఎస్. ఈ. లోకి మారేటట్లు చూశారు. దాని ఫలితంగా రాష్ట్రoలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశం తప్పనిసరి కాకుండా పోతుంది. వారికి తెలుగు కేవలం ఐచ్ఛిక (ఆప్షనల్) పాఠ్యాంశంగా మిగిలిపోతుంది. ఆ విధంగా ఒక్క తెలుగు పాఠం కూడా చదవకుండానే ఉన్నత పాఠశాల విద్య అంతా పూర్తి చేసుకోవచ్చు. కానీ ఇంగ్లీషుతోపాటు హిందీని కూడా తప్పనసరిగా చదివి తీరాలి.

అయితే ఆంధ్ర రాష్ట్రంలోని పాఠశాలల్లో అంతా ఇంగ్లీషు బోధనే అయినప్పటికీ, కొన్ని ప్రత్యేక పాఠశాలల్లో ఉర్దూ, ఒరియా, తమిళం, కన్నడం , మరాఠీ లాంటి భాషలు మాత్రం ఒక పాఠ్యాంశoగానైనా తప్పనిసరిగా బోధిస్తామని హైకోర్టులో రాష్ట్రప్రభుత్వం ఒక అఫిడవిట్ ద్వారా తెలియ పరిచింది.

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ0 న్యాయస్థానాలను తప్పించుకుని, ఇంగ్లీషే సర్వస్వంగా అమలు చేయించే సమస్త విధానాల రూపకల్పనలో, ఈప్రక్రియ అంతటిలో, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు కేవలం సహకారం అందించడం వరకే కాక, అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అప్పటికే కునారిల్లుతున్న తెలుగు భాషపై ఆఖరి మారణాస్త్రాలను కూడా సమకూర్చారు.

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నిటా తమ తమ మాతృ భాషల ద్వారానే విద్య, వైజ్ఞానిక శాస్త్ర రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ, తద్వారా పరాయి భాషలను కూడా అవసరమైన మేరకు నేర్చుకునే ప్రక్రియను అమలు చేస్తూ ఉంటే, మనకి ఇక్కడ పరాయి భాష ద్వారా సమస్త విజ్ఞాన శాస్త్రాల బోధన సాగుతూ ఉంది. ఇది తలకిందుల బోధనా విధానం. ఏ పరాయిభాష అయినా మాతృభాష ద్వారానే సులువుగా బాగా నేర్చుకోవచ్చు నన్నది భాషా శాస్త్రజ్ఞులు ఎవరయినా చెప్పేమాట!

1982 నాటి తిరుపతి మహాసభ తీర్మానం ప్రకారం, తెలుగు భాష కునారిల్లిపోవడానికి కారణం పూర్వ పాలకులు సంస్కృతము , పార్సి, ఇంగ్లీషుల ద్వారా బోధన ప్రక్రియను అమలుపరచడం అని ఎన్.టి.ఆర్ ఆధ్వర్యాన ప్రకటించారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ఎన్.టి.ఆర్ సాధ్యమైన అన్ని స్థాయిలలో తెలుగును అమలు పరచడానికి ప్రయత్నం చేశారు.
కానీ ఎన్.టి.ఆర్ తదనంతర కాలంలో విద్యా బోధన రంగoలో, అటు తల్లిదండ్రుల ఇటు ఉపాధ్యాయుల పాలిట బందిపోట్లు లాంటి కార్పొరేట్ విద్యా వ్యాపారులకు విశాలమైన దారులు పరిచారు. ప్రజలoదరికి విద్యను నేర్పాల్సిన ప్రభుత్వ బాధ్యతను క్రమేణా తగ్గించుకుంటూ వస్తున్నారు.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో ఆర్థిక రాజకీయ పరాధీన విధానాలు కారణమై ఉండగా, ఇంగ్లీషు మాధ్యమంలో చదువులు లేకపోవటమే కారణం అన్న తప్పుడు భావనను విద్యా వ్యాపారులతో పాటు పాలకులు కూడా గొంతు కలిపి ప్రజలలో విపరీతమైన అపోహలను, భ్రమలను సృష్టించారు.

తెలిసిన జ్ఞానం ద్వారా తెలియని జ్ఞానాన్ని పొందటం అన్న సహజ బోధనా ప్రక్రియకు భిన్నంగా, పరాయి భాష ద్వారా తెలియని జ్ఞానాన్ని అందించే కృత్రిమ, తలకిందుల బోధనా పద్ధతికి రాష్ట్రాన్ని మళ్ళించారు. 17 సంవత్సరాల పాటు ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న అనేకమంది పిల్లలు కనీసం సెలవు చీటీని కూడా ఇంగ్లీషులో తప్పులు లేకుండా రాయలేని స్థితికి ముఖ్య కారణం ఈ తలకిందుల విద్యా విధానమే! అటు ఇంగ్లీషు సరిగ్గా రాని, ఇటు తెలుగు అసలే రాని నిరుద్యోగ యువతరంతో రాష్ట్రమంతా నిండి ఉంది.

రాష్ట్రంలోని నిరక్షరాస్యులలో అత్యధికులు ఆదివాసీలు, దళితులు, బీసీలు, మైనార్టీలు, మహిళలు అయి ఉండగా… వారందరికీ కనీసo ఐదవ తరగతి స్థాయి చదువులైనా నేర్పలేని పాలకులు, జ్ఞాన సముపార్జనకు మాతృభాష పనికిరాదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

అందుకు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు లాంటి మేధావి, పాలకుల పక్షాన నిలచి, తెలుగు భాషకు తీరని అపచారం చేస్తున్నారు. ఈ కారణంగా ఎన్.టి.ఆర్ పేరిట తెలుగు సాహిత్య పురస్కారాన్ని పొందే నైతిక
అర్హతను ఆయన కోల్పోయారు .

రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించే ఇందిరా గాంధీ తరహా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను ధిక్కరించి, తల ఎత్తుకు నిలబడి, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, ఒక మేరకైనా నిలబెట్టిన వాడు ఎన్.టి.ఆర్!
కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను కూడా గట్టిగా అడగలేక పోతున్న లొంగుబాటు రాజకీయ దీనావస్థ నేటి ఆంధ్ర రాష్ట్ర పాలకులది.
మొదటి ప్రపంచ మహాసభల సందర్భంగా, 46 ఏళ్ల క్రితం , నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావుని బానిసకొక బానిసకొక బానిస అన్నాడు, మహాకవి శ్రీశ్రీ!

ఎవరైనా అలా ఎందుకు అనిపించుకునేలా ప్రవర్తించాలి?
శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడుకి ఇప్పటికైనా పునరాలోచన కలగాలని ఆశిద్దాం. ఎంతటి మేధో సంపత్తులైనప్పటికీ , కీలక సందర్భాలలో సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోతే, సాహిత్య ప్రపంచంలోనూ, చదువుకున్న వర్గాలలోనూ అప్రతిష్ఠ మూట కట్టుకోవలసి వస్తుందని గుర్తు చేద్దాం!
.ఈ నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అశాస్త్రీయమైన బోధనా మాధ్యమ విధానానికి వ్యతిరేకంగా నిలవమనీ, ఆ విధంగా ఎన్టీఆర్ పేరిట ఇస్తున్న పురస్కారాన్ని స్వీకరించడానికి తనకున్న నైతిక అర్హతను ఇప్పటికైనా రుజువు పరచుకోమని శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు విజ్ఞతకు విజ్ఞప్తి చేస్తున్నాం!

(జనసాహితి, 26 మే 2021న విడుదల చేసిన కరపత్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *