(డా.ఎన్.ఈశ్వర రెడ్డి)
విగ్రహాల ముందు
మనిషి ఎప్పుడూ
ఓడిపోతునే ఉన్నాడు…
రాయిని దేవుణ్ణి చేసిన
మనిషి ఇప్పటికీ
ఓడిపోతునే ఉన్నాడు…
ట్రక్కుల కొద్దీ రూపాయలను
రాళ్ళకోసం కుమ్మరించాం కానీ..
గుప్పెడు ప్రాణాన్ని కాపాడడానికి
పిడికెడు ప్రాణవాయువు
కొనలేక పోయాం…
విగ్రహ విష సంస్కృతిని
పెకళించమన్న బుద్ధుడు..
వేమన… అంబేద్కర్ల
విలువల్ని కాదని…
విగ్రహాల బురదలో
దిగబడక తప్పడం లేదు
మతo మెట్లపై
కులo దారిపై
అందలాన్ని ఆశిస్తున్న
అధికార స్వార్థాలు
జన హీనతలను
విగ్రహాలతో తూకం వేస్తాయి…
నూటముప్ఫై కోట్ల దేవతలు
దిగబడ్డ దేశంలో
కరోనాకు మందిచ్చే దేవుడే
లేకపోవడం వింతే…!
రక్తపు చెమటతో కట్టిన పన్ను రూకలను
ఆకాశమంత విగ్రహాల కోసం మట్టిలో పోస్తే…
ఆపత్కాల అవసరాలు నోళ్ళు తెరిచి కూర్చోక
ఏం చేస్తాయి…?
శ్రామిక సంపదను
బువ్వ పెట్టే భూమిని
విగ్రహాలకు సమాధులకు
తర్పణ తీర్థం చేస్తున్నంత
కాలం…
రాయి కంటే మనిషి
హీనంగా
విగ్రహాల కొలువు లా
మిగిలి పోక తప్పదు..