(ఇఫ్టూ ప్రసాద్ పిపి)
పాలస్తీనాపై లగ్నమైన నా మనస్సును మరో పాలస్తీనా ఆవరించింది. లక్షద్వీప్ దీవులు కూడా మరో పాలస్తీనా గా మరే ప్రమాదం ఉందనే సందేహం నాలో కలిగింది. దాని ఫలితమే ఈ చిన్న రైటప్!
ఈ కధ కొత్తదేమీ కాదు. అడవి నుండి ఆదివాసులని, సముద్రం నుండి మత్యకార్లను, భూమి నుండి రైతాంగాన్ని వెళ్లగొట్టే షరా మామూలు కథే యిది. అంతకంటే కొత్తదేమీ కాకపోవచ్చు. ఇది మరికొంత విస్తృతంగా, లోతుగా, గాఢంగా పన్నిన కుట్రలో భాగమెమో అనే సందేహం కలిగింది. తరతరాలుగా సముద్ర కెరటాలు, తుపాన్ల మధ్య కూడా అదే దీవుల్ని నమ్ముకొని బ్రతికిన స్థానిక జాతిని పూర్తిగా అక్కడ నుండి వెళ్లగొట్టే వైపు అడుగులు పడతాయేమో అనే సందేహమది.
కేరళ సమీపంలో అరేబియా సముద్రంలోనివే లక్షద్వీప్ దీవులు. కేంద్రపాలిత ప్రాంతం. మొత్తం విస్తీర్ణం 32 చ.కి.మీ. మాత్రమే. జనాభా 70 వేలు. తరతరాలుగా సముద్రాన్ని నమ్ముకొని బ్రతికిన నేపథ్యం వారిది. కాశ్మీర్, నాగాలాండ్ సరిహద్దులు దాటి ఇప్పుడు ఫాసిజం లక్షద్వీప్ చేరింది.
ఐదారు నెలల పరిణామాలు ఒక ఎత్తు! రెండు వారాలుగా సాగే అక్కడి పరిణామాలు మరో ఎత్తు! అవి ప్రజాతంత్ర శక్తులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళ పౌర సమాజంలో నేడు అదో తీవ్ర చర్చనీయాంశమే. ఇక్కడ ఆంగ్ల దినపత్రికల పాఠకులకు తప్ప తెలిసే అవకాశం తక్కువే.
సాంప్రదాయంగా IAS, IPS అధికారి దానికి పాలకుడు (ADMINISTRATOR) గా వుంటాడు. గత పాలకుడు శర్మ గత డిసెంబర్ లో మృతి. కొత్త సాంప్రదాయానికి కేంద్రం బాట. ప్రఫుల్ కోడా పటేల్ కొత్తగా నియామకం. ఆయన తండ్రి గుజరాత్ RSS మాజీ నేత. ఈయనెమో గుజరాత్ మాజీ మంత్రి. 2012 ఎన్నికల్లో ఓటమి. పునరావాసంలో భాగంగా మోడీ చే ప్రమోషన్. నేడు లక్షద్వీప్ పాలకుడు.
ఇంకా ఆరు నెలలు కూడా నిండలేదు. విద్యా, ఆరోగ్య, వైద్య రంగాలపై దాడి. 200 మంది స్కూల్ ఉపాధ్యాయుల డిస్మిస్. నిరసన తెలిపిన విద్యార్ధులపై లాఠీచార్జి. టూరిజం శాఖలోని 190 మంది ఉద్యోగుల డిస్మిస్. వివిధ దీవులలోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ల డిస్మిస్. జిల్లా పంచాయతీ అధికారం కుదింపు. కోస్టల్ ప్రొటెక్షన్ చట్టాల పేరిట మత్యకారుల షెడ్లు, వలల స్వాధీనం. ఉన్న రెండు పాలకేంద్రాల మూసివేత. పశువుల అమ్మకంకి వేలం. గుజరాత్ నుండి షిప్ లో పాల దిగుమతి. ఇప్పటి వరకు తమ వాణిజ్యంకై కేరళ తీరంలోని బైపోర్ ఓడరేవు వినియోగం. ప్రజాభీష్టానికి విరుద్ధంగా నేడు బిజెపి పాలిత రాష్ట్రం కర్ణాటక లోని మంగుళూరు పోర్ట్ కి బదిలీ. వైద్య చికిత్సకై రోగులు మెయిన్ లాండ్ (ఇండియా) కి వెళ్లాలంటే కూడా అడ్మినిస్టేటర్ ఆమోదం అవసరమనే కొత్త రూల్స్. ఇంకా ఎన్నో, ఎన్నెన్ని కొత్త రూల్స్. కొంగొత్త నిరంకుశ ఉత్తర్వులూ చట్టాలూ! నేడు ఆ దీవులే జైళ్లుగా మారే దుస్థితి.
అందరినీ డిస్మిస్ చేస్తే ప్రభుత్వ పాలనా యంత్రాంగం సంగతేమిటి? మోడీ, షా లకు ప్రధమ శిష్యుడైన పటేల్ వద్ద ఈ ప్రశ్నకు జవాబు ఉంది. ప్రభుత్వ నిర్వహణ కోసం ఉత్తరాది రాష్ట్రాల నుండి హిందీ భాషావేత్తల దిగుమతి. స్థానికులకు రెండే రెండు భాషలు తెలుసు. స్వజాతీ భాషతో పాటు మలయాళం. ఇప్పుడు కేరళతో సంబంధం తెంచాలి. అది ప్రతిపక్ష రాష్ట్రం కదా! అందుకే గుజరాత్ సహా ప్రధానంగా ఉత్తరాది హిందీ భాషా వాదులతో నింపివేత.
ఆ డెబ్బై వేల జనాభాలో 97 శాతం మంది ముస్లిములే! మిగిలిన మూడు శాతం మంది కూడా స్థానిక జాతీయులు కాదు. మెయిన్ లాండ్ నుండి వచ్చిన వర్తకులే. ముస్లిముల ఆహారం బీఫ్ & చేపలు. నేడు బీఫ్ పై నిషేధం. ఈశాన్య రాష్ట్రాలలో బీఫ్ కు అనుమతి. లక్షద్వీప్ లో మాత్రం నిషేధం.
గుజరాత్ సంపన్న వర్గాల టూరిస్టు వ్యాపార కేంద్రంగా లక్షద్వీప్ దీవులను మార్చే రహస్య రాజకీయ ఎజెండా ఉందనే ప్రచారం నేడు బాగా సాగుతోంది. అందుకై స్థానిక జాతీయుల్ని తరిమివేసే వ్యూహం ఉందా? పొమ్మనలేక పొగబెట్టే కుట్రస్టోన్ నేడు కొత్త నిర్బంధ చట్టాల్ని అమలు చేస్తుందా?
ఆంగ్లో అమెరికన్ కూటమి అండతో జియోనిజం బలపడి, మధ్యధరా సముద్ర తీరప్రాంతం నుండి పాలస్తీనియన్ జాతిని నిలవనీడ లేకుండా చేసిన నాటి కుట్రే నేడు అరేబియా సముద్ర తీరంలోని లక్షదీప్ దీవుల్లోనూ పునరావృతం అవుతోందా?మోడీ ప్రభుత్వ కుట్ర పై కేరళ సమాజంలో నేడు ప్రారంభమైన నిరసన దేశవ్యాప్త స్వభావం దరిస్తుందా? మనం కూడా ఖండన, నిరసనలతో మన వంతు పాత్ర పోషిద్దామా? అక్కడి స్థానిక జాతి జీవించే హక్కు పరిరక్షణ కోసం సాగే ఉద్యమానికి సంఘీభావం ప్రకటిద్దామా?