‘ఇచ్చంపల్లి నుంచి గోదావరి-కావేరి అనుసంధానం వద్దు’

(టి. లక్ష్మీనారాయణ)

జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించిన “ఇచ్చంపల్లి నుండి గోదావరి – కావేరి నదుల అనుసంధానం” పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధ్వందంగా తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నాను.

గోదావరి నదిలో లభించే నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1480 టియంసిలను వినియోగించుకోవచ్చని బచావత్ ట్రిబునల్ అవార్డులో పేర్కొన్నారు. ఆ మేరకు నికర జలాలను వినియోగించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రం నిర్మించుకొంటున్నది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్నది. గోదావరిలో నికర జలాలు లేవని చత్తీస్ఘర్ రాష్ట్రం కూడా అభ్యంతరం చెప్పింది.

గోదావరి నదీ జలాల వినియోగంపై కొత్త ట్రిబునల్ ను నియమించమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వ్రాత పూర్వకంగా కోరితే ఏర్పాటు చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించినట్లు వెల్లడించారు.

ఈ పూర్వ రంగంలో తెలంగాణ రాష్ట్రంలోని ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించి దాదాపు 250 టీయంసీలను తరలించడానికి గోదావరి – కావేరి నదుల అనుసంధాన పథకాన్ని చేపట్టాలనే జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించడం అసంబద్ధం.

మొదటి అంశం నికర జలాలు లేవు. మిగులు/వరద జలాలను అంచనా వేయాల్సింది గోదావరి నదిపై చివరలో నిర్మించబడిన ధవళేశ్వరం ఆనకట్ట వద్ద. పైభాగంలో ఉన్న ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి వరద జలాలను జూన్ – అక్టోబరు మాసాల మధ్య దాదాపు 250 టియంసిలను ఎలా తరలిస్తారు?

జాతీయ నదుల అనుసంధానం పథకంలో భాగంగా మహానది – గోదావరి అనుసంధాన పథకాన్ని చేపట్టాలంటే ముందుగా గంగా – బ్రహ్మపుత్ర – మహానది అనుసంధాన పథకాన్ని అమలు చేస్తేనే అంగీకరిస్తామని ఒడిస్సా పేచీ పెట్టి కూర్చున్నది. మహానది – గోదావరి అనుసంధాన పథకాన్ని అమలు చేయకుండా గోదావరి – కావేరి నదుల అనుసంధాన పథకాన్ని ఎలా చేపడతారు?

ఈ పథకాన్ని అంగీకరిస్తే గోదావరి నుండి నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు నీటిని వాడుకొంటారు కాబట్టి కృష్ణా జలాల్లో మాకు వాటా పెంచాలని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ప్రస్తుతం సుప్రీం కోర్టులో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై విచారణలో ఉన్న కేసు సందర్భంగా వాదనలు వినిపించే అవకాశం ఉన్నది. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి.

జాతీయ జల అభివృద్ధి సంస్థ చేసిన ప్రతిపాదన తీవ్రహానికరమైనది. గోదావరి – కృష్ణా – పెన్నా అనుసంధాన పథకాన్ని పోలవరం ప్రాజెక్టు నుండి చేపట్టాలి.

జాతీయ జల అభివృద్ధి సంస్థ చేసిన గోదావరి – కావేరి(ఇచ్చంపల్లి నుండి) నదుల అనుసంధాన పథకం ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సాగునీటి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న ఉద్యమకారులతో సమావేశాన్ని నిర్వహించి, చర్చించి, సమిష్టి నిర్ణయం తీసుకొని, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి.

(టి.లక్ష్మీనారాయణ,సమన్వయకర్త,ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *