అభ్యుదయ కవి, కళా పిపాసి, ఉద్యమ, సినీ గేయాల రచయిత ,నటుడు, ఉత్తమ నాటక ప్రదర్శనల న్యాయమూర్తి , చరిత్ర పాఠాలు బోధించిన అధ్యాపకుడు … ఇలా బహుముఖ జీవన కార్యకలాపాలలో ప్రజ్ఞావంతుడైన అదృష్టదీపక్ మరణ వార్త ప్రగతిశీల సాంస్కృతికోద్యమ శిబిరానికి ఊహించలేనిది.
తాను అభ్యుదయ రచయితల సంఘానికి చెందినవాడే అయినప్పటికీ ప్రజా సాంస్కృతికోద్యమ సంస్థలతో వ్యక్తులతో కలసి నడవటం అదృష్టదీపక్ తత్వం.
సినీగేయ రచయితగా గుర్తింపు ఎక్కువగా ఉన్న అదృష్టదీపక్ లోని సాహిత్య విమర్శకునికి ప్రజాసాహితి చోటు కల్పించింది. ఆయన కవితలు కొన్నింటిని నిర్మలానంద గారు హిందీలోకి కూడా అనువాదం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పుట్టి (18-1-1950) అక్కడే బాల్యం గడిపి, దాదాపు 60 ఏళ్లు రామచంద్రపురంలో జీవించి ద్రాక్షారామం జూనియర్ కళాశాలలో చరిత్ర పాఠాలు బోధించి చివరి రోజులలో కోవిడ్ బారిన పడి 16-5-2021న అదృష్టదీపక్ కన్నుమూశారు.
“జీవించటం తెలియని జీవితం చావలేక జీవిస్తోంది! జీవించడం మరచిన జీవితం శవం లాగా జీవిస్తోంది,”
అంటూ శవం లాంటి జీవితాన్ని మార్చుకోమని ప్రబోధించిన, ప్రజా ఉద్యమశక్తులు ఐక్యంగా సాగి నడవాలని చివరికంటా ఆశించిన అదృష్టదీపక్ మరణానికి ‘జనసాహితి’ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తోంది.
https://trendingtelugunews.com/top-stories/breaking/adrushta-deepak-poet-lyricist-passes-away-due-to-covid/