కోవాగ్జిన్ వ్యాక్సిన్ వోనర్ ఎవరు? భారత్ బయోటెకా? లేక భారత ప్రభుత్వమా?

ఆ మధ్య కోవాగ్జిన్ వ్యాక్సిన్ విడుదలయిన సందర్భంగా భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ (BBIL) అధినేత డాక్టర్ కృష్ణా ఎల్లా గురించిన అద్భుతమయిన,ఉత్తేజకరమయిన పోస్టొకటి వైరలయింది.

తెలుగు నేపథ్యం ఉన్న డాక్టర్ కృష్ణా ఎల్లా చదవుకున్నది, పైకొచ్చింది, అమెరికా వెళ్లి పిహెచ్ డి చేసి తిరిగి వచ్చి భారత్ బయోటెక్  కంపెనీ ఏర్పాటు చేసి ఇపుడు మేడ్ ఇన్ ఇండియా వైరస్ ను తయారుచేయడం ఈ పోస్టు లో గొప్పగా చెప్పారు.

ఈ వ్యాక్సిన్ ఇపుడు కోట్లాది మంది భారతీయుల ప్రాణాలనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలను ప్రాణాలను కూడా కాపాడుతూ ఉంది. ఇదంతా చూస్తే కోవిడ్ వ్యాక్సిన్  భారత్ బయోటెక్ సృష్టిఅని, అది కంపెనీలోని శాస్త్రవేత్తలు కృషి ఫలితమని, అసలు కోవాగ్జిన్  డాక్టర్ కృష్ణ ఎల్లా మానసపుత్రిక అనే భావన కల్లిస్తుంది.

ఆపోస్టు చదివితే ఈ వ్యాక్సిన్ తయారు చేసి భారతీయులకు ప్రాణాలు కాపాడినందుకు ఆయనకు ఉత్యున్నత పద్మఅవార్డు రావచ్చు లేదా ‘భారత రత్న’ పురస్కారం లభించవచ్చు అని అనిపిస్తూ ఉంది.

ఈ ప్రశంసా పత్రంలో ఎక్కడ ప్రస్తావించని  ఒక విషయం ఉంది. అది వ్యాక్సిన్ సమిష్టి కృషి ఫలితం అనేది. వ్యాక్సిన్ డెవెలప్ మెంటులో భారత్ ప్రభుత్వం పెట్టుడి, పరిశోధన చాలా ఉంది.

ఎందరో భారతీయ శాస్త్రవేత్తల శ్రమ ఫలితం ఉంది. అసలు ఇపుడు కోవాగ్జిన్ కు భారత్ బయోటెక్ కాదు, వోనర్ భారత ప్రభుత్వం  అనే చర్చ మొదలయింది.

ఈచర్చని టాటా న్ స్టిట్యూట్ ఆప్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆర్ రామ్ కుమార్ లేవనెత్తారు. భారత ప్రభుత్వం, కోవాగ్జిన్ తయారీలో పాలుపంచుకున్న ప్రభుత్వ  సంస్థలు, శాస్త్రవేత్తలు, ఈ వ్యాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ పాల్గొన్న వాళ్లు… ఎవరికీ గుర్తు రావడం లేదు. మీడియా లో ప్రచారం మొత్తం ఇది భారత్ బయోటెక్ ల్యాబ్ నుంచి వచ్చిన  వ్యాక్సిన్ గా ప్రచారం చేస్తున్నది.

దీని మీద భారత ప్రభుత్వం కూడా సరైన సమాచారం ప్రజలకు అందించడం లేదు. ప్రజలందరి మెదళ్లలో కోవ్యాగ్జిన్ అంటే భారత్ బయోటెక్ దే అని, ఈ వ్యాక్సిన్ కి భారత ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని, భారత ప్రభుత్వం కేవలం ఒక క్లయింట్ మాత్రమే అనే భావం కల్గిస్తున్నది.

కోవాగ్జిన్ వ్యాక్సిన ధరను మొదట  మూడు రకాలుగా  భారత్ బయోట్క్ నిర్ణయించడంతో అనుమానాలు మొదలయ్యాయి.

కేంద్ర ప్రభుత్వానికి ఒక ధర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరొక ధర (రు. 600 డోస్ కు), ప్రయివేటు సంస్థలకు ఇంకొక ధర (రు. 1,200) నిర్ణయించడంతో వివాదం మొదలయింది.

ఎందుకంటే, ఈ ధరలు భారతదేశంలో తయారయిన మరొక వ్యాక్సిన్ (కోవిషీల్డ్)  ధర కంటే చాలా ఎక్కువగా ఎందుకు ఉంది?

ఈ పశ్నతో మేధావులు వ్యాక్సిన్ రాజకీయాలను తవ్వడం మొదలుపెట్టారు. కోవిషీల్డ్  తయారీ హక్కులను  సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India SII) స్వీడిష్ –బ్రిటిష్ కంపెనీ యాస్ట్రాజనెకా నుంచి కొంది.  ఈ వ్యాక్సిన్ తయారీలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధనేమీలేదు.ఈ ఖర్చులేదు కాబట్టి కోవిషీల్డ్ ధర తక్కువగా ఉంది,మేమేమో రీసెర్చ్ మీద భారీగా ఖర్చు చేశాము కాబట్టి ఈపెట్టుబడి గిట్టుబాటు కావాలంటే ధర ఎక్కువగా నిర్ణయించాల్సి వస్తున్నదని భారత్ బయోటెక్ వాదించింది.

ఇక్కడే తిరకాసు ఉంది. ఈ రీసెర్చ్  మీద ఎక్కువ ఖర్చు చేసింది భారత ప్రభుత్వమే. ఈ రీసెర్చులో ఎక్కువ భారం మోసింది కూడా భారత ప్రభుత్వ సంస్థల శాస్త్రవేత్తలే. అందువల్ల  భారత ప్రజాధనంతో తయారయిన ఈ వ్యాక్సిన్ వోనర్ షిప్ ( ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కులు) భారత ప్రభుత్వానికే ఉండాలి తప్ప భారత్ బయోటెక్ కంపెనీకి కాదని ప్రొఫెసర్ రామ్ కుమార్, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ వంటి వారు వాదిస్తున్నారు.

వ్యాక్సిన్ వ్యవహారం పెద్ద కుంభకోణమని ప్రొఫెసర్ పట్నాయక్ వాదిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనంత ధరకు ఈ వ్యాక్సిన్ భారతీయులకు అమ్ముతున్నారని ఆయన  ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఆశ్చర్యంగా భారత ప్రభుత్వం ఈ విషయం జోలికి వెళ్లడమేలేదు. వ్యాక్సిన్ మనది కాదు, భారత్ బయోటెక్ కంపెనీదే, ప్రజల కోసం ఈ కంపెనీ చౌకగ్గా వ్యాక్సిన్ సప్లయి చేస్తున్నదన్నట్లు ఉదారంగా  వ్యవహరిస్తూ ఉంది.

ఫ్రొఫెసర్ రామ్ కుమార్ లేవనెత్తినఅంశాలు:

  1. కోవాగ్జిన్ తయారీ కి మొదట బాట వేసింది పుణే లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV). ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)అనుబంధ సంస్థ. భారత దేశంలో మొదట SARS-CoV-2 వైరస్   ను ఐసోలేట్ చేసింది ఎన్ ఐ వీ యే. వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఈ వైరస్ స్ట్రెయిన్ ని   భారత్ బయోటెక్ కు అందించింది ఐపిఎంఆర్ అని మర్చిపోరాదు.ఇందులో ఉన్న రీసెర్చ్ ఎవరిది? 2020 మే 10న ఐసిఎంఆర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ (BBIL)-ICMR  సహకారం గురించి వివరంగా చెప్పింది. వ్యాక్సిన్ డెవెలప్ చేయడం, జంతువుల మీద జరిపే ప్రయోగాలలో, క్యాండిడేట్ వ్యాక్సిన్ సామర్థ్యం అంచనా వేయడంలో  అనుమతులు సంపాదించడంలో ఐసిఎంఆర్-ఎన్ ఐవి ఎలాంటి పాత్ర పోషిస్తాయో ఇందులో చెప్పారు. (“…Work on vaccine development has been initiated between the two partners. ICMR-NIV will provide continuous support to BBIL for vaccine development. ICMR-BBIL will seek fast-track approvals to expedite vaccine development, subsequent animal studies and clinical evaluation of the candidate vaccine which will  fully indigenous to India”.)
  2. వ్యాక్సిన్ మీద క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు 12 సంస్థలను  ఎంపిక చేసినట్లు ఐసిఎం ఆర్ ప్రకటించింది.
  3. క్లినికల్ ట్రయల్స్ ను వేగంగా చేయాలని లేక పోతే చర్యలుంటాయని ఎంపిక 12 సంస్థలకు ఐసిఎం ఆర్ చీఫ్ బలరామ్ బార్గవ హెచ్చరిక చేస్తూ లేఖ రాశారు.
  4. ఆగస్టు 15 కల్లా వ్యాక్సిన్ బయటకు వస్తుందని చెప్పింది కూడా ఆయనే.
  5. రీసెర్చ్ లో ఎంతో లోతుగా భాగస్వామ్యం ఉంటే తప్ప ఇలాంటి లేఖలను భారత ప్రభుత్వ సంస్థ రాయగలదు. అంతేకాదు,ఏప్రిల్ 17న మరొక మూడు సంస్థలు కోవాగ్జిన్ ను తయారు చేస్తాయని కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సిన్ మీద సర్వహక్కులు భారత్ బయోటెక్ వే అయితే, ఐసిఎంఆర్, భారత ప్రభుత్వం ఇలా యజమాని లాగా ఎందుకు ప్రకటనలు చేస్తున్నాయి. ఆ పనేదో భారత్ బయోటెక్  కంపెనీయే చేయవచ్చుగా?
  6. అంటే కోవాగ్జిన్ తయారీ మీద భారత ప్రభుత్వానికి ఎంతో కొంత అధికారం ఉందని అర్థమవుతుంది. ఇది ఏ మేరకో ప్రభుత్వం బయటపెట్టడం లేదు. అంత గోప్యం ఎందుకు?
  7. ఐసిఎంఆర్ కు, భారత్ బయోటెక్ కు ఉన్న ఒప్పందం గురించిన వివరాలేవీ వెబ్ సైట్లలో లేవు. ముఖ్యంగా భారత ప్రభుత్వం- భారత్ బయెటెక్ కంపెనీలు సంయుక్తంగా తయారు చేసిన కోవాగ్జిన్ మీద వోనర్షిప్ హక్కులెవరికి ఉంటాయనే మాట ఎక్కడా రికార్డులలో కనిపించకం పోవడం ఆశ్చర్యం.
  8. ఇలాంటపుడు అనుప్రియ ధోన్చాక్, అనిక్ భాదురి అనే ఇద్దరు నల్సార్ పరిశోధకులు మరొక ఆసక్తికరమయిన విషయం వెలుగులోకి తెచ్చారు.  భారత ప్రభుత్వం సంస్థలు  ఏవేని ప్రవేటు సంస్థలతో సంయుక్తంగా ఏదైని ఉత్పత్తి చేసినపుడు  వోనర్షిప్ ఎవరిది అనే ప్రశ్నకు వారు సమాధానం చెప్పారు. 2017 భారత ప్రభుత్వం జనరల్ ఫైనాన్సియల్ రూల్స్ ప్రకారం, భారత్ ప్రభుత్వం నిధుల సహకారం ఉన్నపుడు  ఉత్పత్తయే భౌతిక, మేధోసంపత్తి మీద హక్కులు  స్పాన్సర్ (ప్రభుత్వం) కే ఉండాలి. “… a stipulation should be made in such cases  that the ownership  in the physical and intellectual  assets created or acquired  out of such funds  shall vest in the sponsor”. అయితే, కోవాగ్జిన్ విషయంలో భారత్  బయోటెక్ కంపెనీకి, ఐసిఎంఆర్ కు మధ్య కుదరిన ఒప్పందంలో వోనర్షిప్ గురింపు ఎవరికి దగ్గిర ఉండాలనకున్నారు, దీనికి  సంబంధించిన నియమం ఏమిటి? ఎవరూ బయటపెట్టడం లేదు.
  9. కోవాగ్జిన్ తయారీలో భారత ప్రభుత్వ నిధులున్నాయనేందుకు పరోక్ష నిదర్శనాలు చాలా ఉన్నాయి. కోవ్యాగ్జిన్ మీద వచ్చిన పరిశోధనా పత్రాలన్నింటిలో ఇచ్చిన డిక్లరేషన్ లో భారత ప్రభుత్వం ఆర్థిక సాయం ఉన్నట్లు పేర్కొన్నారు. కోవాగ్జిన్ మీద మొత్తం ఆరు పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్ లో అచ్చయ్యాయి. ఇలాంటివి ప్రచురించే ముందు పరిశోధనకు ఆర్ధిక సహాయం ఎవరు అందించారో పేర్కొని తీరాలి.  కోవాగ్జిన్ పరిశోధనల్లో భారత ప్రభత్వ ఆర్థిక సాయం ఉందనేందుకు ఈ రీసెర్చ్ పేపర్ల డిక్లరేషనే సాక్ష్యం. ఈ పేపర్ల రచయితల్లో ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ బార్గవ పేరుకూడా ఉంది.
  10. మరలాంటపుడు భారత ప్రభుత్వం ఇన్వెస్ట్ మెంట్లకు సంబంధించిన వివరాలు బయటపెట్టాలి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ భారత ప్రభుత్వానికి ఉన్నపుడు వ్యాక్జిన్ తయారు చేసే బాధ్యతలను కేవలం భారత్ బయోటెక్ కే ఎందుకు వదిలేయాలి? వ్యాక్సిన్ ధరలను నిర్ణయించే హక్కు భారత్ బయోటెక్  కంపెనీకే వదిలేయడం ఏమిటి? భారత్ బయోటెక్ ప్రపంచంలో ఎక్కడ లేనంత ధర కు భారత  ప్రజలకు విక్రయించడం ఏమిటి?

కోవాగ్జిన్ ధర కుంభకోణంలో భాగమా?: ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ 

కరోనా వైరస్‌ నిరంతరం మ్యుటేట్‌ అయిపోతూ వుంటుందని అందుచేత దానికి తగినట్టు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసుకోవలసి వుంటుందని, వాక్సిన్  ధర అధికంగా నిర్ణయించడం ఈ ఖర్చుల కోసమేనని చెప్తున్నారు.

కాని, దీని కోసం భారత ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సహాయం గురించి నోరు విప్పడం లేదు ( కేంద్రం    సీరం ఇన్ స్టిట్యూట్ కు  రూ.3000 కోట్లు ఇచ్చింది. భారత్ బయోటెక్  కి  రూ.1500 కోట్లు ఇచ్చింది).

అంటే వ్యాక్సిన్  ఉత్పత్తిదారులూ ఇప్పుడు నెలకొన్న సంకట స్థితిని తమకు లాభదాయకంగా మలచుకోడానికి మాత్రమే చూస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి ఈ వాస్తవం తెలియలేదంటే అది దాని చేతకాని తనం ఔతుంది. తెలుసునంటే ఈ అవినీతి కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అయినట్టు అనుకోవలసి వుంటుంది. అందుకే ఈ వ్యవహారంపై విచారణ జరగడం అవసరం అని ప్రొఫెసర్ ప్రభాత్ సర్కార్ పీపుల్స్ డెమోక్రసీ లో రాశారు.

ఇపుడున్న సంక్షోభానికి ఒక పరిష్కార  కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని జాతీయం చేయడమని ఆయన అభిప్రాయపడ్డారు.

“అంత ధైర్యం ఈ ప్రభుత్వానికి లేకపోతే ప్రస్తుత సంక్షోభం నుండి గట్టెక్కే వరకైనా సీరమ్ SSI ని, BBIL ని తాత్కాలికంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ తర్వాత తిరిగి వెనక్కి అప్పజెప్పవచ్చు ( స్పెయిన్‌ వంటి దేశాలు ప్రైవేటు ఆస్పత్రులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాయి).  ఆ విధంగానైనా చేసే ధైర్యం లేకపోతే కనీసం వ్యాక్సిన్‌ ధరలను నిర్ణయించే విషయంలో ఒక కమిషన్‌ ను నియమించి ఉత్పత్తికి అయిన ఖర్చెంతో, ప్రభుత్వం ఎంత రేటు చెల్లించాలో తేల్చాలి (వ్యవసాయోత్పత్తుల ఖర్చులను, ధరలను నిర్ణయించడానికి కమిషన్‌ వేసిన విధంగానే). ఒకే ఒక కొనుగోలుదారుడిగా ప్రభుత్వం ఉండే విధానం ఎందుకు అమలు చేయకూడదో అది కూడా ఆ కమిషన్‌ నిర్ధారించవచ్చు.

అది చేయలేకపోతే కనీసం ఈ ఇద్దరు ఉత్పత్తిదారుల గుత్తాధిపత్యాన్ని బద్దలు గొట్టడానికైనా పూనుకోవాలి. కొత్త ఉత్పత్తిదారులను ఆహ్వానించాలి. ఎవరు అతి తక్కువ ధరకు వ్యాక్సిన్ ను అందించడానికి ముందుకు వస్తారో వారికే ఉత్పత్తి చేసే లైసెన్సు మంజూరు చేయాలి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *