కోవిడ్ అత్యవసర చికిత్సలో అవసరమయిన రెమ్డిసివిర్, టోసిలిజుమాబ్ ఇంజక్షన్ ల తెలంగాణ కోటా పెంచాలని ఆర్థికమంత్రి హరీష్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ వివిధ రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు ఈ వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్నారు
తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టు్కుని ఆక్సీజన్ సరఫరా పెంచడంతో పాటు. రెమిడిసివర్ ఇంజక్షన్ల కోటాను, వాక్సీన్ల కోటాను పెంచి తక్షణమే సరఫరా చేయాలని హరీష్ రావు కోరారు.
‘తెలంగాణకు కేటాయించిన 450 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ ను 600 మెట్రిక్ టన్నులకు పెంచాలి.. ఒడిశా తదితర సుదూర ప్రాంతాలనుంచి కాకుండా, దగ్గరలో వున్న రాష్ట్రాలనుంచి ఆక్సీజన్ క్రయోజనిక్ ట్యాంకర్లను కేటాయించాలి. తద్వారా తరలింపుకు సులువవుతుంది. పక్కన వున్న ఆంద్ర ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్ట్రాల నుంచి కేటాయింపులు చేయాలి,’ అని కేంద్ర మంత్రిని కోరారు.
రెమిడిసివిర్ ఇంజిక్షన్లను రోజుకు 20 వేలకు పెంచాలని ఎయిర్ అంబులెన్సుల ద్వారా అత్యవసర చికిత్సకోసం ఇతర ప్రాంతాలనుంచి కరోనా రోగులు తెలంగాణకు తరలి వస్తున్నారని, ఈ సందర్భంగా రోజుకు కేవలం 810 మాత్రమే అందచేస్తున్న టోసిలీ జుమాబ్ మందులను రోజుకు 1500 కు పెంచాలనని కూడా హరీష్ రావు కోరారు.
ప్రతిరోజు తెలంగాణకు 2 లక్షల టెస్టింగ్ కిట్లు అవసరముందని కూడా ఆయన కేంద్ర మంత్రికి తెలిపారు.
రెండో డోస్ కొవిడ్ టీకాను సిఎం ఆదేశాలమేరకు నూటికి నూరుశాతం రాష్ట్రంలో అమలుపరుస్తున్నామని చెబుతూ 45 సంవత్సరాలకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయడం కోసం మొత్తం 1 కోటీ 29 లక్షల వ్యాక్సీన్ల అవసరం వున్నదని ఆయన తెలిపారు.
ఈనెల చివరి వరకు మొత్తం 13 లక్షల వ్యాక్సీన్లు తక్షణావసరమున్నదని, వెంటనే రాష్ట్రానికి సరఫరా చేయాలి. 2000 వెంటిలేటర్లు రాష్ట్రానికి అవసరముంది ఆయన కేంద్ర మంత్రికి తెలిపారు.
వీడియో కాన్పరెన్సులో తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతుండటం పట్ల కేంద్ర మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సీజన్, రెమిడిసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందులు సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.