గురి తప్పిన జగనన్న ట్వీట్….

మారణహోమానికి ఎవరిని వేలెత్తి చూపాలి?

బహుశా ఇదే ప్రధమం కావచ్చేమో!ఎట్టి వివాదాస్పద అంశమైనా జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా వుండే వైకాపా శ్రేణులు చేతులెత్తేయడం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన ఎన్ని అసంబద్ధ నిర్ణయాలు గైకొన్నా వైకాపా శ్రేణులు ప్రధానంగా సోషల్ మీడియా సైన్యం ముఖ్యమంత్రి ప్రత్యర్థులపై అంతెంత్తున లేచే వారు.ముందు వెనుక చూడకుండా ప్రత్యర్థులను ట్రోలింగ్ చేసేవారు

 

తుదకు న్యాయ స్థానాల తీర్పులకు వ్యతిరేకంగా కొందరు న్యాయమూర్తులకు (వివాదాస్పదం అని తెలిసీ)వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి లేఖ రాసిన సందర్భంలో కూడా వైకాపా శ్రేణులు ప్రధానంగా ఉబ్బిడికిబ్బిడిగా వుంటే సోషల్ మీడియా శ్రేణులు ముఖ్యమంత్రికి దన్నుగా నిలిచాయి. ఫలితంగా కొందరు కేసులు కూడా ఎదుర్కొన్నారు.

కాని కరోనాను అదుపు చేయడంలో వైఫల్యం చెందిన ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా అది కూడా తాము చెప్పేది వినలేదని ట్వీట్ చేసిన ఝూర్డండ్ ముఖ్యమంత్రికి సలహా రూపంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం పెద్ద దుమారం లేపింది.

దానిపై ఒడిషా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులొకరితో పాటు ఝార్ఖండ్ అధికార పార్టీ ఘాటుగా జవాబు ఇవ్వడం చక చక జరిగి పోవడం అందరికి తెలుసు. ఫేక్ లేక వాస్తవమో తెలియదు గాని తమిళ నాడుకు చెందిన శశికళ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ట్వీట్ చేసింది.

జగన్మోహన్ రెడ్డిని ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు న్యాయ పరమైన చిక్కులు తెలియని వారు కూడా పోస్టులు పెట్టారు. ఇంత జరుగుతున్నా గతంలో లాగా వైకాపా సోషల్ మీడియా సైన్యం గాని ముఖ్య మైన శ్రేణులు గాని స్పందించక పోవడం గమనార్హం.

బహుశా ఇదే ప్రధమమేమో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్ పడటం. అంతే కాదు. వైకాపాను ఎప్పుడూ భుజాన మోసే ఒక వెబ్ సైట్ లో రెండు మూడు కథనాలు వెలువడ్డాయి. జగన్మోహన్ రెడ్డిని గైడ్ చేసేందుకు వైకాపాలో అనుభవమున్న నేతలు ఎవరూ లేరని పెద్దరికం అటూ ఎవరూ లేనందున జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేసే అనుచర గణం మాత్రమే వున్నందున ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నా జరుగుతున్న తప్పులతో అంతా గాలికి పోతోందని ఆవేదన వెలుబుచ్చారు. ఆఖరుగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కు వ్యతిరేకంగా వస్తున్న విమర్శలను తగినంత మోతాదులో వైకాపా శ్రేణులు సోషల్ మీడియాలో స్పందించ లేదని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.

 

గౌరవంగా బతకడం అటుంచి గౌరవంగా చనిపోయే అవకాశాలు దేశంలో కొరవడినాయని గౌరవంగా తప్పు కోండని నరేంద్ర మోడీని ఉద్దేశించి లక్షలాది మంది గొంతెత్తి వివిధ రూపాల్లో నినదిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పేలిన ఆటం బాంబులాగా బీభత్సం సృష్టించింది. కరోనా సృష్టించుతున్న భయానక వాతావరణంలో ఊపిరి వుంటే చాలనే భయంతోనే వైకాపా శ్రేణులు నిస్తేజమైనవేమో.  వాస్తవం చెప్పాలంటే వైకాపాలో సమిష్టి నాయకత్వం లేదు. ఆ మాట కొస్తే ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా ఎవరో ఒక వ్యక్తిని ఆశ్రయించుకొని వుంటాయి.

 

టిడిపి కూడా ప్రాంతీయ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు వేళ్లపై లెక్క పెట్టగల కొందరు నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. వైకాపా ఇందుకు పూర్తి భిన్నం. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం మీద ఆధారపడి వుంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా కొందరు వ్యక్తుల ప్రతిభ మీద ఆధారపడి మనుగడ సాగించినా ఒక బోర్డు అంటూ ఒకటి వుంటుంది. చర్చించి నిర్ణయాలు గైకొంటారు. కాని వైకాపా అధికారంలోనికి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా రాష్ట్ర స్థాయిలో పార్టీ అత్యున్నత బాడీ సమావేశమైన సందర్భం లేదు.

 

ఒకటంటూ కూడా లేదేమో. ఈ బలహీనత వైకాపా ప్రభుత్వానికి గుడి బండ లాగా వుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది అమలు జరుగుతోంది. మున్ముందు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు పైననే తమ భవిష్యత్తు ఆధారపడి వుందని నేతలు భావిస్తున్నారు. అందుకే మంత్రులు ఎక్కడికి పోయినా ముఖ్యమంత్రి చెప్పిన మేరకు అని ప్రసంగం మొదలు పెడతారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరమ అధ్వానంగా వున్నా ఒకటవ తేదీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వ లేకున్నా ఎంతో కొంత మేరకు అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భారత దేశంలో అన్ని రాష్ట్రాలు రోల్ మాడల్ గా మారాయని వైకాపా నేతలు చెబుతున్నారు.

అయితే పరిస్థితులు అనుకూలంగా వుంటే ఏ నాయకుడైనా విజయ పథంలో సాగి పోతాడు. కాని సంక్లిష్టమైన పరిస్థితి ఎదురైనపుడు కూడా ముందుకు సాగితేనే నాయకత్వ ప్రతిభ వ్యక్త మౌతుంది. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుకు పూనుకున్న నవ రత్నాలు ఒక నిర్దిష్ట చారిత్రక దశలో ప్రాధాన్యత పొందినా నేడు గాలిలో దూది పింజలుగా తేలి పోతున్నాయి. ప్రస్తుత నిర్దిష్ట చారిత్రక దశ అనుగుణంగా ఈ నవ రత్నాలు లేవు. ప్రజల ఆరోగ్యం వైద్యానికి నిధులు లేవు. కరోనా రోజుల్లో తాము ఇచ్చే నిధులు ఆదుకుంటాయని ముఖ్యమంత్రి భావిస్తున్నా వాస్తవంలో భిన్నంగా వుంది. ప్రజల్లో ఊపిరి వుంటే చాలు అనే భావన ఏర్పడుతోంది. అవసరమైన మేరకు ప్రభుత్వం ప్రజలకు ఊపిరి పోయ లేక పోతోంది. ప్రభుత్వం రెండంకెల్లో కొందరికి ఆర్థిక సాయం చేస్తే నాలుగైదు అంకెల్లో ఖర్చు పెట్ట వలసి వుంది. పలువురు అంబులెన్స్ ల్లో ఆసుపత్రి మెట్లపై ప్రాణాలు వదులు తున్నారు. ఈ నేపథ్యంలో

అమ్మ ఒడి వద్దు – ఆక్సిజన్ ఇవ్వు
ఇంటి వద్దకు రేషన్ వద్దు. ఇంటి వద్దకు వాక్సిన్ ఇవ్వు
వసతి దీవెన వద్దు. ఆసుపత్రిలో వసతి ఇవ్వు
చేయూత వద్దు. వైద్య భరోసా ఇవ్వు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి నేడు సోషల్ మీడియాలో ఈలాంటి పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రతి అంశానికి అంతెంత్తున లేచే వైకాపా శ్రేణులు నిస్తేజంగా వున్నాయి.

కరోనా వైరస్ అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం గురించి అంతర్జాతీయ మీడియా మొదలు కొని భారత దేశంలో గల్లీలోని సామాన్యుని వరకు ప్రధాన మంత్రి మోదీపై వేలెత్తి చూపిస్తోంది. మాట్లాడితే దేశ ద్రోహం కేసులు బనాయించడం మమత బెనర్జీ చెప్పినట్లు ఒక్క బంగాల్ కోసం నేడు దేశాన్ని రావణ కాష్టం చేయడం చూస్తున్నాము.

ఈ నేపథ్యంలో 20 నెలల క్రితమే ఈ రాష్ట్ర ప్రజలు తనకు అఖండ విజయం చేకూర్చినందుకు వారి బతుకులు బుగ్గి పాలు కాకుండా చూడలసిన జగన్మోహన్ రెడ్డి పైగా కేంద ప్రభుత్వ అసంబద్ధ వైఖరికి వ్యతిరేకంగా గళం ఎత్తడం మానుకున్నారు. పైగా ప్రధాన మంత్రిని వెనకేసుకు రావడం పుండుపై కారం రాసినట్లయింది. కరోనా దేముంది. పారాసిట్మాల్ బ్లీచింగ్ పౌడర్ తో ఖతమౌతుందని ఒక నాడు తేలికగా మాట్లాడినా ఈ రాష్ట్రం ప్రజలు దిగ మింగుకున్నారు. కాని రెండవ అల రాబోతోందని వార్తలు హోరెత్తుతున్నా అందుకు అనుగుణంగా ఎట్టి చర్యలు చేపట్టక పోవడం 25 పార్లమెంటు సభ్యులను గెలిపించితే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ అదుపులో కేంద్ర మెడలు వంచక పోగా కేంద్రానిక వ్యతిరేకంగా గళం విప్పిన మరొక ముఖ్యమంత్రికి సలహా ఇవ్వబోయి రాజకీయంగా బోర్ల పడ వలసి వచ్చింది. తనకు ఇంత కాలం దన్నుగా వుండిన వారి మద్దతు కోల్పోవలసి వచ్చింది

నాణేనికి ఇది ఒక వేపు అయితే మరో వేపు మున్ముందు భయంకరంగా వుండబోతోంది. జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుండి ఇస్తున్న ఆదేశాలు సూచనలు ఎంత వరకు అమలు జరుగుతున్నాయో ఆ వివరాలు అటుంచగా ఈ బీభత్సంలో మారణహోమంలో తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు తండ్రి మరణం తట్టుకోలేక చితిలో దూకిన యువతికి చెందిన పిల్లలు భర్తలను పోగొట్టుకున్న భార్యలు పెళ్లి పీటల మీద పుస్తెకట్టగా పసుపు పారాణి ఆరక ముందే భార్యలను పోగొట్టుకున్న భర్తలు వీరంతా భవిష్యత్తులో ఎవరిపై వేలెత్తి చూపుతారో చరిత్ర గతి నిర్ణయించ బోతోంది.

కుంభ మేళా వాయిదా వేస్తే ఏమై పోతుంది.? అయిదు రాష్ట్రాల ఎన్నికల ఒక సంవత్సరం వాయిదా వేసి వుంటే భారత రాజ్యాంగం కంట తటి పడుతుందా?మలిన మౌతుందా? ఇప్పుడు లక్షలాది మంది మృత దేహాలు దహనం చేసేందుకు స్థలం దొరకడం లేదే. ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారు?

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల జాతర లేకుంటే కొంపలు మునిగి పోవు కదా? ఇప్పుడు ఒక్కో ఇంటిలో ఇద్దరు ముగ్గురు పోతున్నారు. ఉప ఎన్నికలు లేకుంటే పుణ్య క్షేత్రాల సందర్శన తొలి నుండి అదుపు చేసి వుంటే ఈ నర మేథం చిత్తూరు జిల్లాలో నివారింప బడేది కదా? ఇందులో రెండు విధాలుగా విధ్వంసం వుంది. కావలసిన కాలమై పోయారు. ఈ ఝంఝాటకంలో వున్న ఆస్తి పాస్తులు కరిగి పోయాయి. ఈ నర మేథంలో సర్వస్వం కోల్పోయిన తర్వాత మిగిలిన వారు భవిష్యత్తులో బతక లేక ఏలాంటి అసాంఘిక విధ్వంస కార్య క్రమాలకు పాల్పడుతారో ఊహిస్తే భయ మేస్తోంది.

( ‘విశాలాంధ్ర’ దిన పత్రిక లో సౌజన్యంతో )

(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *