ఓ గిరీశం అభిమానిగారి సిగరెట్టోపాఖ్యానం

(బివి మూర్తి)

ఖగపతి అమృతము తేగా

బుగబుగ మని పొంగి చుక్క భూమిని వ్రాలెన్

పొగ మొక్కై జన్మించెను 

పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్

 

కన్యాశుల్కంలో ఈ అత్యవసర ఆశుపద్యం చెప్పే సమయానికి శ్రీమాన్ గిరీశం గారు శిష్య పరమాణువు వెంకటేశంతో కలిసి, చుట్ట కాల్చడవఁనే మహత్తర సంస్కృతిని కొనసాగించవలసిన ఒకానొక సోషల్ కంపల్షన్ ని ఎదుర్కొంటున్నారు.

‘మీ సావాసం వల్ల చుట్ట కాల్చడం తప్ప ఇంకేఁవీ అబ్బడం లేద’ని లోకులు కాకులై కూస్తున్న ఓ అస్సెస్ మెంటానిలిసీస్ ని వెంకటేశం ఓ మోస్తరు నిర్మొగమాటం తోటి ఏకరువు పెట్టేసరికి గిరీశానికి ఎక్కడో మండిపోయింది. సదరు కంపల్షన్ కి తోడు బోల్డంత ఆవేశవూ, దానికి రెండింతల కోపవూ తోడు పడి కవిత్వం అధాటున తన్నుకొచ్చింది.

అందుకనే శిష్య పరమాణువు మనసు చెడగొట్టడానికి కుటిల కుత్సిత ప్రయత్నాలు చేసిన లంఢీకొడుకుల్ని దున్నపోతులై పుడతారు పోవోయ్ అని కవితావేశంతో కసిదీరా తిట్టి పడేసేడన్నమాట.

ఉత్తరోత్తరా, నిరంతరం చుట్ట కాల్చే శాల్తీలని `నిత్యాగ్నిహోత్రు’ లని సంబోధించే వెటకారప్ప్రయోగం రూఢి పడటం వెనకాతల ఈ దిక్కుమాలిన గిరీశం కొంపకూల్చే లౌక్యమేదో తగలడే ఉంటుందని కొందరు గొణుక్కుంటున్న మాట నిజమే గానీ ఇందులో నిజానిజాలేవిటో దేవుడికే ఎరుక.

శిష్య పరమాణువు వెంకటేశం తండ్రిగారి పేరు అగ్నిహోత్రావధాన్లుగా ఉండటం కేవలం యాదృచ్ఛికమవుతుందే తప్ప అందులోనూ గురువుగారి పాత్ర ఉందని వాదించే అల్పబుద్ధులకు ఏవఁని చెప్పగలం? అయినా బుద్ధిగా చేసి తగలెట్టడానికి చేతి నిండా పనేదీ ఏడవకుండా ఇలా అస్తమానం ఏదో ఒహ సంగతి మీద గొణుక్కోడానికి అలవాటు పడిన గొణుగుడు సుబ్బన్నల గురించి గిరీశం లేశమంతైనా ఖాతరు చేయడు.

గురజాడ వారు గిరీశం ద్వారా పలికించిన ఈ చక్కని పద్యం ద్వారా ఏం తెలుస్తున్నది? క్షీరసాగర మథనంలో అమృతం పుట్టి, దాన్ని గరుత్మంతుడు తన్ను కెళ్లే సమయంలోనే తలవని తలంపుగా పొగాకు నాట్లు పడ్డాయని సులభంగా అర్థవైఁ పోడం లేదూ.

చిలకడం సాంతం పూర్తయ్యాక నింపాదిగా నిలకడగా సెటిలైపోయిన పాలకడలిలో, తేలియాడే పాము పరుపు పైన విలాసంగా విష్ణుమూర్తి శయనించాడనిన్నీ, ఆయన బొడ్డు లోంచి పైకి పూచిన కమలం లోని పుప్పొడి పరిచిన కుషన్ సీటులో బ్రహ్మదేవుడు కూర్చుని సృష్టి కార్యం మొదలెట్టాడనిన్నీ కదా ఇతిహాసం చెబుతున్నది. అంటే ఏవిటీ, బ్రహ్మ సృష్టించిన మొదటి బ్యాచీ మనుషులు భూమ్మీదకు రావడానికి ఎంతో ముందుగానే ఇక్కడ పొగాకు ఏపుగా పెరిగి వినియోగానికి సిద్ధంగా ఉన్నదన్న మాట.

మొన్న సావిత్రి బయోపిక్ సిన్మాలో ఎస్వీ రంగారావు క్యారెక్టరు వేసిన మోహన్ బాబు చుట్ట కాల్చాడేమిటి చెప్మాఁ  అని ఆలోచించి ఆలోచించి తెగ ఇదైపోయాను. ఒకవేళ మనం గనక మహానటి సిన్మా పైన రివ్యూ గివ్యూ రాసినట్టయినా ఇదే విషయమ్మీద సదరు కుర్ర డైరెక్టర్ని గిరీశం స్టయిల్లో ఏకబిగిని ఏకిపారేద్దా వనుకున్నాను.

ఎందుకంటే ఎస్వీరంగారావున్నూ, జానపద సిన్మాల కత్తియుద్ధం కాంతారావున్నూ కచ్చితంగా బర్క్ లీ సిగరెట్లే తాగేవారని నా గట్టి నమ్మకమున్నూ, అందుకు సరిపడా దాఖలాలు కూడా ఉన్నవాయెను.

ఈ యాక్టర్ల బొమ్మలున్న బర్క్ లీ సిగరెట్ యాడ్ లు పత్రికల్లో రావడం నేను కళ్లారా చూశాను. అయినా ఈ మధ్య బయోపిక్ లు తీసిన/తీస్తున్న ప్రతి డైరెక్టరూ సదరు సబ్జెక్టుపైన తీవ్ర, ఘోరమైన రీసెర్చ్ చేస్తున్నట్టు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ఢంకా కొట్టి మరీ చెబుతున్నప్పుడు ఎస్వీఆర్ తాలూకూ సిగరెట్ హిస్టోరికల్ ఫ్యాక్ట్స్ గురించి మనం రాద్ధాంతం చేయడం దేనికిలే అని ఊరకుండిపోయాను.

పైగా ఈ సిన్మా నటులూ, క్రికెట్ స్టార్లూ తాము ఎండార్స్ చేసిన బ్రాండ్లను తాము వాడుతారన్న గ్యారంటీ ఎక్కడేడిసింది గనక? ఏమో ఎస్వీ రంగారావు గారు మొదట్లో చుట్టలు ఊదేస్తూ అటు తర్వాత బర్క్ లీ కి మారేరేవోఁ అని నాకు నేను సర్ది చెప్పుకొనిన్నీ, ఇంతటి సందిగ్ధపూరిత సంక్లిష్ట సంశయాత్మక విషయాలపై మౌనమే శరణ్యమనుకునిన్నీ గమ్మునుండి పోయానంతే.

ఇహపోతే పొగాకు ఉత్పత్తుల పరిణామక్రమంలో చుట్టలదే మొదటి అవతారమనీ, బీడీలు తర్వాత వచ్చేయని చెప్పవచ్చు. తెల్ల మ్లేచ్ఛుల పాలన కిందకు మనం వచ్చేక, వాళ్ల సాహచర్యంతోనే మరికాస్త నాజూకైన సిగార్లు, సిగరెట్లు మన మధ్యకు వచ్చి పడ్డాయని విజ్ఞుల అభిప్రాయం (తెల్ల దొరల వ్యాపార ధురీణత, పటాటోప పరాయణత్వమే తప్ప సిగార్లకు చుట్టలకు మధ్య మౌలికమైన తేడాలట్టే ఏం లేవఁని గిరీశం వంటి అద్వైతసిద్ధాంతు లేనాడో కుండ పగలేసి మరీ తత్వం బోధపరిచేరు).

విషయాలింత విస్పష్టంగా ఉన్నప్పటికిన్నీ 1960 దశకంలో వచ్చిన రాముడు భీముడు సినిమాతో సరికొత్త వివాదం భళ్లున విచ్చుకున్నది. ఈ సినిమాలో రేలంగి వెంకట్రామయ్య గారు `ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకాదహనం చేశాడు అని ఓ పాటలో గట్టిగా వాదించడంతో నిజమే కామోఁసు అని అనుకున్నవాళ్లు లేక పోలేదు. అయితే రేలంగి ఈ ముక్క అనీ అనక ముందే సహ నటి గిరిజ గారు సదరు సినిమాలో `హా…ఎవడో కోతలు కోశాడు’ అంటూ ఓ ఛీత్కారంతో కొట్టి పడేస్తారు.

 

వాదప్రతివాద ధోరణిలో సాగే ఈ సిగరెట్ సంకీర్తనా గీతం అప్పట్లో బహుళ ప్రజాదరణ పొంది ఆంధ్రదేశంలో నలుచెరఁగులా మారుమ్రోగింది. అయితే ఆంజనేయుడు సిగరెట్టు కాల్చేవాడా, లేదా?, ఆయనగారి మిత్ర బృందంలోని అంగదుడూ, నీలుడూ వగైరాలూ, వీళ్లకందరికీ పెద్దదిక్కు వంటి జాంబవంతుల వారికి కూడా ఈ అలవాటుండేదా?, తమ యొక్క ఆ కామ్రేఁయిడరీని కాపాడుకునే సత్సాంప్రదాయాల్లో భాగంగా వీళ్లంతా వంతులు వేసుకుని ఒకే సిగరెట్టుని ఒకరి తర్వాత మరొకరు వల్లమాలిన తాదాత్మ్యంతో దమ్ములు లాగేవారా, లేదా?, ఇత్యాది విషయాలపై రాముడు భీముడు సినిమా విడుదలైన కొత్తలో గానీ, అటు తర్వాతెప్పుడైనా గానీ మేధావి వర్గాల్లో చర్చలు జరిగిన జాడలేవీ లేవు.

ఈ గీతం రాసిన కొసరాజు రాఘవయ్య చౌదరి గారి స్వస్థలం గుంటూరు జిల్లా అని చెబుతారు. మేలిమి రకం పొగాకు పంటకు, ఘుమఘమలాడే చుట్టల తయారీకీ, రావణకాష్ఠం వంటి చుట్టల్ని ఉంగరాల చేతి వేళ్ల మధ్య ధరించిన, ఇస్త్రీ మడతలు నలగని ఖద్దరు పంచె-లాల్చీల మోతుబరి పెద్ద మనుషులకి ఈ జిల్లా పెట్టింది పేరు. ఇహపోతే గుంటూరు మిర్చి మొదటి నుంచీ జగత్ప్రసిద్ధమే. వాటి ఘాటూ, కారవూఁ ఏపాటివో, ఎంతటి తీవ్రాతితీవ్రమైనవో వేరుగా చెప్పనక్కర లేదు. ఇంతటి ఘనత వహించిన గుంటూరు జిల్లా వ్యాస్తవ్యుడైన వాడున్నూ, ఎన్నెన్నో అనర్ఘ రత్నముల వంటి సూపరుహిట్టు సినిమా పాటలు రాసి కీర్తి వహించిన వాడున్నూ అయినటువంటి ఆ యొక్క కొసరాజు గారు, సదరు రాముడు-భీముడు సినిమాలో ఆంజనేయుల వారు సిగరెట్టు తోటే లంకా దహనం చేశారని చెప్పడం తాలూకు ఆ చరణం రాయడాన్ని ఏదో ఆషామాషీగా రాసిన వ్యవహారంగా కొట్టి పారవేయడానికి ఎంత మాత్రం వీలు గాదు. అయినా కొసరాజు గారు తాము అలాగ ఎందుకు రాశారో, రామాయణంలోని లంకా దహన ఘట్టంపై తాము చేసిన పరిశోధన ఏ పాటిదో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏవీఁ చెప్పలేదు.

ఇదే పాటలో ఇంకో చరణంలో ఊపిరి తిత్తులు క్యాన్సరుకిదియే కారణమన్నారు డాక్టర్లూ….. అంటూ గిరిజమ్మ దీర్ఘం తీస్తుంటే, కాదన్నారులే పెద్ద యాక్టర్లూ అంటూ రేలంగి ఛప్పున ఖండిస్తారు. ఇందులో పెద్ద యాక్టర్లు అన్న ప్రయోగం కాంతారావూ, ఎస్వీరంగారావులను ఉద్దేశించిందే నని విజ్ఞులు గమనించ గలరు.

 

సినిమా యాక్టర్లు సిగరెట్ బ్రాండ్ ల వాణిజ్య ప్రకటనల్లో యాక్టివ్ గా ఉండేవారని చెప్పడానికి ఇదో ప్రబల సాక్ష్యంగా పరిగణించవచ్చు.

ఎస్వీరంగారావు గారి బర్క్ లీ యాడ్ ఇప్పటికైతే ఏదో అదృష్టం కొద్దీ ఆర్కివ్స్ లో దొరుకుతున్నది గానీ మునుముందు ఇలాంటి చారిత్రక దాఖలాలన్నీ కాలగర్భంలో మట్టి కొట్టుకుపోవడం ఖాయంగా తోస్తున్నది.

నా పరిమిత పరిజ్ఞానవూఁ, జ్ఞాపకశక్తి మేరకు ఈ తరం హిందీ నటులు వివేక్ ఒబరాయ్ గారి తండ్రి గారు సురేష్ ఒబరాయ్ గారున్నూ, టైగర్ ష్రాఫ్ తండ్రి గారైనటువంటి జాకీ ష్రాఫ్ గారున్నూ సిగరెట్ యాడ్ లు చేయగలిగిన దమ్మూదర్పం గల చివరాఖరి ధైర్యవంతులు. వాళ్లు చేసిన యాడ్ చిత్రం వల్ల మన హైదరాబాద్ నగరంలోని నిజాము నవాబుల కాలం నాటి వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీకి వ్యాపారం ఏ మేరకు పెరిగిందో తెలియదు గానీ ఆ కంపెనీ తమ సిగరెట్ల కోసం ఎంచుకున్న పేరు వల్ల పాత నగరంలో ఓ మూల గాజులూ, ముత్యాల అంగళ్ల మధ్య కూరుకుపోయి ఊపిరాడక గింజుకుంటున్న మన చార్మినార్ కు ప్రపంచ ప్రఖ్యాతి లభించడం మాత్రం ముమ్మాటికీ వాస్తవం. ఆ ముదురు పసుప్పచ్చ రంగు సిగరెట్ ప్యాకెట్టు మీద ఎర్రగీతల చార్మినార్ బొమ్మ ఎంత బావుండేదో అని ఇప్పుడు గుర్తు చేసుకుని మురిసిపోవలసిందే.

కొమ్మూరి సాంబశివరావు, భయంకర్, షాడోల అపరాధ పరిశోధన నవలల్లో డిటెక్టివ్ హీరోలు యుగంధరూ, నర్సనూ, పార్థసారథి గట్రాలు చివరి దమ్ము గుండెల నిండా లాగి సిగరెట్ ని బూటు కాలితో నలిపి’’ విలన్ పని పట్టడానికి ముందుకు దూకేవారు.

ఈ పొగ తోటి  గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చూ అంటూ రేలంగి ద్వారా కొసరాజు గారు మురిసి పోయారు. మహాకవి శ్రీశ్రీ గారు, మడిచిన గుప్పెట్లో చిటికెన వేలికీ, ఉంగరం వేలికీ మధ్యన కాలుతున్న క్యాప్ స్టన్ సిగరెట్టుతో సహా మా అనంతపురం పిజి సెంటర్ తెలుగు విద్యార్థులతో ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గొనడం నచ్చక చాలామంది ముసలి ప్రొఫెసర్లు మూతి తిప్పుకున్నారు.

సిగరెట్ హీరోయిజానికి కాలం చెల్లింది. స్మోకర్ల మైనారిటీ జాతికి హక్కులంటూ ఏవీ లేకపోగా హెచ్చరికలు మాత్రం ఎక్కడ బడితే అక్కడ సర్వత్రా హాజరు. చెప్పేవాడికి వినేవాడు లోకువని ఈ ప్రభుత్వాల హిపోక్రసీ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం గాక శివాజీ గణేశన్ లెవెల్లో ముఖకవళికలు పెట్టాల్సొస్తున్నది. చిత్తశుద్ధి లేని వీళ్ల చట్టబద్ధ హెచ్చరికల పుణ్యమా అని సిగరెట్ ప్యాక్ ల డిజైన్ లలో ఉన్న స్టయిలూ, ఏస్థిసిటీ మట్టి కొట్టుకుపోయేయి.

(బి వి మూర్తి  సీనియర్ జర్నలిస్టు, బెంగళూరు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *